అభిప్రాయం: బాలికా సంరక్షణ కేంద్రాలా? నరక కూపాలా?

  • 9 ఆగస్టు 2018
బాలికలపై లైంగిక హింస Image copyright Getty Images

సంరక్షణ గృహాల్లో ఉంటున్న బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని 46 మంది, ఉత్తర్‌ప్రదేశ్ దేవరియాలోని 24 మంది అమ్మాయిలు లైంగిక హింసకు గురయ్యారు. ఒకే చోట ఉన్న ఇంతమందిపై సుదీర్ఘకాలం పాటు లైంగిక దాడులు ఎలా జరిగాయి?

ఈ అమ్మాయిలు ఎందుకు గళం విప్పలేకపోయారు? లైంగిక దాడులను ఎందుకు ప్రతిఘటించలేకపోయారు? ఒకే చోట ఉంటున్న వీరు ఎందుకు స్థైర్యం కూడగట్టుకోలేకపోయారు?

వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. అందరిదీ దీనగాథే.

కుటుంబ హింస నుంచి తప్పించుకొన్నవారు, కుటుంబ సభ్యులే మనుషుల అక్రమ రవాణాదారులకు అమ్మేస్తే, వారి నుంచి తప్పించుకొన్నవారు, వ్యభిచార కూపాల నుంచి బయటపడ్డవారు, భర్త పెట్టే చిత్రహింసలను తట్టుకోలేక పారిపోయి వచ్చినవారు, భర్త 'వదిలేస్తే' తలదాచుకొనేందుకు వచ్చినవారు, అత్యాచారానికి గురైనందుకు సమాజం నుంచి ఎదరయ్యే ఛీత్కారాలను తట్టుకోలేక ఆశ్రయం కోసం వచ్చినవారు ఈ సంరక్షణ గృహాల్లో ఉన్నారు.

Image copyright Getty Images

అనారోగ్యం లేదా అంగవైకల్యం బారిన పడ్డప్పుడు కుటుంబ సభ్యులు పట్టించుకోకపోతే పోలీసుల సాయంతో ఇక్కడకు చేరుకున్నవారు, బాల కార్మికులుగా పనిచేస్తుండగా, అధికారులు రక్షించడంతో ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు.

సంరక్షణ గృహంలో ఈ అమ్మాయిలను అందరూ వదిలించుకొన్న వస్తువులను చూసినట్టు చూశారు. ఈ గృహాల్లో వీరికి ఏ మాత్రం విలువ ఉండదు. వ్యక్తిగత గుర్తింపుగాని, ప్రతిష్ఠగాని ఉండదు.

ఈ అమ్మాయిలపై లైంగిక వేధింపుల విషయంలో సంరక్షణ గృహాల నిర్వాహకులకు, ఈ అమ్మాయిలతో సెక్స్‌ కోసం డబ్బు చెల్లించిన వ్యక్తులకు ఈ పరిస్థితులు ఆసరాగా మారి ఉండొచ్చు. ఈ పరిస్థితులను చూసుకొనే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉండొచ్చు.

చిత్రం శీర్షిక ముజఫర్‌పూర్‌లోని బాలికా సంరక్షణ గృహం

'అవి నరక ద్వారాలు'

ఇలాంటి మహిళలను, బాలికలను చేరదీసి ఆశ్రయం కల్పించేందుకు 1969లో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ 'షార్ట్ స్టే హోమ్స్' ఏర్పాటు చేసింది.

తర్వాత అనేక చట్టాలు, నిబంధనలు వచ్చాయి. అయినా.. అవేవీ వారిని కాపాడలేకపోయాయి. ఈ గృహాల్లో సాగే అనైతిక నేరాలకు వాళ్లు బలైపోతున్నారు.

2013లో ఇలాంటి సంరక్షణ గృహాలపై అధ్యయనం చేసిన 'ఏషియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్' సంస్థ.. అవి 'భారత నరక ద్వారాలు' (ఇండియాస్ హెల్ హోల్స్) అని వ్యాఖ్యానించింది.

భారత్‌లో చిన్నారులపై అత్యాచారాల్లో ఎక్కువగా ఇలాంటి గృహాలలోనే జరుగుతున్నాయని, బాధితుల్లో బాలికలే అధికంగా ఉంటున్నారని ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

ఇలాంటి దారుణాలు చిన్నస్థాయి పట్టణాల్లోనే కాదు.. దిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లోనూ జరుగుతున్నాయి.

చిన్నారుల కోసం ఏర్పాటు చేసే ఏ సంరక్షణ గృహమైనా 'జువెనైల్ జస్టిస్ యాక్ట్' కింద నమోదై ఉండాలి. కానీ.. చాలావరకు అలా నమోదు కాలేదని ఆ నివేదిక తెలిపింది.

Image copyright GLOBAL-SISTERHOOD-NETWORK.ORG

పరిష్కారం ఏంటి?

బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత, ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి మహిళలకు, బాలికలకు ఓ పెద్ద సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని, దాని నిర్వహణను ప్రభుత్వమే చూడాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ సూచించారు.

కానీ 'ఏషియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్' నివేదిక ప్రకారం.. ప్రభుత్వేతర సంస్థలతో పాటు, ప్రభుత్వం నిర్వహిస్తున్న గృహాలలోనూ లైంగిక హింస జరుగుతోంది.

ఈ గృహాల్లో ఉంటున్నవారి విలువ ఏమిటో ప్రభుత్వ అధికారులు గుర్తించకపోతే.. ప్రభుత్వ, ప్రభుత్వేతర గృహాల మధ్య తేడా ఏమీ ఉండదు.

Image copyright Getty Images

'ఎవరూ పట్టించుకోలేదు'

బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని గృహంలో ఉంటున్న బాలికలు 'రెడ్ లైట్ ఏరియా'ల నుంచి వచ్చినవాళ్లేమీ కాదు. ప్రకృతి విపత్తుల్లో తల్లిద్రండ్రులను కోల్పోవడం వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్లు కూడా కాదు.

ఈ గృహాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. అయిదేళ్లుగా దీని నిర్వహణ బాధ్యతలను శిశు సంక్షేమ శాఖ ఆ సంస్థకే అప్పగిస్తోంది.

నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత ఆ సంస్థ పనితీరును సమీక్షించి, అంతా సక్రమంగా ఉంటేనే మళ్లీ బాధ్యతలు అప్పగించాలి. కానీ.. అలా జరగలేదు.

ఈ బాలికలపై లైంగిక హింసకు పాల్పడిన వ్యక్తులు.. వారిని అందరూ 'వదిలించుకొన్న' వస్తువులను చూసినట్లు చూశారు. తాము ఏం చేసినా ఎదిరించేవారే లేరు అన్నట్టుగా ప్రవర్తించారు.

ఆ అకృత్యాలపై జాతీయ స్థాయి పత్రికల్లో పలుమార్లు వార్తలు వచ్చినా.. బాధితులకు మద్దతుగా ఎక్కడా పెద్దగా ర్యాలీలు జరగలేదు. కాలేజీ విద్యార్థులు వీధుల్లో ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టలేదు.

మనమే స్పందించనప్పుడు.. బాధిత బాలికలు ఎదిరిస్తారని ఎలా ఆశించగలం?

Image copyright Getty Images

ఈ బాలికలను ఎవరూ 'పట్టించుకోలేదు'. వారి కుటుంబాలు, సమాజం, ఇతర స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఎవరూ 'పట్టించుకోలేదు'. తమపై జరుగుతున్న అకృత్యాల గురించి ఎవరికి చెప్పుకోవాలో ఈ బాలికలకు తెలియదు.

ఫిర్యాదు చేస్తే.. మరింత హింసను ఎదుర్కోవాల్సి వస్తుందేమో? ఒకవేళ గృహం నుంచి బయటకు గెంటేస్తే.. ఎక్కడికి వెళ్లాలి? బయట ఎవరిని నమ్మాలి?

అయినా.. ఓ బాలిక ధైర్యంగా బయటికొచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఉన్న ఓ సంరక్షణ గృహం నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులను ఆశ్రయించింది.

బిహార్‌లోని సంరక్షణ గృహాల్లో పరిస్థితులను పరిశీలించేందుకు 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్)' బృందం వెళ్లినప్పుడు.. వేధింపులకు గురవుతున్న బాలికలే ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేశారు.

ఆ విషయాలపై ఫిబ్రవరిలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు టిస్ తన నివేదిక అందజేస్తే, జూన్‌లో చర్యలు తీసుకున్నారు.

ఈ గ‌ృహాల్లో ఎలాంటి అమ్మాయిలు ఉంటారు? అన్నది ప్రశ్న కాదు. వాటిని ఎలాంటి వ్యక్తులు నిర్వహిస్తున్నారు? అన్నదే ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)