హైదరాబాద్‌లో చరిత్ర పరిశోధకురాలు ఆడ్రే ట్రష్కే ప్రసంగం ఎందుకు రద్దయింది?

  • 11 ఆగస్టు 2018
ఆడ్రే ట్రష్కే Image copyright Twitter/Audrey Truschke
చిత్రం శీర్షిక ఆడ్రే ట్రష్కే

అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆడ్రే ట్రష్కే హైదరాబాద్‌లోని బి.ఎం. బిర్లా సెంటర్‌లో ఈ ఆదివారం ఇవ్వాల్సిన ఉపన్యాసం రద్దయింది. దక్షిణాసియా చరిత్ర పరిశోధకురాలిగా తాను వాల్మీకి రామాయణం గురించి చేసిన వ్యాఖ్యల మీద ఆగ్రహించిన హిందుత్వవాదులు బెదిరింపులకు పాల్పడడమే అందుకు కారణమని ఆమె చెప్పారు.

దక్షిణాసియా చరిత్ర పరిశోధకురాలు ఆడ్రే ట్రష్కే హైదరాబాద్ పర్యటన రద్దయింది. హిందుత్వ వాదుల నుంచి అందిన బెదిరింపు లేఖల కారణంగా తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వస్తోందని ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు.

భారత- ఇస్లామిక్ చరిత్ర, వర్తమాన అభిప్రాయాల విశ్లేషణ (Unpopular Stories: Narrating the Indo-Islamic Past and Navigating Present-day Prejudices) అనే అంశంపై ఆమె ఆగస్ట్ 11న బిర్లా సైన్స్ ప్లానిటోరియం వేదికగా ప్రసంగించాల్సి ఉంది. కృష్ణాకృతి ఫౌండేషన్, హిస్టరీ ఫర్ పీస్ సంస్థలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ముందుగా కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో జరగాల్సి ఉండగా, స్థలం సమస్యతో బిర్లా ప్లానిటోరియంకు మారింది.

ఈ ఉపన్యాసం ఇవ్వడానికి తాను హైదరాబాద్ రాలేననీ, హిందూత్వ వాదుల నుంచి వస్తున్న బెదిరింపులే అందుకు కారణమనీ ఆడ్రే కార్యక్రమ నిర్వాహకులకు తెలిపారు. అయితే, బెదిరింపుల గురించి నిర్వాహకుల దగ్గర మాత్రం ఎటువంటి సమాచారం లేదు.

Image copyright Twitter/Audrey Truschke
చిత్రం శీర్షిక 'కల్చర్ ఆఫ్ ఎన్‌కౌంటర్స్: సంస్కృత్ ఎట్ మొఘల్ కోర్ట్' పుస్తకం

ఆడ్రే అమెరికాలోని నెవార్క్ లో ఉన్న రట్గర్స్ యూనివర్సిటీలో దక్షిణాసియా చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. 'కల్చర్ ఆఫ్ ఎన్‌కౌంటర్స్: సంస్కృత్ ఎట్ మొఘల్ కోర్ట్', 'ఔరంగజేబ్: ద మ్యాన్ అండ్ ద మిత్' అనే గ్రంథాలు రాశారు. ఔరంగజేబును విలన్‌గా చిత్రీకరించిన కథనాల వెనుక అసలు వాస్తవాలను ఆమె తన రచనలో వివరించారు.

వాల్మీకి రామాయణంలో అగ్నిప్రవేశం సందర్భంలో రాముడి గురించి సీత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, బంగారు మాయ లేడి వచ్చిన సందర్భంలో కూడా సీత, 'నా మీద కోరికతోనే ఇలా చేస్తున్నావ'ని లక్ష్మణుడి మీద ఆరోపణలు చేసిందని ఆడ్రే ఏప్రిల్ నెలలో చేసిన ట్వీట్లు వివాదస్పదం అయ్యాయి. ఆమె మాత్రం, తాను వాల్మీకి రామాయణంలో ఉన్నదే చెప్పానని సమర్థించుకున్నారు.

ఉపన్యాసం ఇవ్వడానికి ఆడ్రే హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకున్నారా అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అడిగినప్పుడు, ఆమె అసలు ఎవరో తమకు తెలియదని చెప్పారు. అలాంటప్పుడు అడ్డుకున్నామనే ప్రశ్నే ఉండదని ఆయన చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా, 'దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం మావద్ద లేదు. ఎలాంటి ఫిర్యాదులూ అందలేదు' అని బదులిచ్చారు.

Image copyright Facebook/Sumiran Komarraju
చిత్రం శీర్షిక సుమీరన్ కొమర్రాజు సైఫాబాద్ పోలీసులకు జులై 31న రాసిన లేఖ

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

అయితే, సుమీరన్ కొమర్రాజు అనే వ్యక్తి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి జులై 31న ఒక లేఖ రాశారు. ఆడ్రే ట్రస్చ్కే కార్యక్రమ నిర్వాహకులకు అనుమతి ఇవ్వవద్దని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ లేఖను ఆయన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఆడ్రే ట్రష్కేను బీబీసీ ఈమెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు, ఆ లేఖను తాను కూడా చూశానని తెలిపారు.

ఆమె తన హైదరాబాద్ పర్యటన రద్దు కావడానికి కారణాలను వివరిస్తూ, "పోలీసులతోనూ, వేదిక విషయంలోనూ సమస్యలు రావడంతో నిర్వాహకులు నా లెక్చర్ రద్దుచేశారు. అప్పటికీ నేను రావడానికి సుముఖంగానే ఉన్నానని చెప్పాను. కానీ, వారు నా ప్రతిపాదన తిరస్కరించారు" అని బదులిచ్చారు.

సోషల్ మీడియాలో తనకు చంపుతామంటూ బెదిరింపులు వస్తూనే ఉంటాయని, అయితే హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి బెదిరింపులు రాలేదని ఆమె చెప్పారు. ఏమైనా, ఈ పర్యటన రద్దు కావడం తనకు బాధ కలిగించిందని తెలిపారు.

"నా హైదరాబాద్ లెక్చర్ రద్దు కావడమన్నది శాస్త్రీయ పరిజ్ఞానం, భావప్రకటనా స్వేచ్ఛలపై జరిగిన దాడిగానే భావిస్తున్నాను. విద్యావంతుల నోరు నొక్కేయటంలో కొన్ని శక్తులు సఫలమయ్యాయి. ఇది నాకు చాలా బాధ కలిగించింది" అని ఆడ్రే వివరించారు.

అయితే కార్యక్రమ రద్దు విషయంలో ఆడ్రే చెప్పిన వాదనకూ, ఒక నిర్వాహక బృంద సభ్యుడు చెప్పిన మాటలకూ పొంతన కుదరడం లేదు.

ఆమె హైదరాబాద్ రావడానికి అంగీకరించకపోయినా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అయినా ప్రసంగించడానికి ఏర్పాట్లు చేయగలమనీ, కానీ ఆమె అందుకు కూడా ఒప్పుకోలేదని కార్యక్రమ నిర్వహణ విషయంలో చురుగ్గా పాల్గొన్న ఒక వ్యక్తి బీబీసీతో చెప్పారు. ఆమెను ఒక ప్రసంగానికి ఆహ్వానించామే తప్ప, రాముడిపై ఆమె చేసిన వ్యాఖ్యాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

మరో నిర్వాహక సంస్థ కృష్ణాకృతి ఫౌండేషన్ మాత్రం ఈ విషయమై ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)