గగన్‌యాన్‌: ‘30 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను’.. భారత తొలి అంతరిక్ష యాత్రికుడు రాకేశ్ శర్మ

రాకేశ్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ నుంచి 2022లో ఈ దేశ పుత్రుడో, పుత్రికో ఎవరో ఒకరు అంతరిక్షంలోకి అడుగు పెట్టడం ఖాయమని 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రకటించారు.

ఆయన అన్నమాట ప్రకారమే మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ శుక్రవారం (2018 డిసెంబర్ 28) ఆమోద ముద్ర వేసింది.

ఈ సందర్భంగా అంతరిక్ష యాత్రకు వెళ్లి వచ్చిన భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మతో బీబీసీ ప్రతినిధి రాజేష్ జోషి మాట్లాడారు.

ఫొటో సోర్స్, HARI ADIVAREKAR

ఎంతో హాయిగా ఉంది ఇప్పుడు

‘‘30 ఏళ్లకు పైగా నేను ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నాను. మిగతా భారతీయుల్లా నేను కూడా దీనిపై ఆసక్తిగా ఉన్నా. 2022లో భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి అడుగుపెడుతుందనే మాట వినగానే నాకు హాయిగా అనిపించింది’’ అని రాకేశ్ శర్మ చెప్పారు.

‘‘ఇక టెక్నాలజీ మనదే అని నేను గత 30 ఏళ్లుగా చెబుతూనే వస్తున్నా. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిని నేనే కావచ్చు. కానీ పూర్తిగా మన సాంకేతికత సాయంతో మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి వెళ్తే అది ఎంతో ప్రత్యేకం అవుతుంది.

అంతరిక్షంలోకి వెళ్లడం అనేది చాలా సవాళ్లతో కూడుకున్నది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అది రిస్కుతో కూడిన పని. అంతకు ముందు నాకు కూడా ఎలాంటి అనుభవం లేదు.

అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఇందిరాగాంధీ నన్ను ‘అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోంది?" అని అడిగారు. దానికి నేను "సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హమారా‘ అని చెప్పాను.

నేను ఒక ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌ని. అంతరిక్షంలోకి పంపించడానికి పైలట్ల నుంచి నన్ను ఎంపిక చేశారు. అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి.

మనిషి అంతరిక్షంలోకి వెళ్లడం అనేది ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. భారతదేశం మనిషిని అంతరిక్షంలోకి పంపించి ఏం సాధిస్తుంది?

దీని ద్వారా విజ్ఞానం దిశగా భారత్ మరింత ముందుకు వెళ్తుంది. మనం ప్రయత్నించడం ఆపేస్తే ఏం లభిస్తుంది?

ఇక్కడ అంతరిక్షంలోకి పంపించడం మాత్రమే కాదు. తర్వాత మనం ఆ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయవచ్చు. మనం ఇది కేవలం విజ్ఞానం కోసమే చేయడం లేదు. దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

మన నాగరికత భవిష్యత్తు అంతరిక్షంలోనే ఉందనే విషయం మర్చిపోకూడదు. భూమిపై వనరుల లోటు మరింత పెరిగిపోతోంది. మనం భవిష్యత్తులో వేరే ఎక్కడికైనా వెళ్లి నివసించాల్సి వస్తుంది. మన జనాభా అంతకంతకూ పెరుగుతోంది. అలాంటప్పుడు మనం వేరే ప్రాంతాలను వెతుక్కోవాలి.

రాకేష్ శర్మ ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

ఐఐటీకి వెళ్తుంటాను. ఐఐఎంలో తిరుగుతాను. నా ఉపన్యాసాలతో విద్యార్థుల్లో స్ఫూర్తి కలిగిస్తుంటాను. నా అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటాను.

ఇలా నేను ఎప్పటివరకు చేయగలనో చేస్తూనే ఉంటా. మీకు ఎప్పుడైనా ఒక పని ఇస్తే, అప్పుడు దృష్టంతా దానిమీదే పెట్టాలి. అంతరిక్షం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. మనం ప్రతిరోజూ కొత్త దానిని అన్వేషించాలి" అన్నారు రాకేష్ శర్మ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)