ప్రెస్‌రివ్యూ: భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు ఎంపికైన తెలుగు క్రికెటర్ హనుమ విహారి

హనుమ విహారీ

ఫొటో సోర్స్, facebook/hanumavihari

ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకుంటున్న ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారికి భారత టెస్టు జట్టులో చోటు దక్కిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇంగ్లండ్‌తో జరిగే 4,5 టెస్టుల కోసం సెలెక్టరు టీమిండియాలో రెండు మార్పులు చేశారు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ మురళీ విజయ్‌తో పాటు మూడో స్పిన్నర్‌ అవసరం లేదని భావించడంతో కుల్దీప్‌కు చోటు గల్లంతయింది.

వీరి స్థానంలో తెలుగు తేజం హనుమ విహారి(24), ఓపెనర్‌ పృథ్వీ షాలకు చోటు కల్పించారు.

ఇంగ్లండ్‌ పరిస్థితులకు తగ్గట్టు జట్టులో మరో బ్యాట్స్‌మన్‌ అదనంగా ఉండడం జట్టుకు లాభిస్తుందనే అభిప్రాయంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది.

ఒకవేళ అశ్విన్‌ గాయం తిరగబెడితే ఆఫ్‌ స్పిన్నర్‌గానూ రాణించే విహారి జట్టుకు ఉపయోగపడతాడనే ఆలోచన కెప్టెన్‌ కోహ్లీకున్నట్టు సమాచారం.

రంజీ ట్రోఫీతో పాటు ఇటీవల భారత్‌ 'ఎ' జట్టు తరఫున విహారి పరుగుల వరద పారించాడు. దీంతో వెంటనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

63 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 5,142 రన్స్‌ చేసిన విహారి ప్రస్తుత ఆటగాళ్లలో ప్రపంచ రికార్డు సగటు (59.79)తో ఉన్నాడు. ఇందులో 15 శతకాలున్నాయి.

చక్కటి డిఫెన్స్‌తో ఆడే విహారి ఆటతీరు టెస్టు ఫార్మాట్‌కు అతికినట్టు సరిపోతుందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

మీ కులమేమిటి? మతమేమిటి?

పెట్రోలు బంకులో పనిచేసే ఉద్యోగి కులమేమిటి? అతను ఏ మతస్తుడు? ఏ నియోజకవర్గానికి చెందినవాడు? తదితర వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోందని ఈనాడు పేర్కొంది.

ఇలాంటి వ్యక్తిగత సమాచారం ఎందుకు పంపించాలంటూ పెట్రోలియం డీలర్లు నిరాకరిస్తున్నారు.

వివరాలు పంపాలంటూ ప్రభుత్వరంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌లు 6.6.2018నే 59వేల మంది డీలర్లకు లేఖలు రాశాయి.

బంకుల్లో దాదాపు పది లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టిన 'తొలి చదువుల గుర్తింపు' (ఆర్‌పీఎల్‌) విధానం కింద ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్టు ఆ లేఖలో తెలిపాయి.

దాని ఆధారంగా ధ్రువపత్రం ఇస్తామని, అది తదుపరి చదువులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా ఉద్యోగి ఆధార్‌ సంఖ్య, కులం, మతం, నియోజకవర్గం వివరాలు అడగడమేమిటని డీలర్లు ప్రశ్నిస్తున్నారు.

సమాచారం పంపనందున ఇంధనాల సరఫరా నిలిపివేస్తామని పంజాబ్‌లోని ఇండియన్‌ ఆయిల్‌ అమ్మకాల అధికారి ఒకరు డీలర్లకు సందేశం పంపారు.

దీనిపై పంజాబ్‌లోని డీలర్లు ఆందోళనకు దిగి లీగల్‌ నోటీసు పంపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015-18 మధ్య 29 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, అందులో 6లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.

పది లక్షల మంది పెట్రోలియం బంకుల ఉద్యోగులు కూడా లబ్ధి పొందారని చెప్పడానికే అన్ని వివరాలు అడిగినట్టు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయిని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Telangana CMO

'ముందస్తు'పై మీదే ఫైనల్‌!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అప్పగిస్తూ మంత్రులంతా నిర్ణయించారని సాక్షి వెల్లడించింది.

శాసనసభను రద్దు చేయాలా, వద్దా... చేయాల్సి వస్తే ఎప్పుడు... షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్దామా అనే అంశాలపై ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సంపూర్ణ అధికారాలను కేసీఆర్‌కే అప్పగిస్తూ మంత్రులంతా ఆమోదించినట్లుగా సమాచారం.

దీనిపై శుక్రవారం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సుదీర్ఘంగా, ఏడు గంటలపాటు ప్రగతి భవన్‌లో బుధవారం సమావేశమయ్యారు.

పూర్తిగా ఎన్నికలను కేంద్రంగానే చేసుకుని ఈ సమావేశం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి 11 గంటలదాకా సాగింది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయస్థాయి పరిణామాలపై అంచనా, ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశముంది, నాలుగున్నరేళ్లు పూర్తవుతున్న ఈ సమయంలో జిల్లాలవారీగా జరిగిన అభివృద్ధి, టీఆర్‌ఎస్‌ పరిస్థితి, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS

విచ్చలవిడిగా 'గ్లైఫోసేట్' అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్‌ కారకంగా పేర్కొంటున్న గ్లైఫోసేట్‌ కలుపు మందు అమ్మకాలపై నియంత్రణ విధించినా విక్రయాలు యథేచ్ఛగానే సాగుతున్నాయిని ఈనాడు వెల్లడించింది.

సాగుకు అనుమతి లేని బీటీ 3 పత్తిపై ఈ మందును రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. పొడి, ద్రవ రూపంలో విక్రయాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదు.

ఈ మందు అమ్మకూడదనే ఆదేశాలున్నా.. నిల్వల లెక్కలే తీయలేదు. గ్లైఫోసేట్‌ పర్యావరణ సమస్యతో పాటు ప్రజల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

నిజానికి దీన్ని తేయాకు సాగులో మాత్రమే ఈ మందు వాడేందుకు అనుమతించారు.

ఇది చల్లితే నేలపై ఉండే గడ్డి, ఇతర మొక్కలన్నీ ఎండిపోతాయి. వర్షాలు, వరదల సమయంలో కలుపుతీత సమస్య తలెత్తినప్పుడు రైతులు దీన్ని వాడుతున్నారు.

హెర్బిసైడ్‌ టోలరెంట్‌(హెచ్‌టీ) అనే జన్యువుతో వచ్చిన బీటీ రకం పత్తి ఈ మందును తట్టుకుంటుంది.

ఇతర మొక్కలన్నీ ఎండిపోవడానికి కారణమయ్యే గ్లైఫోసేట్‌ మందు పత్తిపై ఎలాంటి ప్రభావం చూపదు. కిందనుండే గడ్డి మొక్కల వరకే ఎండేలా చేస్తుంది.

కలుపుతీత సమస్య పరిష్కారం కోసమే రైతులు బీటీ3 పత్తి విత్తనాలను దొంగచాటుగా కొంటున్నారు. ఈ మందును అధికంగా వినియోగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గ్లైఫోసేట్‌పై నిషేధం బదులుగా.. అమ్మకాలపై నియంత్రణ అమలు చేస్తున్నారు. ఇది పత్రాలకే పరిమితమైంది.

దుకాణాలు వారీగా ఎక్కడెంత నిల్వలున్నాయనే వివరాలూ సేకరించలేదు. వాటిని వెనక్కి తెప్పించాలనే విషయాన్ని గుర్తించడం లేదని ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)