#లబ్‌డబ్బు: ఇమ్రాన్ రాకతో భారత్-పాక్ వ్యాపార బంధం బలపడుతుందా?

వీడియో క్యాప్షన్,

#లబ్‌డబ్బు: ఇమ్రాన్ రాకతో భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా?

ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత ఇమ్రాన్ ఓ వినసొంపైన మాట అన్నారు... ‘భారత్‌తో మా వ్యాపార సంబంధాల్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తాం’ అని. అసలింతకూ.. బంధం మెరుగుపడాలంటే ఈ ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉన్న సవాళ్లేంటో చూద్దాం ఈ వారం 'లబ్‌డబ్బు'లో.

చారిత్రక, రాజకీయ కారణాల వల్ల భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు ఎప్పుడూ డిష్యూం డిష్యూం... తెల్సిందే కదా. దక్షిణాసియా స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం... SAFTA పై రెండు దేశాలూ 2006లో సంతకాలు చేశాయి. అప్పటి నుంచి ఇవి వ్యాపార భాగస్వాములుగా మారాయి.

కానీ భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే వ్యాపారం నిజానికి చాలా తక్కువ. భారత్ తన సరుకుల్ని ఎక్కువగా ఎక్కడికి ఎగుమతి చేస్తుందో తెలుసా..? పెద్దన్న యూఎస్‌కి. ఆ తర్వాత స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ది. ఇక దక్షిణాసియా దేశాల విషయానికొస్తే.. భారత ఎగుమతులు ఎక్కువగా వెళ్లేది అఫ్గానిస్తాన్‌కు. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, భూటాన్ ఉంటాయి. ఈ ఎగుమతుల జాబితాలో పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది.

2006-07 సంవత్సరంలో పాకిస్తాన్‌కు భారత్ చేసిన ఎగుమతుల విలువ 167 కోట్ల డాలర్లు. 2007-08లో ఇది 224 కోట్ల డాలర్లకు చేరింది. ఆ తర్వాత పెద్ద పెరుగుదలేమీ లేదు. పాకిస్తాన్ నుంచి భారత్‌కు దిగుమతుల విషయానికొస్తే 2015-16లో వాటి విలువ 44 కోట్ల డాలర్లుగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

రోడ్డు మార్గం ద్వారా వ్యాపారం ఎక్కడ జరుగుతుంది?

  • అమృత్‌సర్ సమీపంలోని వాఘా సరిహద్దు
  • భారత పాలనలో ఉన్న కశ్మీర్లోని సలామాబాద్ నుంచి ముజఫరాబాద్ వరకు
  • బారాముల్లా జిల్లాలోని ఉడీ
  • పూంఛ్‌లోని చకాదీ బాగ్ నుంచి రావల్‌కోట్

రాజకీయ రంగంలో కూడా ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవడానికి ముందే ఇమ్రాన్ ఖాన్‌కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పాకిస్తాన్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. మరోసారి బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని అంతర్జాతీయ ద్రవ్య నిధిని పాక్ కోరవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

భారత్‌తో వ్యాపార సంబంధాల్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నామని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. భారత్ ఒక అడుగు ముందుకేస్తే.. తాము రెండడుగులు వెయ్యడానికి సిద్ధం అని సిగ్నల్స్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని అడుగులు ముందుకేస్తారన్నది వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)