అమ్మాయిలకు మీసాలు, గడ్డం ఎందుకు వస్తాయి?

  • భూమికా రాయ్
  • బీబీసీ ప్రతినిధి
అమ్మాయిల ముఖంపై వెంట్రుకలు

ఫొటో సోర్స్, Getty Images

"అందరూ శరీరాన్ని దాచుకోవడం కోసమే బట్టలు వేసుకుంటారు. కానీ నేను ముఖం దాచుకోడానికి కూడా బట్టలు కట్టుకోవాల్సి వచ్చేది. ముఖానికి గుడ్డ కట్టుకోకుండా నేను ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి వెళ్లలేకపోయేదాన్ని. ఉక్కపోతగా ఉన్నా, వర్షం పడుతున్నా, పదేళ్లు నా ముఖానికి గుడ్డ కట్టుకునే వెళ్లా."

దిల్లీ మహారాణీ బాగ్‌లో నివసించే పాయల్( పేరు మార్చాం) ఆ రోజులను గుర్తు చేసుకుని ఇప్పుడు బాధపడుతోంది. ఆమె జీవితంలో గడిచిన పదేళ్లు చాలా కఠినమైనవి. దానికంతటికీ ఆమె ముఖంపై వెంట్రుకలు ఉండడమే కారణం.

పురుషుల్లా ముఖంపై వెంట్రుకలు

"నేను స్కూలుకు వెళ్తున్నప్పుడు వెంట్రుకలు లేవు. కానీ, కాలేజికి వెళ్లడం ప్రారంభించాక ముఖంపై సగభాగంలో వెంట్రుకలు వచ్చాయి. మొదట చిన్న చిన్న వెంట్రుకలు రావడంతో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఉన్నట్టుండి అవి పొడవుగా నల్లగా కనిపిచడం మొదలయ్యాయి. వాక్సింగ్ చేయించేదాన్ని, కానీ ఐదు రోజుల్లోనే వెంట్రుకలు మళ్లీ వచ్చేసేవి. దాంతో నేను వాటిని షేవ్ చేసుకోవడం మొదలెట్టా" అంటుంది పాయల్.

"ఒక రోజు నాన్న రేజర్ కనిపించలేదు, అమ్మ కూడా నాన్నతో కలిసి అది వెతుకుతోంది. కానీ, తనకు కూడా దొరకలేదు. కాసేపటి తర్వాత నాన్న "పాయల్‌ను అడుగు, షేవ్ చేసుకోడానికి, తనేమైనా తీసుకెళ్లిందేమో అన్నాడు" అని అప్పటి ఘటనలను పాయల్ గుర్తు చేసుకుంది.

పదేళ్లలో పాయల్ ఇలాంటివి ఎన్నో వాటిని భరించింది. మందులు వేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో పాయల్ లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని నిర్ణయించింది. మొదట లేజర్ ట్రీట్‌మెంట్ గురించి ఆమె చాలా భయపడేది. చివరికి వారం వారం ఎదురయ్యే వెంట్రుకల సమస్య నుంచి విముక్తి పొందడానికి లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంది.

దిల్లీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సురుచి పురీ, "మన సమాజంలో ఏ అమ్మాయైనా తన ముఖంపై వెంట్రుకలు వస్తే అవమానంగా భావిస్తుంది. బయోలాజికల్ సైకిల్‌లో గందరగోళం వల్ల ఇలాంటివి జరుగుతాయని ఎక్కువ మందికి తెలీదు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, BILLIE ON UNSPLASH

మొదట కారణం తెలుసుకోవాలి?

డాక్టర్ సురుచి ఫెమినా మిస్ ఇండియా-2014 ఈవెంట్‌కు అధికారిక డెర్మటాలజిస్టుగా ఉన్నారు.

"ముఖంపై వెంట్రుకలు రావడానికి రెండు కారణాలు ఉండచ్చు. వెంట్రుకలు జన్యుపరమైన ( జెనెటిక్) కారణాలతో రావచ్చు. లేదా హార్మోన్స్‌లో తలెత్తిన తేడాల వల్ల రావచ్చు. హార్మోన్స్ సంతులనం తప్పడం వల్ల కూడా అలా ముఖంపై వెంట్రుకలు వస్తాయి" అని సురుచి తెలిపారు.

"మనిషి శరీరంపై కొన్ని వెంట్రుకలు కచ్చితంగా ఉంటాయి. అలాంటప్పుడు అమ్మాయిల శరీరంపై కాస్త ఎక్కువ వెంట్రుకలు ఉన్నంతమాత్రాన దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ, వెంట్రుకలు చాలా ఎక్కువగా ఉంటే కచ్చితంగా డాక్టరును సంప్రదించాలి"

ముఖంపై చాలా ఎక్కువ వెంట్రుకలు ఉండే స్థితిని 'హైపర్ ట్రయికోసిస్' అంటారు. జన్యుపరమైన కారణాలతో ముఖంపై వెంట్రుకలు వస్తే దానిని 'జెనెటిక్ హైపర్ ట్రయికోసిస్' అంటారు. ఆ సమస్య హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల వస్తే దానిని 'హర్‌స్యూటిజం' అంటారని డాక్టర్ సురిచి వివరించారు.

హార్మోన్లలో గందరగోళం తలెత్తడానికి పీసీఓడీ( పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్) పెద్ద కారణం కావచ్చని డాక్టర్ సురుచి చెప్పారు. ఈరోజుల్లో అది చాలా వేగంగా పెరుగుతోందని తెలిపారు. అయితే పీసీఓడీ రోగులు అందరికీ ముఖంపై వెంట్రుకలు రావడం జరగదని వివరించారు.

పీసీఓడీకి ఎక్కువగా మన లైఫ్‌స్టైల్ కారణం అవుతుంది. మన ఆహార అలవాట్లు, బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించే స్టెరాయిడ్స్, గంటలకొద్దీ ఒకే విధంగా కూచోవడం, ఒత్తిడికి గురికావడం వంటివన్నీ పీసీఓడీని మరింత పెంచే అవకాశం ఉంటుంది.

వీటి ప్రభావం వల్ల మహిళల్లో టెస్టోస్టిరాన్, ఎండ్రోజెన్ లాంటి హార్మోన్లు పెరుగుతాయని డాక్టర్ సురుచి చెప్పారు.

ఎవరైనా ఒక అమ్మాయి ముఖంపై చాలా ఎక్కువగా వెంట్రుకలు ఉంటే, వారు మొదట దానికి కారణం తెలుసుకునే ప్రయత్నంచేయాలి. కారణం హార్మోన్లే అయితే జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఎక్కువ కేసుల్లో మందులు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

లేజర్ ట్రీట్‌మెంట్ తప్పదా?

మందుల వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందని పాయల్ అనుకోలేదు.

"నేను పదేళ్ల వరకూ హోమియోపతి మందులు వాడాను. అందరూ నేను ఖరీదైన వైద్యం చేయించుకోలేదు కాబట్టే ఫలితం కనిపించలేదని అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. నేను దిల్లీలోని చాలా పెద్ద పెద్ద హోమియోపతి డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకున్నా. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు".

పాయల్ రెండేళ్ల క్రితమే లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె ముఖంపై కొత్తగా వెంట్రుకలు రాలేదు. పాయల్ డాక్టర్ సురిచి చెప్పింది పూర్తిగా నిజమే అంటుంది.

"నా ప్రాబ్లం హార్మోన్స్ వల్ల వచ్చింది. ఎందుకంటే నా పీరియడ్స్ టైమ్‌కు వచ్చేవి కాదు. అది కూడా ఒకే రోజు ఉండేది. దానివల్ల ముఖంపై వెంట్రుకలే కాదు, నా బరువు కూడా పెరుగుతూ వచ్చింది. లేజర్ చేయించుకునే ముందు నేను బరువు తగ్గించుకున్నా, ఆహారంలో మార్పులు చేశా, లైఫ్‌స్టైల్‌ మార్చుకున్నా, ఇప్పుడు ముందుకంటే మెరుగ్గా ఉంది" అంటుంది పాయల్.

ఫొటో సోర్స్, ROOP SINGAR BEAUTY PARLOUR/FACEBOOK

అయినా ఇది అంత పెద్ద సమస్యా?

"మా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎక్కువగా త్రెడింగ్ కోసమే వస్తుంటారు. ఐబ్రో, అపర్ లిప్స్ కాకుండా కొంతమంది అమ్మాయిలు ముఖం అంతా త్రెడింగ్ చేయించుకుంటారు" అని దిల్లీలోని మిరకిల్ బ్యూటీ పార్లర్‌లో పనిచేసే రచన చెప్పారు.

"మా దగ్గరకు వచ్చే అమ్మాయిలు కొంతమంది ముఖంపై పూర్తిగా త్రెడింగ్ చేయించుకుంటారు. ఎందుకంటే వారి ముఖంపై మిగతా అమ్మాయిలకంటే ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. కొంతమంది వాక్స్ కూడా చేయించుకుంటారు. వారికి బ్లీచ్ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆ వెంట్రుకలు చాలా పెద్దవిగా ఉంటాయి"అంటారు రచన.

తన దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో చాలా మంది తమ ముఖంపై ఉన్న వెంట్రుకల గురించి చాలా ఆందోళన పడుతుంటారని రచన చెప్పారు.

డాక్టర్ సురుచి కూడా అదే అంటారు. "ముఖంపై ఉన్న వెంట్రుకల ప్రభావం ఎక్కువగా మెదడుపై పడుతుంది. దానివల్ల కాన్ఫిడెన్స్‌పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది" అని చెప్పారు.

మహిళల్లో కూడా పురుషుల హార్మోన్లు ఉంటాయని దిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ ఎండోక్రినాలజిస్ట్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ సుజిత్ ఝా చెప్పారు. "కానీ, అవి చాలా తక్కువగా ఉంటాయి. ఆ హార్మోన్ల లెవల్ పెరిగినప్పుడు, ముఖంపై వెంట్రుకలు వస్తాయి" అన్నారు.

దీనికి ప్రధాన కారణం పీసీఓడీనే. దాని వల్ల హార్మోన్ల సంతులనం ఉండదు. ఎక్కువ బరువు ఉన్న వారిలో పీసీఓడీ ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి అని డాక్టర్ సుజిత్ అంటారు.

"మొదట ముఖంపై వెంట్రుకలు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అది జెనెటిక్ వల్లా, లేక హార్మోన్ల వల్లా అన్నది గుర్తించాలి. అవి కాకుండా ముఖంపై హఠాత్తుగా వెంట్రుకలు వస్తే అది కేన్సర్ లక్షణం కూడా కావచ్చు. కానీ ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి" అని సుజిత్ తెలిపారు.

ప్రపంచ రికార్డ్ సృష్టించిన గడ్డం

బ్రిటన్‌లో నివసించే హర్మాన్ కౌర్ గడ్డం ఉన్న అత్యంత చిన్న వయసు మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటికి హర్మాన్ వయసు 16 ఏళ్లు. ఆ వయసులో తనకు పాలిసిస్టిక్ సిండ్రోమ్ ఉందని, దాని వల్ల తన ముఖం, శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయని ఆమెకు తెలిసింది.

శరీరం, ముఖంపై ఉన్న వెంట్రుకల వల్ల ఆమె స్కూల్లో ఎన్నో అవమానాలు భరించింది. చాలాసార్లు ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంది. ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది.

కానీ, ఇప్పుడు ఆమె స్వయంగా తన కొత్త రూపాన్ని స్వీకరించింది. గత కొన్నేళ్లుగా తన ముఖంపై ఉన్న వెంట్రుకలు తీయించుకోకుండా ఉంది.

"వాక్సింగ్ వల్ల చర్మం కోసుకుపోతుంది. బిగుతుగా అవుతుంది. నా చర్మంపై ఎన్నోసార్లు గాయాలయ్యాయి. వాటికి చెక్ పెట్టాలంటే గడ్డం పెంచడమే మంచిదని అనుకున్నా. అని హర్మాన్ వివరించింది".

తన నిర్ణయం చాలా కఠినమైనదని హర్మాన్‌కు తెలుసు. కానీ, ఆమెకు తన మీసాలు, గడ్డం వల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులూ లేవు.

బదులుగా ఆమె గడ్డం అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. "నా గడ్డానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏ పురుషుడికో ఉన్న గడ్డం కాదు, ఇది ఒక మహిళ గడ్డం అంటుంది" హర్మాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)