ప్రెస్‌రివ్యూ: ఏపీలో రైతులకు బ్యాంకు రుణాలు ఇక కష్టమే

  • 6 ఆగస్టు 2018
Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణాల రీషెడ్యూల్‌కు చెల్లు చీటి పడినట్టు ప్రజాశక్తి ఒక కథనం ప్రచురించింది. ప్రభుత్వం నిర్లక్ష్యంతో బ్యాంకులు నిరాసక్తత చూపిస్తున్నాయని, రైతులకు కొత్త అప్పులు పుట్టడం లేదని పేర్కొంది.

రాష్ట్రంలో రైతు రుణాల రీషెడ్యూల్‌కు చెల్లుచీటి పడింది. విపత్తు ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ (ఆర్‌బిఐ) నిబంధనల మేరకు రీషెడ్యూల్‌ చేసి తదుపరి సేద్యం కొనసాగించగానికి కొత్త అప్పులివ్వాలి.

వైపరీత్యాల బారినపడి నష్టాలపాలైన రైతులకు రీషెడ్యూల్‌ ప్రక్రియ ఉపశమనం. సర్వం కోల్పోయిన వారు తిరిగి కూడదీసుకొని పంటలేసుకోడానికి పెట్టుబడులు సమకూర్చడం ప్రభుత్వాల, బ్యాంకుల కనీస బాధ్యత.

కాగా చంద్రబాబు ప్రభుత్వం రుణ మాఫీకి హామీ ఇచ్చి తదుపరి ఆర్థిక సమస్యను చూపించి బ్యాంకుల్లో పేరుకుపోయిన బకాయిల్లో కొద్ది మొత్తాన్ని అదీ విడతలవారీగా ఐదేళ్లపాటు సాగదీయడంతో రుణాల రీషెడ్యూల్‌ జరగట్లేదు. దీంతో విపత్తు మండలాలను ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రైతు రుణాలు రీషెడ్యూల్‌ కావట్లేదు. మళ్లీ పంటలేసుకోడానికి సంస్థాగత పరపతి దొరక్క ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతుల్లో రైతులు నలిగిపోతున్నారని కథనంలో చెప్పారు.

రుణ మాఫీ, సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలను చూపించి చంద్రబాబు ప్రభుత్వం రుణాల షెడ్యూల్‌ను ప్రోత్సహించట్లేదని కథనంలో తెలిపారు. సర్కారు ధోరణితో బ్యాంకులు సైతం రీషెడ్యూల్‌పై అనాసక్తత వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.

రుణ మాఫీ కిస్తును వడ్డీకి జమ వేసుకొని పాత రుణాలను కొత్తవిగా మార్పు చేసి పుస్తకాల్లో సర్దుబాటు చేస్తున్నాయి. రుణ మాఫీ కిస్తులు ఆలస్యంగా విడుదలవుతుండటంతో సున్నావడ్డీ, పావలావడ్డీ పథకాలు అమలు కావట్లేదని, రీషెడ్యూల్‌ లేనందున రైతులకు కొత్త అప్పులు పుట్టట్లేదని ప్రజాశక్తి కథనం పేర్కొంది.

సాగు సాగదు Image copyright Getty Images

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి కొరత తీవ్రంగా ఉందంటూ, ఉన్న నీటితో సగం ఆయకట్టు కూడా గట్టెక్కదంటూ 'సాగు సాగదు’ పేరుతో ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. ఖరీఫ్‌కు రానున్న పది రోజులే కీలకం అని, ఇదే పరిస్థితి కొనసాగితే సీజన్ పోయినట్టేనని తమ కథనంలో తెలిపింది.

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను నీటి కొరత వేధిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు నీటిని అందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ కు రానున్న పది రోజులూ అత్యంత కీలకం.. ఆలోగా ప్రాజెక్టుల్లోకి వరద వస్తే పరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది. లేదంటే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ను వదులుకోవాల్సి ఉంటుందని ఆంధ్రజ్యోతి తమ కథనంలో తెలిపింది.

ఈ ఏడాది మొదటి నుంచీ సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుల్లోకి నీటి వరద రాలేదు. రాష్ట్రంలో రెండు, మూడు మినహా అన్ని ప్రాజెక్టులూ ఖాళీగానే ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో నాగార్జునసాగర్‌, గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్‌ సీజన్‌కు సాగు నీటిని అందించే పరిస్థితి కనుచూపు మేరలో కనపడడం లేదని కథనం వెల్లడించింది.

కృష్ణా బేసిన్‌లో అత్యంత కీలకమైన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద తెలంగాణలో పరిధిలో ఉన్న 6.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు 54 టీఎంసీలు అవసరం అని, కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో ఉపయోగించుకోవడానికి ఒక్క టీఎంసీ నీరు కూడా లేదని ఆంధ్రజ్యోతి తమ కథనంలో తెలిపింది.

గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టుల పరిస్థితి కూడా కష్టంగానే ఉందని ఆంధ్రజ్యోతి కథనంలో చెప్పారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో కేవలం 16 టీఎంసీల నీరు ఉండగా, దీనిని సాగు కోసం విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పింది.

శ్రీరాంసాగర్‌ పరిధిలోని 6.62 లక్షల ఎకరాలు, ఎల్‌ఎండీ కింద ఉన్న మరో 4.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు తగిన నీటిని ఇవ్వాలంటే... సుమారు 72 టీఎంసీల నీరు అవసరం. ఇందులో 25 శాతం నీరు కూడా ప్రస్తుతం ప్రాజెక్టుల్లో లేని పరిస్థితుల్లో ఖరీఫ్ కు నీటి విడుదల అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నాట్టు ఆంధ్రజ్యోతి తమ కథనంలో వివరించింది.

Image copyright Getty Images

ఆర్థిక నేరస్థుల బిల్లు 'కలుగులోంచి రప్పిస్తుంది'

ఆర్థిక నేరస్థుల బిల్లు పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను "కలుగులోంచి రప్పిస్తుంది" అని ఈనాడు ఒక కథనం ప్రచురించింది. వంద కోట్లకు పైబడి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు బిల్లు పరిధిలోకి వస్తారని తెలిపింది. వారు దేశం విడిచి పారిపోకుండా, న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకోకుండా బిల్లు నిరోధిస్తుందని ఈనాడు కథనం వివరించింది.

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు చట్టం ఛత్రం నుంచి తప్పించుకోకుండా నిరోధించే బిల్లుకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో- విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ లాంటి వారికి మరింత ఉచ్చు బిగుసుకున్నట్లేనని కథనం తెలిపింది.

బ్యాంకుల్ని భారీ ఎత్తున ముంచిన విజయ్‌మాల్యా, దాదాపు రూ.12 వేల కోట్ల మోసానికి పాల్పడిన నీరవ్‌మోదీలు ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి ఆర్థిక నేరాలు మున్ముందు జరగకుండా నిరోధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నేరస్థుల బిల్లు- 2018ను తీసుకువచ్చింది.

భారత నేర శిక్షా స్మృతి, అవినీతి నిరోధక చట్టం, సెబీ చట్టం, దివాళా, కస్టమ్స్‌, కంపెనీ చట్టాలు కింద నిర్వచించిన ఆర్థిక నేరాలకు పాల్పడినవారిని ఈ బిల్లు పరిధిలోకి తెస్తారని కథనంలో వివరించారు.

చట్టంలోని సెక్షన్‌-4 ప్రకారం- ఆర్థిక నేరానికి పాల్పడిన వ్యక్తిపై ఏదేని కోర్టు అరెస్టు వారెంటు జారీచేసినపుడు వారు పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు అవుతాడని తెలిపారు. నేర విచారణ ప్రక్రియ నుంచి తప్పించుకోవడానికి అతను దేశం విడిచి పారిపోయినా, విచారణను ఎదుర్కొనడం కోసం భారతదేశానికి తిరిగి రావడానికి నిరాకరించినా, అతడిని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు'గా పరిగణిస్తారని వెల్లడించారు..

'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు' అని ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వం నియమించిన డైరెక్టర్‌ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

పరారీలో ఉన్న ఆర్థికనేరస్థులు చట్టపరమైన ప్రక్రియను తప్పించుకునే యత్నం చేయకుండా గట్టిగా నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అంగీకరించినట్టు, 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల బిల్లు-2018కు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించినట్లు ఓ అధికారిక ప్రకటన తెలిపిందని కథనంలో చెప్పారు.

విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఆర్థ్ధికనేరస్థులు దేశం విడిచి పారిపోకుండా, న్యాయప్రక్రియను తప్పించుకోకుండా గట్టిగా పట్టు బిగించడమే ఈ బిల్లు ఉద్దేశం అన్నారు. లోక్‌సభ జులై 19న, రాజ్యసభ జులై 25న ఆమోదించిన ఈ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారని ఈనాడు తమ కథనంలో తెలిపింది.

Image copyright Getty Images

ఆరోగ్య శ్రీతో 242 మందికి పునర్జన్మ

ఆరోగ్యశ్రీ ద్వారా 242 మందికి తెలంగాణ ప్రభుత్వం పునర్జన్మ ఇచ్చినట్టు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది. పేదలప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో వినూత్న విధానాలను అమలుచేస్తున్నదని తెలిపిదిం.

గత ప్రభుత్వాలు ఖర్చు చేయనివిధంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల మార్పిడి, స్టెమ్‌సెల్స్ (బోన్‌మారో వంటి మూలకణాల మార్పిడి) శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నట్టు కథనంలో చెప్పారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2015 జనవరి నుంచి 2018 జూలై చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 242 మందికి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి, పునర్జన్మ ప్రసాదించిందని, దానికి రూ.8,46,74,539 వెచ్చించిందని కథనం తెలిపింది.

గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆయా శస్త్రచికిత్సలకు రూ.2 లక్షల వరకు మాత్రమే ఖర్చుచేయగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు సాయం అందిస్తున్నట్టు కథనంలో ప్రచురించారు. ప్రైవేటు దవాఖానల్లో అవయవ మార్పిడి చేయించుకున్నవారికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నట్టు వెల్లడించింది. ఆరోగ్యశ్రీ ద్వారా 2015-16లో రూ.21 లక్షలు ఖర్చుతో ఇద్దరికి కడావర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారని చెప్పారు.

ప్రైవేటు దవాఖానలకు మాత్రమే పరిమితమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లోనూ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నివసతులు కల్పించినట్టు ఈ కథనంలో వివరించారు.

అవయవ మార్పిడి అనంతరం రోగికి మార్చిన అవయవం సానుకూలంగా పనిచేసేవిధంగా (ఇమ్యునో సప్రెషన్ థెరఫీ) చేపట్టే చికిత్సకు అయ్యేఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు.

రోగిస్థితి ఆధారంగా ఆరునెలల నుంచి రెండేండ్లపాటు ప్రతినెలా రూ.9 వేల నుంచి రూ.36 వేల వరకు ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది అని నమస్తే తెలంగాణ కథనంలో తెలిపారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)