వైరల్ ఫొటో: ‘స్కూల్ టూర్‌ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే... అక్కడ నానమ్మ కనిపించింది’

దమయంతి, భక్తి

ఫొటో సోర్స్, KALPIT S BHACHECH

వంద మాటల్లో చెప్పలేని విషయాలను ఒక్క ఫొటోతో చెప్పొచ్చంటారు. అలాంటి ఒక ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోతో పాటు దానిపైన రాసిన వివరణను కూడా చాలామంది షేర్ చేస్తున్నారు.

‘ఒక స్కూల్ తన విద్యార్థులను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయికి తన నానమ్మ కనిపించింది. దాంతో ఇద్దరూ ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి తన నానమ్మ గురించి అడిగినప్పుడల్లా, ఆమె బంధువుల దగ్గర ఉంటోందని ఇంట్లో వాళ్లు చెప్పేవారు. ఎలాంటి సమాజాన్ని మనమంతా నిర్మిస్తున్నాం’ అనే వ్యాఖ్యలు ఈ ఫొటోపైన రాసున్నాయి.

చూస్తుండగానే ఈ ఫొటో వైరల్‌గా మారింది. సామాన్యులతో పాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ హర్భజన్ సింగ్‌ లాంటివాళ్లు కూడా ఈ పోస్టును తమ సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు.

ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా, జర్నలిస్టులు తమ కెరీర్‌లో తీసిన అత్యుత్తమ ఫొటోలను తమతో పంచుకోమని బీబీసీ గుజరాతీ కోరింది. దానికి బదులుగా కల్పిత్ ఈ ఫొటోను పంచుకున్నారు. దీన్ని బీబీసీ ప్రచురించడంతో ఈ ఫొటో మరోసారి వైరల్‌గా మారింది.

ఇంతకీ ఈ ఫొటో వెనకున్న కథ నిజమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఫొటోను తీసిన కల్పిత్ భచేచ్ అనే సీనియర్ పాత్రికేయుడు బీబీసీతో పంచుకున్నారు.

ఇంతకీ విషయమేంటి?

నిజానికి ఈ ఫొటో 11ఏళ్ల క్రితం... అంటే, 2007లో తీసిన ఫొటో. దీన్ని తీసిన కల్పిత్ ఈ ఫొటో వెనకున్న కథను కూడా పంచుకున్నారు.

‘పాత్రికేయ వృత్తిలో అనుకోకుండా రకరకాల చిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. ఈ ఫొటో కూడా అలాంటిదే. అది సెప్టెంబర్ 12, 2007. నా బర్త్‌డేకి ఒక రోజు ముందు. నేను ఉదయం ఇంట్లో నుంచి బయటకు రాగానే స్థానిక జీఎన్‌సీ స్కూల్ ప్రిన్సిపల్ రీటా పాండ్యా నాకు ఫోన్ చేశారు. తమ స్కూల్ విద్యార్థులు మణిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి వెళ్తున్నారని, ఆ కార్యక్రమాన్ని కవర్ చేయాలని నన్ను అడిగారు.

నేను వెళ్లేసరికి పిల్లలంతా ఒక వైపు, పెద్దవాళ్లు మరోవైపు ఉన్నారు. నేను వాళ్లందరినీ కలిసి కూర్చోమని, అప్పుడే ఫొటోలు బాగా వస్తాయని చెప్పా. పిల్లలంతా లేచి పెద్దవాళ్ల వైపు వెళ్లే సమయంలో ఒక అమ్మాయి కళ్లు నీటితో నిండిపోయాయి. మరోపక్క ఓ పెద్దావిడ కూడా ఏడుస్తూ కనిపించారు. ఆ అమ్మాయి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ పెద్దావిడను కౌగిలించుకోగానే అందరూ ఆశ్చర్యపోయారు.

ఫొటో క్యాప్షన్,

ప్రస్తుతం ఆ నానమ్మ, మనవరాలు ఇలా ఉన్నారు

నేను వెంటనే నా కెమెరాకు పని చెప్పా. భావోద్వేగంతో నిండిన ఆ దృశ్యాలను కెమెరాలో బంధించా. తరువాత ఆ చిన్నారి తన మనవరాలని ఆ పెద్దావిడ చెప్పారు. ఆ రోజు పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు’ అంటూ నాడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు కల్పిత్.

ఫొటో సోర్స్, KALPIT S BHACHECH

ఫొటో సోర్స్, KALPIT S BHACHECH

ఫొటో సోర్స్, KALPIT S BHACHECH

నానమ్మ గురించి అడిగితే బంధువుల దగ్గర ఉందని ఇంట్లో వాళ్లు చెప్పేవారని ఆ అమ్మాయి తనతో చెప్పినట్లు కల్పిత్ తెలిపారు. కానీ వృద్ధాశ్రమానికి వచ్చిన తరువాతే ఆ అమ్మాయికి తన నానమ్మ అక్కడే ఉన్నారనే విషయం తెలిసింది. ఆ ఫొటోను గుజరాత్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ‘దివ్య భాస్కర్’ నాడు మొదటి పేజీలో ప్రచురించింది.

ఫొటో క్యాప్షన్,

11 ఏళ్ల తరువాత మళ్లీ ఆ నానమ్మ, మనవరాలి ఫొటో తీస్తున్న ఫొటోగ్రాఫర్ కల్పిత్

ఇంతకీ వీళ్ల పేర్లేంటో తెలుసా? నానమ్మ పేరు దమయంతి, అమ్మాయి పేరు భక్తి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)