కరుణానిధి జీవితంలో ప్రధాన ఘట్టాలు.. కీలక మలుపులు

  • 7 ఆగస్టు 2018
కరుణానిధి రేఖా చిత్రం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆగస్టు 7న మరణించారు. దాదాపు 6 దశాబ్దాల కరుణ రాజకీయ ప్రయాణంలోని ప్రధాన ఘట్టాలను సంవత్సరాలు, తారీఖులతోపాటు మీకోసం అందిస్తోంది బీబీసీ.

1924 జూన్ 3: నాగపట్నం జిల్లా తిరుక్కువలై గ్రామంలో అంజుగమ్, ముత్తువేల్ దంపతులకు కరుణానిధి జన్మించారు.

1938: జస్టిస్ పార్టీ నేతల ప్రభావంతో టీనేజ్‌ నుంచే రాజకీయాలవైపు ఆకర్షితుడయ్యారు.

1941: 'తమిళనాడు తమిళ మానవర్ మంద్రం' పేరుతో ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించారు.

1944 సెప్టెంబర్: పద్మావతిని వివాహం చేసుకున్నారు. వారి కొడుకు ఎం.కె.ముత్తు.

1948 సెప్టెంబర్: భార్య పద్మావతి మరణించాక, దయాళు అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు. వారి సంతానం.. ఎం.కె.స్టాలిన్, ఎం.కె.తమిళరసి, ఎం.కె.అళగిరి, సెల్వి.

1949 సెప్టెంబర్ 18: పెరియార్ రామస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చాక సి.ఎన్.అన్నాదురై 'ద్రవిడ మున్నేట్ర కజగం'(డీఎంకే) పార్టీని స్థాపించారు.

1950: 'మంత్ర కుమారి' సినిమా విడుదలైంది. ఈ సినిమాకు కరుణానిధి స్క్రిప్ట్ రైటర్. హీరో ఎంజీఆర్ ఆ సినిమాలో కథానాయకుడు.

చిత్రం శీర్షిక అన్నాదురై, ఎంజీఆర్, పెరియార్ రామసామిలతో కరుణానిధి

1952: 'పరాశక్తి' సినిమా విడుదలైంది. ఈ సినిమాతో సినీ రచయితగా కరుణానిధికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ సినిమాతో శివాజీ గణేశన్ హీరోగా పరిచయమయ్యారు.

1953 జూలై 14, 15: 'కుల కల్వి తిట్టమ్'(వారసత్వపు విద్యా పథకం)కు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. 'దల్మియపురం' అనే ప్రాంతం పేరును 'కల్లక్కుడి'గా మార్చాలన్నది కూడా మరో డిమాండ్. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా కరుణానిధి.. రైలు పట్టాలపై తల పెట్టి నిరసన తెలిపిన ఘటన సంచలనం సృష్టించింది.

1957: కులితలై నియోజకవర్గం నుంచి కరుణానిధి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన మొత్తం 13 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరుణానిధి గెలిచారు.

1959: చెన్నై(అప్పటి మద్రాసు) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలిచింది. మొత్తం 100 సీట్లకు గాను.. డీఎంకే పార్టీ 45 సీట్లను కైవసం చేసుకుంది.

1962: తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అయ్యారు.

1963: నిరసనల్లో భాగంగా భారత రాజ్యాంగం కాపీలను దహనం చేసిన కేసులో 6నెలలు జైలు శిక్ష విధించారు.

1965 ఫిబ్రవరి 16: 'హిందూ వ్యతిరేక ఉద్యమం' నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి, ఏప్రిల్ 15న విడుదలయ్యారు.

1967: శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 'ప్రజా పనుల శాఖ' మంత్రి అయ్యారు.

1969 ఫిబ్రవరి 10: అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వి.పి.సింగ్ సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్‌లో తన పార్టీని భాగస్వామిగా చేయటం ద్వారా కరుణానిధి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు

1969 జూలై 27: డీఎంకే పార్టీ అధ్యక్షుడు అయ్యారు.

1971 మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ మళ్లీ విజయం సాధించింది. కరుణానిధి రెండోసారి మఖ్యమంత్రి అయ్యారు.

1972 అక్టోబర్ 14: ఎం.జి.రామచంద్రన్ డీఎంకేతో విభేదించి, డీఎంకే నుంచి బయటికొచ్చారు. తర్వాత 'ఏఐఏడీఎంకే' పార్టీ స్థాపించారు.

1974 ఆగస్టు 15: కరుణానిధి విన్నపం మేరకు.. పంద్రాగస్టునాడు జాతీయ జెండా ఎగరవేసే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రులకు దక్కింది.

1976 జనవరి 31: డీఎంకే ప్రభుత్వం బర్తరఫ్ అయ్యింది.

1986: శ్రీలంక తమిళుల అంశంలో కరుణానిధి.. టీఈఎస్‌ఓ (తమిళ్ ఈలం మద్దతుదారుల సంఘం) సమావేశం నిర్వహించారు.

1988: వి.పి.సింగ్ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన 'నేషనల్ ఫ్రంట్' ప్రభుత్వంలో డీఎంకే పార్టీ భాగస్వామి అయ్యింది.

1989: ఎంజీఆర్ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. కరుణానిధి మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు.

1991 జనవరి 30: శాంతి భద్రతల అంశం కారణంగా డీఎంకే ప్రభుత్వం మరోసారి బర్తరఫ్ అయ్యింది.

1996: నాలుగోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ప్రమాణ స్వీకారం చేశారు.

2001 జూన్ 30: 2001 ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయింది. జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి పూట అరెస్టు చేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

2006: ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. కరుణానిధి ఐదోసారి మఖ్యమంత్రి అయ్యారు.

2008-09: శ్రీలంకలోని తమిళుల పట్ల నిర్లక్ష్యం వహించారని, శ్రీలంక బలగాలు, ఎల్.టి.టి.ఇ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాస్త విరామం కలిగించే దిశగా.. భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని కరుణానిధిపై విమర్శలు వచ్చాయి.

2010: తమిళనాడు కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు.

2010 జూన్: కరుణానిధి ప్రభుత్వం కోయంబత్తూరులో 'ప్రపంచ తమిళ క్లాసికల్ కాన్ఫరెన్స్'కు ఆతిథ్యం ఇచ్చింది.

2011: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే చేతిలో డీఎంకే ఓటమిపాలైంది.

2013: కొడుకు స్టాలిన్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు.

2014-16: 2014లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయింది.

2016 అక్టోబర్ 25: కురుణానిధి ఆరోగ్యం దెబ్బతిందని డీఎంకే ప్రకటించింది.

2016 డిసెంబర్ 01: చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో వైద్యం కోసం కరుణానిధిని చేర్చారు. డిసెంబర్ 07న కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు.

చిత్రం శీర్షిక కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించిన వెంకయ్యనాయుడు (పాత చిత్రం)

2017 డిసెంబర్ 15: శ్వాసకోశ సమస్యతో రెండోసారి కరుణానిధిని హాస్పిటల్లో చేర్చారు. ఆయనకు 'ట్రాకియోస్టొమీ' ఆపరేషన్ చేశారు.

2017 డిసెంబర్ 16: డీఎంకే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కరుణానిధి వచ్చారు. అప్పటికి ఆయన కార్యాలయానికి వచ్చి సంవత్సరం గడిచింది.

2018 జూలై 18: అర్ధరాత్రి దాటాక, బీపీ స్థాయి తగ్గిపోయిన కారణంగా ఆయన్ను కావేరీ హాస్పిటల్ ఐసీయూలో చేర్చారు.

2018 ఆగస్టు 07: కరుణానిధి మరణించినట్లు కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.