భారత న్యాయ వ్యవస్థలో కొత్త చరిత్ర: సుప్రీం కోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
- సరోజ్ సింగ్
- బీబీసీ ప్రతినిధి

సుదీర్ఘకాలం తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒకేసారి ముగ్గురు న్యాయమూర్తులు కొత్తగా అడుగుపెట్టబోతున్నారు.
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ వినీత్ శరణ్‌తో పాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. దీనిపై కొన్నాళ్లుగా వివాదం కూడా నడిచింది. ఎట్టకేలకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ ఇందిరా బెనర్జీ చేరికతో న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక కొత్త రికార్డు నమోదైంది.
ఒకేసారి ముగ్గురు న్యాయమూర్తులు కొత్తగా సుప్రీం జడ్జిలుగా అడుగుపెట్టడం, అత్యున్నత న్యాయస్థానంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం దేశ న్యాయవ్యవస్థలో ఇదే తొలిసారి.
జస్టిస్ ఇందిరా బెనర్జీ చేరికతో సుప్రీంలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు చేరింది.
ప్రస్తుతం జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తులుగా ఉన్నారు.
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఇందిరా బెనర్జీని సుప్రీం కోర్టు జడ్జిగా నియమిస్తూ గత శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
ఇందిరా బెనర్జీ 1957 సెప్టెంబర్ 24న జన్మించారు.
కోల్‌కతాలోని లొరెట్టో హౌజ్‌లో ఆమె ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి డిగ్రీ చేసిన తర్వాత కోల్‌కతా లా యూనివర్సిటీలో న్యాయవిద్యార్థిగా చేరారు.
1985 జులై 5న లాయర్‌గా ఆమె ప్రాక్టీస్ కోల్‌కతాలోనే ప్రారంభమైంది. క్రిమినల్ కేసులతో పాటు అన్నిరకాల కేసులను ఆమె వాదించారు.
2002 ఫిబ్రవరి 5న కోల్‌కతా హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు.
ఫొటో సోర్స్, Getty Images
2006లో ఢిల్లీ హైకోర్ట్ జడ్జిగా పనిచేసి, ఏడాది తర్వాత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
సుప్రీం కోర్ట్ జడ్జి అయిన 8వ మహిళ ఇందిరా బెనర్జీ. నాలుగేళ్ల, నెల రోజుల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.
మద్రాసు హైకోర్ట్ జడ్జిగా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన పలు కమిటీలలోనూ జస్టిస్ ఇందిరా పనిచేశారు.
ఒడిశా హైకోర్ట్ జడ్జిపై వచ్చిన ఆరోపణలను విచారించే కమిటీకి ఆమె నేతృత్వం వహించారు.
ప్రాంతీయ ప్రాతినిధ్యం ప్రకారం సుప్రీం కోర్ట్‌లో పశ్చిమ్ బెంగాల్ కోటా కింద ఉండాల్సిన జడ్జిల నియామకం సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉంది.
ఇందిరా బెనర్జీ నియామకంతో బెంగాల్‌కు కూడా ఇప్పుడు ప్రాతినిధ్యం దక్కినట్లైంది.
జస్టిస్ ఇందు మల్హోత్రా
ఈ ఏడాది ఎప్రిల్లో జస్టిస్ ఇందు మల్హోత్రా సుప్రీం జడ్జిగా నియమితులయ్యారు. బార్ కౌన్సిల్ నుంచి జడ్జి అయిన మొదటి మహిళ జస్టిస్ ఇందు మల్హోత్రా.
ఈమెది న్యాయవాదుల కుటుంబం. తండ్రి ఓం ప్రకాశ్ మల్హోత్రా సుప్రీం కోర్ట్ లాయర్‌గా పనిచేశారు. 1956 మార్చ్ 14న బెంగళూరులో జస్టిస్ ఇందు మల్హోత్రా జన్మించారు.
దిల్లీలో పుట్టిపెరిగిన ఆమె లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత న్యాయవిద్య అభ్యసించి సుప్రీం కోర్ట్‌లో 30 ఏళ్లుగా ప్రాక్టీస్ చేశారు.
ఫొటో సోర్స్, SUPREME COURT
జస్టిస్ ఆర్.భానుమతి
ఆర్. భానుమతి కూడా ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 2014లో ఆమె అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 1955 జులై 20న ఆమె జన్మించారు. తమిళనాడు హై కోర్ట్, జార్ఘండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.
హ్యాండ్‌బుక్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ మేనేజ్మెంట్ అండ్ యూస్ ఆఫ్ కంప్యూటర్స్ అనే పుస్తకాన్ని ఆమె రాశారు.
జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె అనంతరం జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా దేశాయిలు సుప్రీం కోర్ట్ జడ్జిలుగా వ్యవహరించారు.
ప్రస్తుతం ఇందిరా బెనర్జీతో పాటు ఆర్. భానుమతి, ఇందు మల్హోత్రా సుప్రీం జడ్జిలుగా ఉన్నారు.
ఇవికూడా చదవండి
- జాతీయగీతానికి మదనపల్లెకూ ఉన్న సంబంధమిది
- అమీనా: ఈ ఆఫ్రికా రాణి ప్రతి యుద్ధం తరువాత ఓ భర్తను పొందుతారు.. మరుసటి రోజున అతడిని చంపేసేవారు
- ఇంద్రా నూయీ: పన్నెండేళ్ల పెప్సీకో ప్రస్థానానికి గుడ్‌బై
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)