సంప్రదాయ కళను నమ్ముకుని.. జీవితాలను మెరుగు పరచుకుంటున్న మహిళలు

  • 6 ఆగస్టు 2018

తమ సంప్రదాయ కళనే బతుకుదెరువుగా మార్చుకొని తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు ఆ మహిళలు. వారంతా భారతదేశంలోనే అతి పెద్ద జిల్లా అయిన కఛ్ మహిళలు.

ఎంబ్రాయిడరీ కళ అక్కడి మహిళల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని గుజరాత్ రాష్ట్రంలోని కఛ్ జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి ఆమె అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇది.

కొన్ని తరాల నుంచి కఛ్ ఆదివాసీ మహిళలు కుట్టుపనితో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. ‘కఛ్ ఎంబ్రాయిడరీ’గా పేరున్న ఈ కళను ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తున్నారు.

ఒకప్పుడు అమ్మాయిలంతా తమకు కట్నంగా వచ్చిన దుస్తులపైనే ఎంబ్రాయిడరీ చేసుకునేవాళ్లు. ఇప్పుడు అదే ఎంబ్రాయిడరీతో తమ జీవితాలను మార్చుకుంటున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: జీవితాలను మారుస్తున్న సంప్రదాయ కళ

‘‘అవును. చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మా కళ కేవలం మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దీన్ని బయట ప్రపంచానికి కూడా మేం పరిచయం చేశాం. ఈ కళే మా ఆదాయ వనరుగా మారింది. దీని ద్వారా డబ్బు సంపాదించి నగలు కొనుక్కుంటున్నాం. మా పిల్లలకు చదువు చెప్పించగలుగుతున్నాం’’ అని అక్కడి మహిళలు అంటున్నారు.

కఛ్ ప్రాంతంలో మొత్తం 12 సముదాయాలకు చెందిన మహిళలు ఎంబ్రాయిడరీ చేస్తారు. వాటిలో ఒకటైన ముథువా సముదాయం బన్నీ ప్రాంతంలో నివసిస్తోంది. ఈ సముదాయంలోని ముస్లింలు వృత్తి రీత్యా పశువుల కాపరులు. కుట్లు, అల్లికలు, రంగు రంగుల దారాలు, అద్దాలతో కూడిన ఈ కళ ద్వారా ఇప్పుడు ఈ సమూహంలోని ముస్లిం మహిళలు తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు.

‘‘గతంలో మాకు చేయడానికి పని కానీ, చేతిలో డబ్బులు కానీ ఉండేవి కావు. ఎడారి ప్రాంతాలకు వెళ్లి పేడ సేకరించి, అమ్ముకునేవాళ్లం. ఆ పనితో పోలిస్తే ఈ ఎంబ్రాయిడరీ పని ఎంతో బాగుంది’’ అని ఒక మహిళ చెప్పారు.

ప్రతి సముదాయానికీ ఎంబ్రాయిడరీ కళలో ప్రత్యేకమైన సంప్రదాయ డిజైన్లు ఉన్నాయి. ఇక్కడి మహిళలు 50కి పైగా డిజైన్లలో ఎంబ్రాయిడరీ చేస్తారు. ఈ కళ ఇక్కడి మహిళల్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

2001లో యునెస్కో అవార్డు అందుకున్న దళిత వికలాంగురాలు జాసీ బెన్ ఇక్కడి మహిళలకు ఆదర్శం.

‘‘నేను నా స్నేహితురాలికి కూడా ఈ కళ నేర్పించాను. నేను బాగా ఎంబ్రాయిడరీ చేస్తాను. అలాగే నువ్వు కూడా చేయగలవు, నేర్చుకో అని తనకు చెప్పాను.

ప్రభుత్వం, ఎన్జీఓలు ఈ కళను, ఇక్కడి మహిళల్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రోత్సహిస్తున్నాయి.

‘‘ఈ పనితో జీవితంలో ముందుకు సాగగలనని అనుకుంటున్నాను. కుటుంబానికి అండగా ఉంటూ సోదరుల చదువుకి సాయపడాలి’’ అని జీవిక అనే మహిళ చెప్పారు.

షూట్, ఎడిట్: కె నవీన్ కుమార్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)