రాయలసీమలో ‘రత్నాల’ వేట

  • డి.ఎల్.నరసింహ
  • బీబీసీ ప్రతినిధి

ఎక్కడైనా తొలకరి చినుకులు కురవగానే పంటపొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు మెుదలెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని వ్యవసాయ భూముల్లో మాత్రం వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభమౌతుంది.

కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అధిక భాగం ఎర్ర నేలలున్నాయి. నునుపైన రంగురాళ్లు కలిగిన ఈ ఎర్రనేలలు కొంత ప్రత్యేకంగా కనిపిస్తాయి. వజ్రకరూర్, జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, తుగ్గలిలోని ఈ ఎర్రనేలల్లో తొలకరి చినుకులు కురిసిన తరవాత వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది.

అలాగే నంద్యాల-గిద్దలూరు మధ్యనున్న నల్లమల అటవీప్రాంతంలోని సర్వనారసింహస్వామి క్షేత్ర పరిసరాల్లోని వంకల్లో వర్షానికి వజ్రాలు కొట్టుకొస్తాయన్న ప్రచారం కూడా ఉంది.

ఈ ఏడాదీ తొలకరి చినుకులు ప్రారంభం కావడంతోనే వజ్రాలవేట ప్రారంభమైంది. ప్రస్తుతం వజ్రాల కోసం ఆ రెండు జిల్లాల ప్రజలు పొలాలను జల్లెడ పడుతున్నారు. స్థానికులే కాకుండా కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలతోపాటు కర్నాటకలోని బళ్లారి నుంచి కూడా జనం పొలాల్లో వజ్రాలవేట సాగిస్తున్నారు.

వీళ్లంతా పొలాలకు సమీపంలోని చెట్లకిందే వంట చేసుకుని తింటూ.. రాత్రిళ్లు పాఠశాలలు, ఆలయాల వద్ద తలదాచుకుంటారు.

వీడియో క్యాప్షన్,

తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయా?

జొన్నగిరి పొలాల్లో వజ్రాలను అన్వేషిస్తున్న జెహెరాబీ అనే మహిళను బీబీసీ పలుకరించగా, ''మేం అనంతపురం నుంచి వచ్చినాం. వజ్రాలు దొరుకుతాయని ఎతుకులాడుతుండాం. ఇంతవరకు దొరకలేదు. పనులన్నీ వదిలిపెట్టి వచ్చినాం. దొరికితే మా అదృష్టం" అన్నారు.

"ఈ భూమిలో పోయిన సంవత్సరం ఒకరికి వజ్రం దొరికింది. అదే ఆశతో ఈ సంవత్సరం మళ్లీ వచ్చాం. ఎట్టయిద్దో చూడాలి మరి" అని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బాలూనాయక్ అన్నారు.

టీవీలు, పేపర్లలో వచ్చిన కథనాలను చూసి వజ్రాల కోసం వచ్చిన వారిలో చాలామందికి వాటిని ఎలా వెతకాలి, ఎలా గుర్తించాలన్న విషయాలు తెలియవు.

చాలామంది తేడాగా కనిపించిన రాళ్లన్నిటినీ ఏరుకుంటున్నారు. అవగాహన, అనుభవమున్న కొందరు మాత్రం దానికి భిన్నంగా తమ అన్వేషణ సాగిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

వన్నూరుసా

రాళ్ళల్లో వజ్రాలను గుర్తించడం ఎలా?

పి.వన్నూరుసా అనే వ్యక్తి ఓ రాయిని చూపిస్తూ, "ఇది వజ్రం కాదు కానీ వజ్రపురాయి. ఈ రాయి ఎక్కడుంటే అక్కడ వజ్రాలు దొరుకుతాయి. మనం వెతికే చోట ముందు ఈ రాయి ఉందో లేదో చూసుకోవాలి. ఉంటే అక్కడ జాగ్రత్తగా వెతకాలి. ఈ రాయిని బట్టే ఆ రోజుల్లో బ్రిటిషర్లు ఇక్కడ తవ్వకాలు జరిపారు. చాలా ఏళ్ల క్రితం మాకొక చిన్న వజ్రం దొరికింది. ఆశతో మళ్లీ వచ్చాం" అని చెప్పారు.

సీమ జిల్లాల్లో వజ్రాలు దొరుకుతుండటంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం శ్రీకృష్ణదేవరాయల పాలనలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని, శత్రువులు కొల్లగొట్టకుండా రాజులు ఎక్కడపడితే అక్కడ నిధులు దాచారని, అప్పట్లో ఊహించని వైపరీత్యాలవల్ల వజ్రాలు, రత్నాలు భూమిలో కలిసిపోయి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు అవి బయటపడుతున్నాయన్నది ఒక కథనం.

ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఔషధ మెుక్కలున్నాయని, వర్షపు బిందువులు వాటిపై పడ్డప్పుడు అవి వజ్రాలుగా మారతాయని, ఈ విషయం కొన్ని వైద్య గ్రంథాల్లోకూడా ఉందన్నది మరో కథనం.

గనులు, భూగర్భశాఖ అధికారులు ఏమంటున్నారు ?

రాష్ట్ర గనులు, భూగర్భశాఖ అధికారులు మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చుతున్నారు.

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని, భూమి లోపల సహజసిద్ధంగా జరిగే కొన్ని పరిణామాల వల్ల అవి భూపైభాగానికి చేరుకుంటాయని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజబాబు తెలిపారు. మట్టితో మూసుకుపోయిన ఆ వజ్రాలు వర్షాలు, నీటి ప్రవాహంవల్ల బయటపడతాయని ఆయన వివరించారు.

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు లభించే కింబర్లైట్ పైపులు భూఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని, దానికితోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన ఐదువేల సంవత్సరాల్లో దాదాపు అరకిలోమీటరు మేర కోతకు గురైందని, అందుకే అక్కడ తరచుగా వజ్రాలు దొరుకుతున్నాయని రాజబాబు తెలియజేశారు.

వజ్రాల పుట్టుక, కింబర్లైట్ పైపుల కథేంటి?

గనులు, భూగర్భశాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం - కార్బన్ ధాతువులు భూమి అడుగున అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడికి లోనైనప్పుడు గట్టిపడి వజ్రాలుగా మారతాయి. ఈ ప్రక్రియ భూఉపరితలం నుంచి 140 నుంచి 190 కిలోమీటర్ల దిగువన జరుగుతుంది.

అంతకంటే దిగువన మాగ్మా ప్రవహిస్తుంటుంది. దీనినే లావా అని కూడా అంటారు. అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ఆ లావా ఒకోసారి అత్యంత వేగంగా పైపు ఆకారంలో భూఉపరితలానికి చేరి విస్ఫోటనం చెందుతుంది.

భూఉపరితలానికి ప్రయాణించే క్రమంలో అది తనతోపాటు వజ్రాలను కూడా భూమి పైకి చేరవేస్తుంది. ఇలా భూమిపైకి చేరిన వజ్రాలు, భూఉపరితలానికి దగ్గరగా నిలిచిపోయిన వజ్రాలు ఏవైనా కారణాల వల్ల భూమి కోతకు గురైనప్పుడు లేదా వరదనీటి ప్రవాహాల వల్ల ఒక చోటు నుంచి మరోచోటికి ప్రయాణిస్తాయి.

విస్ఫోటనం తరువాత భూమిలోపల పైపు ఆకారంలో ఉండిపోయిన లావా చల్లబడి నల్లటి రాయిగా మారుతుంది. వీటినే కింబర్లైట్, లాంప్రాయిట్ పైపులు అని అంటారు.

విస్ఫోటన సమయంలో భూమిపైకి చేరని వజ్రాలు ఈ కింబర్లైట్, లాంప్రాయిట్ పైపులలో ఇమిడి ఉంటాయి. ఈ పైపుల ఆధారంగానే మైనింగ్ కంపెనీలు వజ్రాన్వేషణ చేస్తుంటాయి.

రాయలసీమలో బంగారం, వజ్రాల అన్వేషణ ఎప్పటి నుంచి?

రాయలసీమ రతనాలసీమ, రత్నగర్భ అన్న నానుడి అనాదిగా వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో అపారమైన బంగారు, వజ్ర నిక్షేపాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతున్నాయి.

వీటి ఆధారంగా ప్రస్తుతం పగిడిరాయిలో జియో మైసూర్ సంస్థ బంగారం వెలికి తీసేందుకు భూసేకరణ ప్రయత్నాలు చేస్తోంది.

'డి బీర్స్' వజ్రవ్యాపార సంస్థ కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని నల్లమల ప్రాంతంలో వజ్ర నిక్షేపాల లభ్యతపై ఇప్పటికే సర్వేలు పూర్తి చేసి, మైనింగ్ అనుమతులు పొందే ప్రయత్నాల్లో ఉంది.

బంగారం, వజ్రాల కోసం జరుగుతున్న అన్వేషణ ఈనాటిది కాదు. బ్రిటిష్ పాలనలో, అంతకుముందు మహమ్మదీయులు, విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనూ ఆంధ్ర, రాయలసీమల్లో మైనింగ్ జరిగినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

పదహారు, పదిహేడో శతాబ్దాలలో ఈ ప్రాంతంలో పర్యటించిన విదేశీ పర్యాటకుడు, ఫ్రెంచ్ దేశానికి చెందిన వజ్రాల వ్యాపారి టావెర్నియర్‌ రచనలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

బ్రిటిష్ హయాంలోనే అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ గ్రామంలో జాన్ టేలర్ అనే పరిశోధకుడు వజ్రాల మైనింగ్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అందుకోసం ఆయన తవ్వించిన 120 మీటర్ల లోతైన బావి కూడా ఉంది. జాన్ టేలర్ షాఫ్ట్‌గా పిలిచే ఈ బావి దగ్గరే కేంద్ర ప్రభుత్వం 1970లో డైమండ్ ప్రాసెసింగ్ సెంటర్ నెలకొల్పింది. అక్కడే కింబర్లైట్ పార్కు, మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేసింది.

అశోకుని కాలంలోనే వజ్రాలు, బంగారం కోసం తవ్వకాలు జరిగాయా?

శ్రీకృష్ణదేవరాయలు, మహమ్మదీయ పాలకులు, ఆంగ్లేయుల కాలంలోనే కాకుండా అంతకు చాలా ముందు క్రీస్తుపూర్వం అశోకుని పరిపాలనలోనే రాయలసీమలో బంగారం, వజ్రాల కోసం గనుల తవ్వకం జరిగి ఉండొచ్చని కొందరు జియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

అపారమైన ఖనిజ నిక్షేపాలు, బంగారం, వజ్రసంపద ఉన్న ఈ ప్రాంతంలో అశోకుడు లేదా ఆయన అధికారులు విడిది చేశారనటానికి సాక్ష్యంగా జొన్నగిరి సమీపంలో అశోకుని శిలాశాసనాలు ఉండటాన్ని ఇందుకు ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు.

రాయలసీమలో విలువైన, అపారమైన ఖనిజ సంపద ఉండటంవల్లే ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు వివిధ రాజ్యాధినేతలు ప్రయత్నించి ఉండవచ్చని గనులు, భూగర్భశాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ రాజబాబు అభిప్రాయపడ్డారు. ఎక్కడో పాటలీపుత్రలో ఉన్న అశోకుడు జొన్నగిరి దగ్గర శాసనాలు ఏర్పాటు చేయటం, శ్రీకృష్ణదేవరాయలు గుత్తి వద్ద ఎత్తైన కొండపై భారీ కోటను నిర్మించటం అందులో భాగమేననేది ఆయన అభిప్రాయం.

కౌటిల్యుని అర్థశాస్త్రం ఏం చెబుతోంది?

అశోకుని తాత, మౌర్యసామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తునికి కౌటిల్యుడు గురువు. ఆయన తన అర్థశాస్త్ర గ్రంథంలో ఖనిజాలు, వాటి తవ్వకాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎ.కె. బిస్వాస్ అనే చరిత్రకారుడు 'మినరల్స్ అండ్ మైన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా' అనే పుస్తకంలో వివరించారు. అప్పట్లోనే బంగారం, వజ్రాల పేర్లు వాటితో చేసిన నగలు, వాటి విలువ తదితర అంశాలు కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఉన్నట్లు బిస్వాస్ తన రచనలో పేర్కొన్నారు.

ఇప్పుడు మనకు గనులు, భూగర్భశాఖ సంచాలకుడు ఉన్నట్లుగానే మౌర్యుల కాలంలో కూడా 'అకారాధ్యక్ష' అనే పదవి ఉండేది. విలువైన ఖనిజాలను గుర్తించటం.. వాటిని వెలికితీసి ఖజానాకు తరలించటం అతని ముఖ్యవిధి.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమంటోంది?

కౌటిల్యుని అర్థశాస్త్రంలో గనుల తవ్వకం అంశాలు, ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద, జొన్నగిరి సమీపంలో అశోకుని శిలాశాసనాలు - వీటన్నింటిని క్రోడీకరించి చూస్తే అశోకుని కాలంలోనే బంగారం, వజ్రాల కోసం మైనింగ్ జరిగి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చలేమని జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీధర్ అన్నారు.

అయితే ఈ అంశాన్ని భారతీయ పురావస్తుశాఖ నిర్ధరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)