‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
- నవీన్ నేగి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
''మా పెళ్లయి అప్పటికి రెండు మూడు నెలలైంది. మేం వారాంతాల్లో మామూలుగా సినిమాకు వెళ్లేవాళ్లం. ఒకరోజు నేను నా భార్య మోనాకు ఆఫీసులో పని వల్ల సినిమాకు వెళ్లలేమని చెప్పాను. ఇది వినగానే ఆమెకు హఠాత్తుగా నా మీద కోపం వచ్చింది. కానీ అంత చిన్న విషయానికి కోప్పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు.''
ఇది చెబుతూ సంతోష్ నవ్వడం ప్రారంభించారు. పక్కనే కూర్చున్న మోనా కూడా నవ్వును దాచుకునే ప్రయత్నం చేశారు.
వాళ్లిద్దరికీ పెళ్లయి ఏడాది గడిచిపోయింది. వాళ్లిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.
సంతోష్ వివరించిన ఆ సంఘటన జరిగినప్పుడు మోనా 'ప్రీ-మెన్స్ట్రువల్ స్ట్రెస్' (పీఎంఎస్) అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఫొటో సోర్స్, MONALISA/FACEBOOK
సంతోష్, మోనా
రాజస్థాన్ కేసు
పీఎంఎస్ కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు కూడా దారి తీయవచ్చు.
కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌లోని అజ్మేర్లో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను బావిలో విసిరేయడంతో వాళ్లు మరణించారు.
ఈ కేసు రాజస్థాన్ హైకోర్టులో విచారణకు వచ్చినపుడు, ఆ ఘటన జరిగినప్పుడు ఆమె ప్రీ-మెన్ట్రువల్ స్ట్రెస్‌లో ఉందని, అందుకే తానేం చేస్తుందో ఆమెకు తెలీదంటూ న్యాయవాదులు వాదించారు.
ఆ మహిళ వాదనతో అంగీకరించిన కోర్టు, ఆమెను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
పీఎంఎస్ సందర్భంగా ఏం జరుగుతుంది?
పీఎంఎస్ అన్నది మహిళల్లో పీరియడ్స్ రావడానికి ఐదు నుంచి వారం రోజుల ముందు ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో వాళ్ల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తాయి.
ఆ సమయంలో వాళ్లు ఊరికే చిరాకు పడిపోతుంటారు. కొన్నిసార్లు, కొంతమంది మహిళలు ఆత్మహత్యకు కూడా పాల్పడతారు.
దిల్లీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఆదితి ఆచార్య పీఎంఎస్ గురించి ఇలా వివరించారు, ''మహిళల శరీరంలోని హార్మోన్ల మార్పులే పీఎంఎస్‌కు కారణం. ఆ సమయంలో వారి శరీరంలో, మరీ ప్రత్యేకించి పొత్తికడుపు, రొమ్ములలో నొప్పిగా ఉంటుంది. దీని వల్ల వాళ్ల మూడ్ హఠాత్తుగా మారిపోతుంటుంది. కొన్నిసార్లు వాళ్లకు హఠాత్తుగా కోపం వస్తుంది. ఆ సమయంలో వాళ్లు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తుంటారు'' అని తెలిపారు.
PLOS One అన్న సైన్స్ పత్రికలో పీఎంఎస్ గురించి పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. 2017, ఏప్రిల్‌లో ప్రచురించిన ఈ పరిశోధనా పత్రం.. 90 శాతం మంది మహిళల్లో పీఎంఎస్ కనిపిస్తుందని పేర్కొంది.
వారిలో 40 శాతం మంది మహిళలు ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. వారిలో 2-5 శాతం మంది ఆ ఒత్తిడికి బాధితులుగా మారుతారు. అది వాళ్ల సాధారణ జీవితాలపై ప్రభావం చూపిస్తుంది.
ఫొటో సోర్స్, Getty Images
జీవిత భాగస్వామిని అర్థం చేసుకోండి
ఆ సమయంలో మహిళలు తమ భాగస్వాములు తమ సమస్యలను అర్థం చేసుకోవాలని, తమకు తోడుగా నిలవాలని అనుకుంటారు.
బి.కామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఆయుష్, తన గర్ల్‌ఫ్రెండ్ మూడ్ అలా మారడం గురించి ఇలా వివరించారు.
''మాకు పరిచయమై రెండేళ్లయింది. ఆడవాళ్లకు ఇలాంటి సమస్యలు ఉంటాయని మొదట నాకు తెలీదు. ఒకరోజు నా గర్ల్ ఫ్రెండ్ హఠాత్తుగా కోపం తెచ్చుకుంది. చిన్న విషయం మీదే ఏడ్వడం ప్రారంభించింది. దాంతో నాకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాను'' అన్నారు.
అయితే, గూగుల్ ద్వారా పీఎంఎస్ గురించి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆయుష్కు తన గర్ల్ ఫ్రెండ్ మూడ్ హఠాత్తుగా ఎందుకు మారుతుందో అర్థమైంది.
పీరియడ్స్, పీఎంఎస్లాంటి విషయాల గురించి సమాచారం తెలుసుకున్న కొద్దీ తమ సంబంధం మరింత మెరుగుపడిందని ఆయుష్ తెలిపారు.
పీఎంఎస్ గురించి వివరిస్తూ డాక్టర్ ఆదితి, ''యువకుల్లో చాలా మందికి పీరియడ్స్‌పై అవగాహన ఉండదు. వాళ్లు తమ భాగస్వాముల బాధను అర్థం చేసుకోలేరు. తమ భాగస్వామి మూడ్ మారితే, వాళ్లకు కోపం వస్తుంది. దీని వల్ల సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుంది'' అన్నారు.
ఫొటో సోర్స్, LAURÈNE BOGLIO
భాగస్వామి పాత్ర
మోనా తన పెళ్ళయిన కొత్తలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు తన భర్త ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.
''నా భర్తకు అక్కాచెల్లెళ్లు ఉన్నా పీరియడ్స్ గురించి ఎక్కువగా తెలియదు. అందువల్ల నాకు పీఎంఎస్ వచ్చినపుడల్లా ఆయనకు కోపం వచ్చేది. అయితే ఇప్పుడు తను నా మూడ్‌ను అర్థం చేసుకుంటున్నారు'' అని ఆమె చెప్పారు.
భర్తలు తమ భార్యలను అర్థం చేసుకుంటే సగం సమస్య పరిష్కారం అయినట్లే అని డాక్టర్ ఆదితి అంటారు.
పీఎంఎస్లో మరీ తరచుగా మూడ్ మారిపోతుంటే అలాంటి మహిళలు డాక్టర్ల సాయం తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు.
ఇవికూడా చదవండి
- కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం: ఎడిటర్స్ కామెంట్
- ఇవి బాలికా సంరక్షణ కేంద్రాలా? నరక కూపాలా?
- తెలంగాణలో FRS: దొంగ ముఖాన్ని ఇట్టే పట్టేస్తుంది
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- ఆవాసం కోసం ఆరాటం: ఏపీలో పులులు.. గుజరాత్లో సింహాలు
- ఈ మహిళలు బతకడానికి.. ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెడతారు
- యెమెన్ యుద్ధం: సౌదీ సేనల వైమానిక దాడిలో 29 మంది పిల్లలు మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)