మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- దివ్య ఆర్య
- బీబీసీ

ఫొటో సోర్స్, PRADIP LOKHANDE
తన ప్రియురాలికి క్షమాపణ చెబుతూ పుణెలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన హోర్డింగ్
గర్ల్ ఫ్రెండ్‌కు సారీ చెప్పడం ఎలా? అని గూగుల్‌ను అడిగితే, ఆ సెర్చింజెన్ నుంచి 3.2 కోట్ల సమాధానాలు వచ్చాయి.
మొదట్లో మీ క్షమాపణను స్పష్టంగా చెప్పండి. మీ ప్రవర్తనకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. ఆమెకు కాస్త సమయం ఇవ్వండి. లేకుంటే ఓ బహుమతి పంపండి. ఒక లేఖ రాయండి.. ఇలా చాలా సలహాలున్నాయి.
మరి మహారాష్ట్రలో 300 హోర్డింగ్‌లు పెట్టిన ఆ యువకుడు గూగుల్ నుంచి వచ్చిన ఈ ఆ సమాధానాలను చూశాడా!!
ఈ పాతికేళ్ల యువకుడు 'ఐ యాం సారీ షివ్డే' అని రాసిన హోర్డింగ్‌లను పుణే సమీపంలోని నగరంలో ఏర్పాటు చేశాడు.
తన గర్ల్ ఫ్రెండ్ మనసుకు సారీ సందేశాన్ని పంపడానికి అయామ్ సారీ అని రాసి.. బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్ పెట్టడం ప్రభావవంతమైన విధానం అని ఈ యువకుడు ఎందుకు భావించాడు?
తన గర్ల్ ఫ్రెండ్ పేరు లేదా ముద్దుపేరు - షివ్ డే - పేరిట ఇలా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే.. అది ఆమెకు మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతుందని అతనికి తెలియలేదా?
సెలబ్రిటీలు కూడా ఇలా చేశారు
మొత్తానికి ఈ క్షమాపణ ఒక ప్రచార ఎత్తుగడగా మారిపోయింది. అన్ని వార్తా పత్రికలూ ఈ వార్తను ప్రచురించాయి. దీంతో, ఈ హోర్డింగ్‌లు చూడనివారు, చివరకు ఈ నగరంలో లేని వారికి కూడా ఈ హోర్డింగ్ గురించి తెలిసింది.
ఇపుడు ఆ యువతి ఉంటున్న ప్రాంతానికి చెందిన పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు.
చివరకు ఆమె అతడిని క్షమిస్తుందో లేదో తెలియదు. కానీ అతను చేసిన చర్య మాత్రం సారీ చెప్పే విధానంపై తీవ్ర చర్చకు దారి తీసింది.
అయితే, ఇలాంటి పబ్లిక్ అపాలజీ అన్నది కొత్తేమీ కాదు. గతంలో కొందరు సెలబ్రిటీలు కూడా ఈ మార్గంలో ప్రయత్నించారు.
ప్రముఖ గాయని రిహనా బాయ్ ఫ్రెండ్ క్రిస్ బ్రౌన్ ఆమెకు పబ్లిక్‌గా క్షమాపణలు కోరారు.
క్రిస్ బ్రౌన్ 2009లో రిహానాను కొట్టడంతో చివరకు అది క్రిస్‌పై గృహహింస కేసుకు దారి తీసింది.
కొన్ని నెలల తర్వాత అతను క్షమాపణ కోరుతూ ఒక వీడియో విడుదల చేశాడు.
ఆ వీడియోలో తాను క్షమాపణలు కోరేందుకు ఇంతకు ముందూ ప్రయత్నించానని, కేసు విచారణలో ఉన్నందున తన న్యాయవాదులు వారించారని పేర్కొన్నారు.
రిహానాకు చాలా సార్లు సారీ చెప్పానని.. ఆమె అంగీకరించకపోవడంతో ఇలా పబ్లిక్‌గా చెబుతున్నానని ఆ వీడియోలో క్రిస్ పేర్కొన్నాడు.
ఈ విషయంలో తాను రోల్‌మాడల్‌గా ఉండాలనుకున్నానని. ఇలా మరెప్పుడూ చేయనని వివరించాడు.
మరి ఆ క్షమాపణ... రోల్ మాడల్‌గా ఉండేందుకా? లేక రిహానా మనసు గెలుచుకునేందుకా? అసలు ఉద్దేశం ఏంటి?
ఫొటో సోర్స్, PRADIP LOKHANDE
తన ప్రియురాలికి క్షమాపణ చెప్తూ పుణె సమీపంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన హోర్డింగ్
క్రిస్ క్షమాపణను ఇటు రిహానా, అటు చట్టం ఎవరూ అంగీకరించలేదు. దీంతో అతను గృహహింస కేసులో దోషిగా తేలి.. చివరకు జైలుకూ వెళ్లాడు.
ఈ నెలలో ఇంటర్నెట్లో షిగ్గీ డాన్స్ పేరిట సంచలనమైన షిగ్గీ కూడా తన గర్ల్ ఫ్రెండ్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఇతనికి యూట్యూబ్, ఇన్స్టాల్లో లక్షల మంది ఫాలోయర్లున్నారు.
తన గర్ల్ ఫ్రెండ్‌కు సారీ చెబుతూ.. షిగ్గీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను రోల్‌మాడల్ కావాలనుకుంటున్నానని.. ఇలా చేశానని చెప్పాడు.
ఇలాంటి క్షమాపణ షిగ్గీ గర్ల్ ఫ్రెండ్‌ను ఒప్పించే అవకాశం చాలా తక్కువ. అలాగే, అభిమానులు కూడా ఆయన పట్ల సానుకూలంగా స్పందించలేదు.
వాళ్ళు ఆయనను విమర్శిస్తూ ట్రోల్ చేశారు. ఈ క్షమాపణ 'అతని విషపూరిత పురుషత్వాన్ని, మహిళల విషయంలో అతని వైఖరిని బయటపెట్టిందని కొందరు విమర్శించారు.
సెలిబ్రిటీలు పబ్లిక్‌గా క్షమాపణలు కోరడంలో ఉద్దేశం.. సదరు వ్యక్తి నుంచి అంగీకారం కాదు. వారు ప్రజల్లో తమకు ఉన్న పేరును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పబ్లిక్‌గా క్షమాపణలు కోరతారు.
ఉద్దేశం సరైంది కాకుంటే చివరకు ప్రజలు కూడా క్షమించరు.
చివరకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరే ఇతర అంతర్జాతీయ అధ్యయనాలు కూడా చక్కని క్షమాపణకు ప్రమాణాలు ఏమీ నిర్ణయించలేదు.
ఫొటో సోర్స్, PRADIP LOKHANDE
ఒకరికి మీతో మాట్లాడటం ఇష్టం లేనపుడు మీరు బలవంతపెడితే.. బలవంతంగా వారిని ఒప్పిస్తే అది వెంటపడినట్టు ఉంటుంది.
చివరకు, ఆ క్షమాపణను అంగీకరించకుంటే తనను కనికరం లేని వారిగా భావిస్తారేమోనన్న ఒత్తిడి పెరుగుతుంది.
ఒకవేళ ఒత్తిడిలో క్షమాపణను అంగీకరించినా అది మనస్పూర్తిగా ఉండాలి కాని బలవంతంగా ఉండకూడదు.
ప్రేమ, క్షమాపణలను బహిరంగంగా కోరలేం. వీటిని కోరే విధానం ఆయా ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది.
తప్పును అంగీకరించే గుణం, అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని నిజాయతీగా తెలుసుకోవాలనుకున్నపుడు వారు నో చెప్పినా అంగీకరించాలి.
ఎందుకంటే 'సారీ' అనేది ఆ సమస్యకు చివరి పరిష్కారం కాదు. అది మొదటి అడుగు మాత్రమే. నిజాయతీగా అదే తప్పును మళ్లీ చేయకుండా ఉండేందుకే ప్రయత్నించడమే అసలైన క్షమాపణ అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- వీళ్లు పగలు లాయర్లు... రాత్రుళ్లు బార్లో ‘డ్రాగ్’ డాన్సర్లు
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- కేరళ వరద బాధితుల దాహం తీరుస్తున్న తెలుగువాళ్లు
- నాబార్డ్ రిపోర్ట్: వ్యవసాయ ఆదాయంలో దిగజారిన ఆంధ్రప్రదేశ్, జాతీయ సగటు కన్నా కాస్త మెరుగ్గా తెలంగాణ
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)