ఈ మహిళలు బతకడానికి.. ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెడతారు

  • 10 ఆగస్టు 2018
సముద్రంలో మహిళ

నెలకు ఓ 10వేల రూపాయల కోసం మీరెంత సాహసం చేయగలరు? ఇదే ప్రశ్న ఈ మహిళల్ని అడిగితే.. 'ఆ డబ్బు కోసం మా ప్రాణాల్ని సైతం పణంగా పెడతాం' అంటున్నారు. బతుకు తెరువు కోసం వీళ్లు నిజంగానే ఆ పని చేస్తున్నారు.

తమిళనాడులోని వందలాది మహిళలకు సముద్రమే జీవితం. వాళ్లు బతకాలంటే నిత్యం సముద్ర గర్భంలో సాహసం చేయాల్సిందే. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల సంపాదన కోసం వీరు ప్రాణాల్నే పణంగా పెడుతున్నారు.

సముద్రంలోని రాళ్లు, పగడపు దిబ్బల మీద దొరికే నాచు కోసం వీరు నిత్యం సముద్రంలోకి వెళ్తున్నారు. ఆ నాచుని సేకరించి, అమ్ముకొని వాటితోనే జీవనం సాగిస్తున్నారు.

జీవనశైలిని కింది వీడియోలో చూడొచ్చు

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబతకాలంటే.. ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే

తమిళనాడులో దాదాపు 3వేల మంది మహిళలు ఈ పనినే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారు. సముద్రం ఎప్పుడు ఆటుపోట్లకు గురవుతుందో, ఏ క్షణం ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అన్నిటికీ సిద్ధపడే వీళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

వీళ్లలో కొందరు మృత్యువును దగ్గరగా చూసినవాళ్లూ ఉన్నారు. నమ్‌తాయి అనే వృద్ధురాలు కూడా అందులో ఒకరు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ‘ఈ సముద్రమే మాకు జీవితం. గతంలో మేం చాలా నాచు సేకరించేవాళ్లం. కానీ ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. దాంతో డిమాండ్‌కు తగినంత నాచు దొరకట్లేదు. వేగంగా ఈదగలిగేవాళ్లు 50కిలోల దాకా నాచును సేకరిస్తారు. కానీ నాలాంటి వాళ్లు మాత్రం ఓ 15కిలోలు తీసుకురాగలరు.

చిత్రం శీర్షిక నేను చనిపోయేవరకూ ఈ సంపాదనతోనే బతుకుతా.. అంటారు నమ్‌తాయి

సముద్ర వాతావరణం ఎప్పుడు ప్రతికూలంగా మారుతుందో చెప్పలేం. 2004 సునామీ నాటి భయానక పరిస్థితులు నాకిప్పటికీ కళ్ల ముందు మెదుల్తాయి. ఆ రోజు నేను మూడు సంచుల నాచు సేకరించాను. వాటిని మూటగట్టే సమయంలో భారీ అలలు మొదలయ్యాయి. నా నడుము దాకా నీళ్లొచ్చేశాయి. అలలకు ఎదురీదడానికి ప్రయత్నించాను. నా కూతుళ్లను రక్షించుకుంటానో లేదోనని భయపడ్డాను. కానీ కాసేపటి తరవాత అటుగా వచ్చిన జాలర్లు నాతో పాటు నా ఐదుగురు కూతుళ్లనూ రక్షించారు’ అని సముద్రంలో తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ మహిళలంతా నెలకు 15రోజులపాటు పనిచేస్తారు. రూ.8వేల నుంచి రూ.10వేల దాకా సంపాదిస్తారు. కానీ వీరు చేసే ఈ పని వల్ల సముద్ర గర్భంలో జీవావరణం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అయినా ఈ మహిళలు మాత్రం తమ పనిని వదిలిపెట్టేలా కనిపించట్లేదు.

‘నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకూ నేను సముద్రంలోనే పనిచేస్తా. నేను చనిపోయేవరకూ ఈ సంపాదనతోనే బతుకుతా. అందుకే వీళ్లంతా నన్ను 'మొండి బామ్మ' అని పిలుస్తారు’ అంటారు నమ్‌తాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)