సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
Sunny Leone

కరణ్‌జీత్ కౌర్.. సన్నీ లియోని జీవితం ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్ ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందో తెలిసిందే. అసలింతకీ ఆ వివాదంపై సన్నీ లియోని ఏమంటున్నారు? బీబీసీ విమెన్ ఎఫైర్స్ ప్రతినిధి దివ్య ఆర్యతో సన్నీ లియోనీ తన మనసులో మాటను పంచుకున్నారు.

'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి మధ్య తేడా ఏమిటి?' అని ఆ వెబ్ సిరీస్‌లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సన్నీలియోని ఇచ్చిన సమాధానం.. ''ఒక సిమిలారిటీ ఉంది.. గట్స్''.

ఈ గట్స్.. (తెగువ) సన్నీ మాటలో మొహంలో నడకలో కనిపించాయి, ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ముంబైలోని ఒక హోటల్‌లో నేను కలిసినపుడు.

'కరణ్‌జీత్ కౌర్' కోసం ఆ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ సీన్ షూటింగ్ చాలా కష్టమైందని ఆమె చెప్పారు. ''అవి చాలా దారుణమైన ప్రశ్నలు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ ప్రశ్నలను అలానే ఉంచాం. ఎందుకంటే జనం మనసుల్లో ఆ ప్రశ్నలున్నాయి.. వాటికి జవాబు ఇవ్వాలని నేను భావించాను'' అని వివరించారు.

వీడియో క్యాప్షన్,

సన్నీ లియోనీ ఇంటర్వ్యూ:

భారతదేశంలో గత అయిదేళ్లుగా గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు సన్నీ లియోనీ. ఆమెను చూడాలని జనం కాంక్షిస్తున్నారు. ఆమె గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ, ఆమె గురించి వారు ఎప్పుడో అభిప్రాయాలు కూడా ఏర్పరచుకున్నారు.

ఆ అభిప్రాయాలు ఏర్పరుచుకోవటానికి కారణం తానేనని సన్నీ భావిస్తారు. ''నా గురించి, నేనేమనుకుంటున్నాను అనేదాని గురించి నేను నిజాయితీగా ఉన్నా. కానీ, జనం నన్ను నా గత జీవితం కోణం నుంచే చూస్తారు. ఆ అభిప్రాయాన్ని నేనే నిర్మించానన్న అవగాహన నాకుంది. అయితే, ప్రతి వ్యక్తి పరిణామం చెందుతూ ఉంటారు. ఆ పరిణామాన్ని జనం చూడగలరని నేను ఆశిస్తున్నా'' అని ఆమె చెప్పారు.

బాలీవుడ్‌లో 'ఐటం సాంగ్స్' చేసిన సన్నీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు కూడా పోషించారు. ఆమె ఇటీవల తన సొంత పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ 'ద లస్ట్' కూడా ప్రారంభించారు.

ఆ బ్రాండ్ పేరు అదే ఇమేజీని ముందుకు తీసుకెళుతోందా అని నేను అడిగాను. దానితో సన్నీ లియోనీ విభేదించారు. ఇంత చిన్న వయసులో ఒక పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ ప్రారంభించటం ఏ యువతికైనా ఒక కలవంటిదని.. ఆ కల నిజమైనపుడు తనకు ఈ పేరు నచ్చిందని ఆమె చెప్పారు.

''వేరే పెర్‌ఫ్యూమ్ తయారీ సంస్థలు కూడా ఇలాంటి పేర్లు పెడుతున్నాయి.. సెడక్షన్, ఫైర్ అండ్ ఐస్ వంటి పేర్లు'' అని ఆమె వాదించారు.

సన్నీ లియోని అసలు పేరు కరణ్‌జీత్‌కౌర్.

సిక్కుల సర్వోన్నత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ).. 'కరణ్ ‌జీత్ కౌర్' టైటిల్‌లో కౌర్ అనే పదాన్ని తొలగించాలనడం గురించి ప్రస్తావించినపుడు. ''నా వృత్తిపరమైన పేరు సన్నీ లియోని. నా అసలు పేరు కరణ్‌‌జీత్ కౌర్. ఆ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదు'' అని ఆమె చెప్పారు.

పోర్న్ ఇండస్ట్రీలో పనిచేయటం గురించి సన్నీ ఎన్నడూ సిగ్గుపడలేదు. ఇప్పుడు కూడా అది తను ఎంచుకున్న వృత్తి అని ఆమె బలంగా చెప్పారు.

భారతదేశంలో ప్రైవేటుగా పోర్న్ వీక్షణపై ఎలాంటి నియంత్రణా లేదు. కానీ, పోర్నోగ్రఫీ మెటీరియల్ ఏదైనా తయారు చేయటం, చలామణీ చేయటం చట్టవ్యతిరేకం.

ప్రపంచంలో అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ అంచనా ప్రకారం.. అమెరికా, బ్రిటన్, కెనడాల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా పోర్న్ వీక్షించే నాలుగో దేశం భారతదేశమే.

'భారతదేశంలో కూడా పోర్న్ పరిశ్రమ ఉండాలంటారా..?' అన్న ప్రశ్నకు.. ఆ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమని., అది తనకేమాత్రం సంబంధం లేని విషయమని సన్నీ బదులిచ్చారు.

నీలి చిత్రాలు చూడాలన్నా లేదా తీయాలన్నా సమాజం ఆమోదం అవసరం కదా.. అని అడిగితే, ''ఏదైనా ఒక రంగానికి సంబంధించి నా అభిప్రాయం.. ఇంకొకరి అభిప్రాయం కానవసరం లేదు. ఆ విషయంపై ఏదైనా ప్రజలు, ప్రభుత్వం నిర్ణయించుకుంటాయి. నాకు సంబంధించిన విషయం కానేకాదు. మా తల్లిదండ్రులు నన్ను చాలా స్వతంత్ర వ్యక్తిగా పెంచారు. కానీ నేను ఎంచుకున్న మార్గం వారికి నచ్చలేదు. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను'' అని ఆమె స్పందించారు.

ఒక బిడ్డను దత్తత తీసుకుని, అద్దె గర్భం ద్వారా మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సన్నీని, భవిష్యత్తులో వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నారని అడిగినపుడు... ఒక అమ్మగా వారు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ''వారికి నచ్చింది చేయాలి. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకుంటారు'' అని అన్నారు.

'మీ గత వృత్తి మీ పిల్లల చదువు, కెరీర్ పైన ప్రభావం చూపే అవకాశముందా?' అని అడిగితే.. ''వాళ్లిప్పుడు చాలా చిన్న పిల్లలు. వారి వయసు ఆరు నెలలు, రెండున్నర ఏళ్లు మాత్రమే. ఓ పదేళ్ల తరువాత మీరీ ప్రశ్న అడిగితే అప్పుడు ఏదైనా చెప్పగలను'' అని ఆమె స్పందించారు.

'ఒక తల్లిగా మీ వృత్తి గురించి వారికి చెప్పాలి కదా?' అనంటే, ''ఒక తల్లిగా నిజాయితీతో నేను ఏం చేయగలనో అంతా చేస్తాను'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)