బీబీసీ స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు

  • అరుణ్ శాండిల్య
  • బీబీసీ ప్రతినిధి
ఎడారి

ఫొటో సోర్స్, Getty Images

ఎడారి అంటే భారతదేశంలో గుర్తొచ్చే పేరు థార్. భారతదేశ మొత్తం భూభాగంలో 5 శాతం ప్రాంతాన్ని ఆక్రమించిన ఈ ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో 60 శాతం వైశాల్యాన్ని తానే మింగేసింది.

ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనూ సుమారు నాలుగో వంతు భూభాగం ఎడారిగా మారిపోయే ప్రమాదం ముంచుకొస్తోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

బెంగళూరులోని 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ, అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లు 2003 నుంచి 2005, 2011 నుంచి 2013 మధ్య రెండు వేర్వేరు కాల వ్యవధుల్లో రిమోట్ సెన్సింగ్ డేటా ఉపయోగించి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

దీని ప్రకారం 2013 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం, తెలంగాణలో 31.4 శాతం, కర్నాటకలో 36.24 శాతం భూభాగం ఎడారీకరణ ముప్పులో ఉంది.

తెలుగు రాష్ట్రాలు మొక్కల పెంపకం, జల సంరక్షణ చర్యలు విస్తారంగా చేపడుతూ ప్రమాద నివారణ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఎడారీకరణ అంటే..?

నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, జీవభౌతిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఉత్పాదక భూమి అనుత్పాదకంగా మారిపోవడమే ఎడారీకరణ.

ప్రకృతి సిద్ధంగా జరిగే మార్పులు, మనుషులు.. రెండూ ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి.

ప్రపంచంలోని మూడోవంతు భూభాగం ఎడారీకరణ ప్రమాదంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ కంబాటింగ్ డిజర్టిఫికేషన్(యూఎన్‌సీసీడీ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల హెక్టార్ల భూమి ఎడారీకరణ ప్రభావానికి లోనయింది.

దీనికితోడు, మృత్తికా క్రమక్షయం కారణంగా ఏటా 530 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి, 80 లక్షల టన్నుల వృక్ష పోషకాలను నేల కోల్పోతోంది.

భూక్షీణత వల్ల ప్రత్యక్షంగా 25 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణం, గనుల తవ్వకం వంటి కారణాల వల్ల వ్యవసాయం, చెట్ల పెంపకానికి భూమి లభ్యత తగ్గిపోతోంది.

వర్ధమాన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్యను విధాన లోపాలు మరింత తీవ్రం చేస్తున్నాయి. ఫలితంగా ఎడారీకరణ మరింత వేగవంతమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

కారణాలేమిటి?

భారత్‌లోని 57 శాతం భూభాగంలో సాగు ప్రాంతం ఎడారీకరణ వల్ల పెను సంక్షోభాలకు గురవుతోంది. దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయని 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ నివేదిక చెబుతోంది.

ఉపాంత భూములను(వ్యవసాయానికి అనుకూలం కానివి) వ్యవసాయానికి వినియోగిస్తుండడం.. నేల, నీటి పరిరక్షణ చర్యలు తగినంతగా లేకపోవడం.. పరిమితికి మించి సాగు చేయడం, జల యాజమాన్యం సక్రమంగా లేకపోవడం.. భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఎడారీకరణకు ప్రధాన కారణాలని నివేదికలో ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌లో: 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2003-05 మధ్య 22,67,728 హెక్టార్ల ప్రాంతం ఎడారీకరణ ముప్పును ఎదుర్కోగా 2011-13 నాటికి అది 22,98,758 హెక్టార్లకు చేరింది. సుమారు పదేళ్ల కాలంలో 0.19 శాతం మేర ఎడారీకరణ పెరిగినట్లు తేలింది.

ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఎడారీకరణ జరుగుతుండగా, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 2003-05తో పోల్చితే 2011-13 నాటికి అడవుల విస్తీర్ణం పెంచగలిగారు. ప్రభుత్వాలు చేపట్టిన అటవీ సంరక్షణ చర్యల వల్ల 4,190 హెక్టార్ల మేర అడవులు పెరిగాయి. కానీ, ఇతర కారణాల ప్రభావం వల్ల ఎడారీకరణ వేగాన్ని నియంత్రించలేకపోయారు.

తెలంగాణలో: తెలంగాణ ప్రాంతంలో 2003-05 మధ్య 36,58,486 హెక్టార్ల భూభాగం ఎడారీకరణ ముప్పును ఎదుర్కోగా 2011-13 నాటికి అది 35,98,856 హెక్టార్లకు తగ్గింది. అంటే ఈ పదేళ్ల కాలంలో తెలంగాణలో 0.52 శాతం మేర భూభాగం ఎడారీకరణ ముప్పు నుంచి బయటపడింది.

ప్రస్తుత నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఎడారీకరణ ముప్పు ఉండగా, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

కర్నాటకలో: కర్నాటక రాష్ట్రంలో 2003-05 మధ్య 69,40,943 హెక్టార్ల భూభాగం ఎడారీకరణ ముప్పును ఎదుర్కోగా 2011-13 నాటికి అది 69,51,000 హెక్టార్లకు పెరిగింది.

బెలగావి, గుల్బర్గా, తుముకూరు, బీజపుర్ జిల్లాల్లో ఎడారీకరణ ప్రభావం అధికంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్న మానవ ప్రమేయం

వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కార్చిచ్చులు, వ్యవసాయ విధానాలు, జలయాజమాన్య లోపాలు, భూగర్భజలాల మితిమీరిన వినియోగం, పారిశ్రామికీకరణ, గనుల తవ్వకం వంటివి ఎడారీకరణకు ప్రధాన కారణాలు. ప్రకృతి సిద్ధమైన కారణాలతో పాటు, మానవ సంబంధిత కారణాల వల్ల కూడా ఎడారీకరణ వేగవంతమవుతోంది. అధ్యయనం జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ పదేళ్ల కాలంలో మానవ ప్రమేయం వల్ల కలిగిన నష్టం పెరుగుతున్నట్లు స్పష్టమైంది.

* ఆంధ్రప్రదేశ్‌లో 2003-05 మధ్య 20,565 హెక్టార్లలో మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు ఏర్పడగా 2011-13 నాటికి అది 20,833 హెక్టార్లకు చేరింది.

* తెలంగాణలో 2003-05 మధ్య 14,592 హెక్టార్లలో మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు తలెత్తగా 2011-13 నాటికి అది 16,982 హెక్టార్లకు చేరింది.

*కర్నాటకలో 2003-05 మధ్య 18,704 హెక్టార్ల విస్తీర్ణం మానవ సంబంధిత కారణాల వల్ల ఎడారీకరణ ముప్పు ఎదుర్కొనగా 2011-13 నాటికి అది 20,876 హెక్టార్లకు పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాద తీవ్రత అంచనా ఇలా..

హైరెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా, జియో కంప్యూటింగ్ విధానాలను వినియోగించి ఎడారీకరణ స్థాయి, తీవ్రతను తెలుసుకుంటున్నారు. నిర్ణీత కాల వ్యవధుల్లో ఈ అంచనాలు రూపొందిస్తూ ఎడారీకరణ పరిస్థితులను గమనిస్తున్నారు. భూమిపై పూర్వ పరిస్థితులను పునరుద్ధరించే క్రమంలో చేపట్టాల్సిన చర్యలకు సన్నద్ధమవడానికి ఇది తోడ్పడుతుంది.

ఈ విధానాల సహాయంతో అడవుల క్షీణత, భూక్రమక్షయం, లవణీకరణ వంటివన్నీ అంచనా వేస్తారు.

ఎడారీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో జీవభౌతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి దీని ప్రభావాన్ని అంచనా వేస్తారు.

దక్షిణ భారతదేశంలో సమగ్ర అధ్యయనం

దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 'ఐసీఏఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ సోయిల్ సర్వే అండ్ లేండ్ యూజ్ ప్లానింగ్' సంస్థ ఎడారీకరణపై సునిశిత అధ్యయనం చేసింది. మొత్తం 4,66,836 చదరపు కిలోమీటర్ల పరిధిలో వీరి అధ్యయనం సాగింది. దేశ విస్తీర్ణంలో ఇది 14.2 శాతానికి సమానం.

అధ్యయనం చేసిన ప్రాంతం పరిధిలో దక్కన్ పీఠభూమి.. పశ్చిమ, తూర్పు కనుమలు.. తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. దీంతో మూడు వేర్వేరు నైసర్గిక స్వరూపాల్లో ఈ అధ్యయనం చేసినట్లయింది.

తీరప్రాంతంలోని తక్కువ సారవంతం గల ఇసుక భూములు, డెల్టాలోని సారవంతమైన నేలలు, లాటరైట్, నల్లరేగడి, ఎర్ర నేలలు వంటివన్నీ ఈ ప్రాంతాల్లో ఉండడంతో వివిధ రకాల నేలలనూ అధ్యయనం చేసినట్లయింది.

ఈ ప్రాంతాల్లో వార్షిక కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా 16 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతుంటాయి.

అంతేకాకుండా, అధ్యయన ప్రాంతంలోని 47.83 శాతం భూమి వ్యవసాయానికి వినియోగిస్తుండగా, 20.5 శాతం భూమిలో అడవులున్నాయి.

ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవి పంటల కాలంలోని వివరాలనూ సేకరించి అధ్యయనం చేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.