దేవరియా: ‘బాలికల హాస్టల్ వద్దకు లగ్జరీ కార్లొస్తాయ్ వాటిలో ఎవరొస్తారో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు’

  • 8 ఆగస్టు 2018
యూపీ బాలికల హాస్టల్ Image copyright JITENDRA TRIPATHI

ఉత్తర్ ప్రదేశ్‌లో దేవరియా జిల్లాలోని బాలికల సంరక్షణ గృహంలో బాలికలపై లైంగిక వేధింపుల జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. జిల్లా మేజిస్ట్రేట్‌ను తొలగించింది.

ఈ కేసులో మరికొందరు అధికారులను విచారించారు. బాలికల సంరక్షణ గృహం నడుపుతున్న ఇద్దరిని అరెస్టు కూడా చేశారు.

కానీ చట్టవిరుద్ధంగా నడుపుతున్న ఈ సంరక్షణ గృహంలో పోలీసులే స్వయంగా బాలికలను తీసుకొచ్చి ఎందుకు వదిలేవారు అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ సంరక్షణ గృహం, దేవరియా రైల్వే స్టేషన్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఒక పాత భవనం మొదటి అంతస్తులో ఉంది. దీనిని ప్రస్తుతం సీల్ చేశారు. అక్కడ ఉన్న వారు పారిపోయారు లేదా పారిపోయేలా చేశారు.

ఇంటి పక్కనే ఇంత జరుగుతున్నా తమకు దీని గురించి ఏమాత్రం తెలియదని చుట్టుపక్కల ఉన్న వారు షాక్ అవుతున్నారు.

Image copyright JITENDRA TRIPATHI

స్థానికులు ఏం చెబుతున్నారు

ఈ వింధ్యావాసిని బాలికా సంరక్షణ గృహం ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో పాండేయ్ నడిపే స్టేషనరీ షాపు, ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. భవనం వెనుక భాగంలో ఆయన పూర్వీకుల ఇల్లుంది.

"మాకు ఇదంతా జరుగుతోందని అసలు తెలీదు. బాలికలను వదలడానికి, తీసుకెళ్లడానికి పోలీసులే వచ్చేవారు. ఇక్కడ బాలికలను స్కూలుకు కూడా పంపేవారు. చాలాసార్లు వాళ్లంతా పిక్నిక్‌కి వెళ్లడం కూడా మేం చూశాం" అని కేపీ పాండే చెప్పారు.

గిరిజా త్రిపాఠికి చెందిన ఆ సంస్థ చాలా పాతదని కేపీ పాండే తెలిపారు. 8 ఏళ్ల క్రితం వాళ్లు భవనం పైన అద్దెకు తీసుకుని ఆ బాలికల సంరక్షణ గృహాన్ని ప్రారంభించారని చెప్పారు.

పగలు తనకు అక్కడ అభ్యంతరకరంగా ఏం కనిపించేవి కావని, రాత్రిళ్లు అక్కడ ఏం జరిగేదో తనకు తెలీదని ఆయన చెప్పారు.

గిరీజా త్రిపాఠి, ఆమె భర్త బాలికల హాస్టలుతోపాటు కుటుంబ సలహాల కేంద్రం కూడా నడిపేవారని, వాటి ద్వారా వాళ్లు చాలా కుటుంబాలను కలుస్తూ ఉండేవారని, పొరుగునే ఉన్న మణిశంకర్ మిశ్రా తెలిపారు. కొంతమంది ఆమె దగ్గర పెళ్లిళ్ల గురించి సలహాలు తీసుకోవడానికి కూడా వచ్చేవారని చెప్పారు.

Image copyright JITENDRA TRIPATHI

కోట్లు వెనకేసిన గిరిజా త్రిపాఠి

చక్కెర మిల్లులో మామూలు ఉద్యోగం చేసే గిరిజా త్రిపాఠి భర్త ఇప్పుడు కోట్లు సంపాదించారని మణిశంకర్ మిశ్రా చెప్పారు. ఆయన ఇలాంటి ఎన్నో సంస్థలు నడుపుతున్నారని తెలిపారు.

"వాళ్లు పిల్లలను దత్తత ఇస్తారు, తమ దగ్గర ఉన్నవారికి పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. కనిపించడం లేదని చెబుతున్న 18 మంది బాలికలను వాళ్లు అలా ఎక్కడికైనా పంపించి ఉండచ్చు. అదే జరిగుంటే వాళ్లు దీన్నుంచి బయటపడతారు" అని గిరిజా త్రిపాఠిని ఆయన వెనకేసుకొచ్చారు.

అక్కడికి తరచూ కొందరు వచ్చేవారని, నగరంలో చాలా కార్యక్రమాలకు గిరిజా త్రిపాఠిని అతిథిగా ఆహ్వానించేవారని కూడా ఇరుగుపొరుగు చెబుతున్నారు.

నిజానికి ఇక్కడ ఆమెకు ఒక సంఘ సేవకురాలుగా గుర్తింపు ఉంది. ఆమె ఎన్నో ప్రభుత్వ సంస్థల్లో గౌరవ సభ్యులుగా ఉన్నారు. ఆమె చాలా మంది ప్రముఖులతో ఫొటోలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు స్వయంగా తనను తాను కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నారు.

ఈ బాలికల సంరక్షణ గృహం కార్యకలాపాలపై విచారణ జరిగింది, తర్వాత దాని గుర్తింపు కూడా రద్దైంది. అయినా దీనిని మూసి వేయకుండా కొనసాగించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చూపిందని, నిర్వాహకులతో కుమ్మక్కు అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి.

దీని గుర్తింపు రద్దు చేసి ఏడాదికి పైనే అయింది. కానీ సంరక్షణ గృహం గోడలపై 'ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన' అనే బోర్డు ఇంకా అలాగే ఉంది.

Image copyright JITENDRA TRIPATHI

ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్

అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన తర్వాత గత ఏడాది జూన్ 23న సంస్థ డైరెక్టర్ గిరిజా త్రిపాఠిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. కానీ జిల్లా అధికారులు మాత్రం ఏడాది తర్వాత 2018 జులై 30న ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ మధ్య కాలంలో ఏడాదంతా అధికారులు ఆమెకు నోటీసులు పంపిస్తూనే వచ్చారు. కానీ నోటీసులు ఇచ్చాక ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రీటా బహుగుణ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు.

గత ఏడాది రాష్ట్రమంతా ఉన్న మొబైల్ కుటీర గృహాల నిర్వహణలో పెద్ద ఎత్తున మోసం, అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో, అలాంటి సంస్థలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించారు.

అప్పుడు దేవరియాలోని ఈ సంస్థపై కూడా విచారణ జరిగింది. ఈ సంస్థలో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. అధికారులు చెప్పినదాన్ని బట్టి అప్పుడు కూడా అక్కడ నమోదై ఉన్న సంఖ్య కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు.

Image copyright JITENDRA TRIPATHI

గుర్తింపు రద్దు చేసినా, కార్యకలాపాలు

అవకతవకలు బయటపడడంతో ఈ సంస్థ గుర్తింపు రద్దు చేశారు. అయినా అందులో కార్యకలాపాలు కొనసాగాయి. జిల్లా అధికారులు ప్రేక్షకపాత్ర వహించడమే కాదు, పోలీసులు స్వయంగా బాలికలను తీసుకొచ్చి అక్కడ చేర్పించేవారని ఆరోపణలు వస్తున్నాయి.

"పాలనా స్థాయిలో ఆ సంస్థను మూసేసి, అక్కడ ఉన్న పిల్లలను వేరే సంస్థకు షిఫ్ట్ చేయమని మేం ఆదేశాలు ఇచ్చాం. కానీ గిరిజా త్రిపాఠి తనకు తెలిసిన ప్రముఖుల ద్వారా అలా జరగకుండా ఆపగలిగారు" అని మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు.

పేరు రాయకూడదనే షరతుతో అక్కడే నివసించే మరో వ్యక్తి "సుమారు వారం క్రితం జిల్లా ప్రొబెషన్ అధికారి ఇక్కడికి వచ్చారు. బాలికల గృహం సూపరింటెండెంట్, అక్కడ ఉన్న మిగతా వాళ్లు ఆయనతో గొడవ పడ్డారు" అని చెప్పారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ గొడవ తర్వాత ఆ సంస్థలో వ్యభిచారం జరుగుతోందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా, లేదా అనేది మాత్రం ఆయనకు తెలీదు. కానీ అలా జరిగిందని చెప్పారు.

Image copyright JITENDRA TRIPATHI

అయితే ప్రభుత్వ అధికారులు ఇంకొకటి కూడా చెబుతున్నారు. సంస్థ డైరెక్టర్ గిరిజా త్రిపాఠీ కోర్టు తప్పుడు వాయిదా ఆదేశాలను చూపిస్తూ అధికారుల్లో గందరగోళం సృష్టించారు. విచారణ నుంచి తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఆ విషయం అధికారికంగా చెప్పేందుకు ఏ అధికారి సుముఖంగా లేరు.

ఇక్కడ ప్రశ్నేంటంటే, సంరక్షణ గృహంలో ఉన్న బాలికల జీవనవిధానం, వారితో ప్రవర్తించిన తీరు విషయానికి వస్తే, చుట్టుపక్కల వారు ఆ సంస్థ గురించి, దాని డైరెక్టర్ గురించి, అందులో ఉన్న వారి గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.

"నేను స్వయంగా ఒక సంస్థలో పనిచేస్తున్నాను. అది అక్రమ, అనైతిక కార్యకలాపాలపై నిఘా పెడుతుంది. ఇక్కడ అలాంటిది ఏదైనా జరిగినట్టు మాకు తెలిసుంటే, చూసుంటే మేం కచ్చితంగా సందేహించే వాళ్లం" అని కేపీ పాండే తెలిపారు.

పక్కనే బట్టల దుకాణం నడిపే రాకేష్ మౌర్య కూడా ఈ ఘటన గురించి తెలిసి షాక్ అయ్యారు. ఇక భవనం వెనకే ఉంటున్న దిలీప్ శర్మ " పోలీసులే ఎంతో నమ్మకంతో బాలికలను సురక్షితంగా ఉంచడానికి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేవారు. చాలా పెద్ద అధికారులు వచ్చేవారు. మాకు కూడా అక్కడ జరిగేదానిలో ఎలాంటి తప్పూ ఉన్నట్టు కనిపించలేదు. ఉధయం, అర్థరాత్రి కొన్ని లగ్జరీ కార్లు వచ్చేది మాత్రం నిజం, కానీ ఆ కార్లలో ఎవరొస్తారో, ఎవరు వెళ్తారో.. మాకు తెలీదు అని చెప్పారు.

సుమారు రెండేళ్ల ముందు తమ ఇంటి దగ్గర ఒక మద్యం దుకాణం తెరిచారని, ఆ కార్లలో వచ్చిన వారు ఆ షాపులో మద్యం కోసం అక్కడికి వచ్చి ఉంటారేమోనని దిలీప్ శర్మ సందేహం వ్యక్తం చేశారు. అయితే, సంస్థపై దాడులు జరిగిన తర్వాత రోజు నుంచి, అక్కడ ఆ కార్లు తనకు కనిపించలేదని మళ్లీ ఆయనే అన్నారు.

Image copyright Thinkstock

బాలికల సంరక్షణ గృహాన్ని ప్రస్తుతం సీల్ చేశారు. చుట్టుపక్కల నిఘా పెట్టడానికి, రక్షణ కోసం అక్కడ కొంతమంది పోలీసులను నియమించారు.

సంస్థలో అంతా బాగానే జరిగేదని అక్కడ కొందరు చెబుతూ కనిపించారు. ఒక వృద్ధుడు మాత్రం పోలీసు అధికారులకు దాన్ని మూసేయాలంటూ చాలా మంది లేఖలు రాసినట్టు తనకు తెలుసని చెప్పారు. దానికి సంబంధించి తన దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.

"ఆ ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపకుండానే, తప్పిపోయిన పిల్లల్ని, ఇంటి నుంచి పారిపోయిన బాలికల్ని పోలీసులు అదే కేంద్రంలో తీసుకొచ్చి వదిలేవారు. పోలీసులకు వేరే సంరక్షణ గృహం లేదనుకుంటా, లేదా ఇక్కడ వదలడం వల్ల వాళ్లకు ఏదో లాభం ఉంది, లేదంటే అన్నిటికంటే ఇది సురక్షితమైనదేమో.. నాకు తెలీదు" అని ఆ వృద్ధుడు తెలిపారు.

పోలీసులు కూడా ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. సంస్థ డైరెక్టర్ గిరిజా త్రిపాఠికి యూపీ సర్కారు రక్షణ కల్పిస్తోందని, ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ సంస్థను అప్పట్లో ఎవరు కాపాడారు అనే ప్రశ్నకు మాత్రం అవి జవాబు చెప్పలేకపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)