భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది
- మారీలెన్ వార్డ్
- బీబీసీ ట్రావెల్

ఫొటో సోర్స్, Getty Images
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, నోయిడా లాంటి భారత నగరాల పేర్లు వినగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగమే గుర్తుకు వస్తుంది. కంప్యూటింగ్- బైనరీ నంబర్లపై ఎంతగానో ఆధారపడి ఉంది. ఇందులో సున్నా(0) అత్యంత కీలకమైనది.
ఒక్క ఐటీయే కాదు, నేడు మనం వినియోగిస్తున్న అనేక టెక్నాలజీల ఆవిష్కరణ వెనక 'సున్నా' పాత్ర ఉంది. సున్నా గణితశాస్త్రం అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుకు కారణమైంది. భౌతికశాస్త్రం, ఇంజినీరింగ్ అంశాల్లో దీనిది ప్రధాన పాత్ర.
మరి ఇంత కీలకమైన సున్నా భారత్‌లోనే ఎందుకు ఆవిష్కృతమైంది? సున్నా, భారత సంస్కృతి మధ్య సంబంధం ఏమిటి?
ఫొటో సోర్స్, Getty Images
చతుర్భుజ్ ఆలయం గోడపై 270
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగర నడిబొడ్డున ఎనిమిదో శతాబ్దం నాటి అతిపెద్ద కోట ఉంది. గ్వాలియర్ ఫోర్ట్ భారత్‌లోని అతిపెద్ద కోటల్లో ఒకటి. ఈ కోటలో 'చతుర్భుజ్ ఆలయం' అనే చిన్న రాతి గుడి ఉంది. ఇది భారత్‌లోని అనేక ప్రాచీన ఆలయాల మాదిరే ఉంటుంది. కానీ ఈ ఆలయానికి తనదైన ప్రత్యేకత ఉంది. సున్నాను రాతలో తొలిసారిగా వాడింది ఇక్కడేనని గత ఏడాది వరకు పరిశోధకులు భావిస్తూ వచ్చారు.
ఆలయం గోడపై '270' అనే సంఖ్య స్పష్టంగా కనిపిస్తుంది. తొమ్మిదో శతాబ్దంలో దీనిని చెక్కారు. సున్నాను రాతలో వాడారనేందుకు ఇదే అత్యంత పురాతన ఉదాహరణ అని గత ఏడాది వరకు భావించారు.
అంతకన్నాదాదాపు 500 లేదా 600 ఏళ్ల ముందే సున్నాను భారతీయులు వాడారని వెల్లడైంది.
ఫొటో సోర్స్, Mariellen Ward
భారత్‌లోని అతిపెద్ద కోటల్లో గ్వాలియర్ కోట ఒకటి
ఆర్యభట్ట కంటే ముందే సున్నా వాడారు
బక్షాలీ రాతప్రతిలో సున్నా కనిపించింది. రాతప్రతి ఎప్పటిదో నిర్ణయించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్ష జరపగా, ఇది మూడో శతాబ్దం లేదా నాలుగో శతాబ్దం నాటిదని తేలింది. సున్నా వాడకానికి సంబంధించిన అత్యంత పురాతన ఉదాహరణ ఇదే.
ఆధునిక సంఖ్యా విధానాన్ని హిందూ ఖగోళశాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, బ్రహ్మగుప్తలే తొలుత వివరించారని, సున్నా వినియోగంపై ప్రస్తుతమున్న నిబంధనలను వారే అందించారని భావిస్తారు.
ఆర్యభట్ట 476వ సంవత్సరంలో జన్మించారు. బ్రహ్మగుప్త 598లో పుట్టారు.
ఫొటో సోర్స్, Mariellen Ward
బౌద్ధమతం, హిందూమతం బోధనల్లో శూన్యత అనే భావన ఉంది.
అలెగ్జాండర్, భారతీయుడి మధ్య ఆసక్తికర సంభాషణ
చతుర్భుజ్ ఆలయ సందర్శన సమయంలో నాకో ఆసక్తికర చర్చ గుర్తుకు వచ్చింది. భారత రచయిత దేవ్‌దత్ పట్నాయక్ టెడ్(TED) టాక్‌లో ఓ కథ చెప్పారు.
పూర్వం భారత్‌లో గ్రీకు రాజు అలెగ్జాండర్‌కు శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదనా లేని ఒక వివేకవంతుడైన వ్యక్తి కనిపించారు. రాతిగుట్టపై కూర్చుని ఉన్న ఆ వ్యక్తి యోగి అయ్యుండొచ్చు.
''ఏం చేస్తున్నావ్'' అని ఆయన్ను అలెగ్జాండర్ అడిగారు.
''నేను శూన్యతను అనుభవిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావ్'' అని ఆయన అలెగ్జాండర్‌ను అడిగారు.
''నేను ప్రపంచాన్ని జయిస్తున్నా'' అని అలెగ్జాండర్ సమాధానమిచ్చారు.
ఇద్దరూ నవ్వుకొన్నారు. ఇద్దరూ అవతలి వ్యక్తి అవివేకి అని, జీవితాన్ని వృథా చేసుకొంటున్నారని మనసులో అనుకొన్నారు.
దేవ్‌దత్ పట్నాయక్ చెప్పిన కథను బట్టి చూస్తే చతుర్భుజ్ ఆలయం గోడపైన, బక్షాలీ రాతప్రతిలోన సున్నా రాయడాని కంటే చాలా ముందే ఈ సంభాషణ జరిగింది.
అలెగ్జాండర్‌తో మాట్లాడిన భారతీయుడు చెప్పిన శూన్యత(nothingness)కు, సున్నా ఆవిష్కరణకు మధ్య సంబంధం ఉంది.
ఫొటో సోర్స్, Mariellen Ward
భారత తాత్వికత
తాత్వికత కోణంలో చూస్తే, ప్రపంచంలోని చాలా సంస్కృతులకు చెందిన ప్రజల మాదిరి కాకుండా, భారతీయులు 'శూన్యత' అనే భావనను పరిగణనలోకి తీసుకొంటారు. ధ్యానం చేయడాన్ని ప్రోత్సహించేందుకు, మెదడులోంచి అన్ని ఆలోచనలను తొలగించుకొనేలా ప్రోత్సహించేందుకు యోగా లాంటి ప్రక్రియలు ఇక్కడ రూపొందాయి.
బౌద్ధమతం, హిందూమతం బోధనల్లో శూన్యత అనే భావన ఉంది.
''బౌద్ధ మత బోధనల ప్రకారం- ఆలోచనల నుంచి పూర్తిగా బయటపడ్డ స్థితిని శూన్యత అంటారు. ఈ తాత్వికత లోంచే 'సున్నా' ఆవిష్కరణ జరిగి ఉండొచ్చు'' అని సున్నా ఆవిష్కరణపై పరిశోధనలు సాగించే 'జీరోఆరిజ్ఇండియా ఫౌండేషన్' కార్యదర్శి డాక్టర్ పీటర్ గోబెట్స్ ఒక వ్యాసంలో చెప్పారు.
ఈ ఫౌండేషన్ నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ పరిశోధనల ప్రాజెక్టును 'జీరో ప్రాజెక్ట్' అని కూడా అంటారు.
ఈ తాత్వికతే కాదు, మరో కోణమూ ఉంది. సంక్లిష్ట గణితశాస్త్ర అంశాలపై భారత్‌కు అనాదిగా మక్కువ ఎక్కువ.
ఫొటో సోర్స్, CSueb / Alamy Stock Photo
కంప్యూటింగ్ బైనరీ నంబర్లపై ఎంతగానో ఆధారపడి ఉంది.
ఇతర ప్రాంతాల్లో ఇది ఎందుకు సాధ్యం కాలేదు?
భారీ సంఖ్యలు, భారీ సంఖ్యల గణనపై భారత ప్రాచీన గణితశాస్త్రవేత్తలకు చాలా ఆసక్తి ఉండేది. ప్రాచీన గ్రీకులు దాదాపు 10 వేల వరకు మాత్రమే లెక్కగట్టగలిగేవారు. భారతీయులు ట్రిలియన్ల వరకు గణించేవారు.
భారతీయుల గణితశాస్త్రంలో భిన్న రకాల 'ఇన్ఫినిటీ' కూడా ఉండేది.
గణితశాస్త్ర చరిత్రలోనే అత్యంత కీలక ఆవిష్కరణల్లో సున్నా ఒకటని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ గణితశాస్త్ర ప్రొఫెసర్ మార్కస్ డు సావ్టోయ్ చెప్పారు. నేటి సున్నాకు మూడో శతాబ్దంలోనే బీజం పడిందని బక్షాలీ రాతప్రతి సూచిస్తోందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఆయన రాశారు.
''భారత ఉపఖండంలో శతాబ్దాలపాటు గణితశాస్త్రం ఎంత గొప్పగా ఉండేదో ఈ విషయాన్ని బట్టి తెలుస్తోంది'' అని మార్కస్ ప్రశంసించారు.
సున్నా భారత్‌లో ఎందుకు ఆవిష్కృతమైందో చెప్పుకున్నాం. మరి సున్నా ఇతర ప్రాంతాల్లో ఎందుకు ఆవిష్కృతం కాలేదు?
కొన్ని సంస్కృతుల్లో 'శూన్యత' భావనపై ప్రతికూల దృక్పథం ఉందని, ఇదొక కారణమై ఉండొచ్చనే వాదన ఉంది.
ఐరోపాలో క్రైస్తవం తొలినాళ్లలో సున్నా వాడకాన్ని మతపెద్దలు నిషేధించారు. ''దేవుడు సర్వాంతర్యామి, ప్రతీ దాంట్లోనూ దేవుడు ఉన్నాడు. సున్నా శూన్యాన్ని సూచిస్తుంది. కాబట్టి సున్నా అంటే సైతానే'' అని మతపెద్దలు భావించడమే దీనికి కారణం.
స్థూలంగా చెబితే- ధ్యానానికి మూలమైన భారత ఆధ్యాత్మిక చింతనకు, సున్నా ఆవిష్కరణకు మధ్య సంబంధం ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
యోగా: ప్రపంచానికి భారత్ ఇచ్చిన 7 అద్భుతమైన బహుమతులు ఏంటో తెలుసా?
భారత్ మానవ జీవన విధానాన్నే మార్చేయగలిగిన అద్భుతాలను ఆవిష్కరించింది. ప్రపంచానికి భారత్ అందించిన ఏడు అద్భుతాలు ఇవే...