అభిప్రాయం - మాడభూషి శ్రీధర్: 'జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సవరణతో ఆర్టీఐ అంతమే'

  • ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు
  • బీబీసీ కోసం
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్

ఫొటో సోర్స్, FACEBOOK/MADABHUSHI SRIDHAR

ఫొటో క్యాప్షన్,

మాడభూషి శ్రీధరాచార్యులు, కేంద్ర సమాచార కమిషనర్

సమాచార హక్కు చట్ట సవరణ కోసం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన ప్రతిపాదనలు అవినీతి అధికారులకు రక్షణ కల్పించే విధంగా ఉన్నాయి. వ్యక్తిగత వివరాల గోప్యత అన్నది ప్రాథమిక హక్కే అయినప్పటికీ ఆ పేరుతో గోప్యతా రక్షణకు తీసుకునే చర్యల ప్రభావం పాలనలో పారదర్శకతపై ప్రతికూలంగా పడుతుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు హెచ్చరించాయి. వ్యక్తిగత వివరాలకు సంబంధించిన సమాచారం డేటా ప్రిన్సిపల్ అంటే ఆ సమాచారం సొంతదారు అయిన అధికారికి హాని కలిగించినా లేదా కలిగించే 'అవకాశం' ఉన్నా ప్రజా సమాచార అధికారి (PIO) ఆ సమాచారాన్ని నిరాకరించొచ్చని ప్రస్తుత సవరణ ప్రతిపాదిస్తోంది. వ్యక్తిగత గోప్యతను కాపాడే పేరుతో ప్రతిపాదిస్తున్న ఈ సవరణ వాస్తవానికి సమాచార హక్కు స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదముంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార హక్కు చట్టం-2005 ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తిగత వివరాల గోప్యత హక్కుకు, ప్రభుత్వంలో తప్పుడు పనులు చేసే అధికారులకు సంబంధించిన సమాచారాన్ని,ప్రభుత్వ పత్రాలను పొందడానికి ప్రజలకు ఉన్న హక్కుకు మధ్య చక్కని సమతౌల్యాన్ని కలిగి ఉంది. కొత్తగా రక్షణ నిబంధనలు చేర్చాల్సిన అవసరమేమీ లేదు. 2005 చట్టం ప్రకారం దరఖాస్తుదారు ఎవరి వ్యక్తిగత సమాచారమైనా కోరినపుడు, అది ప్రభుత్వ విధుల నిర్వహణతో ముడిపడి లేకపోతే దరఖాస్తును ప్రజా సమాచార అధికారి(పీఐవో) తిరస్కరించవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని పీఐవో ప్రజాప్రయోజనమే ప్రాతిపదికగా వెల్లడించే వీలుంది.

ఫొటో సోర్స్, BELLUR N.SRIKRISHNA/FACEBOOK

ఫొటో క్యాప్షన్,

నిర్దిష్టతలేని పదబంధాలు, అస్పష్ట వ్యక్తీకరణలతో కూడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బిల్లును ముందుకు తీసుకెళ్లలేం.

సమాచార హక్కు చట్టం 2005 లోని గోప్యత క్లాజులను విశ్లేషించి చూస్తే- ఏడు సందర్భాల్లో వ్యక్తిగత సమాచారాన్నికూడా వెల్లడించవచ్చు. అవేమిటంటే-

01. ప్రభుత్వ కార్యకలాపాలకు చెందిన సమాచారం

02. ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన సమాచారం

03. సమాచారాన్ని వెల్లడించడం వల్ల సంబంధిత వ్యక్తి గోప్యతపై నిష్కారణంగా దాడి జరిగే అవకాశమేదీ లేనపుడు.

04. ప్రభుత్వ కార్యకలాపాలతోగాని, ప్రజా ప్రయోజనంతోగాని నేరుగా సంబంధం లేని వ్యక్తిగత సమాచారమే అయినప్పటికీ, దానిని వెల్లడించడంలో విస్తృత ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని భావించినప్పుడు.

05. సమాచారం వ్యక్తిగతమైనది అయినప్పటికీ, వ్యక్తి గోప్యత మీద నిష్కారణంగా దాడి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అది సమంజసమే అని భావించినప్పుడు.

06. సమాచారం వ్యక్తిగతమైనది అయినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రజా ప్రయోజనాలతో సంబంధం లేకపోయినప్పటికీ, సమాచారాన్ని వెల్లడి చేయడం వల్ల వ్యక్తి గోప్యత మీద నిష్కారణ దాడి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, విస్తృత స్థాయి ప్రజా ప్రయోజనాలేవీ ముడిపడి లేకపోయినప్పటికీ, పార్లమెంటుకు లేదా రాష్ట్ర శాసన సభకు ఇవ్వదగిన సమాచారమైతే ఆ సమాచారాన్ని ఇవ్వాలి.

07. సమాచారం వ్యక్తిగతమైనది అయినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రజా ప్రయోజనాలతో సంబంధం లేకపోయినప్పటికీ, సమాచారాన్ని వెల్లడి చేయడం వల్ల వ్యక్తి గోప్యత మీద నిష్కారణ దాడి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, సమాచారాన్ని వెల్లడి చేయకపోవడంలోని ప్రయోజనాల కన్నా సమాచారాన్నివెల్లడి చేయడం వల్ల కలిగే ప్రజా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని భావించినప్పుడు కోరిన సమాచారాన్ని ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

1996లో 'బెర్న్‌స్టీన్ వర్సెస్ బెస్టర్ మరియు ఇతరులు' కేసులో దక్షిణాఫ్రికా న్యాయస్థానం.. ఇతర హక్కుల లాగానే వ్యక్తిగత గోప్యతకు హక్కుకు కూడా కొన్ని పరిమితులున్నాయని తెలిపింది.

''గోప్యత అన్నది ఒకరి ఆంతరంగిక విషయం. అతడు/ఆమె కుటుంబ జీవితం, కుటుంబ వాతావరణం, లైంగిక విషయాల లాంటి వ్యక్తిగత అంశాలకు సమాజపు సమష్టి హక్కుల మూలంగా భంగం వాటిల్లకుండా ఒక కవచంగా 'గోప్యత' పని చేస్తుంది. సామాజిక హక్కులతోపాటు, సమాజంలోని తోటివారి హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఆ సమాజంలో భాగమైన ప్రతి పౌరుడిపై ఉంటుంది. గోప్యత అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనదే, కానీ ఆ వ్యక్తి ఒక సమూహంలో భాగమైనపుడు, ఆ సమూహంతో సామాజిక, వాణిజ్య వ్యవహారాలు నెరపుతున్నపుడు తన గోప్యత విస్తృతి తగ్గుతుంది.

ముఖ్యంగా ప్రజా జీవితంలో. అధికారులు/ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నపుడు ఆ ఖర్చు వివరాలను తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. ప్రభుత్వ శాఖల పద్దులు, దస్తావేజులు ప్రజలకు అందుబాటులో ఉన్నపుడు పారదర్శకత, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ మరింత బలపడతాయి. ఇవి ఎప్పటికీ రహస్యంగా ఉండకూడదు. ప్రజాస్వామ్య,రాజ్యాంగబద్దమైన పరిపాలన ఈ విధానాన్ని బలపరుస్తుంది. ఇలాంటి విషయాల్లో గోప్యత పాటిస్తే అవినీతికి ఆజ్యం పోసినట్లవుతుంది. అది ప్రజాస్వామ్యం ఆయువుపట్టును దెబ్బతీస్తుంది.

ఈ విషయాన్ని.. సమాచార హక్కు చట్టంలో సరిగానే గుర్తించారు. 'గోప్యత'కు అవసరమైన మేరకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. దేశంలో ప్రజాప్రయోజనానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజాప్రయోజనం ఒక మినహాయింపు కూడా. సమాచార హక్కు చట్టం 12 సంవత్సరాలుగా అమలవుతున్నప్పటికీ, చాలా మంది సమాచార హక్కు చట్టం అధికారులకు ఏయే విషయాలు వెల్లడించకూడదనే అంశంలో సరైన తర్ఫీదు లేదు. సమాచార హక్కు చట్టంలోని 'మినహాయింపు' క్లాజ్‌ను అమలు చేయడంలో కొన్ని కోర్టు తీర్పులు కూడా అయోమయం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజా సమాచారం గోప్యంగా ఉంటోంది.

పుట్టస్వామి కేసులో (2017 ఆగస్టు) వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తించింది. అయితే, పాలనా పారదర్శకతపై దీని ప్రభావం ఉంటుందన్న భయాలు కూడా ఉత్పన్నమయ్యాయి.

కెనెరా బ్యాంక్ వర్సెస్ సి.ఎస్.శర్మ కేసులో, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా వారి వ్యక్తిగత సమాచారమే అంటూ, పౌరులకు, ఉద్యోగుల బదిలీల సమాచారం తెలుసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. వ్యక్తిగత సమాచార భద్రత పేరుతో సమాచార హక్కు చట్టానికి శ్రీకృష్ణ కమిటీ చేసిన ప్రతిపాదనలతో ఈ సందేహాలు మరింత బలపడ్డాయి. ఆయన ప్రస్తుత ఆర్టీఐ చట్టంలోని 8(1)(జె) నిబంధనను తొలగించి తాను రచించిన కొత్త నిబంధనను చేర్చాలనుకుంటున్నారు. శ్రీకృష్ణ సూచన ప్రకారం పీఐవో ఈ కింది సందర్భాల్లో సమాచారాన్ని నిరాకరించవచ్చు:

''(జె) సమాచారం వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనప్పుడు, అది డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరి సమాచారం అయితే ఇస్తున్నామో ఆ వ్యక్తికి లేదా అధికారికి 'హాని' కలిగించినప్పుడు లేదా హాని కలిగించే 'అవకాశం' ఉన్నప్పుడు, ప్రభుత్వ అధికార వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు మేలు చేసే అవకాశం ఉన్న ఆ సమాచారాన్ని సంపాదించడంలోని ప్రజా ప్రయోజనాల కన్నా ఆ 'హాని' తీవ్రమైనదని భావించినప్పుడు;

ఒక వ్యక్తి లేదా ఉద్యోగికి హాని కలిగే పక్షంలో ఆ వ్యక్తికి చెందిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించవచ్చు. కొత్తగా ప్రతిపాదిస్తున్న 2018 బిల్లులోని 3(29) సెక్షన్ ప్రకారం, వ్యక్తిగత సమాచారం అంటే, ఒక వ్యక్తి గురించిన, దానికి సంబంధించిన సమాచారం ద్వారా సదరు వ్యక్తిని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గుర్తుపట్టగలగడం. వ్యక్తిని గుర్తించడానికి అవసరమయ్యే లక్షణాలు, గుణాలు, స్వభావం కూడా వ్యక్తిగత సమాచారం కిందికే వస్తాయి. ఈ నిర్వచనం పరిధి చాలా విస్తృతంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిపాదిత సెక్షన్ 8(1)(జే) ప్రకారం వ్యక్తులకు హాని కలిగించే 'అవకాశం' ఉన్న వ్యక్తిగత డేటాను ఇవ్వరాదు, ఆ డేటాకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఇక్కడ'relating to', 'likely' అనే పదాలు అస్పష్టంగానూ విస్తృత పరిధితోనూ ఉండడం వల్ల, వీటి అర్థాలను ఎవరికి వారు తమకు కావలసిన విధంగా ఊహించుకోవచ్చు. 'హాని కలిగే అవకాశం' అనే ఊహాజనిత కారణంతో సమాచార హక్కును అడ్డుకునే వెసులుబాటు ఉంటుంది.

ప్రస్తుత ఆర్టీఐ చట్టంలోని 8(1)(జే) సెక్షన్ ప్రకారం, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత గోప్యతకు మినహాయింపు ఇవ్వడమన్నది ఒక పరీక్ష. ఈ వివేచనాధికారంతో పీఐవో సమాచారాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవచ్చు. జస్టిస్ శ్రీకృష్ణ తన నివేదికలో 2005 చట్టంలో 'ప్రజా ప్రయోజనం' అన్న దానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల గందరగోళం ఉందంటూ మినహాయింపు క్లాజుకు ఆయన స్పష్టత ఇవ్వాలన్నారు. కానీ, ఆయన ప్రతిపాదించిన పదాలు, పదబంధాలు మరింత అస్పష్టంగా ఉన్నాయి. గంపగుత్తగా సమాచార నిరాకరణకు సహకరించేలా ఉన్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ చెప్పిన మినహాయింపు 'పరీక్ష'లు కూడా 'ప్రజా ప్రయోజనం' చుట్టే తిరిగినట్టు కనిపించినా అందుకు ఆయన ఉపయోగించిన పదాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. అంతిమంగా అవి అవినీతి పరులకే ఉపయోగపడే ప్రమాదముంది.

దీనితోపాటు శ్రీకృష్ణ 'హాని పరీక్ష'ను కూడా ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష కనుక అమల్లోకి వస్తే ఆర్‌టీఐ కింద సంధించే అన్ని ప్రశ్నలకు అదో ఇనుపగోడలా అడ్డుపడుతుంది. ఈ హాని పరీక్షే నిజానికి చాలా హానికరమైన అవరోధం.

హాని అనే పదాన్ని శ్రీకృష్ణ సెక్షన్ 3(21)లో నిర్వచించారు. "హాని"లో ఇమిడి ఉన్నవి: (1) శారీరక లేదా మానసిక గాయం, (2) నష్టం, వక్రీకరణ లేదా గుర్తింపు చౌర్యం, (3) ఆర్థిక నష్టం లేదా ఆస్తి నష్టం (4) ప్రతిష్ఠకు భంగం కలగడం లేదా అవమానం (5) ఉద్యోగం కోల్పోవడం, (6) ఏవిధంగానైనా వివక్ష చూపించడం (7) బ్లాక్ మెయిల్ లేదా భయపెట్టి డబ్బు లాగడం. (8) ఏదైనా సేవల నిరాకరణ లేదా ఉపసంహరణ, డేటా ప్రిన్సిపల్ గురించి విశ్లేషణాత్మక నిర్ణయం ఫలితంగా కలిగే మంచి లేదా ఏదైనా ప్రయోజనం, (9) తనను గమనిస్తున్నారు, తన మీద నిఘా పెట్టారనే భయంతో మాట్లాడే మాటలు, కదలికలు, ఇంకా ఇతరత్రా చర్యలపై ఏవైనా నియంత్రణలు విధించడం, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందుకు సంబంధించి సమస్యలు, (10) డేటా ప్రిన్సిపల్ సాధారణంగా ఊహించని పర్యవేక్షణ లేదా నిఘా.

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ ఉద్యోగి తన సస్పెన్షన్ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల మానసిక క్షోభ కలుగుతుందని, లేదా ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని లేదా అవమానం జరుగుతుందని, లేదా ఉద్యోగం పోవడానికి కారణమవుతుందని లేదా బ్లాక్ మెయిల్‌కు గురికావచ్చని వాదించి ఆ సమాచారాన్ని నిరాకరించవచ్చు. అవినీతిపరులైన అధికారులందరూ ఈ కొత్త బిల్లును చూసి సంబరాలు చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ అధికారుల్లోని అక్రమార్కులను బ్లాక్ మెయిల్‌కు గురయ్యే అవకాశాల నుంచి రక్షణ కల్పిస్తుంది. 'బ్లాక్ మెయిల్ లేదా బలవంతంగా డబ్బు లాగడం' అనే పదబంధాలను (వ్యక్తీకరణ) 'హాని' అనే పదానికి ఇచ్చిన విస్తృత నిర్వచనంలో స్పష్టంగా చేర్చడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతున్నది.

ఈ బిల్లును కనుక చట్టం చేస్తే, ఒక అధికారి అవినీతి సమాచారాన్ని, అందుకు 'సంబంధించిన' ఇతర సమాచారాన్ని కూడా అతని వ్యక్తిగత సమాచారంగా వక్ర భాష్యం చెప్పడానికి వీలవుతుంది. ఆ నిర్వచనంలో హాని గురించి చెప్పిన పది అంశాలే కాకుండా ఇంకా ఏదైనా చేర్చే అవకాశం కూడా ఈ నిర్వచనం కలిగించింది. చెప్పిన పది నిబంధనలకు కాకుండా వేరే ఏదైనా హాని కూడా కలగవచ్చు. Likely అనే విశేషణాన్ని సెక్షన్ (8)(1)(జే)లో, సెక్షన్ 3(21)లో హాని అన్న పదానికి అనుబంధంగా జోడించారు. దాంతో, దాని నిర్వచనానికి ఆకాశమే హద్దుగా మారింది.

నిర్దిష్టతలేని పదబంధాలు, అస్పష్ట పదాలతో కూడిన జస్టిస్ శ్రీకృష్ణ బిల్లును ముందుకు తీసుకెళ్లలేం. ఆయన కమిటీ కనీసం ఈ విషయంలో సమాచార కమిషన్‌ను సంప్రతించలేదు. ఇప్పుడున్న వ్యక్తిగత సమాచార గోప్యత నిబంధనలకే వక్ర భాష్యాలు చెబుతూ సమాచారాన్ని ఇవ్వకుండా ఉండడానికి కొందరు అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచార కమిషన్‌కు సమస్యలు సృష్టిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సమాచార కమిషన్‌ను కలవకుండానే, మరింత దుర్వినియోగమయ్యే నిబంధనలతో బిల్లు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ బిల్లు అక్రమాలను, అక్రమార్కులను ఆదుకునేందుకు ప్రజా సమాచార అధికారుల చేతిలో పౌరులపై ఓ అస్త్రంగా మారే ప్రమాదం ఉందనడంలో అతిశయోక్తి లేదు.

(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)