‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’

  • 20 ఆగస్టు 2018
మాంచెస్టర్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భారతీయ మహిళలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక సంప్రదాయ దుస్తులు ధరించి మాంచెస్టర్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భారతీయ మహిళలు

బీబీసీ ఆసియా నెట్‌వర్క్ యూకేలో చేసిన ఒక కొత్త అధ్యయనంలో బ్రిటన్‌లోని ఆసియా ప్రజల (ఎక్కువగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల వారు) జీవన దృక్పథం బ్రిటన్ మెజారిటీ ప్రజలతో పోలిస్తే చాలా వరకూ సంప్రదాయబద్ధంగా ఉన్నట్టు వెల్లడైంది. ఇది నాకు ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు.

యూకేలో బ్రిటిష్-భారతీయుల ఇంట్లో పెరిగిన వ్యక్తిగా, పక్కనే చాలా ఉదారంగా ఉండే బ్రిటిష్ జనాభా కంటే ఆసియా ప్రజల వైఖరిలో చాలా వ్యత్యాసం ఉన్నట్టు నాకు తెలుసు. కానీ, ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయం వేరే ఉంది. అదేమంటే, భారతదేశంలోని వారి కంటే బ్రిటన్‌లో ఉన్న భారతీయుల జీవన విధానం మరింత సంప్రదాయబద్ధంగా ఉన్నట్టు నాకు అనిపించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లండన్‌లో వినాయక చవితి వేడుకలు

గత ఏడాదిగా నేను బీబీసీ ఢిల్లీ ఆఫీసులో పనిచేస్తున్నాను. నాలుగేళ్ల వయసులో నేను నా కుటుంబంతో కలిసి యూకే వెళ్లాక, ఎన్నో ఏళ్ల తర్వాత నేను మొదటి సారి ఇప్పుడు భారత్‌లో వచ్చి ఉంటున్నాను. అయితే, అన్నీ కాకపోయినా, నేను ఒక విషయం గమనించా. బ్రిటన్‌లోని భారతీయ కుటుంబాలు ఇప్పటికీ సంప్రదాయ విలువలనే పునాదులుగా భావిస్తున్నాయి. వాటిని సంరక్షిస్తున్నాయి. ఈ విలువలు కాలంతో పాటు బలపడిపోయాయి. వారు భారత్, తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు చేరుకున్నప్పటి నుంచి ఈరోజు వరకూ వాటిని ఆచరిస్తూనే ఉన్నారు. ఈలోపు భారత్ చాలా ముందుకు వెళ్లిపోయినట్లు నాకు కనిపించింది.

అవును, పిల్లలుగా, యువకులుగా నా తరం వారు భారత్‌ వెళ్లినపుడు, మేం వేసుకున్న జీన్స్‌, టీ-షర్ట్స్, స్పోర్ట్స్ షూజ్‌ లాంటి వాటివల్ల మేం చాలా పాశ్చాత్య శైలిలో, ఆధునికంగా కనిపించి ఉండచ్చు. కానీ నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఆధునికత భారతీయ యువతను మార్చేయడమే కాదు, వారి దుస్తులు, హెయిర్ స్టైల్స్, ప్రవర్తన వంటివి అప్పట్లో, ఆ వయసులో ఉన్న నా తరం కంటే మరింత సాహసోపేతంగా మారిపోయాయి.

Image copyright Getty Images

బీబీసీ సర్వేలో బ్రిటన్‌లో నివసిస్తున్న ఎన్నో ఆసియా ప్రజల కుటుంబాల వలస వైఖరి చాలా సంప్రదాయబద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. వారికి మతం చాలా ముఖ్యం. వివాహానికి ముందు సెక్స్, లైంగిక సంబంధాలపై కూడా వారి వైఖరి ఎక్కువ సంప్రదాయబద్ధంగానే ఉంటోంది. అవును, ఈ విలువలు భారత్‌లో ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మాత్రం నేను చాలా మార్పు గమనించాను.

తల్లిదండ్రులు తమతో లైంగికత, వివాహం, జీవిత భాగస్వాముల ఎంపిక లాంటి విషయాల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ ఉంటారని నా భారతీయ స్నేహితులు నాకు ఎన్నోసార్లు చెప్పారు. యూకేలో ఉన్న నా బ్రిటిష్ భారతీయ స్నేహితుల్లో ఎవరూ తమ ఇళ్లలో ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటామని చెప్పినట్టు నాకు గుర్తులేదు.

చిత్రం శీర్షిక ఆధునిక భారతదేశంలో నాకు ఇష్టమైన ఎన్నో కోణాలు ఉన్నాయి. వాటిలో చాలా వాటిని మరింత బాగా అర్థం చేసుకునేందుకు నేనింకా నేర్చుకుంటూనే ఉన్నా. కానీ, ఒకటి మాత్రం నేను ఎప్పటికీ మార్చను

ఒక గుజరాతీగా నేను లండన్‌లో ఒక శాకాహార కుటుంబంలో పెరిగాను. శాకాహారిగా ఉండడం అనే ఆలోచన చాలా సహజం, దాన్ని సమాజంలో చాలా మంది అంగీకరిస్తారు. అయితే, మాంసం తినడం కూడా సమాజంలో సర్వ సాధారణం.

భారత్‌లో ఉండడానికి వచ్చినపుడు, నేను శాకాహారిని అని చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. నావైపు నిరుత్సాహంగా కూడా చూశారు. ఎందుకో తెలీదు, కానీ ఆధునిక భారతదేశంలో శాకాహారిగా ఉంటూ నేను కాస్త వెనకబడిపోయానని కొందరు కచ్చితంగా అనుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఇంకా ఆసక్తి కలిగించిన విషయం ఒకటుంది. యూకే, పాశ్చాత్య దేశాల్లో శాకాహార ధోరణి బాగా పెరుగుతున్నప్పుడు, యువతరమే దానిని ముందుకు నడిపిస్తున్నప్పుడు, నేను చూసిన చాలా మంది భారతీయులు దానిని చాలా పాతధోరణిగా భావిస్తున్నారు.

చిన్నప్పుడు నేను చూసిన భారతదేశం ఎంత మారిపోయిందో నేను గత ఏడాదిగా చూస్తూనే ఉన్నా. ఆధునిక భారతదేశంలో నాకు ఇష్టమైన ఎన్నో కోణాలు ఉన్నాయి. వాటిలో చాలా వాటిని మరింత బాగా అర్థం చేసుకునేందుకు నేనింకా నేర్చుకుంటూనే ఉన్నా. కానీ, ఒకటి మాత్రం నేను ఎప్పటికీ మార్చను. అది, నా హెయిర్ స్టైల్!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు