తాజ్‌మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే

  • 22 ఆగస్టు 2018
తాజ్ మహల్

ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో తాజ్‌మహల్ ఒకటి.

మొఘల్ రాజైన షాజహాన్, తన భార్య ముంతాజ్ గుర్తుగా నిర్మించిన ఈ చారిత్రక సమాధిని చూడటానికి రోజూ వేల మంది వస్తూ ఉంటారు.

అయితే... ఈ 17వ శతాబ్దపు అందాల కట్టడం అందాలు ఇప్పుడు మసకబారుతున్నాయి.

దశాబ్దాల నిర్లక్ష్యం ఫలితంగా ఈ నిర్మాణం ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.

ఈ అంశంపై పర్యావరణ వేత్త బ్రిజ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ''మొట్టమొదటి విషయం ఏంటంటే, యమునా నదిలో నీటి ప్రవాహం నిరంతరాయంగా కొనసాగాలి. దయచేసి ఇక్కడ నీరు నిల్వ ఉండేలా చూడండి. ఈ కట్టడానికి నీటి నిల్వ చాలా అవసరం. ఎందుకంటే తాజ్‌మహల్ చాలా బరువైన కట్టడం. దాని గుమ్మటం బరువే దాదాపు 12,500 టన్నులు. అంత బరువును తట్టుకోవాలంటే, నదీతీరంలో నిరంతరం నీళ్లు కచ్చితంగా ఉండాలి. లేదంటే.. తాజ్‌మహల్ వంగిపోతుంది లేదా కుంగిపోతుంది.'' అని వివరించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: తరిగిపోతున్న తాజ్ మహల్ అందాలు

పొగ, దుమ్ము, ఇళ్లలోంచి వెలువడే వ్యర్థాలు ఈ కట్టడం పక్కనే ఉన్న యమునా నదిలో పేరుకు పోతున్నాయి.

నీటి కాలుష్యం వల్ల తాజ్‌మహల్ దాని అసలు రంగును కోల్పోతోంది. దాని పునాదులూ బలహీనమవుతున్నాయి.

ఈ సమస్య ఏ స్థాయికి చేరిందంటే, దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ పురావస్తు శాఖకూ నోటీసులు జారీ చేసింది.

తాజ్‌మహల్ చుట్టూ పేరుకుపోతున్న కాలుష్య స్థాయి ఆందోళనకరంగా ఉందని, తక్షణం ఈ విషయంలో తగిన చర్య తీసుకోవాలని ఆదేశించింది. వీలైతే తాజ్‌మహల్‌ను పరిరక్షించండి, లేదంటే దానిని కూల్చేయండి అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Image copyright Getty Images

ఆగ్రా డివిజినల్ కమిషనర్ కె.మోహన్‌రావు మాట్లాడుతూ.. "కోర్టు ఉత్తర్వులను అనుసరించి మేం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అక్కడకు వెళ్లి, ఘన వ్యర్థాలను ఎవరూ తగులబెట్టకుండా, పొగ, దుమ్ము నేరుగా తాజ్‌మహల్‌పై ప్రతికూల ప్రభావం చూపకుండా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ బృందాలు నగరాన్ని కాలుష్యరహితంగా చేసేందుకు కూడా పని చేస్తాయి. ఆగ్రాను ఎలాగూ స్మార్ట్ సిటీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా చేయాల్సిందే..'' అని వివరించారు.

అయితే, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆచరణయోగ్యం కావని నిపుణులు అంటున్నారు.

'ఒక వారసత్వ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎలా మార్చగల్గుతారు? ఇది హాస్యాస్పదం. ఆగ్రా వారసత్వాన్ని కాపాడండి, చాలు. మిగతావన్నీ వాటికవే సర్దుకుంటాయి.' అని ఖండేల్వాల్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నిర్మాణంలో పగుళ్లు

అయితే ఆగ్రా, తాజ్‌మహల్‌పై ఆధారపడిన వారి అభిప్రాయం వేరుగా ఉంది. 400 ఏళ్ల క్రితం ఈ అద్భుత కట్టడాన్ని ఏ సాంకేతికతతో నిర్మించారో అవే పద్ధతులతో దానిని పరిరక్షించాలని వారు కోరుతున్నారు.

''తాజ్ వైభవం, ఘన చరిత్ర ఇప్పుడు ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిపుణులు కూడా ఈ ప్రేమ చిహ్నాన్ని కాపాడే ప్రయత్నంలో కాలంతో పోరాడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పరిరక్షణా చర్యలు చేపట్టడం లేదు. ఇలాగైతే తాజ్ మహల్ కేవలం పాఠ్యపుస్తకాల్లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది.'' అని స్థానికులు అంటున్నారు.

ఈ అద్భుత కట్టడం కేవలం ఓ స్మృతి శకలంగా మిగిలిపోగూడదనీ, దీని మనుగడను కాపాడాలనీ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)