మీ పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?
- నవీన్ నేగి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని రోజుల కింద ఓ ఉదయం వార్తాపత్రికను తెరిస్తే, ఒక వార్త నా దృష్టిని ఆకర్షించింది. దిల్లీలోని కృష్ణానగర్ ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేశాడన్నది ఆ వార్త.
పాఠశాల విద్యార్థుల మధ్య ఇలాంటి గొడవలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పాఠశాల విద్యార్థులు గొడవపడి, ఒకరినొకరు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంత చిన్న వయసులోనే పిల్లల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది?
యువతకన్నా టీనేజ్ పిల్లల్లో ఎక్కువ కోపం
ప్రపంచంలో 10 నుంచి 19 ఏళ్ల వయసున్న 120 కోట్ల మంది టీనేజర్లు ఉన్నారని యునిసెఫ్ నివేదిక వెల్లడిస్తోంది. అదే భారతదేశం విషయానికి వస్తే, 2011 జనాభా లెక్కల ప్రకారం, వాళ్ల సంఖ్య 24 కోట్లు. ఇది భారతదేశ జనాభాలో పాతిక శాతం. ప్రపంచంలో ఎక్కువ శాతం టీనేజర్లు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉన్నారు.
పిల్లలలో కోపం తెచ్చుకునే స్వభావం వాళ్ల వయసు మీద ఆధారపడి ఉంటుంది. 2014లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, బాలికలకన్నా బాలల్లో కోపం ఎక్కువగా ఉంటుంది.
ఈ పరిశోధనను దేశంలోని 6 ప్రధాన ప్రాంతాలలో మొత్తం 5467 మంది టీనేజ్ మరియు యవ్వన ప్రాయంలో ఉన్నవారిపై చేపట్టారు.
దీనిలో 16-19 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఎక్కువ కోపం కనిపించగా, 20-26 ఏళ్ల మధ్య వయసున్న వారిలో తక్కువ కోపం కనిపించింది. దీనిని బట్టి యవ్వనప్రాయంలో కన్నా టీనేజీలోనే ఎక్కువ కోపం ఉన్నట్లు గుర్తించారు.
అదే సమయంలో బాలికలతో పోలిస్తే, బాలురలో కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిశోధనలో, 12-17 ఏళ్ల వయసు బాలికల్లో 19 శాతం మంది పాఠశాలలో ఏదో ఒక రకమైన వివాదంలో చిక్కుకున్నారని తేలింది.
ఫొటో సోర్స్, Thinkstock
ఇంతకూ పిల్లలు ఇంత కోపం తెచ్చుకోవడానికి కారణం ఏమిటి?
సైకాలజిస్టు, మ్యాక్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ దీపాలి బాత్ర పిల్లలపై తల్లిదండ్రులు ఎంత దృష్టి పెడుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం అంటారు.
''పెద్ద పట్టణాలలో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. ఏదో పని ఇవ్వడం అనే నెపం మీద వాళ్లకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి సందర్భంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో హింసాత్మక ధోరణి కలిగిన గేమ్స్ ఆడుతున్నారు'' అని తెలిపారు.
వీడియో గేమ్స్ పిల్లల మెదడుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
దీనికి జవాబుగా ఆమె, ''హింసాత్మక ప్రవృత్తి కలిగిన పిల్లలంతా రోజులో కనీసం మూడునాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడుతున్నారని తెలిసింది. ఈ ఆటల్లో ప్రత్యర్థిని అంతమొందించినప్పుడే మీరు గెలుస్తారు. అలా మొబైల్ గేమ్స్ పిల్లల మనస్తత్వాన్ని మెల్లగా మార్చేస్తాయి'' అని వివరించారు.
2010లో అమెరికా సుప్రీంకోర్టు - హత్యలు, లైంగిక హింస ఉన్న వీడియో గేమ్స్ ఆడడాన్ని అనుమతించరాదని సూచించింది.
దీనికి ఐదేళ్ల ముందు, కాలిఫోర్నియా గవర్నర్ 18 ఏళ్లలోపు పిల్లలు హింసాత్మక ప్రవృత్తి కలిగిన వీడియో గేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
అమెరికన్ సైకాలజీ సంస్థ కూడా వీడియో గేమ్స్ మానవ ప్రవత్తిని మార్చడంలో చెప్పుకోదగిన పాత్ర పోషిస్తాయని పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
యూట్యూబ్ వీడియోల నుంచి పోర్న్ వరకు..
ఒకసారి పిల్లల చేతికి మొబైల్ ఫోన్ అందితే, దాంతో యూట్యూబ్ వీడియోల నుంచి పోర్న్ దృశ్యాల వరకు అందుబాటులోకి వస్తాయి.
డెహరాడూన్‌కు చెందిన పూనమ్ అస్వాల్కు ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఆయుష్ తనకు కావాల్సిన వీడియోలను చాలా సులభంగా మొబైల్ ఫోన్లలో చూసేస్తాడు.
తన పిల్లవాడి అలవాటుపై ఆమె చాలా ఆందోళన చెందుతున్నారు.
''మొదట ఆయుష్ మొబైల్‌తో బిజీగా ఉంటే సంతోషించేదాన్ని. కానీ క్రమంగా వాడు మొబైల్లో హింసాత్మకమైన కార్టూన్ చిత్రాలు చూడడం ప్రారంభించాడు. దాంతోపాటు అసభ్యకరమైన చిత్రాలు కూడా లింకులుగా రావడం ప్రారంభమైంది. వాటిని క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో తల్చుకుంటే భయంగా ఉంది'' అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
1961లో అమెరికా మానసిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండురా ఒక ప్రయోగం చేశారు.
దానిలో ఆయన ఒక వ్యక్తి ఒక బొమ్మను చంపుతున్న దృశ్యాన్ని పిల్లలకు చూపించారు. ఆ తర్వాత పిల్లలకు బొమ్మలు ఇచ్చినపుడు వాళ్లు కూడా తమ బొమ్మలను అదే రకంగా చంపడానికి ప్రయత్నించారు.
తల్లిదండ్రులతో సంబంధాలు
పట్టణాలలో తల్లిదండ్రులు ఇధ్దరూ ఉద్యోగం చేస్తున్న సందర్భంలో పిల్లలపై సమయం వెచ్చించడం కష్టం అవుతుంది.
తల్లిదండ్రుల మధ్య ఎలాంటి సంబంధం ఉందన్న విషయం పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
''తల్లిదండ్రులు తాము స్వయంగా కొట్లాడుకుంటూ పిల్లలను మాత్రం సరిగా ప్రవర్తించమంటే పిల్లలు వినరు. అలాంటప్పుడు వాళ్లలోనూ హింసాత్మక ప్రవృత్తి బయలుదేరుతుంది. పిల్లలు తమకు నచ్చినట్లుగా ఉండాలనకుంటారు. అలా జరగనప్పుడు వాళ్లు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు'' అని డాక్టర్ బాత్రా తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
హార్మోన్లలో మార్పులు
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేయడం... ఇవన్నీ ఆధునిక జీవితం పర్యవసానాలు. అయితే పిల్లల్లో హింసాప్రవృత్తికి మరో కోణం కూడా ఉంది. మొబైల్స్, ఇంటర్నెట్ లేని కాలంలోనూ పిల్లలలో హింసా ప్రవృత్తి ఉంది. దీనికి కారణమేంటి?
పిల్లలలో వచ్చే హార్మోన్ మార్పులే దీనికి కారణమని డాక్టర్ బాత్రా తెలిపారు. ఆ సమయంలో వాళ్ల శరీరావయవాలు, మెదడు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి.
''11 నుంచి 16 ఏళ్ల వయసును కిశోరప్రాయం అంటారు. ఈ సమయంలో పిల్లలు ఎమోషనల్‌గానే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు'' అని తెలిపారు.
అందుకే ఆ సమయంలో వాళ్లలో చాలా కోపం, హింసాత్మక ప్రవృత్తి కనిపిస్తాయి.
పిల్లలలో మారుతున్న స్వభావాన్ని ఎలా గుర్తించాలి?
దీనికి సమాధానంగా డాక్టర్ బాత్రా, ''పిల్లలు పాఠశాలలో తోటి పిల్లలతో గొడవపడుతుంటే లేదా వాళ్లను తిడుతుంటే, చదువుపై శ్రద్ధ పెట్టకుంటే.. మీరు పిల్లల మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం'' అని తెలిపారు.
అలాంటప్పుడు వాళ్ల కోసం సమయం కేటాయించాలి. వాళ్లతో పాటు బైటికి వెళ్లి వాళ్లతో రకరకాల ఆటలు ఆడించాలి. వాళ్లతో మాట్లాడాలి. వాళ్లు చేసే ప్రతి పనిలో తప్పులు వెదకడం మానేయాలి. ఎందుకంటే వాళ్ల వ్యక్తిత్వం రూపుదిద్దుకునే సమయం అదే.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)