ఆవాసం కోసం ఆరాటం: ఏపీలో పులులు.. గుజరాత్‌లో సింహాలు

  • 10 ఆగస్టు 2018
సింహం

గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కానీ.. వాటికి అడవుల విస్తీర్ణం సరిపోవడంలేదు. దీంతో అవి తరచూ బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి.

1968లో గుజరాత్‌లో ఈ సింహాల సంఖ్య 177. అయితే వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు, ప్రభుత్వం, పరిసర గ్రామస్థుల ప్రయత్నాల కారణంగా ఈ సింహల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.

ప్రస్తుతం గుజరాత్‌లో 523 సింహలున్నాయి. కానీ గిర్ అడవుల విస్తీర్ణం వాటికి సరిపోవడం లేదు. దీంతో సుమారుగా 200కు పైగా సింహాలు అడవి బయటే బహిరంగ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. తరచూ నివాస ప్రాంతాలకు వస్తున్నాయి.

దాంతో దాదాపు 1200 గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

మరోవైపు.. పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి, బావుల్లో పడి, రైలు, రోడ్డు ప్రమాదాల భారిన పడి ఎన్నో సింహాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఇక్కడ నాలుగు రోజులకో సింహం చనిపోతోంది

జికార్ భాయ్ ఓ రైతు. ఈయన దగ్గర 8 గేదెలున్నాయి. 2017 నవంబర్‌లో దూడపై కొన్ని సింహాలు దాడి చేశాయి. అదృష్టవశాత్తూ ఆ దూడ బతికినప్పటికీ ఇంకా దాని మెడకు అయిన గాయం మాత్రం మానలేదు.

"ఇంతకుమందు మాకు చాలా గేదెలుండేవి. కానీ ఈ సింహాల దాడులకు భయపడి పశువుల సంఖ్యను తగ్గించుకున్నాను. ఒక సింహం రెండు గేదెలను ఎత్తుకుపోయింది. నిన్న కాక మొన్నే సింహాలు ఇక్కడ పశువులపై దాడి చేశాయి" అని జికార్ భాయ్ చెప్పారు.

జికార్ భాయ్ లాగే వారి గ్రామంలో మిగతా రైతులు కూడా ఈ సింహాల బెడదకు అలవాటుపడిపోయారు.

అయితే ఈ గ్రామాల్లో బ్లూ బుల్ లాంటి జంతువుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో తరచుగా వాటిలో సింహలు చిక్కుకుని ప్రమాదాల పాలవుతున్నాయి.

2016, 2017 మధ్య 184 సింహాలు చనిపోవడంతో గుజరాత్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.

సింహాల మరణాలకు సంబంధించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016 ,2017లో సగటున నాలుగు రోజులకో సింహం మరణించింది.

గిర్ అడవులలో ఉన్న సింహాలు గుజరాత్‌కి గర్వకారణం. అయితే వాటికి సరిపడా ఆవాసం కల్పించినప్పుడు మాత్రమే.. గుజరాత్ తన సింహ సంపదను చూసి గర్వపడాలి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపులులకూ వేసవి తాపం తప్పలేదు. మహారాష్ర్టలోని తడొబ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి తన మూడు పిల్లలతో కలిసి వేసవి తాపంతో నీరు తాగుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

తెలుగు రాష్ర్టాల్లో పులుల పోట్లాట

అడవుల్లో పెద్దపులులు చాలా భీకరంగా పోట్లాడుకుంటాయి. కొన్నిసార్లు ఏదో ఒకటి చనిపోయేదాకా ఆ పోరు సాగుతుంది. మరి వాటి కొట్లాటకు దారితీసే పరిస్థితులు ఏంటి?

ఇటీవల నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పెచ్చెర్వు సెక్షన్ నరమామిడి చెరువు సమీపంలో ఓ పెద్దపులి కళేబరాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు.

ఆ పులి దేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, తనకంటే పెద్దదైన మరో పులి చేసిన దాడిలో అది మృతి చెందిందని నిర్ధారించారు.

వేటగాళ్ల దాడిలోగాని మరే ఇతర కారణాలవల్లగాని చనిపోయిన ఆనవాళ్లు లేవని తెలిపారు.

Image copyright AP FOREST DEPARTMENT

"చంపటం లేదంటే చావటం"

అటవీ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పులుల మధ్య రెండు విషయాల్లో పోట్లాట జరుగుతుంది.

ఒకటి ఆవాసం కోసం, రెండోది సంపర్కం(సెక్స్) కోసం.

సహజంగా పులులు పుట్టిన తరువాత రెండు నుంచి మూడు సంవత్సరాల వరకే తల్లితో కలిసి ఉంటాయి. ఆ సమయంలో అడవిలో ఎలా జీవించాలి..? ఎలా వేటాడాలి..? తమనుతాము ఎలా రక్షించుకోవాలి? అనేది నేర్చుకుంటాయి.

తరువాత అవి తల్లిని వదిలి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఒక్కోసారి అప్పటికే మరోపులి ఏర్పాటు చేసుకున్న ఆవాసంలోకి వెళ్లి ఆక్రమించే ప్రయత్నం చేస్తాయి. ఆసమయంలో రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది.

Image copyright AP FOREST DEPARTMENT

"ఆవాసం కోసం పోరాటం"

అడవిలో ఒక్కోపులి తన ఆవాస ప్రాంతాన్ని దాదాపు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించుకుంటుంది. కొన్ని ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని తమ పరిధిగా ఏర్పాటు చేసుకుంటాయి.

తన ఆవాస పరిధిలోకి మరో పులి రాకుండా జాగ్రత్త పడుతుంది. వస్తే అడ్డుకుంటుంది. పోరాడుతుంది.

తనకంటే చిన్నది, బలహీనమైనది వస్తే కొన్నిసార్లు చంపుతుంది. అదే తనకంటే బలమైన దానితో ఘర్షణ జరిగితే చనిపోతుంది. లేదంటే పారిపోయి మరోచోట ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది.

Image copyright AP fOREST DEPARTMENT
చిత్రం శీర్షిక నల్లమలలో ఇటీవల కొట్లాటలో చనిపోయిన పులి ఇదే. దీన్ని ఈ చారల ఆధారంగా గుర్తించారు.

"సంపర్కం కోసం పోట్లాట"

సంపర్కం సమయం(మేటింగ్ పీరియడ్)లో కూడా పులుల మధ్య భీకర పోరు జరుగుతుంది.

సంపర్కం కోసం ఒక మగపులి ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఆడపులులతో జతకడుతుంది.

ఆడపులి తన శరీరం పునరుత్పత్తికి అనుకూలంగా మారినపుడు కొన్ని ప్రత్యేకమైన చేష్టలు, శబ్దాల ద్వారా తాను సెక్స్‌కు సిద్ధంగా ఉన్నట్లు మగపులికి సంకేతాలిస్తుంది.

అప్పుడు మగపులి దానితో జతకడుతుంది. పది నుంచి పదిహేను రోజులపాటు ఆ ఆడపులి ఆవాసంలోనే ఉండి సెక్స్‌లో పాల్గొంటుంది.

ఆ తరువాత సంపర్కానికి సిద్ధంగా ఉన్న తన గుంపులోని మరో ఆడపులి ఆవాసానికి వెలుతుంది.

Image copyright dl NARASIMHA
చిత్రం శీర్షిక బేస్ క్యాంపును పరిశీలిస్తున్నడీఎఫ్‌వో వెంకటేశ్

ఈ విధంగా ఒక మగపులి తన గుంపులోని ఆడపులులతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంటుంది.

వీటితో కలిసేందుకు ఇతర మగ పులులు ప్రయత్నిస్తే వాటిని అడ్డుకుంటుంది, పోరాడుతుంది. ఆ పోట్లాటలో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతాయి.

ఆడపులులు కూడా తమ గుంపులోని మగపులితోనే సంపర్కంలో పాల్గొంటాయి. ఏదైనా ఇతర మగపులి తమ ఆవాసంలోకి వచ్చి సంపర్కం కోసం ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాయి.

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సహకరించాల్సి వస్తే దానివల్ల పిల్లలు పుట్టకుండా ఉండేలాగా జాగ్రత్తపడతాయి.

Image copyright AP FOREST DEPARTMENT

"మలం, మూత్రంతో ఆవాసానికి హద్దులు"

పులులు తమ ఆవాసానికి హద్దులు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తాయి.

హద్దులో ఉన్న చెట్లపొదలపైన మూత్రాన్ని చిమ్ముతాయి.

నేలపై అక్కడక్కడా మలవిసర్జన చేస్తాయి. వాటి వాసన బట్టి అది సరిహద్దు అని ఇతర పులులు తేలికగా గుర్తించగలుగుతాయి.

అలాగే చెట్ల బెరడుపై గోర్లతో గీకి గుర్తులు పెట్టుకుంటాయి. పాదముద్రలు పడేలా తన ఆవాసం చుట్టూ తిరిగి సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి.

ఇలా ఒకపులి ఏర్పాటు చేసుకున్న హద్దు దాటి మరోపులి వెళ్లదు.

ఒకవేళ ఆక్రమించుకునేందుకు లోనికి వస్తే అప్పుడు ఆ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది.

కొన్నిచోట్ల పులుల సంఖ్యకు తగ్గట్టుగా అడవుల విస్తీర్ణం లేకపోవడం కూడా ఇలాంటి ఘర్షణలకు ఓ కారణమన్న అభిప్రాయం ఉంది.

Image copyright AP FOREST DEPARTMENT

కొట్లాటలు సహజమే...

పెద్దపులుల మధ్య పోట్లాటలు సహజమేనని కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎఫ్ఓ వెంకటేష్ సంబంగి తెలిపారు.

"ఈ పోట్లాటలో ఏదైనా పులి చనిపోతే దానికి ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పంచనామా, శవపరీక్ష నిర్వహించి ఆ తరువాత ఖననం చేస్తాం. దానిపై ఓ నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తాం" అని ఆయన చెప్పారు.

"పులుల రక్షణ కోసం అవి నివసించే కోర్ ఏరియా, సంచరించే అవకాశమున్న బఫర్ ఏరియాలలో తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. చెట్లను పెంచటం, వేటగాళ్ళను అడవిలోకి వెళ్లకుండా చూడటం ఇతర వన్యప్రాణుల సాంద్రతను పెంచటం ద్వారా పులులకు ఆహారాన్ని కల్పిస్తాం" అని వెంకటేష్ వివరించారు.

నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో రాత్రింబవళ్ళు అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండటం వల్ల వేటగాళ్ల నుంచి పులులకు రక్షణ దొరుకుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)