ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'

  • 7 ఆగస్టు 2018
రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi

బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ ప్రాంతంలో 572 దీవులు ఉన్నాయి. భారతదేశ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో 38 దీవుల్లో మాత్రమే జనావాసాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దీవులన్నీ భారతదేశానికంటే కూడా ఆగ్నేయ ఆసియా దేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ అందమైన బీచ్‌లు, అద్భుతమైన సముద్ర జీవజాతులు, ఘనమైన పగడపు దిబ్బలు, ఎలాంటి అవరోధాలు లేకుండా పెరిగిన అడవులు కనిపిస్తాయి. ఆహ్లాదభరితమైన ఈ సుందర దృశ్యాల వెనక వెంటాడే గత చరిత్ర కూడా ఉంది.

రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi

ఈ దీవుల్లో ఒకటి రాస్ ఐలాండ్... మనోహరంగా కనిపించే, శిథిలమైపోయిన ఒక నిర్మానుష్య పట్టణం. 19వ శతాబ్ధానికి చెందిన బ్రిటిష్ నివాస అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. 1940ల్లో బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రకృతి ఈ దీవిని తిరిగి తన సొంతం చేసుకుంటోంది. ఎంతో ఖర్చుపెట్టి నిర్మించిన భారీ భవనాలు, ఒక పెద్ద చర్చి, వినోద, ఆతిథ్య భవనాలు, గదులు, ఆఖరికి ఒక స్మశానం.. ఇవన్నీ ఇప్పుడు పాడుబడిపోయాయి. వీటన్నింటినీ ఒక అడవి తనలో కలిపేసుకుంటోంది.

రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi

ఏకాంత ‘శిక్షా కాలనీ’

1857లో ఊహించని రీతిలో జరిగిన భారతీయ తిరుగుబాటు నేపథ్యంలో తిరుగుబాటుదారులు, శిక్ష పడ్డ ఖైదీలను బంధించేందుకు బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని ‘శిక్షా కాలనీ’గా ఎంచుకున్నారు. 1858లో తొలిసారి బ్రిటిష్ వాళ్లు 200 మంది దోషుల్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఈ ద్వీప సమూహమంతా ‘కాకులు దూరని కారడవి’లా లోపలికి ప్రవేశించడానికి వీలులేనంత దట్టమైన అడవులతో ఉండేది. రాస్ ఐలాండ్ విస్తీర్ణం 0.3 చదరపు కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువ. ఇక్కడ తాగునీరు అందుబాటులో ఉండటంతో దీవులన్నింటిలోనూ ఖైదీలను ఉంచేందుకు ఇదే అనువైనదని బ్రిటిషర్లు భావించారు. దట్టమైన అడవిని తొలగించి, నివాసయోగ్యమైన ప్రాంతంగా చేసే బాధ్యతను ఖైదీలకు అప్పగించారు బ్రిటిష్ అధికారులు. ఖైదీలంతా చెట్లు కొట్టి దీవిని శుభ్రం చేస్తుంటే ఆ అధికారులు సముద్రంలో లంగరు వేసిన నౌకల్లో ఉండేవారు.

రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi
చిత్రం శీర్షిక ప్రెస్బిటేరియన్ చర్చి

ప్రత్యేక ప్రాంతం.. పరిపాలనా కేంద్రం

కొంత కాలానికి ఈ ‘శిక్షా కాలనీ’ని విస్తరించారు. ఖైదీలంతా పొరుగు దీవుల్లో నిర్మించిన జైళ్లు, బ్యారక్‌ల్లోకి వెళ్లారు. రాస్ ఐలాండ్ పరిపాలనా కేంద్రం అయ్యింది. ఉన్నతాధికారులు, వారి కుటుంబాలు మాత్రమే నివాసం ఉండే ప్రత్యేక ప్రాంతంగా మారింది. అయితే, ఈ ప్రాంతంలో నీటిద్వారా సంక్రమించే వ్యాధులు అధికంగా ప్రబలేవి. దీంతో మరణాలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే, రాస్ ఐలాండ్‌ను నివాసయోగ్యమైన ఆకర్షణీయ ప్రాంతంగా మార్చేందుకు బ్రిటిషర్లు అన్ని ప్రయత్నాలూ చేశారు. పెద్ద పెద్ద భవంతుల్లో చరిత్రను కళ్లకు కట్టేలా కళాకృతులు, గృహోపకరణాలను ఏర్పాటు చేశారు. సుందరమైన పచ్చిక బయళ్లు, టెన్నిస్ కోర్టులు నిర్మించారు. అంతేకాదు ఒక ప్రెస్బిటేరియన్ (క్రైస్తవ మతంలో ఒక వర్గం) చర్చిని కూడా నిర్మించారు. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు, సైనికులకు బ్యారక్‌లు, జబ్బుపడిన వారి బాగోగులు చూసుకునే, వైద్య సదుపాయం కలిగిన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.

రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi
చిత్రం శీర్షిక విద్యుత్ స్టేషన్‌ భవనం

జపాన్ దండయాత్ర

అయితే, ఒక విద్యుత్ స్టేషన్‌లోని డీజిల్ జనరేటర్ మంటల్లో చిక్కుకుని మొత్తం రాస్ ఐలాండ్‌ను అగ్నికి ఆహుతి చేసింది. మిరుమిట్లు గొలిపే స్వర్గం లాంటి ఈ దీవి అలా మంటల్లో చిక్కుకుని పతనమైంది.

పెరిగిన ఒత్తిడి కారణంగా 1938వ సంవత్సరం నాటికి రాజకీయ ఖైదీలందరినీ బ్రిటిషర్లు విడుదల చేయాల్సి వచ్చింది. జపాన్ దండయాత్ర 1942 నాటికి మిగిలిన బ్రిటిష్ సైనికులంతా ఈ దీవిని వీడి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఈ దీవి జపనీయుల ఆధీనంలో ఉన్నది అత్యంత తక్కువ కాలమే. యుద్ధం ముగిసే సమయానికి మళ్లీ ఈ దీవిని బ్రిటిషర్లు చేజిక్కించుకున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించడంతో బ్రిటిషర్లు శాశ్వతంగా ఈ దీవిని విధి రాతకు వదిలేశారు. మూడు దశాబ్దాల తరువాత 1979లో భారత నౌకాదళం ఈ దీవిని స్వాధీనం చేసుకుంది.

రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi

అలముకుంటున్న ప్రకృతి

క్రూరమైన వలస పాలనకు సంబంధించిన గతానికి ప్రతిబింబాలుగా మిగిలాయి ఈ దీవిలోని శిథిల నిర్మాణాలు. త్రికోణాకార గోడల పైకప్పులు, సందడిగా ఉండే బజార్లు, ఇటాలియన్ టైల్స్, రంగులద్దిన గ్లాసు కిటికీలు.. ఇవన్నీ ఒకప్పటి ఆడంబరానికి నిదర్శనాలు. కమిషనర్ బంగ్లా, సబార్డినేట్స్ క్టబ్, ప్రెస్బిటేరియన్ చర్చిల పైకప్పుల్లేని శిథిలాలు, మరెన్నో పేరులేని పాడుబడ్డ భవనాల గోడలు మిగిలాయి ఇప్పుడు. పెద్దపెద్ద మర్రి చెట్లు ఈ భవనాలను ఆక్రమించుకుంటున్నాయి. తమ ఊడలతో, వేళ్లతో ఈ శిథిలాలను చుట్టేస్తున్నాయి.

రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi

దారితప్పిన వేట

1900ల ప్రారంభంలో వేటాడటం కోసం వివిధ రకాల జింకల్ని బ్రిటిష్ అధికారులు అండమాన్ దీవులకు తీసుకొచ్చారు. అయితే, సహజమైన మాంసాహారులేవీ ఈ ప్రాంతంలో లేకపోవటంతో ఈ జింకలదే రాజ్యం అయ్యింది. అడవిలో పెరిగే తాజా మొక్కల్ని ఇవి తినేసేవి. దీంతో కొత్త అడవి పెరిగేది కాదు. అడవి వృద్ధికి ఈ జింకలు పెద్ద అవరోధాలుగా మారాయి. ఇప్పుడు అడవి కుందేళ్లు, కోళ్లతో పాటు ఈ జింకలే రాస్ ఐలాండ్‌లో నివశిస్తున్నాయి. అప్పుడప్పుడూ వచ్చే సందర్శకులను అలరిస్తున్నాయి.

రాస్ ఐలాండ్ Image copyright Neelima Vallangi
చిత్రం శీర్షిక సబార్డినేట్స్ క్లబ్‌ భవనం

భవిష్యత్ దర్శనం!

జూనియర్ అధికారుల వినోద కార్యక్రమాల కోసం నిర్మించిన సబార్డినేట్స్ క్లబ్‌లో నృత్యం చేసేందుకు అనువుగా టేకు చెక్కతో వేదిక ఏర్పాటు చేశారు. బహుశా ఒకప్పుడు ఇక్కడ సంగీతం ప్రతిధ్వనించేది. ఇప్పుడు ధ్వంసమైన క్లబ్బు గోడల మధ్య పక్షుల కిలకిలా రావాలు సరిగమల్ని మరిపిస్తున్నాయి.

భారతదేశ వలస చరిత్రలోని చీకటి అధ్యాయం ఈ శిక్షా కాలనీని మూసేయడంతో ముగిసిపోయింది. ఇది జరిగి ఇప్పటికి ఎనిమిది దశాబ్ధాలు గడిచాయి. రాస్ ఐలాండ్ ఇప్పుడు బంగాళాఖాతంలో మర్చిపోయిన మచ్చ. అయితే, ఇది చాలా హుందాగా ఒక గొప్ప విషయాన్ని మన అందరికీ తెలియజేస్తోంది. అదేమంటే.. మానవజాతి అంతమైపోయాక, భూగోళాన్ని ప్రకృతి స్వాధీనం చేసుకోవడం అనివార్యమైనప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో రేఖామాత్రంగా కళ్లకు కడుతోంది.

గమనిక: ఈ కథనంలో వాడిన ఫొటోల కాపీరైట్ హక్కులు నీలిమ వల్లంగికి చెందుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం