ట్రిపుల్ తలాక్: బిల్లు సవరణపై ఎవరికి కోపం, ఎవరికి సంతోషం?

  • 11 ఆగస్టు 2018
తీన్ తలాక్ సవరణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు Image copyright Getty Images

రాజ్యసభలో శుక్రవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశ పెట్టలేదు. దీనిని శీతాకాల సమావేశాల వరకూ వాయిదా వేశారు.

గత ఏడాది లోక్‌సభలో పాస్ చేసిన బిల్లులో కేబినెట్ గురువారం కొన్ని సవరణలు చేసింది. ఒక వేళ బిల్లుకు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో ఆమోదముద్ర పడితే, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లే ముందు ఈ సవరణ బిల్లు మరోసారి లోక్‌సభలో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడో ఇది చట్టంగా మారుతుంది.

ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. గురువారం కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు కొన్ని సవరణలను ఆమోదించింది.

దీని ప్రకారం భార్యకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇచ్చి దోషి అయిన భర్తకు బెయిల్ ఇచ్చే నియమాన్ని బిల్లులో జోడిస్తారు. ఒక వేళ ఏ భర్త అయినా మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇచ్చేస్తే, బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.

గురువారం కేబినెట్ సమావేశం తర్వాత "భార్యాభర్తల మధ్య విభేదాలను పరిష్కరించాలనుకుంటే కొన్ని నియమాలు-షరతులతో మేజిస్ట్రేట్‌కు ఆ నేరం మాఫీ చేసే హక్కు ఉంటుంది" అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

Image copyright Getty Images

పిటిషనర్లలో సంతోషం

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ట్రిపుల్ తలాక్ అంశాన్ని లేవనెత్తిన ఐదుగురు మహిళల్లో ఒకరైన ఆతియా సాబ్రీ ఈ సవరణతో చాలా సంతోషంగా ఉన్నారు. బిల్లు రాజ్యసభలో పాస్ కావాలని, అందుకు రాజకీయ పార్టీలన్నీ ఒక్కటై ముందుకు రావాలని ఆమె కోరుకుంటున్నారు.

బిల్లు రాజ్యసభకు రావడం ఆలస్యం అవుతుండడంతో ఆతియా కాస్త ఆందోళనగా ఉన్నారు. కానీ బిల్లులో జరిగిన సవరణలపై ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. అవి చాలా అవసరం అని భావించారు.

"నేను స్వయంగా బాధితురాలిని, అందుకే బిల్లులో జరిగిన సవరణలు అవసరమనే అంటాను, ఇది చట్టంగా మారితే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ధైర్యం కూడా పెరుగుతుంది" అన్నారు ఆతియా.

"తలాక్ తర్వాత మహిళను పుట్టింటి వారు తీసుకెళ్లి, ఆమె బాగోగులు చూడాల్సిన అవసరం లేదు. ఈ సవరణ మహిళలకు అనుకూలంగా ఉంది"

ఈ సవరణ చట్టబద్ధమైనదని, దీనివల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం లభిస్తుందని ఆతియా భావిస్తుంటే, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సెక్రటరీ జఫర్యబ్ జిలానీ మాత్రం ఈ బిల్లు పూర్తిగా తప్పు అంటున్నారు.

Image copyright Getty Images

ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వాదన

"ట్రిపుల్ తలాక్ గురించి బిల్లులో చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. భర్త ఒకేసారి మూడు సార్లు తలాక్ చెప్పడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఈ బిల్లులో చాలా రకాల తలాక్‌లు వస్తాయి. అలాంటప్పుడు అది సరి కాదు" అని జిలానీ అన్నారు.

"ప్రతిసారీ భర్త మాత్రమే తీన్ తలాక్ చెప్పాలనే నియమం ఏదీ లేదు. కొన్ని సార్లు భార్య కూడా మొండిగా ట్రిపుల్ తలాక్ కోరుతుంది. అలాంటి పరిస్థితిలో కూడా భర్తే దోషి అవుతాడు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం అయినపుడు, దానికోసం ఎవరికైనా శిక్ష విధించడంలో అర్థం లేదు" అని జిలానీ అంటారు.

ముస్లిం సమాజంలో ఉన్న కోట్ల మంది మహిళలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని జిలానీ చెబుతున్నారు. కేవలం కొన్ని లక్షల మంది మహిళల చెప్పడం వల్ల ఇలాంటి చట్టం తీసుకురావడం సరికాదంటున్నారు.

"మాకు విపక్షాలపై పూర్తి నమ్మకం ఉంది. మొదటి నుంచి వారు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారో, రాజ్యసభలో కూడా అదే స్టాండ్ తీసుకుంటారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేస్తారు. ఒకవేళ దీన్ని చట్టం చేసినా సుప్రీంకోర్టు తలుపులు మాకోసం తెరిచే ఉన్నాయి" అన్నారు జిలానీ.

ఈమెయిల్ లేదా టెక్ట్స్ మెసేజ్ ఎలా అయినా, ముస్లిం పురుషులు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పే సంప్రదాయం చట్టవిరుద్ధం అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు చెప్పింది.

ఈ బిల్లును మరికొన్ని సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం మాత్రం తన వాదన తాను వినిపిస్తోంది.

ట్రిపుల్ తలాక్ మతవిశ్వాసాలకు సంబంధించిన అంశం కాదని, ఇది లింగ న్యాయం, లింగ సమానత్వం, మహిళల ప్రతిష్ట, మానవతా దృష్టితో లేవనెత్తిన అంశంగా కేంద్రం చెబుతోంది.

Image copyright Getty Images

ముస్లిం మహిళా సంఘం మద్దతు

భారతీయ ముస్లిం మహిళా ఉద్యమం అధ్యక్షురాలు జాకియా సోమన్ కూడా బిల్లులో సవరణను స్వాగతించారు.

"మేం బిల్లులో సవరణ కోసం మూడు ప్రధాన సూచనలు చేశాం. కేబినెట్ ఆ మూడింటినీ పరిగణనలోకి తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు జాకియా

కానీ ముంబై ముస్లిం మహిళా సంఘం 'బేబాక్ కలెక్టివ్'కు చెందిన హసీనా ఖాన్ ఇప్పటికీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

"మాకు అతిపెద్ద సమస్య ఒక్కటే, దీనిని క్రిమినల్ విభాగంలో ఎందుకు చేర్చారు" అని హసీనా ప్రశ్నిస్తున్నారు.

Image copyright AFP

"ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు కోర్టు తీర్పుకు అనుగుణంగా లేదు. సవరణలో కేవలం బాధితురాలు, కుటుంబ సభ్యుల ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు అని చెప్పారు. అలాంటప్పుడు అమ్మాయిపై కుటుంబం ఒత్తిడి కూడా చేయవచ్చు"

"ఈ బిల్లుతో మహిళలకు వారి హక్కులు లభిస్తాయి అని ప్రభుత్వం చెబుతోంది. కానీ అలాంటిదేం లేదు. బిల్లు పూర్తిగా మహిళలకు వ్యతిరేకంగా ఉంది" అని హసీనా అన్నారు.

"ప్రభుత్వం ఒక వేళ చట్టం తీసుకురావాలనే అనుకుంటే, ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీలో సభ్యులు ఈ విషయంపై నిపుణులతో చర్చించాలి. కోర్టుకు వెళ్లలేని మహిళల పరిస్థితి ఏంటనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి"

ఒక వేళ చట్టం చేస్తే, తాము రోడ్లపైకి వస్తామని, ఆందోళనలకు దిగుతామని హసీనా చెబుతున్నారు.

ఇప్పుడు, ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లును కేంద్రం రాజ్యసభ వరకూ తీసుకెళ్లలేకపోయింది. అయితే ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. కానీ విపక్షాలు వ్యతిరేకించడంతో బిల్లు పాస్ కాలేకపోయింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)