తెలంగాణ గ్రామంలో తేళ్ల పంచమి: తేళ్లతో ఆటలు.. భక్తితో పూజలు

  • 19 ఆగస్టు 2018
తేళ్ల పంచమి కందుకూరు

తేలును చూస్తేనే భయపడిపోతాం.. కుట్టిందంటే విలవిల్లాడిపోతాం. కానీ, తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామస్థులు మాత్రం తేళ్లతో ఆడుకుంటారు. వాటిని పూజిస్తారు.

నాగపంచమి రోజు దేశంలో చాలా చోట్ల పాముకు పాలు పోసి పూజలు చేయడం మనకు తెలిసిందే. కానీ ఈ గ్రామంలో అదే రోజు తేళ్ల పంచమి నిర్వహిస్తారు.

ఎందుకు పూజిస్తారంటే...

''ఈ ఊరి పక్కనే ఓ గుట్ట ఉంది. దాన్ని కొండమావుల గుట్టగా పిలుస్తారు. కొన్నాళ్ల కిందట ఈ గుట్టపై ఓ వ్యక్తి తవ్వకాలు జరుపుతుండగా పెద్ద తేలు బయటపడింది. దీంతో భయపడి 'నన్ను కుట్టకుండా ఉంటే నీకు గుడి కడతా' అని తేలును చూసి మొక్కుకున్నాడు. వెంటనే ఆ తేలు అదృశ్యమైంది'' అని గ్రామస్థులు చెబుతారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘తేళ్ల పంచమి రోజున తేలును పట్టుకున్నా అది కుట్టదు’

దీంతో అతను తేలుకు చిన్నగుడి కట్టి మొక్కు తీర్చుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్థులు అక్కడే కొండ మహేశ్వరి మాతగా పిలిచే తేలు విగ్రహాన్ని ప్రతిష్టించి పెద్ద ఆలయాన్ని నిర్మించారు.

ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక..

ఈ గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం జరిగితే కొండ మహేశ్వరి దేవతకు మొక్కిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు. శ్రావణమాసంలో వచ్చే మొదటి పంచమిరోజు ఇక్కడ తేళ్ల పంచమి నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీతోపాటు అనేక ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు.

‘ఆ ఒక్క రోజు తేలు కుట్టదు’

నాగపంచమి రోజున ఇక్కడ గుట్టపై ఏ రాయి తీసినా తేళ్లు కనిపిస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ రోజు తేళ్లను ముట్టుకున్నా కుట్టవని, ఏడాదిపాటు ఇంట్లోకి ఎలాంటి విషపురుగులూ కూడా రావని వీరు నమ్ముతుంటారు.

నాగపంచమి రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇక్కడ అందరూ భయం లేకుండా తేళ్లను పట్టుకుంటారు.

ఆచారం.. అనుభూతి

కొత్త దంపతులు, శుభకార్యాలకు వెళ్లేవారు తేళ్ల దేవతను దర్శించుకోవడం తమ ఊళ్లో ఆనవాయితీగా వస్తోందని గ్రామానికి చెందిన ఎగళప్ప బీబీసీకి తెలిపారు.

మూడేళ్లుగా ఇక్కడికి వస్తున్నానని, ఇప్పుడు తేళ్లంటే తనకు భయం పోయిందని కర్నాటకలోని గుర్మిటికల్ గ్రామం నుంచి వచ్చిన అమిత్‌ కుమార్ అన్నారు.

ఇప్పటివరకు ఎవరినీ తేలు కుట్టలేదని ఆలయ పూజారి నాగప్ప బీబీసీకి తెలిపారు. అనాదిగా ఇక్కడ తమ వంశీయులు పూజలు చేస్తున్నారని చెప్పారు.

హాని కలిగించకుంటే కుట్టవు

తేళ్లకు హాని కలిగించకుంటే అవి ఎవరినీ కుట్టవని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.

''కొండితో మాత్రమే తేళ్లు కాటు వేస్తాయి. కందుకూరులో అందరూ చేతితో కొండిని పట్టుకుని ఆడుకుంటారు. శరీరంపై అవి సమాంతరంగా పాకేలా జాగ్రత్తపడతారు. అందుకే అవి కుట్టవు'' అని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి, జంతు సంరక్షకులు డాక్టర్ సదాశివయ్య బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు