బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం

  • శ్యాంమోహన్‌
  • బీబీసీ కోసం

మెదక్‌ పాత బస్‌స్టాండ్‌ నుండి కిలోమీటరు దూరంలో గిద్దకట్ట సమీపంలో గుట్టల మధ్య ఉన్న చిక్కటి అడవిలాంటి స్మశాన వాటికలోకి మేం అడుగు పెట్టగానే నలుగురు మహిళలు బొంద తవ్వుతూ కనిపించారు.

చనిపోయిన వారి అంత్యక్రియలు జరపడమే వీరి జీవనోపాధి. ఇది బ్యాగరి మహిళలకు తరతరాలుగా వచ్చిన కుల ఆచారం.

‘‘ఆస్పత్రుల దగ్గర అనాథ శవాలను తీయాలన్నా మేమే పోవాలి. కుళ్లిన శవాల దగ్గరకు మమ్మల్నేపిలుస్తారు. మా బతుకంతా శవాల మధ్యనే. భరోసా లేని బతుకులు మావి’’ అని గోతిని తవ్వడం ఆపకుండానే చెప్పింది బ్యాగరి లచ్చిమి.

గిద్దకట్టలోని స్మశాన వాటిక సమీపంలో ఆరు కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో పన్నెండుమంది మహిళలకు అంత్యక్రియలు జరపడమే వృత్తి. వీరు తమను తాము బ్యాగరోళ్లుగా చెప్పుకుంటారు. ఇక్కడి ప్రజలు కూడా అలాగే పిలుస్తారు.

అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ వీరే పూర్తి చేస్తారు. ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు.. అవసరమైన సామగ్రినంతటినీ సిద్ధం చేసుకుంటారు. బంధువులు శవానికి తలకొరివి పెట్టి వెళ్లిపోతారు. మిగతా పనంతా ఈ ఆడవాళ్లే దగ్గరుండి చూసుకుంటారు.

ఇంత చేస్తున్నా వీళ్లకు నెలకు దక్కే ఆదాయం 2,000 రూపాయలు కూడా ఉండదు. ‘‘మృతుల అంత్య సంస్కారాలకు వచ్చిన వారు ఏమైనా ఇస్తే ఇవ్వవచ్చు లేదా ఇవ్వకుండా వెళ్లిపోవచ్చు. గ్యారంటీ లేదు’’ అని వీరంటారు. అయితే అంత్యక్రియల్లో తామూ పాలు పంచుకున్నామనే తృప్తి మిగులుతోందంటారు.

నిలువ నీడా లేదు...

కొండల మధ్య అడవిలా ఉన్న బొందల గడ్డ దిగువన రహదారి పక్కన పూరిళ్లలో ఈ బ్యాగరి కుటుంబాలు జీవించేవి. విద్యుత్‌, నీళ్లు, మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు లేవు. స్మశానంలో నుండి నీళ్లు తెచ్చుకొని వాడుకునే వారు.

రెండేళ్ల కిందట వీరుంటున్న పూరిళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. అప్పటి నుంచి వీరికి నిలువ నీడ లేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. సమీపంలో చిన్న గదుల్లో ఇరుకిరుగ్గా జీవిస్తున్నామని యాదమ్మ, శైలజ చెప్పారు.

ఇదే పనిలో 800 కుటుంబాలు

‘‘మెదక్‌ పట్టణంలో దాదాపు 48,000 జనాభా ఉంది. అన్ని కులాలు, వర్గాల వారికీ ఇదే స్మశానం. ఎవరు పోయినా మేమే అంతిమ సంస్కారాలు చేయాలి. మా అమ్మ, చిన్నమ్మ, తోబుట్టువులు ఇదే పనిచేసి బతుకుతున్నారు. అంత్యక్రియల సమయంలో బండలు మోయడం లాంటి బరువు పనులు మగవాళ్లు చేస్తారు.

మెదక్‌ జిల్లాలో 800 బ్యాగరి కుటుంబాలు ఇదే వృత్తిలో ఉన్నాయి. కానీ, మా సమస్యలను ఎవరూ పట్టించుకోరు. ఆస్పత్రుల్లో కుళ్లిన శవాలను తీయడానికి మేమే పోవాలి. కానీ, మాకు రోగాలు వచ్చి, అదే ఆస్పత్రికి పోతే మమ్మల్ని చాలా హీనంగా చూస్తారు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు బ్యాగరి యాదగిరి.

అతడు ఐటీఐ వరకూ చదివాడు. కానీ ఏ ఉద్యోగం రాక స్మశానంలో మహిళలకు పనుల్లో సాయంగా ఉన్నాడు.

అందివచ్చిన ఉద్యోగం దక్కలేదు

‘‘ఇంటర్మీడియట్‌ చదివాను. అప్పట్లో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ రెండు వేలు లంచం అడిగారు. అదిచ్చే స్తోమత లేక ఈ వృత్తిలోనే కొనసాగుతున్నాను. రాములును ప్రేమించి పెళ్లాడాను. మాకు ముగ్గురు పిల్లలు. కష్టమైనా నష్టమైనా ఇదేపని చేసుకొని బతుకుతున్నాను. నా ఇల్లు కాలిపోయినపుడు నా సర్టిఫికెట్లు, రేషన్‌ కార్డులు అందులో బూడిదయ్యాయి. ఇప్పటి వరకు మాకు నీడ లేదు. ఇదే స్మశానంలో వాచ్‌మన్‌ గదిలో తల దాచుకుంటున్నాం’’ అని బ్యాగరి సుజాత వివరించారు.

అమెకిపుడు అరవై అయిదేండ్లు. ఒకసారి బొంద తవ్వుతుంటే ప్రమాదం జరిగి కాలు విరిగింది. ఇప్పటికీ కుంటుతూనే పనులు చేస్తున్నారామె.

‘‘విజయశాంతి ఎంపీగా ఉన్నపుడు మాకు ఇంటిస్ధలాలు ఇస్తామన్నది. కానీ ఇప్పటికీ నెరవేరలేదు’’ అని చెప్పారు సుజాత కూతురు బ్యాగరి నాగరాణి. ఆమె ఏడో తరగతి వరకూ చదువుకున్నారు. ఇదే వృత్తిలో ఉన్నారు.

ఊరికి దూరంగా ఉండాలి...

‘‘మాకు రాత్రింబవళ్లు లేవు. ఎవరు ఎపుడు చనిపోయినా ఆ శవం దగ్గర ఉండాల్సి వస్తుంది. అందరూ మాతో సేవలు చేయించుకుంటారు తప్ప మా బాధలు ఎవరూ పట్టించుకోరు.’’

‘‘అందరిలా మాకు సమాజంలో సమాన గౌరవం ఉండదు. అంత్యక్రియలు చేసుకునే బ్యాగరోళ్లమని దూరంగా ఉంచుతారు. అశుభకార్యాలకు తప్ప శుభకార్యాలకు పిలవరు. కొందరు పిలిచినా అందరూ తిన్న తరువాత ఆఖరున మాకు భోజనం పెడతారు’’ అని చెప్పారు బ్యాగరి అన్నమ్మ.

వీరిలో అందరూ పదో తరగతి నుండి ఇంటర్‌ వరకు చదువుకున్నవారే. మరో పనిచేయడానికి కుల కట్టుబాటు అడ్డురావడంతో ఇదే పనిలో కొనసాగుతున్నారు.

సింగిల్‌ బెడ్‌రూం చాలు...

‘‘డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని సర్కారోళ్లు అంటున్నారు. నీడలేని మాకు సింగిల్‌ బెడ్‌రూం ఇచ్చినా చాలు. కల్యాణలక్ష్మి, కంటి వెలుగు వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మా కష్టాల పైనా దృష్టి పెట్టాలి’’ అని బ్యాగరి అశోకమ్మ అడుగుతున్నారు.

‘‘మనం ఒక చెత్తకుప్ప దగ్గర నిమిషం కూడా ఉండలేం. వీరు కుళ్లిన శవాల దగ్గర కొన్ని గంటల పాటు ఉండాల్సి వస్తోంది. అలాంటి వీరికి వంద రూపాయల ఆదాయం కూడా రావడంలేదు. విషాదంలో ఉన్న వారిని వీరు డిమాండ్‌ చేయలేరు. కొన్నిసార్లు ఉచితంగానే అంత్యక్రియలు చేస్తారు.

వీరి పనికి ప్రభుత్వం సముచితమైన ధరను నిర్ణయించాలి. ఆర్ధికంగా సాయపడాలి. కులాచారం వల్ల వీరు మరో పని చేయడానికి లేదు. వీరిలో చదువుకున్న యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం’’ అంటారు ఈ కుటుంబాలకు సుస్థిర జీవనోపాధి కోసం కృషి చేస్తున్న ‘వి అండ్‌ షి’ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి శ్రావ్యారెడ్డి దేశ్‌ముఖ్‌.

పిల్లల భవిష్యత్‌ ఎలా..?

తరతరాలుగా వీరి బతుకులిలా ఉన్పప్పటికీ తమ పిల్లల భవిష్యత్‌ అయినా బాగుండాలని ఆశిస్తున్నారు. కానీ, తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొంటూ బిడ్డలను చదివించలేకపోతున్నారు. కొందరు మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు.

ఈ కుటుంబాలకు చెందిన అనూష, ఉదయ్‌, చింటు, శైలజ చదువుతున్నారు. వీరిలో ఉదయ్‌కిరణ్‌ ఇంటర్‌ చదివి కారు డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్నాడు. బాబు అనే యువకుడు మెదక్‌ పురపాలక శాఖలో బిల్‌ కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

స్పందించిన అధికారి...

బ్యాగరీ కుటుంబాల సమస్యలను మెదక్‌ జిల్లా ఎస్‌సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లింది బీబీసీ.

‘‘బ్యాగరోళ్లను ప్రత్యేక కేటగిరీగా చూడలేం. వీరి గణాంకాలు కూడా లేవు. వీరిని ఎస్‌సీ మాల కులంగా పరిగణిస్తారు. ఎస్‌సీలకు వర్తించే అన్ని పథకాలు వీరికీ వర్తిస్తాయి. వీరు ఇన్ని సమస్యల్లో ఉన్నారని మీరు చెప్పే వరకు తెలీదు. బ్యాగరీ యువతీ యువకులు స్వయం సమృద్ధి సాధించే దిశగా మెరుగైన ఉపాధి అవకాశాలకు ఆర్థిక సాయం చేస్తాం. ప్రభుత్వ పథకాల్లో వారిని లబ్ధిదారులుగా చేరుస్తాం’’ అన్నారు ఈడీ దేవయ్య.

విశేషం ఏమంటే దేవయ్య కూడా బ్యాగరీ కులానికి చెందినవారే. అనేక కష్టాల మధ్య చదువుకొని ఈ స్ధాయికి వచ్చానని ఆయనే చెప్పారు.

తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల అభివృద్దిశాఖ అంచనా (జీఓ నెం. 2, 2015) ప్రకారం ఎస్‌సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. వాటిలో 11వ ఉపకులం బ్యాగరి. కొన్ని జిల్లాల్లో వీరిని ‘బ్యాగర’ అని కూడా అంటారు.

‘నా వర్గాలకు న్యాయం జరగనప్పుడు స్వతంత్రం వచ్చినా రాకున్నా ఒక్కటే’ అంటారు డాక్టర్ అంబేడ్కర్.

‘‘మేం 72వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. మాకు కనీసం రోజుకు 70 రూపాయల ఆదాయం కూడా లేదు’’ అని స్మశానంలో శవాల మధ్య జీవచ్ఛవాలుగా బతుకుతున్న బ్యాగరీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)