ప్రెస్‌రివ్యూ: బెంగళూరుకు ఇచ్చారు.. మాకెందుకు ఇవ్వరు: కేటీఆర్

కేటీఆర్ నిర్మలా సీతారామన్ తెలంగాణ

ఫొటో సోర్స్, ktr/facebook

బెంగళూరులో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం 210 ఎకరాల భూములను కేటాయించిన కేంద్ర రక్షణశాఖ హైదరాబాద్‌లోని రెండు ముఖ్యమైన ఆకాశ మార్గాల నిర్మాణానికి రెండేళ్లుగా అనుమతించడం లేదని మంత్రి కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఈనాడు తెలిపింది.

అలాంటి విధానాలను తమ రాష్ట్రానికి ఎందుకు వర్తింపజేయడం లేదని ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను ట్విటర్‌లో ప్రశ్నించారు.

హైదరాబాద్‌ నుంచి రాకపోకలను సులభం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కింద రెండు ఆకాశమార్గాల(స్కైవేల) నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. దీనికి 160 ఎకరాల రక్షణశాఖ స్థలం అవసరమని గుర్తించారు. ఈ భూములివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రక్షణశాఖకు రెండేళ్ల కిందట లేఖ రాశారు.

ఇప్పటివరకూ కేంద్రం అనుమతించలేదు. భూముల బదలాయింపు సాధ్యం కాదని, దీనికి మూడు రెట్లు భూమి ఇవ్వాలని, రూ.700 కోట్లకు పైగా నిధులివ్వాలని రక్షణశాఖ అభ్యంతరాలు తెలిపింది.

తాజాగా బెంగళూరులోని మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం 210 ఎకరాల భూ బదలాయింపునకు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ అనుమతించారు. ఈ సమాచారం తెలుసుకొని కేటీఆర్‌ విస్మయం వ్యక్తం చేశారు.

''కర్నాటక కంటే ముందే మేం రక్షణశాఖ భూములను బదలాయించాలని కోరాం. బెంగళూరుకు ఇచ్చారు. మేం రెండేళ్లుగా కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నా మాకు అనుమతించలేదు. ఇదేం ద్వంద్వనీతి'' అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారని ఈనాడు వెల్లడించింది.

హరితహారం మొక్కల పెంపకం తెలంగాణ

ఫొటో సోర్స్, Telangana cmo/facebook

లక్ష మొక్కలు పీకేశారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'తెలంగాణకు హరితహారం' అటవీప్రాంత జిల్లాల్లో అభాసుపాలవుతోందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

అటవీ భూముల కబ్జాదారుల ప్రతాపానికి పచ్చదనం ఆదిలోనే అంతమవుతోంది. కబ్జాదారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అండగా నిలుస్తుండటంతో అడవుల పునరుద్ధరణ లక్ష్యం 'మొక్క' దశలోనే ముగిసిపోతోంది.

హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ భూముల్లో నాటిన మొక్కల్లో 1,05,618 మొక్కలను జూలైలో కబ్జాదారులు పీకేశారు.

2014 నాటికి కబ్జాకు గురైన అటవీ భూముల జోలికి వెళ్లవద్దని స్వయంగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించడంతో ఈ ప్రాంతాల్లో హరితహారం నిలిచిపోయింది.

కొందరు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రకటనలే చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది.

ఈ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర అటవీ విభాగాధిపతి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) స్వయంగా గత నెల 20న ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

కబ్జాకు గురైన అటవీ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంతో కొత్తగా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత మూడేళ్లలో నాటిన మొక్కలు, చెట్లను పీకేసి మరీ స్థానికులు కబ్జాలకు పాల్పడుతున్నారని నివేదించారని సాక్షి వెల్లడించింది.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

పోలవరం పరిహారం ఖర్చైపోయింది

పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం పొందిన కొందరు ఆ డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

పోలవరం నిర్వాసితులకు గత ఏడాది ఏప్రిల్‌ 25వ తేదీ అర్ధరాత్రి నుంచి బ్యాంకు ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ కావడం మొదలైంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల రైతులకు రెండు నెలల్లో దాదాపు రూ.1800 కోట్లు పరిహారం లభించింది.

ఇక్కడ 90 శాతం మంది రైతులు ఎప్పుడూ అప్పుల్లోనే ఉండేవారు. అయితే, పోలవరంతో ఎకరానికి పదిన్నర లక్షల రూపాయల సొమ్ము జమ కావడంతో రైతుల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

కోరికలు గుర్రాలయ్యాయి. ఒకే ఇంట్లో ఉన్న తండ్రీకొడుకులకు బైకు, ఇంటికి కారు, ఆడవాళ్లకు నగలు, ఖరీదైన గృహోపకరణాలు... ఇలా తమ జీవన విధానాన్ని మార్చేశారు.

గతంలో సన్న చిన్నకారు రైతులు కూడా కూలి పనులకు వెళ్లే వారు. పరిహారం సొమ్ములు వచ్చాక పరిస్థితి మారిపోయింది.

కొందరైతే కార్లు కూడా కొన్నారు. వాటిని నడపడానికి డ్రైవర్‌లకు ఏడాది జీతం అడ్వాన్సుగా చెల్లించేశారు. టిఫిన్‌ చేయడానికి భద్రాచలం, బిర్యానీ కోసం అశ్వారావుపేటకు వెళ్లిన వాళ్లున్నారు.

ఖర్చు మాత్రమే చేస్తూ సంపాదన లేకపోవడంతో... పలువురు కార్లు అమ్ముకున్నారు. కొందరు పూట కూడా గడవని పరిస్థితికి వచ్చారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

హైకోర్టు

ఫొటో సోర్స్, High court website

హైకోర్టు విభజనపై కదలిక

ఉమ్మడి హైకోర్టు విభజన దిశగా అడుగులు పడుతున్నాయంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటుచేయడంపై కేంద్రం దృష్టిసారించింది.

ఉమ్మడి హైకోర్టు విభజన జరుగనిదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పరిపూర్ణం కాదని కేసీఆర్ చాలా రోజులుగా చెప్తూ వస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలో హైకోర్టు విభజనపై ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రికి నివేదిస్తున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో భేటీ అయిన సందర్భంలో కూడా హైకోర్టును వెంటనే విభజించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడితో సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. హైకోర్టు విభజనపై సీరియస్‌గానే దృష్టిసారించినట్టు తెలిసింది.

ఈ క్రమంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

హైకోర్టు విభజనపై చీఫ్ జస్టిస్‌తో గవర్నర్ చర్చించినట్టు సమాచారం. విభజన ఏర్పాట్లు జరుగుతున్న తీరుతోపాటు ఎప్పటిలోగా పూర్తవుతుందని చీఫ్ జస్టిస్‌తో గవర్నర్ ఆరా తీసినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణపనులు మందగమనంలో సాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచడం ద్వారా హైకోర్టు విభజనను త్వరగా చేయవచ్చన్న అభిప్రాయాన్ని చీఫ్ జస్టిస్ వ్యక్తంచేయగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ సూచించినట్టుగా సమాచారం.

హైకోర్టు విభజనకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో గవర్నర్ త్వరలో కేంద్రానికి నివేదిక పంపనున్నట్టు తెలిసిందని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)