ఆర్టికల్ 35-A అంటే ఏంటి? కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?

  • అరుణ్ శాండిల్య
  • బీబీసీ ప్రతినిధి

జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులు స్థిరాస్తులు కొనకుండా నిరోధించే ఆర్టికల్ 35-ఎ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

జమ్ముకశ్మీర్‌లో అత్యంత వివాదాస్పదం, అంతే ప్రాధాన్యం ఉన్న ఈ అధికరణం పూర్వాపరాలేమిటో చూద్దాం.

ఆర్టికల్ 35-ఎ ఎందుకు చర్చనీయమవుతోంది?

నాలుగేళ్ల కిందట 'వి ది సిటిజన్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ అధికరణం రాజ్యాంగబద్ధం కాదంటూ, దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.

భారతదేశ ఏకత్వ స్ఫూర్తికి ఇది విరుద్ధమని.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ ఇతర రాష్ట్రాలవారిని జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగం పొందనివ్వకుండా, స్థిరాస్తులు కొననివ్వకుండా నిరోధిస్తోందని ఆ వ్యాజ్యంలో ప్రస్తావించారు.

అనంతరం జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ చారువాలీ ఖన్నా కూడా దీనిపై సుప్రీంను ఆశ్రయించారు. జమ్ముకశ్మీర్‌లో శాశ్వత నివాస గుర్తింపు లేని పురుషులను స్థానిక మహిళలు వివాహమాడినప్పుడు వారి సంతానానికి శాశ్వత నివాస గుర్తింపు దక్కడం లేదని.. వారు అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొంటూ ఆమె ఈ అధికరణాన్ని సవాల్ చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు 2017 జులైలో కేంద్రం, జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది.

ఈ చట్టం కశ్మీర్‌ను మిగతా దేశంతో వేరుచేస్తోందని, మహిళల హక్కులను హరిస్తోందని, దీన్ని రద్దు చేయాల్సిందేనని కొందరు కోరుతుండగా... కశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను హరించేందుకే దీని రద్దుకోసం ప్రయత్నిస్తున్నారని, దీన్ని కొనసాగించాల్సిందేనని మరికొందరు కోరుతున్నారు.

అసలింతకీ ఈ ఆర్టికల్ ఏం చెబుతోంది?

  • జమ్ముకశ్మీర్‌లో ఎవరు శాశ్వత నివాసులో నిర్ణయించే అధికారం
  • అలాంటి శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించడం.

ఇవీ ఆ హక్కులు.. అధికారాలు

  • జమ్ముకశ్మీర్ రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలకు అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే అర్హులు.
  • శాశ్వత నివాసులు మాత్రమే ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలి. ఇతరులు కొనుగోలు చేయరాదు.
  • రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉపకారవేతనాలు, ఇతర ప్రయోజనాలు శాశ్వత నివాసులకే అందుతాయి.

ఎందుకు వివాదాస్పదమైంది?

జమ్ముకశ్మీర్‌లో శాశ్వత నివాసిగా గుర్తింపు పొందిన వ్యక్తి కుమార్తె శాశ్వత నివాసి కాని వ్యక్తిని వివాహమాడితే ఆమె కూడా తన శాశ్వత నివాస హోదాను కోల్పోతారు.

ఆమె సంతానానికి కూడా శాశ్వత నివాస హోదా రాదు. దానివల్ల వారు వారసత్వంగా తమకు ఏమైనా స్థిరాస్తులు వచ్చినా దాన్ని చట్టబద్ధంగా పొందలేరు.

విద్యా, ఉద్యోగ అవకాశాలూ ఆ రాష్ట్రంలో కోల్పోతారు.

1965, 1971 యుద్ధ సమయాల్లో పాకిస్తాన్‌ నుంచి జమ్ముకశ్మీర్‌కు వచ్చిన శరణార్థులకూ అక్కడ శాశ్వత నివాస హోదా లేదు.

ఈ ఆర్టికల్ జమ్ముకశ్మీర్‌ ప్రజలను వేరు చేస్తుండడమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలను, జమ్ము కశ్మీర్ ప్రజలను వేరు చేస్తోందని పిటిషినర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టికల్ 35-ఎ నేపథ్యం ఇదీ..

పంజాబ్ నుంచి ప్రవాహంలా వస్తున్న వలసలను అడ్డుకునే క్రమంలో 1927లో అప్పటి జమ్ముకశ్మీర్ సంస్థానం మహారాజు హరిసింగ్ తొలిసారి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు.

జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులకు సంబంధించి అందులో కొన్ని సూత్రాలు పొందుపరచుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిరపడడాన్ని నియంత్రిస్తూ చట్టంలో నిబంధనలున్నాయి.

అనంతరం 1947లో జమ్ముకశ్మీర్ సంస్థానం భారత్‌లో విలీనమైంది.

ఆ తరువాత అక్కడ షేక్ అబ్దుల్లా అధికారం చేపట్టారు. 1949లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు.

ఇది జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, జెండా కలిగి ఉండే వీలు కల్పిస్తుంది. ఆర్టికల్ 370 కేంద్రం శాసనాధికారాలను జమ్ముకశ్మీర్‌లో కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసారాల వరకే పరిమితం చేస్తుంది.

1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35-ఎను రాజ్యాంగంలో చేర్చారు. ఇది ఇంతవరకు పార్లమెంటు ఆమోదాన్ని పొందలేదు.

ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగానికి చేసే సవరణలు ఏవైనా పార్లమెంటు ఆమోదం పొందాలని దీనిపై వ్యాజ్యం వేసిన 'వి ది సిటిజన్స్' సంస్థ సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది.

ఇంతకుముందు కోర్టులేం చెప్పాయి?

డాక్టర్ సుశీల సాహ్నీ అనే కశ్మీరీ మహిళ వేసిన వ్యాజ్యంపై విచారించిన జమ్ముకశ్మీర్ హైకోర్టు 2002లో ఒక తీర్పునిచ్చింది. దాని ప్రకారం.. శాశ్వత నివాసులు కానివారిని వివాహం చేసుకున్న కశ్మీర్ మహిళలు వారి హక్కులేమీ కోల్పోరని తీర్పునిచ్చింది. కానీ, దీనిపై ప్రభుత్వానికేమీ ఆదేశాలివ్వలేదు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)