కేరళ వరదలు: విదేశీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు?

  • జుబైర్ అహ్మద్
  • బీబీసీ ప్రతినిధి
కేరళ సహాయ నిధి

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. రాష్ట్రాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రూ.600కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.

విదేశాలు కూడా సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రూ.700కోట్లను కేరళకు అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి విజయన్ స్వయంగా వెల్లడించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా విదేశీ సహాయాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించలేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై విమర్శలు మొదలవుతున్నాయి.

కేరళలో ప్రజలకు ఆహారం, దుస్తుల అవసరం చాలా ఉంది. భారీ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేయాలి. నీళ్లు, విద్యుత్, రవాణా వ్యవస్థలను పునరుద్ధరించాలి. వీటిన్నింటికీ చాలా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ సహాయాన్ని ఎందుకు స్వీకరించట్లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

కేరళ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారిని దీని గురించి బీబీసీ ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ గత 15-20ఏళ్లలో దేశంలో సంభవించిన విపత్తులను గమనిస్తే, చాలాసార్లు భారత ప్రభుత్వం విదేశీ సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదనే విషయం అర్థమవుతుంది.

2004 సునామీ సమయంలో మొదట భారత ప్రభుత్వం విదేశీ సాయాన్ని తిరస్కరించింది. కానీ తరువాత ఆ సాయం తీసుకోక తప్పలేదు. ఒక నివేదిక ప్రకారం సునామీ సమయంలో అందిన ఆర్థిక సాయంలో 70శాతం విదేశాల నుంచి వచ్చిందే.

ఆ తరువాతి ఏడాది కశ్మీర్‌లో సంభవించిన భూకంపం ధాటికి 1300మంది చనిపోయారు. దాదాపు 30వేల మంది తమ ఇళ్లను కోల్పోయారు. ఆ సమయంలో చాలా దేశాలు ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎలాంటి విదేశీ సాయాన్ని తీసుకోలేదు. మరోపక్క అదే సమయంలో పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్‌లో పరిస్థితులను పునరుద్ధరించేందుకు ఆ దేశం విదేశీ సాయాన్ని కోరింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కేరళకు యూఏఈ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించింది

ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ, ‘భారత ప్రభుత్వం తనను తాను ఒక డోనర్(దాత)లాగా చిత్రించుకోవడానికే చూస్తుంది’ అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ‘మా సమస్యలను మేం చూసుకోగలం’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి హామిద్ అన్సారీ వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక తెలిపింది.

భారత్ ఓ అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా కనిపించడానికి ఇష్టపడుతుందని, అందుకే విదేశీ సహాయాన్ని పొందడానికి ఆసక్తి చూపట్లేదని ఆ పత్రికా కథనం చెబుతోంది.

కానీ 2014లో ఒడిశా తుపాను తరువాత భారత ప్రభుత్వం అమెరికా నుంచి లక్ష డాలర్ల ఆర్థిక సహాయాన్ని స్వీకరించింది. దీన్ని బట్టి చూస్తే గత 15-20ఏళ్ల భారత్ విదేశాల మీద ఆధారపడటం కంటే స్వయం శక్తిపైన ఆధారపడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పడం సమంజసం. ప్రస్తుత కేరళ పరిస్థితే అందుకు ఉదాహరణ. అక్కడ విదేశీ సాయానికి బదులుగా భారత సైన్యాన్ని బరిలోకి దింపి పరిస్థితులను చక్కబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కేరళలో ఇప్పుడిప్పుడే వరద ఉద్ధృతి తగ్గుతోంది

ప్రకృతి విపత్తుల నిపుణుడు సంజయ్ శ్రీవాస్తవ్ ఇటీవలే కేరళ నుంచి తిరిగొచ్చారు. విదేశీ ఆర్థిక సాయాన్ని తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని ఆయన అన్నారు. కానీ కేరళలో విదేశాలకు చెందిన సంస్థల సిబ్బంది సేవలందిస్తున్నారనీ, ఐరాసకు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్ లాంటి సంస్థలకు చెందిన వలంటీర్లు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారని ఆయన చెప్పారు.

‘సాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. తరువాత వారికి ఆహారం, దుస్తులు సమకూరుస్తారు. ఆపైన వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటారు. ఆ తరువాతే నష్టానికి సంబంధించిన అంచనాలు మొదలవుతాయి. ఆపైన పునరావాస కార్యక్రమాలు చేపడతారు. దీనంతటికీ నెల రోజులైనా పడుతుంది’ అని సంజయ్ వివరించారు.

కేరళ ప్రభుత్వం 2వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కోరింది. కానీ జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేశాకే కేరళకు ఎంత సాయం అవసరమవుతుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవచ్చు. విదేశీ సాయం అవసరమో లేదో కూడా అప్పుడే తేల్చుకుంటుంది అని సంజయ్ అభిప్రాయపడ్డారు.

విదేశీ సాయంపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన

కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో విదేశీ సాయం గురించి వెలువడిన మీడియా కథనాలపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు.

‘‘కేరళలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన పలు దేశాలు, విదేశీ ప్రభుత్వాలను భారత ప్రభుత్వం అభినందిస్తోంది. అయితే, కేరళలో సహాయ, సహకారాల అవసరాలను (నిధులను) ప్రభుత్వం దేశీయంగా లభించే మద్దతు చర్యలతో తీర్చగలదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు, అంతర్జాతీయ సంస్థలు ప్రధాన మంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. వీటిని స్వాగతిస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)