ఐకియా: భారతదేశంలో అతిపెద్ద ఫర్నీచర్ స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభం

  • 9 ఆగస్టు 2018
ఐకియా

స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా భారతదేశంలోని తన తొలి అతి పెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. మధ్యతరగతి గణనీయంగా పెరుగుతున్న దేశంలో ఇదొక గొప్ప అవకాశం అవుతుందని ఐకియా భావిస్తోంది.

హైటెక్ సిటీ సమీపంలో 13 ఎకరాల్లో ఐకియా ఏర్పాటు చేసిన అత్యంత విశాలమైన ఫర్నిచర్ మార్కెట్‌ను భారత్‌లో బహుశా ఎవరూ ఇప్పటి వరకు చూసి ఉండరు.

ఐకియా బ్రాండ్ గురించి ఇప్పటివరకు తెలియని వారు కూడా ఈ భారీ స్టోర్ ఏర్పాటైందని తెలియడంతో సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఐకియా బ్రాండ్ విదేశీ పర్యటనలు చేసే ఉన్నతాదాయ వర్గాలలో చాలా పాపులర్. వాస్తవానికి, దశాబ్ద కాలం నుంచే పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టాయి. కానీ, ఐకియా ఇక్కడికి రావడానికి సమయం తీసుకుంది.

దీని వెనుక ఉన్నకారణాన్ని సంస్థ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెస్పెర్ బ్రొడిన్ బీబీసీకి వివరిస్తూ, ''భారతీయ మార్కెట్లోకి విస్తరించడం మా కల. కొన్నేళ్ల కిందటే ఇక్కడికి రావాలనుకున్నాం. కానీ, ఇక్కడ వ్యాపార పరిస్థితులను పరిశీలించినప్పుడు అప్పట్లో అంత ఆశాజనకంగా కనిపించలేదు. మా లక్ష్యాలను సాధించలేమని, రిస్కుతో కూడుకున్నదని భావించాం.'' అని తెలిపారు.

ఐకియా ఇప్పుడు అడుగుపెట్టడానికి కారణమేంటి?

ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పులు. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోకి అనుమతిస్తూ 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదీ ఐకియాకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, ఈ సంస్థకు దేశీయ భాగస్వామితో కలసి జాయింట్ వెంచర్ చేయాలనే ఆలోచన ఎన్నడూ లేదు.

అంతేకాకుండా, భారతదేశంలో ఈ-కామర్స్ వేగంగా వృద్ది చెందుతుండటం కూడా ఐకియాకు సానుకూలాంశంగా మారింది.

ప్రస్తుతానికి హైదరాబాద్‌లో స్టోర్ మాత్రమే ఏర్పాటు చేసిన ఐకియా వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మాలని భావిస్తోంది.

''ఇండియాలో స్టోర్ ఏర్పాటుకు వారు చాలా ఓపిక పట్టారు. ఇక్కడ మొదటి స్టోర్ ఏర్పాటు చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. వాస్తవానికి వారు ఇలా చేయడం అసాధారణంగా అనిపించింది.'' అని టెక్నోపార్క్‌ అడ్వైజర్ సలహా సంస్థకు చెందిన అరవింద్ సింఘాల్ తెలిపారు.

''సరైన సమయంలో మార్కెట్‌లోకి వెళ్లాలనే సంకల్పంతో వారు ఇలా చేసినట్లు నాకు కనిపించింది'' అని చెప్పారు.

Image copyright AFP/Getty Images

ప్రపంచవ్యాప్తంగా ఐకియా తన ఫర్నిచర్ ను విడిభాగాల (రెడీ టు ఫిట్) రూపంలోనే అందిస్తుంది.

ఫర్నిచర్ విడిభాగాలను ఇంటికి తీసుకెళ్లి కొనుగోలుదారుడే బిగించుకోవాల్సి ఉంటుంది. అయితే, భారత్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించదు. చాలా తక్కువ ఖర్చుకే కూలీలు ఇంటికి వచ్చి ఫర్నిచర్‌ను బిగిస్తుంటారు.

''ఈ విషయంపై మేం వినియోగదారులతో వాదిస్తాం. విడిభాగాలను తీసుకెళ్లి మీరే బిగించుకోవాలని చెబుతాం. దాని వల్ల మీకు డబ్బు కూడా ఆదా అవుతుందని వివరిస్తాం'' అని బ్రొడిన్ చెప్పారు.

''మేం హోం డెలివరీ, కిచెన్ ఇన్‌స్టలేషన్ సర్వీసులను కూడా అందిస్తాం. ఇందుకోసం దేశంలో ఉన్న వివిధ సంస్థలు, నిపుణులతో ఒప్పందాలు చేసుకున్నాం. అలాగే, వినియోగదారుల ఇంట్లో ఫర్నిచర్ విడిభాగాలను అమర్చేందుకు కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తాం. దీని ద్వారా చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది.'' అని బ్రొడెన్ తమ ప్రణాళికలను వివరించారు.

''1000 సీట్లతో ఐకియా స్టోర్‌లో ఒక రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేశాం. ప్రపంచం వ్యాప్తంగా మాకున్న స్టోర్లలో ఇదే పెద్దది. ఇక్కడ ఆవు, పంది మాంసం కాకుండా ఇక్కడి సంప్రదాయ వంటకాలనే వడ్డిస్తాం. చికెన్, శాకాహార వంటలు ఇక్కడ లభిస్తాయి. అలాగే, బిర్యానీ, దాల్ మఖాని కూడా మీరు ఇక్కడ తినొచ్చు.'' అని తెలిపారు

కానీ, వినియోగదారుడు ఐకియా స్టోర్‌కు రావాలంటే ముందుగా ఆలోచించేది ఉత్పత్తుల రేట్ల గురించే.

''భారతీయులు ఏ వస్తువునైనా కొనాలంటే ముందు దాని ధర గురించే ఆలోచిస్తారు. అలాగే, నాణ్యతను కూడా పరిశీలిస్తారు. కానీ, నాణ్యమైన వస్తువులను తక్కువ ధరల్లో అందించలేం. ఇక్కడి వారు తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు కావాలనుకుంటారు'' అని ఎర్నెస్ట్ అండ్ యంగ్‌ సంస్థకు చెందిన పరేశ్ తెలిపారు.

ఈ విషయాలను ఐకియా సంస్థ పరిగణనలోకి తీసుకున్నట్లుంది.

''ఇక్కడ దాదాపు 7,500 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. రూ.200 అంతకంటే తక్కువ ధర లోపు ఉన్న వస్తువులు 1,000 వరకు ఉండేలా చేయడానికి మేం చాలా కష్టపడ్డాం. మరో 500 రకాల వస్తువులు రూ.100 లోపే మీకు ఇక్కడ లభిస్తాయి.'' అని బ్రొడిన్ తెలిపారు.

విదేశాల నుంచి తమ వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా ఐకియాకు పెద్ద సమస్య. అలాగే, తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తే పెట్టిన పెట్టుబడి రావడానికి చాలా సమయం పడుతుంది.

మొత్తంగా, భారతదేశంలో 10 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఐకియా తెలిపింది.

"భారీగా పెట్టుబడులు పెడుతున్నాం, వీటి మీద ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, మేం ఓపిగ్గా నిరీక్షించాలనే ఉద్దేశంతోనే ఉన్నామ"ని బ్రొడిన్ చెప్పారు.

ఐకియా తన స్టోర్‌ను ఆగస్ట్ 9న ప్రారంభించింది. వినియోగదారులు తమ ఉత్పత్తులను ఎలా ఆదరిస్తారోనని సంస్థ ప్రతినిధులు ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)