ప్రెస్ రివ్యూ: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘హిందూ న్యాయస్థానం’ స్థాపన

ఫొటో సోర్స్, Getty Images
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో.. హిందూ మహాసభ ఆధ్వర్యంలో హిందూ కోర్టును ఏర్పాటు చేశారని ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. దేశంలో ఇటీవల వివాదం రేపిన షరియత్ కోర్టులను మూసేయాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖలు రాసినా వారు స్పందించలేదని, అందుకే తాము ఈ కోర్టును ఏర్పాటు చేశామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ చెప్పారు.
షరియత్ న్యాయస్థానాలను మూసేయనప్పుడు తమ న్యాయస్థానాలపై కూడా ఆంక్షలు విధించడాన్ని అంగీకరించబోమన్నారు. ఈ కోర్టులలో హిందువులకు హాని కలిగించే మతపరమైన గొడవలు, ఆస్తి తగాదాలు, వివాహ సమస్యలు వంటి అంశాలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ తరహా సమస్యలను పరిష్కరించడం కోసం అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి కూడా వెనుకాడేది లేదన్నారు.
మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను తమ హీరోగా అభివర్ణించారు. ప్రస్తుతానికి మీరట్‌లో మాత్రమే దీనిని నెలకొల్పామని.. గాడ్సేను ఉరితీసిన రోజైన నవంబర్ 15న రాష్ట్రంలోని అలీగఢ్, హత్రాస్, మధుర, ఫిరోజాబాద్, షికోహాబాద్లలో కూడా హిందూ కోర్టులను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు.
హిందూ కోర్టులలో తొలి జడ్జీగా అలీగఢ్‌కు చెందిన పూజా శకున్ పాండేను నిమమించామని ఆయన చెప్పినట్లు ‘ప్రజాశక్తి’ కథనం తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
పడగ్గదిలో 'సోషల్' కాలక్షేపంలో హైదరాబాద్ టాప్!
హైదరాబాద్ నగరవాసులు ఏకాంతంగా ఉండే పడక గదులను సైబర్ 'చాట్ రూం'లుగా మార్చేస్తున్నారని.. దీంతో సిటీజనులు నిద్రలేమికి గురవుతున్నారని 'సెంచురీ మాట్రిసెస్' తాజా సర్వేలో తేలినట్లు సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. దేశవ్యాప్తంగా పది నగరాల్లోని ప్రజల నిద్ర అలవాట్లపై ఆ సంస్థ సర్వే చేసింది. ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్, ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు నిద్ర సమయంలోనూ బెడ్‌మీదకు చేరుతున్నాయని.. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలో అగ్రభాగాన నిలిచిందని సర్వేలో వెల్లడైంది.
హైదరాబాద్ నగరంలో సుమారు 70 శాతం మంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గడుపుతున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో సినిమాలు, తమకు నచ్చిన షోలను వీక్షిస్తున్నట్లు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు.
ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నంలో 66 శాతం మంది, మూడోస్థానంలోని బెంగళూరులో 65 శాతం మంది, నాలుగో స్థానంలోని ఇండోర్‌లో 58 శాతం మంది, ఐదో స్థానంలో ఉన్న పూణెలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు సర్వే చెప్తోంది. అహ్మదాబాద్, చెన్నై, కోచి, భువనేశ్వర్, రాయ్‌పూర్ నగరాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మొత్తంగా పది నగరాల్లో సగటున 53 శాతం మంది రాత్రి సమయాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోనే కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. సుమారు పది వేల మంది నుంచి 'ఆన్లైన్'లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారని 'సాక్షి' కథనం వివరించింది.
ఫొటో సోర్స్, social media in bedroom/Facebook
రాజకీయ పార్టీ పెట్టను: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం తనకు లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టంచేసినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. రైతుల సంక్షేమం కాంక్షించే పార్టీతోనే తన రాజకీయ పయనం సాగుతుందని ఆయన చెప్పినట్లు పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఎన్ఆర్ఐలు గ్రామంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే తాను తొమ్మిది జిల్లాల్లో పర్యటించానని, మిగతా నాలుగు జిల్లాల్లోనూ పర్యటించిన అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణ తెలియజేస్తానన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆదిత్య-ఎల్1 ద్వారా సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సన్నాహాలు
సూర్యుడి వాతావరణం గురించి పరిశోధనలకు తమ తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందని.. 'ఆదిత్య-ఎల్ 1' పేరుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ప్రాజెక్టును చేపట్టనుందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
సూర్యుడిపై విస్తృత అధ్యయనాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసా.. 'పార్కర్ సోలార్ ప్రోబ్'ను ఇటీవల ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా 'ఆదిత్య-ఎల్ 1' వివరాలను ఇస్రో తమ వెబ్సైట్లో పంచుకున్నట్లు ఆ కథనం పేర్కొంది.
సూర్యుడి వాతావరణంపై పరిశోధనలకుగాను 'ఆదిత్య-1' ప్రాజెక్టు చేపట్టాలని ఇస్రో తొలుత భావించింది. 'విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్'తో కూడిన 400 కేజీల పేలోడ్‌ను అందులో పంపాలని.. 800 కిలోమీటర్ల 'దిగువ భూ కక్ష్య'లో దాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే, సూర్యుడు-భూమి వ్యవస్థలోని 'లాగ్రాంగియన్ పాయింట్-1 (ఎల్ 1)' చుట్టూగల హాలో కక్ష్య (భూమి నుంచి 15 లక్షల మైళ్ల దూరం)లో ఉపగ్రహాన్ని ప్రవేశపెడితే మెరుగైన ప్రయోజనాలుంటాయని కొన్నాళ్ల తర్వాత ఇస్రో గుర్తించింది.
ఆ కక్ష్యలో ఉంటే.. గ్రహణాల ప్రభావానికి లోనుకాకుండా నిరంతరం సూర్యుణ్ని పరిశీలించవచ్చునని గ్రహించింది. దీంతో ప్రాజెక్టు పేరును 'ఆదిత్య-ఎల్ 1'గా మార్చింది. భానుడిపై మరింత సమాచారం సేకరించేందుకుగాను మరో ఆరు పేలోడ్లను కూడా ఉపగ్రహంతో పంపాలని నిర్ణయించింది.
'ఆదిత్య-1' ద్వారా పంపాలని భావించిన పేలోడ్.. సూర్యుడి వాతావరణం-'కరోనా'పై పరిశోధనలకు మాత్రమే దోహదపడుతుంది. 'ఆదిత్య-ఎల్ 1' ద్వారా పంపనున్న పేలోడ్లు కరోనాతోపాటు భానుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లపైనా కన్నేస్తాయని ‘ఈనాడు’ కథనం వివరించింది.
ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో కిక్కే.. కిక్కు: 6 నెలలు.. రూ. 13 వేల కోట్ల ఆదాయం
‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఆబ్కారీ ఆదాయం భారీగా పెరుగుతోందని ‘నవ తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ఆర్నెల్ల కాలంలో ఆబ్కారీ శాఖకు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రూ. 13,000 కోట్లు సమకూరిందని తెలిపింది.
వచ్చే నాలుగు మాసాల్లో ఇది సుమారు. రూ. 27 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మధ్య పెంచిన బీర్ల ధరలతో అదనంగా మరో రూ. 460 కోట్లు ఖజానాకు చేరుతోంది.
గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈఏడాది ఏకంగా 27వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలన్న యోచనలో సర్కారు ఉంది.
రాష్ట్రంలో 2,216 మద్యం షాపులు ఉండగా అందులో 2,000 షాపులకు పర్మిట్ రూంల అనుమతులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 75 షాపులకు పర్మిట్ రూంలు ఉండగా, 1,925 షాపులు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. పర్మిట్ రూంల అనుమతుల వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ. 112 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
నవతెలంగాణ కథనం ప్రకారం.. షాపుల్లో పెగ్గుల రూపంలో మద్యం విక్రయించరాదన్న మార్గదర్శకాలు సైతం ఉన్నాయి. కానీ మద్యం షాపుల యాజమాన్యాలు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు ముట్ట చెబుతున్నాయి. ప్రభుత్వం విధించిన టార్గెట్‌ను చేరుకోవాలంటే ఈ తరహాలో మద్యం అమ్మకాలు తప్పవని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు.
జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యంషాపులను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా సర్కారు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నూతన ఆబ్కారీ విధానం లోనూ జాతీయ రహదారులకు ఇరు పక్కలా మద్యం షాపులను అనుమతించడం గమనార్హం. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోకూడదన్న ఉద్దేశంతోనే సర్కారు పెగ్గు అమ్మకాల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయని నవతెలంగాణ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి.
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- ఈయన ప్రపంచంలోనే అత్యంత పేద మాజీ అధ్యక్షుడు
- అభిప్రాయం: 'ధర్మరాజుకూ మంచిచెడ్డలు ఉంటాయి'
- 14 ఏళ్లుగా వాజ్‌పేయి ఏకాంతవాసం - ఇంతకూ ఆయనకు ఏమైంది?
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)