ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు

  • గుర్‌ప్రీత్ కౌర్
  • బీబీసీ ప్రతినిధి
దీక్షా డాగర్

ఫొటో సోర్స్, diksha dagar

ఓ పెన్నూ పేపరూ తీసుకుని, ఏదోరాసి ఆ పేపరును దీక్ష చేతిలో పెట్టారు ఆమె తండ్రి. చేతిలో గోల్ఫ్ స్టిక్‌తో ఉన్న దీక్ష... ఆ పేపరుపై రాసిన సందేశాన్ని చదివింది. వెంటనే తన దృష్టి గోల్ఫ్ బాల్‌పై నిలిపింది. లక్ష్యాన్ని ఛేదించింది.

ఖటక్... దీక్ష కొట్టిన షాట్‌తో వచ్చిన శబ్దం. వెంటనే మైదానం మొత్తం ప్రేక్షకుల చప్పట్లతో మారుమోగిపోయింది. కానీ దీక్షకు ఆ షాట్ శబ్దమూ వినపడదు, ప్రేక్షకుల చప్పట్లూ వినపడవు.

ఎందుకంటే ఆమెకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. చెవిలో మెషిన్ పెట్టుకుంటే చాలా వరకూ శబ్దాలు వినగలుగుతుంది. కానీ ఈ పోటీ జరిగిన రోజు ఆ మెషిన్ పనిచేయలేదు.

వైకల్యం.. దీక్ష విజయాలకు ఏమాత్రం అడ్డంకి కాలేదు. ఎలాగైనా గెలవాలనే తపనతో ఆమె ఈనెల 18 నుంచి జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంటోంది. ఆగస్ట్ 23 నుంచి 26 మధ్య జరిగే మహిళల సింగిల్స్ గోల్ఫ్ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించాలని ఉవ్విళ్లూరుతోంది.

జపాన్, దక్షిణ కొరియా, చైనీస్ థాయ్‌పీ, థాయ్‌లాండ్‌ల నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురుకానుంది. దిల్లీకి చెందిన 17 ఏళ్ల దీక్ష డాగర్‌పైనే గోల్ఫ్‌లో భారత ఆశలన్నీ.

ఇంట్లోనే గోల్ఫ్ ఆడుతున్న దీక్షా డాగర్

ఫొటో సోర్స్, diksha dagar

ఫొటో క్యాప్షన్,

ఇంట్లోనే గోల్ఫ్ ఆడుతున్న దీక్షా డాగర్

ఆరేళ్ల వయసులోనే గోల్ఫ్ స్టిక్ పట్టింది

దీక్ష అన్నయ్య యోగేష్‌కు కూడా వినికిడి లోపం ఉంది. దీంతో దీక్ష పుట్టేముందు తల్లిదండ్రులకు మనసులో ఆందోళనగానే ఉంది. దేవుళ్లందరికీ మొక్కారు. కానీ దీక్షకు మూడేళ్ల వయసు వచ్చేసరికి ఆమెకు కూడా వినికిడి లోపం ఉందనే విషయం వైద్య పరీక్షల్లో తెలిసింది.

"మేం చాలా కుంగిపోయాం. కానీ ఈ సమస్య కారణంగా ఆమె భవిష్యత్‌ను ఇబ్బందుల్లో పడనివ్వకూడదని నేను, నా భార్య గట్టిగా నిర్ణయించుకున్నాం" అని తండ్రి కల్నల్ నరేంద్ర డాగర్ తెలిపారు. ఆయన కూడా గోల్ఫ్ ఆటగాడే. సైన్యంలో పనిచేసే సమయంలో గోల్ఫ్ క్రీడలోని మెళకువలు తెలుసుకున్నారు. తండ్రి ఆడుతుండగా చూసి దీక్ష కూడా ఆరేళ్ల వయసులోనే గోల్ఫ్ స్టిక్ పట్టింది. తండ్రి ఆమెకు శిక్షకుడిగా మారారు.

కొద్ది రోజుల తర్వాత దీక్షకు ఆపరేషన్ చేసి కోచ్లియర్ ఇంప్లాంట్ అమర్చారు. అప్పటినుంచి మెషిన్ సాయంతో దాదాపు 70 శాతం వరకూ శబ్దాలను వినగలుగుతోంది.

దీక్ష.. స్పీచ్ థెరపీ సాయంతో మాటలు నేర్చుకుంది.

"మెషిన్ సాయంతో వినగలుగుతోంది. కానీ దానికీ కొన్ని ఇబ్బందులున్నాయి. ఎదుటివారు మాట్లాడే సమయంలో వారివైపు చూడకపోతే... ఆ మాటలు సరిగా వినపడవు" అని దీక్ష తండ్రి చెబుతున్నారు.

దీక్షా డాగర్

ఫొటో సోర్స్, diksha dagar

దేశవిదేశాల్లో విజయాలు

దీక్ష తన తొలి మ్యాచ్ పన్నెండేళ్ల వయసులో గోల్ఫ్ యూనియన్ నేషనల్ సబ్ జూనియర్ సర్క్యూట్‌లో ఆడింది. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు.

అండర్-15, అండర్-18 స్థాయుల్లో వర్థమాన గోల్ఫర్‌గా ఖ్యాతిని ఆర్జించింది. 2015 నుంచి మహిళల టాప్ గోల్ఫర్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

దేశీయ టోర్నమెంట్లతో పాటు అంతర్జాతీయ టోర్నీల్లో కూడా దీక్ష సత్తా చాటింది. సింగపూర్‌లో జరిగిన లేడీస్ అమెచ్యూర్ ఓపెన్ గోల్ఫ్ పోటీల ద్వారా విదేశాల్లో తొలిసారిగా తన ప్రతిభను ప్రదర్శించింది. ఆ టోర్నీలో భారత మహిళల గోల్ఫ్ బృందం విజేతగా నిలవగా సింగిల్స్‌లో దీక్ష మొదటి స్థానంలో నిలిచింది. విదేశాల్లో భారత మహిళలు గోల్ఫ్ టోర్నీల్లో గెలవడం ఇదే తొలిసారి.

దీక్షా డాగర్

ఫొటో సోర్స్, diksha dagar

సవాళ్లతోనే ఉత్సాహం

టర్కీలో జరిగిన డెఫ్ ఒలింపిక్స్‌లో వెండి పతకాన్ని సాధించింది. ఒకట్రెండు టోర్నీల్లో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో దీక్ష సాధారణ వ్యక్తులతోనే పోటీపడింది.

దీక్ష.. యూఎస్ ప్రొఫెషనల్ ఓపెన్ గోల్ఫర్స్ ఫైనల్లో ప్లే ఆఫ్‌కు చేరింది. ఈ సంవత్సరం జరిగిన మలేసియన్ విమెన్స్ ఓపెన్ సింగిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన దీక్ష... బృందంలో తొలిస్థానంలో నిలిచింది.

ఆసియన్ గేమ్స్ పూర్తైన తర్వాత దీక్ష ఐర్లాండ్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆడనుంది.

టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి క్రీడలపై కూడా దీక్షకు ఆసక్తి ఎక్కువ. కానీ గోల్ఫ్‌ అంటే ఉన్న అమితమైన మక్కువ కారణంగా దాన్నే తన కెరీర్‌గా మల్చుకుంది.

"గోల్ఫ్ మనసుతో ఆడే ఆట. శాంతియుత క్రీడ. అందుకే నాకు చాలా ఇష్టం. పచ్చని గోల్ఫ్ మైదానాలంటే నాకెంతో ఇష్టం. ఆటలో సవాళ్లెదురైతే నాకు మరింత ఉత్సాహం వస్తుంది" అంటూ గోల్ఫ్‌పై తన ఆసక్తిని వివరించింది దీక్ష.

దీక్షా డాగర్‌తో ఆమె అన్న యోగేశ్

ఫొటో సోర్స్, diksha dagar

ఫొటో క్యాప్షన్,

దీక్షా డాగర్‌తో ఆమె అన్న యోగేశ్

ఎన్నో సవాళ్లు...

దీక్ష ఓ వర్థమాన క్రీడాకారిణి. అందువల్ల ప్రొఫెషనల్ ప్లేయర్ల మాదిరిగా ఆమెకు పారితోషికం ఉండదు. దీంతో ఆమెకు భారత గోల్ఫ్ యూనియన్, సైన్యం తోడ్పాటునందించింది.

కానీ ఇది ఏ మూలకూ సరిపోదు. ఎందుకంటే గోల్ఫ్ చాలా ఖరీదైన క్రీడ. ఒక్క దేశీయ టోర్నీకే దాదాపు 35 నుంచి 40 వేల రూపాయలు ఖర్చవుతాయి. అలాంటి ఈవెంట్లు సంవత్సరానికి 20 పైనే జరుగుతాయి.

దీక్ష ఎదుర్కొనే మరో ఇబ్బంది... ఈమె ఎడమచేతివాటం క్రీడాకారిణి. గోల్ఫ్ ఆటకు సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లు వాడే ఉపకరణాలన్నీ చాలా ఖరీదైనవి. ఇవి అంత సులభంగా దొరకవు కూడా. ఒక్కో కిట్ సుమారు రూ.3 లక్షల వరకూ ఉంటుంది.

వినికిడి లోపం అధిగమించేందుకు దీక్ష ఓ మంచి హియరింగ్ మెషిన్ వాడుతోంది. కానీ ఒక్కోసారి ఆట మధ్యలో సడెన్‌గా బ్యాటరీ అయిపోతుంది. దీంతో దీక్షకు ఏమీ వినబడదు.

తండ్రి కల్నల్ నరేంద్ర డాగర్‌తో

ఫొటో సోర్స్, diksha dagar

ఫొటో క్యాప్షన్,

తండ్రి కల్నల్ నరేంద్ర డాగర్‌తో

"ఓసారి నేను దీక్షపై తీవ్రంగా కోప్పడ్డాను. నేను ఎన్ని తిట్లు తిట్టినా ఆమె నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఆ తర్వాత తెలిసింది... ఆమె హియరింగ్ ఎయిడ్‌లో బ్యాటరీ అయిపోయిందని. అందుకే నేను ఎంత తిట్టినా తనకు ఏమీ వినబడలేదు. కాసేపటికి నాకు కోపం తగ్గింది. దీక్షకు అవేమీ వినపడకపోవడమే మంచిదనిపించింది. కానీ కొన్నిసార్లు నేను ఏదైనా విషయం మళ్లీ మళ్లీ చెబితే... ఎన్నిసార్లు చెబుతావు నాన్నా, నాకు వినపడింది... అంటుంది దీక్ష." అంటూ నవ్వుతూ తండ్రి కల్నల్ డాగర్ గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

దీక్ష పన్నెండో తరగతి చదువుతోంది. కానీ సంవత్సరం పొడవునా జరిగే టోర్నీల కారణంగా ఆమె చదువు సరిగా కొనసాగడంలేదు. అందువల్లే ఆమె తన చదువు పూర్తైన తర్వాత ఓ ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా స్థిరపడాలనుకుంటోంది. పద్దెనిమిదేళ్లు నిండితే ఆమెకు ఇది సాధ్యమవుతుంది.

ఆసియా క్రీడలతోపాటు వచ్చే ఒలింపిక్స్‌లో కూడా దీక్ష స్వర్ణ పతకాన్ని సాధిస్తుందని కల్నల్ డాగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అభిమానులు దీక్ష బలాలను గురించి చర్చించాలి, బలహీనతలు కాదు అని ఆయన సూచిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏదైనా ఆశించేముందు వారిని దానికి తగిన నైపుణ్యాలను సాధించుకునేందుకు సిద్ధం చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)