మీ ఆధార్ నంబర్ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మీ ఆధార్ నంబర్ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసా?

  • 11 ఆగస్టు 2018

మళ్లీ హలో అంటూ వార్తల్లోకొచ్చేసింది ఆధార్. ఆధార్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటా బేస్‌గా పేరుంది. భారత టెలికాం రెగ్యులేటరీ హెడ్ రామ్ సేవక్ శర్మ తన ఆధార్ నంబర్ ఇచ్చి హ్యాక్ చేయండి చూద్దాం అంటూ సవాల్ చేశారు.. ఆ తర్వాత జరిగిన తమాషా ఏంటో మీకు తెల్సిందే. అసలు మీ 12 అంకెల ఆధార్ నంబర్ మొట్టమొదట ఎవరి దగ్గరకి వెళ్తుంది? ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఇవాళ్టి లబ్ డబ్బులో..

అసలు ఆధార్ అంటే ఏంటి?

ఆధార్ నెంబర్ జారీ చేసే ముందర మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. దీంట్లో మీ వయస్సు, అడ్రస్, వేలిముద్రలు, ఫొటో, మీ కనుపాపల ఫొటో ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలు తీసుకుంటారు. ఆరంభంలో, ఏ రకమైన గుర్తింపు కార్డు లేని వారి కోసం ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేందుకూ.. అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపరచేందుకు అని చెప్పి ఈ ఆధార్‌ను ప్రవేశపెట్టారు.

భారత్ ప్రభుత్వం 2016 జులై 12న విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) ని ప్రారంభించింది. ఆధార్ చట్టం 2016 లోని నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ అంతకు ముందరే మొదలయింది. 2009 లోనే UIDAI అనే విభాగాన్ని అప్పటి ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభించింది.

2010 సెప్టెంబరు 29న ఆధార్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి టెంబ్లీ గ్రామానికి చెందిన రాంజనా సొనావ్నే. ఆధార్‌ను సపోర్ట్ చేసే వారు చాలా గర్వంగా చెప్పే మాట - మా దగ్గర ఆధార్ ఉందని. అయితే ఆధార్ కోసం సేకరించిన మన వ్యక్తిగత వివరాలు ఎక్కడ భద్రపరుస్తారో తెలుసా! UIDAI ఈ సమాచారాన్ని మొత్తం హర్యానాలోని మానెస్సర్ సెంటర్ లో భద్రపరుస్తుంది. అలాగే బెంగళూరు లో కూడా మన డేటా స్టోర్ అవుతుంది. మొత్తం 7000 సర్వర్లను ఈ డేటా భద్రపరిచేందుకు ఉపయోగిస్తున్నారు.

ఇక ఆధార్ లాంటి బయోమెట్రిక్ డేటా సిస్టం ఇతర దేశాలలో ఎప్పటి నుంచో అమలులో ఉంది. : చాలామంది ఆధార్ ను అమెరికా సంయుక్త రాష్ట్రాల తొమ్మిది అంకెల సామాజిక భద్రత సంఖ్య SSNతో పోల్చుతారు కానీ వీటి మద్య చాలా తేడా ఉంది. SSN ద్వారా జనాభా వివరాలు మాత్రమే సేకరిస్తారు. ఎస్ ఎస్ ఎన్ పొందడానికి ఏజ్ ప్రూఫ్, గుర్తింపు కార్డ్, యూఎస్ సిటిజన్ షిప్ గుర్తింపు వివరాలు అందించాలి. ఈ ఎస్ఎస్ఎన్ నంబర్ ఫొటో గుర్తింపు లేకుండా ఒక పేపర్ మీద మాత్రమే ప్రింట్ అయి ఉంటుంది.

మీకు ఆధార్ ఎక్కడ అవసరమంటే- బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, పన్ను మినహాయింపులు ఫైల్ చేయాలన్నా, కొన్ని రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలలో సబ్సిడీల కోసం, ప్రభుత్వ స్కాలర్ షిప్ లకోసం , పాస్ పోర్ట్ తీసుకొవాలన్నా ఆధార్ కావాల్సిందే. అయితే ఆధార్ కు సంబంధించి కొన్ని అంశాలు ఇంకా సుప్రీమ్ కోర్ట్ విచారణలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)