‘ఎన్‌ఆర్‌సీ కేవలం హిందూ-ముస్లిం సమస్య కాదు... అంతకు మించిన అసలు రాజకీయం వేరే ఉంది’

  • 9 ఆగస్టు 2018
ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక పోరాటం Image copyright Getty Images

అసోంలో ఎంతోమంది భారతీయుల హత్యలకూ, మారణహోమాలకు కారణమైన సంస్థ ఉల్ఫా(యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం). కేవలం అస్సామీలు కాదన్న ఒకే ఒక్క కారణంతో ఆ సంస్థ చాలామంది ప్రాణాలు తీసింది. తాజాగా విడుదలైన ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) ఆ సంస్థలో ఉత్సాహాన్ని నింపింది. అటు బీజేపీకి కూడా ఆ జాబితా సంతోషాన్నిచ్చింది.

దశాబ్దాలుగా వివక్షతో పెనవేసుకుపోయిన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్(ఆసు) కూడా ఆ జాబితాను చూసి సంబరపడింది. ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవల్ గతంలో ఆసు అధ్యక్షుడిగా ఉండేవారు.

ఎన్‌ఆర్‌సీ విషయంలో వీళ్లంతా ఇంత ఆనందపడటానికి వెనకున్న రాజకీయ కారణాలను ముందుగా అర్థం చేసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ జాబితాకు వెనకున్న ప్రధాన కారణం బెంగాలీలపై వ్యతిరేకత. ఇంకా చెప్పాలంటే వాళ్లపై ఉన్న వివక్ష.

అసోం, బెంగాల్‌లకు చాలా దూరంగా ఉన్న దిల్లీ మీడియా, క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన లేకుండా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను కేవలం హిందు-ముస్లింలకు సంబంధించిన విషయంగా చూపించింది. ఈ పరిణామం బీజేపీకి అనుకూలంగా మారింది. కానీ నిజానికి ఈ జాబితా ముస్లింలకు కాదు.. బెంగాలీలకు వ్యతిరేకం, బెంగాలీ-హిందువులకు, బెంగాలీ-ముస్లింలకు వ్యతిరేకం. ఈ జాబితా రూపకల్పనలో వీళ్లతో పాటు గూర్ఖాలు కూడా నష్టపోయారు.

బెంగాల్‌లో గత కొన్ని దశాబ్దాల్లోనే తొలిసారిగా అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం సీపీఐ(ఎం).. రెండూ కూడా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. అసోంలో ప్రజా సభలో పాల్గొనేందుకు తృణమూల్ పార్టీ తన ఎంపీలను పంపగా, అసోం పోలీసులు వాళ్లను విమానాశ్రయంలో అడ్డుకున్నారు.

Image copyright EPA

మరోపక్క బెంగాల్‌లో వేలాది దళితులు.. అసోంలో ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కని దళిత హిందు బెంగాలీలకు మద్దతుగా రైల్ రోకోలు నిర్వహించారు. దీనికి తోడు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలతో వార్తల్లో నిలిచే ఫైర్‌బ్రాండ్ బీజేపీ ఎంఎల్ఏ శిలాదిత్య దేబ్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీలో చోటుదక్కని వాళ్లలో ఎక్కువమంది హిందువులే ఉన్నారని అంగీకరించారు. శిలాదిత్య ఓ బెంగాలీ హిందువు. ఆయన ప్రధాన ఓటు బ్యాంకు కూడా బెంగాలీ హిందువులే.

బెంగాలీలు అయిన కారణంగానే ఈ హిందువులను కూడా జాబితా లక్ష్యంగా చేసుకుంది. బెంగాలీ ముస్లింలలోనూ తీవ్ర భయందోళనలు నెలకొన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ బెంగాలీ మాట్లాడే ముస్లింలంతా బంగ్లాదేశీయులే అన్న ముద్ర పడిపోయింది. దాంతో అసోంలోని చాలామంది బెంగాలీ ముస్లింలు జాబితా విడుదలైనప్పటి నుంచి నిరాశలో కూరుకుపోయారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption‘మేం భారతీయ పౌరులమని ఎలా నిరూపించుకోవాలి?’

బెంగాలీలు ఎక్కువగా ఉండే అసోంలోని బక్సా జిల్లాలో మాత్రం బెంగాలీ హిందువులు తమ గొంతు వినిపించారు. రాస్తారోకోలు నిర్వహించి తమకు మద్దతునిస్తోన్న మమతా మెనర్జీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ భారతీయులంతా ఇప్పుడు తమకంటూ ఓ రాష్ట్రం ఉండదేమోననే భయంతో ఉన్నారు. కేవలం బెంగాలీలు అయినందుకు వాళ్లీ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

మొదట్నుంచీ బెంగాలీలు అస్సామీలకు మధ్య బీజేపీ దోబూచులాడింది. మొదట అందరితో కలిసి ప్రయాణించినట్లు కనిపించినా, తమ ఓట్లు తమకు దక్కాక బెంగాలీలను బస్సు కిందకు తోసేయాలని బీజేపీ నిర్ణయించుకుంది.

Image copyright Getty Images

నిజానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా భారత్‌లో ఉంటున్న వాళ్లను మాత్రమే బంగ్లాదేశీయులు అనాలి. కానీ బీజేపీ దృష్టిలో మాత్రం ముస్లిం బెంగాలీలంతా బంగ్లాదేశీయులే అన్నట్లు కనిపిస్తోంది. తరచూ ఆ వర్గంపై జరుగుతున్న దాడులు, వాళ్లపై విధిస్తోన్న శిక్షలు దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, హరియాణా లాంటి రాష్ట్రాల్లోనూ బెంగాలీ ముస్లింల అరెస్టులు జరుగుతున్నాయి.

అసోంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశీయులకు అర్థం బెంగాలీ ముస్లింల నుంచి మొత్తంగా బెంగాలీలుగా మారిపోయింది. ఎన్‌ఆర్‌సీ ప్రచురితమయ్యాక ఈ వివక్ష స్పష్టంగా కనిపించింది. మేఘాలయలో కొంతమంది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బెంగాలీలుగా కనిపించిన వారిని పౌరసత్వ ధృవీకరణ పత్రాలు చూపించమని డిమాండ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనూ అదే పని చేస్తామని కొందరు ప్రకటించారు.

మణిపుర్‌లోనూ 1951ని కటాఫ్ తేదీగా పెట్టి ఇలాంటి ఎన్‌ఆర్‌సీనే తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తున్నారు.

‘అసోం అస్సామీలకు మాత్రమే’ అన్న నినాదం చాలాకాలంగా ఉంది. ఆ ముసుగులోనే బెంగాలీలకు వ్యతిరేకంగా గతంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయి. చివరికి అది ఉల్ఫా రూపంలో పూర్తిస్థాయి వేర్పాటువాద ఉద్యమంగా మారింది. కేవలం అస్సామీలతో నిండిన ‘స్వచ్ఛమైన’ అసోం కావాలని అక్కడ చాలామంది కోరుకుంటున్నారు. కానీ భారతీయ విలువల్లో ఒకటైన ‘భిన్నత్వంలో ఏకత్వ’ స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం.

మొత్తంగా అసోంలో దాని పొరుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు ముస్లిం వ్యతిరేక బీజేపీ ఆయా రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లడానికి సహకరించాయి. వాళ్ల అసలు లక్ష్యం బెంగాలీ ముస్లింలు. కానీ దాని కోసం బెంగాలీ హిందువులనూ బలివ్వక తప్పలేదు. ‘ఓ పెద్ద లక్ష్యాన్ని’ అందుకునే క్రమంలో అసోంలోని గూర్ఖాలు కూడా సమిధలుగా మారారు.

ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కని 40లక్షల మందిలో అసలైన భారతీయులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మీడియా, జాబితా సిద్ధమయ్యే సమయంలో మాత్రం పట్టించుకోలేదు.

దేశంలో చాలా మంది అక్రమంగా ప్రవేశించిన వాళ్లు ఉండొచ్చు. కానీ పౌరులు కాని వారు ఎవరో నిర్ణయించేముందు అసలు పౌరులంటే ఎవరో నిర్ణయించాలి. పౌరులుగా నిర్ణయించడానికి నిబంధనలను రూపొందిస్తే అవన్నీ న్యాయబద్ధంగా, సమానత్వంతో ఉండాలి. డాక్యుమెంట్లనే సాక్ష్యాలుగా స్వీకరిస్తే అవన్నీ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి. పౌరసత్వాన్ని నిర్ణయించే సంస్థ పారదర్శకంగా ఉండాలే తప్ప ఏ పక్షానికీ అనుకూలంగా ఉండకూడదు. కానీ వీటిలో ఏ ఒక్క అంశాన్నీ ఎన్‌ఆర్‌సీ ఏజెన్సీ పాటించినట్లు కనిపించట్లేదు.

అందుకే బెంగాలీలను ‘అధికారికంగా’ దూరం చేసి బీజేపీ సెంటిమెంట్లను సంతృప్తి పరిచేందుకే ఈ జాబితాను రూపొందించినట్లు ఉంది. కానీ ఈ జాబితా ద్వారా అసోంలో లాభపడదామనుకున్న బీజేపీకి బెంగాల్‌లో ఎదురువుతోన్న వ్యతిరేక సెగ తగులుతోంది. క్రమంగా యావత్ భారతంలో ఈ ఎన్‌ఆర్‌సీని రూపొందించిన విధానంపై అవగాహన పెరుగుతోంది.

(ఈ వ్యాసం రచయిత వ్యక్తిగత అభిప్రాయం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)