యాదగిరిగుట్ట: ‘గమనిక... మేం స్వచ్ఛందంగా పడుపు వృత్తిని మానేస్తున్నాం’

  • 11 ఆగస్టు 2018
యాదగిరి గుట్టలో తాళం వేసున్న ఇళ్లు
చిత్రం శీర్షిక యాదగిరిగుట్టలో తాళం వేసున్న ఇళ్లు

యాదగిరిగుట్టలో వ్యభిచారం చేసే కుటుంబాల అరెస్టులో పిల్లలు దొరకడం, హార్మోన్ ఇంజెక్షన్లు, భూమిలోపల సొరంగాలు - ఈ మూడు అంశాలూ కేసు తీవ్రతను పెంచాయి. ఇంతకీ గుట్టలో అసలేం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ న్యూస్ తెలుగు. ఈ కేసుల్లో అరెస్టయినవారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక దొమ్మరి కులస్తులతో బీబీసీ మాట్లాడింది. వారంతా బీబీసీ ప్రతినిధిని కలవడానికి రాత్రి పూట యాదగిరి గుట్టకు దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రాంతానికి వచ్చారు.

దొమ్మరి కులం - వినోదం నుంచి వివాదం వరకూ...

యాదగిరిగుట్ట వ్యభిచారం కేసులో దొరికిన నిందితులంతా దొమ్మరి కులానికి చెందిన వారిగా తెలుస్తోంది. దొమ్మరి లేదా ఆరె దొమ్మరి ఒక సంచార తెగ. కొన్నిచోట్ల వారు స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటారు. సన్నటి గెడపై నుంచోవడం, గెడల మధ్య కట్టిన తీగలపై నడవడం వంటి విద్యలు ప్రదర్శిస్తారు. దీంతో పాటూ చాపలు, బుట్టలు అల్లడం కూడా వీరి వృత్తిలో భాగం. ప్రస్తుతం పందులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు. ఊళ్లు తిరగడానికి వీలుగా గాడిదలను పెంచేవారు. వీరికి ప్రత్యేకమైన భాష ఉంది. వినడానికి అది హిందీకి దగ్గరగా ఉంటుంది. వారు తమ భాషను ఆరె భాష అని పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల, పంటలు బాగా పండనప్పుడు పోలి వేయడం (పోలి వేయడం: బావి చుట్టూ లేదా ఊరి చుట్టూ పసుపు, రక్తం కలిపిన అన్నాన్ని చల్లడం) వంటివి చేసేవారు. ఊళ్లలో పంటలు బాగా పండనప్పుడు దొమ్మరి ఆట ఆడించే సంప్రదాయం కూడా ఉంది.

కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి ఈ కులం సంప్రదాయంలో ఉండేదని.. రాన్రానూ అది తగ్గిపోయిందని.. ఇప్పుడు వారు ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఈ కులానికి చెందిన వారు చెప్పారు. స్థానికులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలతో పాటూ ఆ కులస్తులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. "ఇది ఎప్పుడు మొదలైందో మాకు తెలియదు. మా నానమ్మ కంటే ముందోళ్లు గెడెక్కెటోళ్లు (గెడపై ఎక్కి విద్య ప్రదర్శించేవారు). నాకు తెలిసి మా నానమ్మ గెడెక్కేది. దొమ్మరాటాడేది. అప్పట్లో భూస్వాములు, వాళ్ల మోజు తీర్చుకోడానికి మమ్మల్ని వాడుకునేవారు. ఆ కాలం పోయింది. ఇప్పుడు కొందరు చాపలు, బుట్టలు అల్లుతారు. మా నాన్న చిన్నతనంలోనే ఆట ఆడడం ఆగిపోయింది. మేం ఆ ఆట ఆడ్డం చూళ్లేదు. మా దగ్గర మాత్రం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలున్నాయి. ఇప్పుడు అందరం అన్ని పనులూ చేసుకుంటున్నాం" అని బీబీసీతో మాట్లాడిన కొందరు యువకులు వివరించారు.

చిత్రం శీర్షిక యాదగిరిగుట్టలో తాళం వేసిన ఇల్లు

"ఇంట్లో ఒక ఆడబిడ్డ వ్యభిచారం చేస్తుంది. మిగతావాళ్లకు అందరిలాగనే పెళ్లిళ్లు చేసి పంపిస్తాం. ఉదాహరణకు ముగ్గురమ్మాయిలు ఉన్నారనుకో, ఒకర్ని వృత్తి కోసం ఉంచేసి, మిగిలిన ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి పంపేస్తాం. మేం ఈ పని చేయమని ఎవరినీ బలవంత పెట్టం. పెళ్లి చేసుకుంటావా? వృత్తి చేసుకుంటావా? అని అడుగుతాం. వాళ్లిష్టం. పైగా వృత్తి మానేసే హక్కు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇప్పటి తరం వాళ్లు ఎవరూ ఆ పనిచేయడం లేదు. పాత వాళ్లే చేసుకుంటున్నారు. మేం ఎవర్నీ ఆ వృత్తి చేయమని బలవంత పెట్టం. వారికి ఇష్టం ఉన్నంత కాలమే చేస్తారు. కొందరు ఓ వయసు తరువాత మానేయాలనుకుంటారు. ఎవరైనా ఇష్టపడితే వాళ్లే ఆ వృత్తి మాన్పించేసి తామే పోషించుకుంటుంటారు. ఇప్పుడు ఆ వృత్తిలో ఉన్నదంతా పాతవాళ్లే. కొత్త వాళ్లు ఎవరూ అటు వెళ్లడం లేదు'' అని అక్కడివారు కొందరు చెప్పారు.

ప్రస్తుతం యాదగిరి గుట్టలో దొమ్మరి కులస్తులు ఎంతమంది? వారిలో ఎందరు వ్యభిచార వృత్తిలో ఉన్నారు? ఎందరు వృత్తిలో లేరు? అనే విషయాలపై స్పష్టమైన సమాచారం లేదు. ఆ కులస్తులు చెప్పే లెక్కల ప్రకారం అక్కడ సుమారు 50 కుటుంబాలున్నాయి. వాళ్ల జనాభా 200 నుంచి 300దాకా ఉంటుంది. వీరిలో కొద్దిమంది మాత్రమే వ్యభిచార వృత్తికి దూరంగా ఉన్నారు. కానీ ఒకే కులం, ఒకే ఊరు కావడంతో అందరూ దగ్గరి బంధువులే. అంటే చాలా దగ్గరి చుట్టాల్లో కొందరు ఈ వృత్తిలో ఉంటూ, మరి కొందరు ఈ వృత్తిలో లేకుండా ఉన్నారు. ఈ కులస్తులు యాదగిరి గుట్టలోని గణేశ్ బజార్, అంగడి బజార్, పెద్ద కందుకూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల అరెస్టులు, బయటి వార్తలపై వారేమంటున్నారు?

(కొందరు బృందంగా చెప్పిన విషయాలను క్రోడీకరించి క్లుప్తంగా ఇస్తున్నాం)

"అసలెవరూ ఆ వృత్తిలో లేరు అని మేం చెప్పడం లేదు. కొందరు ఉన్నారు. కానీ అందర్నీ అరెస్టు చేసి, అందరిమీదా పీడీ యాక్టులు పెడితే మేం ఎలా బతికేది? సొంత పిల్లలు ఉన్న వాళ్లను కూడా అరెస్టు చేశారు. మా దగ్గర వేరే వాళ్లు కూడా వచ్చి వ్యభిచారం చేస్తుంటారు. వారికి పిల్లలు పుడితే చాలా మంది వదిలేసి వెళ్లిపోతారు. అటువంటి పిల్లలను మేం పారేయలేం కదా. పెంచుకుంటాం. అలా పెంచుకున్న వాళ్లను కూడా అరెస్టు చేశారు. వ్యభిచార వృత్తిలో ఉండి పిల్లల్ని కన్న తరువాత ఆరోగ్యం బాలేక చనిపోయిన వారి పిల్లలను, వారి బంధువులు పెంచుకుంటున్నారు. వాళ్లనీ అరెస్టు చేశారు. ఒకరు చేసిన దాన్ని అందరికీ అంటగడితే ఎలా?"

"మా దగ్గర వ్యభిచారం చేసే వాళ్లలో బయటి నుంచి చాలామంది స్వచ్ఛందంగా వస్తారు. ఈ పని చేయాలని మేం ఎవరినీ అడగం, బలవంత పెట్టం. బయటినుంచి వచ్చినవాళ్ల ఆదాయంలో చెరిసగం తీసుకుంటాం. అలా వచ్చిన చాలా మంది గర్భవతులయ్యాక పిల్లల్ని కని ఇక్కడే వదిలేసి పోతారు. మేం వారిని చేరదీసి ఆదుకుంటాం. మేం పుట్టక ముందు నుంచీ ఆ పద్ధతి ఉంది."

"ఇక్కడ ఓ వ్యక్తి బయటి పిల్లలను తీసుకువచ్చింది వాస్తవం. అతడే వేరే వాళ్ల దగ్గర పిల్లల్ని కొన్నాడు. మేమంతా కలిసి అలా చేయొద్దని చెప్పాం. అతడు వినలేదు. దాంతో మేం అతడిని దూరం పెట్టాం. కానీ ఆ వ్యక్తి 8 నెలల క్రితమే చనిపోయాడు."

చిత్రం శీర్షిక యాదగిరి గుట్ట ప్రధాన మార్గం

"ఇదంతా ఓ మహిళ వల్లే జరిగింది. ఆమెకు పిల్లల్లేరు. దీంతో ఇద్దరు పిల్లలను తెచ్చుకుంది. ఒక పాపను వేరే దగ్గర నుంచి కొనింది. అందులో ఒకరిని బాగా చూసుకుంటూ, ఒకరిని హింసించేది. దీంతో చూసిన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి ఆమె మా ఏరియాలో ఉన్నప్పుడే మేం ఆమెను తిట్టాం. 'పిల్లల్లేని నువ్వు, ఆ పిల్లలను ప్రేమగా చూసుకోవాలి కానీ అలా కొడతావేంటి' అని అడిగేవాళ్లం. మేం తిడుతున్నామని ఆమె మా మీద పగ పెంచుకుంది."

"మా వదిన వ్యభిచారం చేసేది. ఆమెను ఒకాయన చేరదీశారు. తరువాత ఆ వృత్తి మానేసింది. వారికి ఒక పాప పుట్టింది. ఆమె కొన్నాళ్లకు చనిపోయింది. దాంతో అతను రావడం మానేశాడు. మా వేరే అన్నయ్య వాళ్లు ఆ పాపను పెంచుకున్నారు. ఆ పాప ఇప్పుడు పెద్దదయింది. ఆమెకు తన సొంత బామ్మర్దితో పెళ్లి చేద్దాం అని ఏర్పాటు చేస్తున్న సమయంలో, ఆమె మా అమ్మాయి కాదంటూ లాక్కెళ్లిపోయారు పోలీసులు. సొంత పిల్లలున్న వాళ్లపై కూడా కేసు పెట్టారు. అరెస్టయిన వారిలో ఓ మహిళకు డెలివరీ అయి నెల రోజులు అయింది. ఆమె తన సొంత కూతురని బర్త్ సర్టిఫికేట్ చూపించినా పోలీసులు వినలేదు."

"మాలో చాలామందిమి వేర్వేరు పనులు చేసుకుంటున్నాం. అయినా రాత్రుళ్లు ఇంట్లో పడుకోవాలంటే ఎవరు వచ్చి ఎత్తుకుపోతారా అని భయమేస్తుంది. అరెస్ట్ చేస్తారన్న భయానికి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. ప్రెస్‌తో మాట్లాడాలన్నా భయమే. అందరూ మాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తుంటే, ఎవరు మాకు సాయం చేస్తారు?"

వ్యభిచార వృత్తిని వదిలిపెట్టిన కొంతమంది దొమ్మరి కులస్తుల్లో కూడా తమ బంధువుల విషయంలో ఆవేదన ఉంది. కానీ పోలీసులతో సమస్య వస్తుందనే ఉద్దేశంతో వారు బహిరంగంగా మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు.

హార్మోన్ ఇంజెక్షన్లు ఉన్నాయా?

యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాల వారు పిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ కేసులో హార్మోన్ ఇంజెక్షన్లు ఉన్నాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఏఏ హార్మోన్ ఇంజెక్షన్లు వాడారో, ఏ డాక్టరు వాటిని చేశారోననేది పోలీసులు ఇంకా నిర్ధరించలేదు. అది అసత్య ప్రచారమనీ అటువంటిదేమీ లేదని వ్యభిచార వృత్తి నిర్వహించిన వారి బంధువులు చెబుతున్నారు.

జూలై 30న రాచకొండ పోలీసుల పత్రికా ప్రకటనలో 'ఆడపిల్లలు తొందరగా పెద్దమనిషి అయి, శరీర భాగాలు పెరగడం కోసం డా. స్వామి అనే వ్యక్తి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారనీ, ఆ వ్యక్తి దీనికోసం 25 వేల రూపాయల వరకూ తీసుకుంటారని' ప్రకటించారు.

ఆగస్టు 2వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో.. కమ్మగిరి నరసింహ అనే ఆర్ఎంపి డాక్టర్ అమ్మాయిలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారనీ, అతని వద్ద నుంచి 48 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆడపిల్లలు తొందరగా పెద్దమనిషి అవడం కోసం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్టు నరసింహ ఒప్పుకున్నాడని పోలీసులు ప్రకటించారు.

అయితే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఆడపిల్లల ఎదుగుదలకు పనిచేసేవి కావన్నారు వైద్యులు. "ఆ ఇంజెక్షన్లను డెలివరీ సమయంలో ఎక్కువ రక్తం పోకుండా వాడుతుంటాం. వాటికీ ఆడపిల్లలు ఎదుగుదలకు ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్లకీ సంబంధం లేదు" అని శిల్పి రెడ్డి అనే వైద్యురాలు బీబీసీతో చెప్పారు.

ఇదే అంశంపై బీబీసీ పోలీసుల వివరణ కోరగా, దీనిపై ఇంకా విచారణ కొనసాగిస్తున్నామనీ, త్వరలోనే పూర్తి సాక్ష్యాలతో నిందితులను పట్టుకుంటామని యాదాద్రి ఏసీపీ శ్రీనివాసాచార్యులు, డీసీపీ రామచంద్రారెడ్డి చెప్పారు.

పునరావాసం

యాదగిరిగుట్టలో వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించినా వారు మారడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. అయితే పునరావాసం తమకు సరిగా అందలేదని ఆ వృత్తి నుంచి బయటకు వచ్చిన వారు వాదిస్తున్నారు. అప్పట్లో పోలీసులు ఇప్పించిన ప్రైవేటు ఉద్యోగాల్లో జీతాలు సరిగా రాలేదని కొందరు ఆరోపించారు. వారంతా తరువాత డ్రైవర్లుగా స్థిరపడ్డారు.

"2005-06లో మాకు 25 ఎకరాల స్థలం చూపించారు. కానీ అప్పటి ఎస్పీ బదిలీ అయి వెళ్లగానే తిరిగి ఆ భూమి లాగేసుకున్నారు. శిలాఫలకం కూల్చేశారు. నల్లగొండలో శిక్షణ ఇచ్చి కొందరికి ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఇప్పించారు. వాళ్లు రెండు వేల రూపాయలు ఇచ్చేవారు. అవి సరిపోక కొందరు మానేసి ఆటోలు నడుపుకోవడం మొదలుపెట్టారు. తరువాత సెక్యూరిటీ ఏజెన్సీ మారిన తరువాత మాకు స్థానికులు వద్దంటూ, బిహార్ నుంచి ఉద్యోగులను తెచ్చుకున్నారు. అలా మా ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు అందరూ తలోపని చేసుకుంటున్నాం అని చెప్పారు" బీబీసీని కలిసిన యువకులు.

అప్పట్లో పోలీసులు ఇద్దరు అమ్మాయిలకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పించారు. ఒకమ్మాయి ఆ ఉద్యోగం చేసుకుంటుండగా, మరో అమ్మాయి మానేసింది.

చిత్రం శీర్షిక యాదగిరిగుట్టలో ఓ ఇల్లు

సొరంగాలు

పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఇంట్లో ఏర్పాటు చేసిన సొరంగాల వంటి నిర్మాణంలో అమ్మాయిలను దాస్తున్నారన్న వార్తలపై స్పష్టత లేదు. బీబీసీ ప్రతినిధులు పరిశీలించిన ఒక ఇంట్లో మాత్రం వంట చేసుకున్న పొగ పైకి వెళ్లడానికి ఉన్న గొట్టం ఉంది. ఆ వంట గదిని తరువాత పడక గదిగా మార్చి ఫ్లోర్ ఎత్తు పెంచారు. కానీ అది సొరంగం కాదు. కానీ చాలా ఇళ్లు తాళం వేయడం సీజ్ చేయడంతో మిగతా ఇళ్లల్లో పరిశీలించలేదు.

పోలీసులూ ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ముంబయిలోని కామాటిపురలో ముఖాన్ని కప్పుకుంటున్న సెక్స్‌వర్కర్

పోలీసులు ఏమంటున్నారు?

తమ దగ్గర వదిలేసిన పిల్లల్ని పెంచుకుంటున్నామన్న స్థానికుల వాదనతో పోలీసులు ఏకీభవించలేదు. "వ్యభిచారం చేసిన వారు వదిలేసిన పిల్లల్ని తమ దగ్గర ఉంచుకోవడం కూడా తప్పే కదా" అని వ్యాఖ్యానించారు డీసీపీ రామచంద్రా రెడ్డి. కొందరు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినా పోలీసులు చించేశారనడం తప్పు అన్నారాయన. గతంలో వారికి భూమి ఇచ్చినా తిరిగి దాన్ని వెనక్కు తీసుకోవడం తమ దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. "ఒకవేళ మేం అదుపులోకి తీసుకున్న వారిలో వాళ్ల కన్న పిల్లలుంటే పరీక్షల్లో ఆ విషయం బయటపడుతుంది. వారికి అప్పగిస్తాం" అని సమాధానం ఇచ్చారు రామచంద్రారెడ్డి.

చిత్రం శీర్షిక నిమ్మయ్య

స్వచ్ఛంద సంస్థల మాట

"ఈ తనిఖీల్లో దొరికిన పిల్లలు ఒక 'కండిషన్డ్ ఎట్మాస్ఫియర్'లో పెరుగుతున్నట్టు అనిపించింది. వాళ్లనడిగితే స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేదంటారు. ప్రజ్వల సెంటర్ కి వెళ్తున్నారు. పిల్లలు ఎలా పెరగాలో అలా లేరు" అని చెప్పారు పీస్ ఎన్జీవోను నిర్వహిస్తోన్న నిమ్మయ్య. నిమ్మయ్య ప్రస్తుతం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడిగా ఉన్నారు.

"యాదగిరి గుట్టలో బయటివాళ్లు, పిల్లలు ఎప్పటి నుంచి వస్తున్నారన్న విషయం ఎవరూ గమనించలేదు. యాదగిరిగుట్టలో పిల్లలు దొరకడం ఇదే మొదటిసారి కాదు. 2015లో కేర్ అండ్ జస్టిస్ అనే సంస్థ బెంగళూరు నుంచి వచ్చి 12 మంది మైనర్లను కాపాడింది. కానీ ఎవరింట్లో దొరికారో కోర్టు వారికే అప్పగించింది."

"యాదగిరి గుట్టలో వ్యభిచారం చేసేవారిది సామాజిక ఆర్థిక (సోషియో ఎకనమిక్) సమస్య కాదు. అది పూర్తిగా ఎక్స్‌ప్లాయిటేషనే. ఆర్గనైజ్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ మాత్రమే. సులువైనా ఆదాయం కోసం చేస్తున్నదే. వారికి పని చూపించడంలో వ్యవస్థ విఫలం అయిందని చెప్పలేం" అన్నారు నిమ్మయ్య.

Image copyright Ramulu
చిత్రం శీర్షిక సిద్ధిపేటలో కట్టిన బ్యానర్

స్థానికులేమంటున్నారు?

యాదగిరి గుట్ట స్థానికులు మాత్రం ఈ సమస్య విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు అర్థం అవుతోంది. "మేం యాదగిరిగుట్ట అని చెప్పగానే అనుమానంగా చూస్తారు. పెళ్లి సంబంధాల విషయంలోనూ ఇబ్బంది అవుతోంది అని చెప్పారు" ఒక స్థానిక యువకుడు.

ప్రస్తుతం దొరికిన పిల్లల్లో తమ వారు ఉన్నారేమో అని వెతుక్కోవడానికి రెండు రాష్ట్రాల నుంచీ చాలా మంది తల్లిదండ్రులు వస్తున్నారు. వారందరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామనీ, రిపోర్టులు వచ్చాకే పిల్లల్ని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.

యాదగిరిగుట్ట తనిఖీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మరి కులస్తులు స్పందించారు. తాము వ్యభిచార వృత్తి మానేస్తున్నామనీ, తమతో ఎవరూ తప్పుగా ప్రవర్తించవద్దంటూ సిద్ధిపేట పట్టణంలో స్థానిక దొమ్మరి కులస్తులు బోర్డు పెట్టారు. అటు యాదగిరిగుట్టలో కూడా ఈ తరహా బోర్డులు పెట్టారు.

'పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఈ పని చేశాం. మేం స్వచ్ఛందంగా మానుకుంటే ప్రభుత్వం ఆదుకుంటదని ఇలా చేశాం. చదువుకునే పిల్లల్ని తోటోళ్లు పేపర్లో వచ్చిన విషయాల గురించి అడుగుతున్నారు. దీంతో వాళ్లు స్కూళ్లకు వెళ్లడం లేదు. ఏం చేసినా పిల్లల కోసమే కదా. ఈ బోర్డులు కూడా అందుకే పెట్టాం' అన్నారు దొమ్మరి కుల రాష్ట్ర అధ్యక్షులు రాములు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

'డోనల్డ్ ట్రంప్ చెప్తేనే ఆమెకు డబ్బులిచ్చా': తప్పు ఒప్పుకున్న ట్రంప్ మాజీ లాయర్

తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?

ప్రెస్ రివ్యూ: 'బీజేపీకి 120 స్థానాలకు మించి రాకపోవచ్చు' - చంద్రబాబుతో టీడీపీ నేతల చర్చ

సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'

వరద బాధితుల దాహం తీరుస్తున్న తెలుగువాళ్లు

మైక్రోసాఫ్ట్: ‘రష్యా పొలిటికల్ హ్యాక్‌’ను విజయవంతంగా అడ్డుకున్నాం

ఆసియా క్రీడల్లో అమ్మమ్మలు: భారత బ్రిడ్జి జట్టులో అత్యధికులు 60 దాటినవారే

నాబార్డ్ రిపోర్ట్: వ్యవసాయ ఆదాయంలో దిగజారిన ఆంధ్రప్రదేశ్, జాతీయ సగటు కన్నా కాస్త మెరుగ్గా తెలంగాణ