చరిత్రలో కనిష్ఠ స్థాయికి రూపాయి: ఈ పతనం ఎందుకు?

  • 13 ఆగస్టు 2018
rupee Image copyright Getty Images

అమెరికన్ డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ రూపాయి విలువ సోమవారం చరిత్రలో అత్యంత తక్కువ స్థాయికి చేరింది. ఇప్పుడు డాలర్ విలువ రూ.69.93కి చేరింది.

టర్కీ కరెన్సీ లిరా సంక్షోభం రూపాయి పతనానికీ ఓ కారణమైంది.

టర్కీలో పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో లిరా అత్యంత కనిష్ఠ స్థాయికి చేరింది. కంపెనీలు బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడం.. అమెరికాతో సంబంధాలు క్షీణిస్తుండటం, టర్కీ ఉక్కు, అల్యూమినియంపై అమెరికా ధరలు పెంచడం వంటి కారణాలు లిరా పతనానికి దారి తీశాయి.

దీని ప్రభావంతో పెట్టుబడిదారులు రూపాయికన్నా డాలర్ వంటి సురక్షితమైన కరెన్సీవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ వంటి దేశాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి.

ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యెస్ బ్యాంక్‌కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త వివేక్ కుమార్ వెల్లడించారు.

Image copyright Getty Images

''ఇదే పరిస్థితి కొనసాగుతుందని అనుకోవడం లేదు. ఒకవేళ కొనసాగితే నియంత్రించడానికి ఆర్బీఐకి తగిన సాధనాలు ఉన్నాయి. తగిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది'' అని వివేక్ కుమార్ అన్నారు.

ఇప్పుడు లిరా సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో భారత కరెన్సీ కూడా కొన్నాళ్లు బలహీనంగానే ఉండొచ్చు.

ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి వాణిజ్యలోటు

భారత వాణిజ్య లోటు అయిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ జూన్‌లో ఇది 16.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. కొంత కాలంగా డాలర్ విలువ పెరుగుతుండటం వాణిజ్య లోటుకు ఒక ప్రధాన కారణం.

మరో ప్రధాన కారణం చమురు దిగుమతులు. భారత్‌కు అవసరమైన చమురులో 80 శాతం విదేశాల నుంచే వస్తోంది. చమురు దిగుమతిలో భారత్ ప్రపంచలోనే మూడో స్థానంలో ఉంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionడాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది?

అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ చమురు ధరలు పెంచింది. దీంతో భారత్‌లో చమురు ఖర్చు పెరిగిపోతోంది.

అంతా సరే.. మరి రూపాయి బలహీనమైతే నాకేంటి అనుకుంటున్నారా..

'' ఇప్పటి వరకూ వస్తున్న సంప్రదాయం ప్రకారం.. రూపాయి బలహీనమైతే దాని ప్రభావం ద్రవ్యోల్బణంపై స్వల్పంగా ఉంటుంది. దిగుమతుల ధరలు పెరుగుతాయి. అలాగే మన ఎగుమతులకూ విలువ పెరుగుతుంది.'' అని వివేక్ కుమార్ వివరించారు.

అయితే విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. ముఖ్యంగా అమెరికాకు వెళ్తున్న వారికి మాత్రం ఇది చేదు వార్త.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)