క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు

ఆజాద్ అక్కడ ఇంటి పేరు

భారతదేశ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఆజాద్‌కు ఆ ఇంటి పేరు ఎలా వచ్చిందనే విషయం మనలో చాలా మందికి తెలీదు.

13 ఏళ్ల వయసులో ఆయన చంద్రశేఖర్ తివారీ అనే తన పేరులో తివారీని తీసేసి, ఆజాద్ అనే పదాన్ని జోడించారు.

చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో గుజరాత్ యువత కూడా అప్పట్లో ఆజాద్, కాందర్, బాద్షా అనే మారుపేర్లు ఎంచుకుంది.

వడోదరలో ఉన్న కర్జన్, షినోర్ ప్రజలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం అయ్యారు.

భారత స్వతంత్ర పోరాటం గురించి 'అంబాలాల్ గాంధీ అండ్ రసిక్ భాయ్ ఆజాద్' అనే పుస్తకం రాసిన లలిత్ రాణా అందులో "రసిక్ షా ఒక రోజు తన పేరును రసిక్ ఆజాద్‌గా మార్చుకున్నాడు" అని తెలిపారు.

మహాత్మా గాంధీ అహింసా ఉద్యమంలో రసిక్ భాయ్ ఆజాద్ పాల్గొన్నారు. ఆయన వడోదర జిల్లాలోని చోరాండాలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. అంబాలాల్ గాంధీ చోరాండాలో నివసించేవారు. ఆయన కూడా స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. అంబాలాల్ గాంధీ, రసిక్ భాయ్ ఆజాద్ ఇద్దరూ ఒకే సిద్ధాంతాన్ని అనుసరించారు.

అదే సమయంలో చంద్రకాంత్, పద్మాబేన్ లాంటి మరి కొందరు నేతలు కూడా తమ పేరు చివర ఆజాద్ అనే పదం చేర్చుకున్నారు. ఆ ప్రాంతంలో చాలా మంది తమ అసలు ఇంటి పేర్లు వదిలి ఆజాద్, కందార్, బాద్షా అనే పేర్లను తమ పేరు పక్కన జోడించారు.

1942లో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న సమయంలో వడోదర ప్రజలు కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో భాగమయ్యారు.

ఫొటో క్యాప్షన్,

'ఓజస్వీ ఆజాద్' పుస్తకం నుంచి

1942 ఆగస్టు 18

1942లో ఆగస్టు 8న భారత్‌లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. ఉద్యమంలో ఎవరు పాల్గొన్నా అరెస్టులు చేయమని బ్రిటిష్ పాలకులు పోలీసులను ఆదేశించారు.

'అంబాలాల్ గాంధీ అండ్ రసిక్ భాయ్ ఆజాద్' పుస్తకంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన అంబాలాల్ గాంధీ, రసిక్ భాయ్ ఆజాద్ లాంటి వారు వడోదరలో క్విట్ ఇండియా ఉద్యమం ర్యాలీలో పాల్గొన్నారు అని తెలిపారు.

ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారిని అరెస్టు చేయమని బ్రిటిష్ అధికారులు, వడోదర ఎస్టేట్ పాలకులు ఆదేశించడంతో 1942 ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం నేతలను అరెస్టు చేశారు. వడోదరలో నిరసనలు, ర్యాలీలు నిషేధించారు.

లాఠీలు, తుపాకులతో ఉన్న పోలీసులు వడోదర వీధుల్లో గస్తీ కాశారు.

"క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా వడోదర సమీపంలోని అడాస్ గ్రామంలో ఒక ఆందోళన నిర్వహిచారు. ఇందులో వడోదర నుంచి వెళ్లిన చాలా మంది యువకులు పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు" అని 'అంబాలాల్ గాంధీ అండ్ రసిక్ భాయ్ ఆజాద్' పుస్తకంలో రాశారు.

అదే సమయంలో వడోదరలోని కోఠీ పోల్(వీధి) దగ్గర కూడా లాఠీఛార్జ్, కాల్పులు జరిగాయి. అక్కడ మరో ఇద్దరు యువకులు మరణించారు.

అడాస్‌లో మృతి చెందిన యువకుల స్మృతిచిహ్నంగా వడోదర-ఆనంద్ మధ్యలో ఉన్న అడాస్ రైల్వే స్టేషన్లో ఒక స్మారకాన్ని కూడా నిర్మించారు.

పోస్టాఫీసుకు నిప్పు

పోలీసు కాల్పులు, లాఠీఛార్జికి వ్యతిరేకంగా వడోదరలో తర్వాత ఎన్నో ర్యాలీలు, ఆందోళనలు జరిగాయని వడోదర జనజాగృతి అభియాన్ కన్వీనర్ మన్హర్ షా బీబీసీతో చెప్పారు.

"విద్యార్థులు షినోర్‌ గ్రామంలో ఉన్న స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లలేదు. ఆందోళనలు, ర్యాలీలు చేశారు. ఆ ఆందోళనల్లో పాల్గొన్నవారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు" అని ఆయన చెప్పారు.

పోలీస్ స్టేషనుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు, గ్రామంలో ఉన్న పోస్టాఫీసుకు కూడా నిప్పు పెట్టారు

ఆందోళనలు హింసాత్మకం కావడంతో ప్రభుత్వం ఆగ్రహించింది. వాటిని అణచివేసేందుకు గైక్వాడ్ ప్రభుత్వం సాయం కోరింది. వడోదరకు సైన్యాన్ని పంపాలని భావించింది. కానీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికులు ఒక వ్యూహం సిద్ధం చేశారు.

రైలు పట్టాలు ధ్వంసం

వడోదర రాజ్య ప్రజా మండలి 'పోలీస్ జుమ్లో ని కాలి కథ' అనే ఒక పుస్తకం ప్రచురించింది. అందులో స్వతంత్ర పోరాటం చేస్తున్న వారందరూ ఆగస్టు 21న అంబాలాల్ గాంధీ నాయకత్వంలో ఒక్కటయ్యారని తెలిపారు.

"బ్రిటిష్ సైన్యం 1942 ఆగస్టు 22న ఉదయం 10.30కు షినార్ చేరుకుంటుందని, మొత్తం గ్రామానికి నిప్పు పెట్టబోతోందని వారికి తెలిసింది. దాంతో సైన్యం తమ గ్రామానికి చేరుకోకుండా వారు రైలు పట్టాలను ధ్వంసం చేశారు" అని ఆ పుస్తకంలో రాశారు.

"ఆందోళనకారులు భర్తాలీ స్టేషన్ నుంచి షినార్ వరకూ ఉన్న రైలు పట్టాలు ధ్వంసం చేశారు. స్టేషన్ మాస్టర్లను కట్టేసి, రైల్వే స్టేషన్లో ఉన్న పుస్తకాలను తగలబెట్టారు".

బ్రిటిష్ ఆర్మీ, గైక్వాడ్ ప్రభుత్వం సైనికులు రైల్లో షినార్ బయల్దేరారు. కానీ కర్జన్ నుంచి పట్టాలు లేకపోవడంతో అక్కడి నుంచి తిరిగి వడోదరకు రావాల్సి వచ్చింది.

కానీ 'పోలీస్ జుమ్లో ని కాలి కథా' పుస్తకం ప్రకారం, బ్రిటిష్ పాలకులు షినార్ గ్రామానికి తమ పోలీసులను పంపించారు.

స్వతంత్ర పోరాటం కోసం ప్రభుత్వ ఉద్యోగం వదిలారు

వడోదరకు చెందిన రసిక్ భాయ్ ఆజాద్, అంబాలాల్ గాంధీ ఇద్దరూ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు.

జనజాగృతి అభియాన్ తరఫున 'అంబాలాల్ గాంధీ అండ్ రసిక్ భాయ్ ఆజాద్', 'ఓజస్వీ ఆజాద్' లాంటి పుస్తకాలు ప్రచురించిన మన్హర్ షా, రసిక్ ఆజాద్‌కు స్వయానా మేనల్లుడు.

"సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడానికి రసిక్ ఆజాద్ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారు, చంద్రశేఖర్ ఆజాద్ లాగే, ఆయన కూడా బ్రహ్మచారిగా ఉండిపోయారు" అని మన్హర్ బీబీసీకి చెప్పారు.

"1942లో గాంధీజీ వినోబా భావేని సత్యాగ్రహం కోసం ఎంచుకున్నారు. వినోబా భావే రసిక్ ఆజాద్‌ను మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఎంచుకున్నారు" అని ఆయన తెలిపారు.

స్వతంత్ర పోరాటంలో మహర్షి అరవింద్ పాత్ర

మహర్షి అరవింద్ స్వతంత్ర ఉద్యమ సమయంలో ప్రస్తుతం ఎం.ఎస్. యూనివర్సిటీగా పిలిచే, బరోడా కాలేజీలో ఫిలాసఫీ బోధించేవారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వడోదర ప్రజలు మహర్షి అరవింద్ నుంచి స్ఫూర్తిని పొందారు.

"1905లో అరవింద్ వడోదరలో ఉన్నప్పుడు, మధ్య గుజరాత్ అంతా ఆయన ప్రభావం కనిపించింది" అని సీనియర్ జర్నలిస్ట్, గుజరాత్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విష్ణు పాండ్యా బీబీసీకి చెప్పారు.

"అప్పట్లో పురానీ సోదరులు (చోటూ భాయ్ పురానీ, అంబాలాల్ పురానీ) చాలా చురుకుగా ఉండేవారు, వాళ్లు బాంబు తయారు చేసే పద్ధతిని కూడా నేర్చుకున్నారు".

'అంబాలాల్ గాంధీ అండ్ రసిక్ లాల్ భాయ్ ఆజాద్' పుస్తకంలో అప్పట్లో బాంబు తయారీకి సంబంధించిన వివరాలతో పుస్తకాలు కూడా ప్రచురించారని తెలిపారు. కానీ బ్రిటిష్ వాళ్ల కళ్లు కప్పేందుకు వాటిని దేశీయ మందుల తయారీ పుస్తకాలుగా చెప్పేవారని రాశారు".

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)