ప్రెస్‌రివ్యూ: ‘యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా పీహెచ్‌డీలు ఇచ్చేస్తున్నాయి’

  • 9 ఆగస్టు 2018
Image copyright kadiam srihari/facebook

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు అడ్డగోలుగా పీహెచ్‌డీ ప్రవేశాలు, పట్టాలు ఇవ్వడంపై ఉపకులపతుల సమావేశంలో గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తంచేశారని ఈనాడు తెలిపింది.

వెంటనే ఈ తంతుకు ముగింపు పలకాలని స్పష్టం చేశారు. ఒక్కో విశ్వవిద్యాలయం వందల సంఖ్యలో పీహెచ్‌డీలు ఇస్తోందని, కొన్నింటిలో ఆ సంఖ్య 400-500 వరకు ఉంటోందని, అందుకే స్నాతకోత్సవాలకు వెళ్లాలనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

''అసలు వందల మంది ఏం పరిశోధన చేస్తున్నారు? వారికి కనీసం లేఖ రాయడమైనా వస్తుందా? అంతమందికి ఆచార్యులు సక్రమంగా మార్గదర్శకం చేయగలరా? అంత సమయం కేటాయించగలరా?'' అంటూ నిలదీశారు.

ఉన్న ఆచార్యులు ఎంతమంది? వారి శక్తిసామర్థ్యాలు ఏమిటి? ఎంత మందికి మార్గదర్శనం చేయగలరో అంచనా వేసి విద్యార్థులను కేటాయించాలని సూచించారు.

గూగుల్‌ సమాచారంతో సిద్ధాంత పత్రాలు(థీసిస్‌) సమర్పిస్తున్నారని, అలాంటి ఆషామాషీ పీహెచ్‌డీలు ఇవ్వడాన్ని వెంటనే ఆపేయాలని ఆదేశించారు. ఇలా పట్టాలు తీసుకున్నవారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆమోదం లేని కళాశాలలు దిల్లీ తర్వాత తెలంగాణలోనే(37) ఎక్కువ ఉన్నాయని వార్తలొచ్చాయని, వాటి పరిస్థితి ఏమిటని గవర్నర్‌ ఉపకులపతులను ఆరా తీశారు.

అవన్నీ మూసివేతకు దరఖాస్తు చేశాయని, వాటిల్లో ప్రవేశాలు లేవని అధికారులు సమాధానమివ్వగా.. 'కేవలం బోధనా రుసుముల కోసం నడిచే కళాశాలలను మూసివేయాలని' గవర్నర్‌ స్పష్టం చేశారని ఈనాడు వెల్లడిచింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

చేప పిల్లల కోసం చలో ఆంధ్ర

తెలంగాణలోని మత్స్యకారులందరికీ ఉచితంగా చేపపిల్లల్ని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. మత్స్యకారులు మాత్రం సొంత డబ్బుతో కొనుక్కోవడానికే మొగ్గు చూపుతున్నారంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

మత్స్యశాఖ సకాలంలో పంపిణీ చేయకపోవడం, చేసేవి కూడా నాణ్యమైనవి కాకపోవడమే దీనికి కారణం. అధికారులు పంపిణీ చేసే చేపపిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, రెండు- మూడు నెలలు ఆలస్యంగా పంపిణీ చేస్తుండడంతో మత్స్యకారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు.

చెరువుల్లో నీళ్లుంటే చేపపిల్లలు పోయడానికి జూన్‌, జూలై నెలలే అనుకూలం. జూలై, ఆగస్టుల్లో పెరుగుదల వేగంగా ఉంటుంది. డిసెంబరు నాటికి కిలో బరువుకు చేరువవుతాయి.

సంక్రాంతి నుంచి చేపలు పట్టడం మొదలవుతుంది. మార్చి వరకు మంచి సైజులో ఉంటాయి. ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లలు మాత్రం సెప్టెంబరులో చెరువుల వద్దకు వస్తున్నాయి. 3, 4 నెలలు ఆలస్యంగా పంపిణీ చేస్తుండడంతో ప్రయోజనం లేకుండా పోతోంది.

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఇప్పటికే ఆంధ్రాకు వెళ్లి చేప పిల్లలు కొనుగోలుచేసి తీసుకొచ్చారు. చిన్న సైజు పిల్లలైతే ఒక్కోటి 25 పైసలు, అంగుళం నుంచి రెండంగుళాల పొడవున్న పిల్లలైతే ఒకటి 50 పైసలు పడుతోంది. లక్ష పిల్లలు కొంటే రూ.50 వేలు అవుతోంది.

రాష్ట్రంలోని 21,568 నీటి వనరుల్లో మత్స్యశాఖ ఈ ఏడాది 75.80 కోట్ల చేపపిల్లలను విడుదల చేయాలని నిర్ణయించింది. జూలై చివరి వారంలో పంపిణీ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. నిరుడు కూడా సెప్టెంబరులో పంపిణీ చేయ డంతో చేపలు పెద్దగా ఎదగలేదని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright Getty Images

రాబందువులకు బంధువుగా..

అంతరించిపోతున్న అరుదైన జాతి రాబందులను సంరక్షించేందుకు బెజ్జూరు రిజర్వ్‌ అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపిందని సాక్షి వెల్లడించింది.

జెజ్జూరుతో పాటు గూడెం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి 'జటాయు' పేరుతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని బెజ్జూరు రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో గల పాలరాపుగుట్ట మీద రాబందుల ఉనికిని 2013లో గుర్తించారు.

200 మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న పాలరాపుగుట్టపై 100 మీటర్ల ఎత్తులో రాబందులు ఆవాసం ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. రాబందుల పునరుత్పత్తి, ఆవాసాలకు రక్షణ కల్పించేందుకు అదే సంవత్సరం నుంచి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది.

2013లో 10 రాబందులు మాత్రమే ఇక్కడ ఉండగా, 2016-17 నాటికి 30కి పెరిగాయి. ఏటా సగటున 6 నుంచి 8 రాబందుల పిల్లలు పుడుతున్నాయి.

వీటి పరిరక్షణకు బెజ్జూరు రిజర్వ్‌ అటవీ ప్రాంతం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి 397.99 చ.కి.మీ. మేర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం అవసరమని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అటవీ శాఖ నివేదించింది.

రాష్ట్రంలో పాలరాపుగుట్టపైనే రాబందులున్నా యి. దక్షిణ భారత్‌లో రాబందుల అతిపెద్ద నివాస ప్రాంతం ఇదే. భారత్, పాకిస్తాన్, నేపాల్‌లో ఈ జాతి రాబందులు అరుదుగా కనిపిస్తున్నాయి. పాలరాపుగుట్టపై ఉండే రాబందులకు పశువుల కళేబరాలను ఆహారంగా వేసినా తినకుండా గడ్చిరోలికి వెళ్తున్నాయని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయని సాక్షి తెలిపింది.

ఏడీఆర్ Image copyright Adr webiste

ప్రాంతీయ పార్టీలకు తగ్గిన విరాళాలు

దేశంలోని 31 ప్రాంతీయపార్టీలకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.91.37 కోట్ల విరాళాలు అందాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ.87కోట్ల మేరకు చందాలు తగ్గినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించిందని ఈనాడు తెలిపింది.

అత్యధిక విరాళాలు ఆర్జించిన జాబితాలో శివసేన, ఆప్‌, ఆకాళీదళ్‌ తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. తెలుగురాష్ట్రాలకు చెందిన తెదేపా (రూ.1.89 కోట్లు), వైకాపా (రూ.42లక్షలు), తెరాస (రూ.34లక్షలు)లు వరుసగా 7, 16, 18వ స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

మొత్తం చందాల్లో 4977 మంది రూ.20వేలకుపైగా (రూ.90.08 కోట్లు)సమర్పించుకున్నారు. 1,362 మంది ఆ లోపే (రూ.1.29కోట్లు) అందించారు. 2015-16తో పోలిస్తే 2016-17లో తెదేపా విరాళాలు 39శాతం, వైకాపా 75, తెరాస 55శాతాలు తగ్గాయి.

అకాలీదళ్‌, ఆప్‌, ఎంఎన్‌ఎస్‌, ఏజీపీ, ఎస్‌డీఎఫ్‌, జేడీఎస్‌ మినహా మిగతా అన్నిపార్టీల విరాళాలూ కుంచించుకుపోయాయి. అసోం గణపరిషత్‌, అకాలీదళ్‌లకు విరాళాలు భారీగా పెరిగాయి.

రాజకీయపార్టీలకు అత్యధికంగా దిల్లీ నుంచి 22.83శాతం, మహారాష్ట్ర నుంచి 21.56, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1.76; ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి 18.77, ఆచూకీ లేని చిరునామాల నుంచి 15.75శాతం మేరకు విరాళాలు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీకి రూ.1.89 కోట్లమేర విరాళం ఇచ్చిన 59 మంది పాన్‌ నెంబర్లు ప్రకటించారు. అలాగే వైకాపాకు రూ.42 లక్షల విరాళం ఇచ్చిన ముగ్గురు, తెరాసకు రూ.34 లక్షలు ఇచ్చిన 26 మంది పాన్‌ నెంబర్లను ప్రకటించినట్లు ఏడీఆర్‌ పేర్కొందని ఈనాడు వెల్లడించింది.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)