హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- బళ్ల సతీశ్
- బీబీసీ ప్రతినిధి
వీడియో: హైదరాబాద్ సామ్రాజ్యానికి ఐదు వందల ఏళ్లు
గంగా జమునా తహెజీబ్ వర్ధిల్లిన నేల.. ఇండోపర్షియన్ సంస్కృతి వికసించిన నేల.. గోల్కొండ సామ్రాజ్యం. ఈ రాజ్యం ఏర్పడి ఈ ఏడాదికి సరిగ్గా 500 ఏళ్లు పూర్తవుతోంది.
చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం గోల్కొండ కోటను అభివృద్ధి చేసి, హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీ రాజులు. వీరినే 'ఆంధ్రా సుల్తానులు'గా అభివర్ణిస్తుంటారు.
క్రీ.శ.1518లో ఏర్పాటైన ఈ రాజ్యం కుతుబ్ షాహీల పాలనలో 1687 వరకూ ఉంది. 8 మంది కుతుబ్ షాలు ఈ రాజ్యాన్ని పాలించారని, వీరి పాలన తర్వాత రాజ్యం మొఘల్‌ల హస్తగతమైందని డక్కన్ హెరిటేజ్ సొసైటీ నిర్వాహకులు డా. సఫీయుల్లా బీబీసీతో అన్నారు. ఆయన బీబీసీకి వివరించిన సమాచారం మేరకు..
ఈ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ (కుతుబ్ ఉల్ ముల్క్). ఇరాన్‌లోని కారాకునీల్ తెగకు చెందిన ఈయన మొదట బహమనీ రాజ్యంలో ఉద్యోగిగా చేరి ఆ తర్వాత గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
వీరు స్థానికుల్లో కలిసిపోయారు. స్థానిక భాషా సంస్కృతులను గౌరవించారు. అదే సమయంలో తమ సంస్కృతినీ కాపాడుకున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ నిర్మాతలు
హైదరాబాద్ నవాబులు అనగానే చాలా మందికి నిజాములు గుర్తొస్తారు. కానీ నిజాంల కంటే ముందు కుతుబ్ షాహీ వంశం హైదరాబాద్‌ని పాలించింది. ప్రస్తుత హైదరాబాద్ పునాదులు వేసి, భారీ కట్టడాలు నిర్మించింది వారి హయాంలోనే.
కుతుబ్ షాహీల పాలన తరువాత నిజాం పాలన మొదలైంది. 1519 నుంచి 1591 వరకూ గోల్కొండ కేంద్రంగా, 1591 నుంచి 1687 వరకూ హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. వీరి అధికార భాష పర్షియన్. గోల్కొండ రాజులందరూ షియా ముస్లిములే.
కుతుబ్ షాహీలు ఇరాన్ లో చాలా సంపన్నులు. తెగల మధ్య జరిగిన యుద్ధాల్లో వారు ఓడిపోయారు. దీంతో 1470-80 ప్రాంతాల్లో ఇక్కడకి వచ్చారు. ముందుగా బహమనీ సుల్తానులు, ఇతర సామంత రాజులకు గుర్రాలను సరఫరా చేసేవారు.
ఫొటో సోర్స్, Getty Images
గోల్కొండ చిత్రం
తరువాత బహమనీ రాజులు దగ్గర ఉద్యోగులుగా చేరారు. 1495లో బహమనీ రాజుపై దాడి జరిగింది. ఆ దాడిలో సుల్తాన్ కులి తన ప్రాణాలకు తెగించి రాజుని కాపాడారు. దీంతో ఆయన్ను 1496లో తెలంగాణ ప్రాంత పాలకుడిగా (గవర్నర్) నియమించారు. నిజానికి అతనిపేరు సుల్తాన్ కులీ ఖాన్.
అయితే అతని కంటే ముందు తెలంగాణ గవర్నర్ గా ఉన్న కుతుబ్ ఉల్ ముల్క్ గుజరాత్ ప్రాంతానికి చెందిన బహదూర్ షా తో జరిగిన యుద్ధంలో బహమనీల తరపున పోరాడుతూ మరణించాడు. దీంతో అతని పేరును బిరుదులోకి తీసుకుని సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ పేరుతో ఇతను పాలించాడు.
1496 నుంచి 1518 వరకు అతను తెలంగాణ గవర్నర్ గానే ఉన్నారు. 1518లో బహమనీలు బలహీనం కావడంతో, కులీ కుతుబ్ స్వతంత్రం ప్రకటించుకుని కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు" అంటూ కుతుబ్ షాహీ పాలన ప్రారంభం అయిన విధానం వివరించారు డక్కన్ హెరిటేజ్ సొసైటీ నిర్వాహకులు డా. సఫీయుల్లా.
ఫొటో సోర్స్, Getty Images
కుతుబ్ షా సమాధులు
ఇండో పర్షియన్ శైలితో ముస్తాబైన నగరం
కుతుబ్ షాహీ రాజులు హైదరాబాద్ నగరంలో అద్భుత నిర్మాణాలు చేశారు. చార్మినార్, హుస్సేన్ సాగర్, మక్కా మసీదు, తారామతి బారాదరి వీళ్ల హయాంలో నిర్మించినవే.
గోల్కొండ కోటను కాకతీయుల కాలంలో మట్టితో నిర్మించారు. అయితే, కుతుబ్ షాహీలు దీన్ని రాళ్లతో కట్టుదిట్టం చేశారు.
సాగు, తాగు నీటి అవసరాల కోసం హుస్సేన్ సాగర్ తవ్వించారు. వీరి నిర్మాణాలన్నీ ఇండో పర్షియన్ వాస్తు శిల్పాన్ని ప్రతిబింబిస్తాయి. కొన్ని నిర్మాణాల్లో ఇతర వాస్తు శైలులు కనిపిస్తాయి.
గోల్కొండ కోట బయటి గోడకు కిలోమీటరు దూరంలో నిర్మించిన కుతుబ్ షాహీ రాచ కుటుంబీకుల సమాధులు వీరి కాలపు నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబిస్తాయి.
ముహమ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో హైదరాబాద్ నగరం రూపుదిద్దుకుంది. చార్మినార్‌ను ఇతని హయాంలోనే నిర్మించారు.
ఫొటో సోర్స్, Getty Images
కులీ కుతబ్ షా
హైదరాబాద్ నిర్మాణం
మొదటి కుతుబ్ షాహీ రాజు మనుమడు మహమ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో 1591సం.లోనే హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభం అయిందని సఫీయుల్లా అన్నారు.
"అప్పట్లో గోల్కొండలో దాదాపు 40 వేల మంది ఉండేవారు. వాళ్లకి తాగునీరు, మురునీటి పారుదల సమస్యగా ఉండేది. దీనికి తోడు కలరా, ప్లేగు వంటి అంటు వ్యాధుల ప్రమాదం ఉండేది. దీంతో 1570లలోనే ఒక కొత్త నగరం నిర్మించాలన్న ఆలోచనలుండేవి. చివరకు 1591లో హైదరాబాద్ నిర్మాణం ప్రారంభం అయింది" అని వివరించారు సఫీయుల్లా.
సాహిత్య సేవ
కుతుబ్ షాహీ రాజుల గురించి చెప్పాల్సిన ప్రత్యేకత.. వీరు తమ సొంత భాషనే కాకుండా, స్థానిక ప్రజల భాషను గౌరవించి ఆదరించారు.
వీరి మాతృ భాష పార్శీ. స్థానిక భాషలైన తెలుగు, ఉర్దూలు చదవడం, రాయడం వీరికి వచ్చు. కొందరు రాజులు తెలుగులో కవిత్వం కూడా రాశారు. ఉర్దూలో దక్కనీ యాస వీరి హయాంలోనే ప్రాచుర్యం పొందింది.
1580లో సింహాసనం అధిష్టించిన ముహమ్మద్ కులీ కుతుబ్ షా పార్శీ, ఉర్దూతో పాటు తెలుగులో కూడా కవిత్వం రాశారు. రెవెన్యూ, న్యాయ అంశాల్లో కుతుబ్ షాహీలు తెలుగు భాషను ఉపయోగించారు.
1543లో సింహాసనం కోసం జరిగిన గొడవల్లో ఇబ్రహీం విజయనగర రాజుల దగ్గర ఆశ్రయం పొందారని చెబుతారు. అక్కడ ఆయన తెలుగులో మరింత ప్రావీణ్యం సంపాదించారనీ చరిత్రకారులు అంటారు.
అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం.. ఇబ్రహీం కుతుబ్ షా 1550లో సింహాసనం అధిష్టించాక, తెలుగును ఆదరిచాడు. సింగనాచార్యుడు, అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవులను ఈయన ఆదరించాడు. ప్రముఖ తెలుగు కవి క్షేత్రయ్యను సత్కరించారు. ఇతనికి మల్కిభరాముడు అనే బిరుదు ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
అబుల్ హసన్ తానిషా
హిందువులకు పెద్దపీట
కుతుబ్ షాహీ రాజులు ముస్లింలలోని షియా తెగకు చెందిన వారు. అయినప్పటికీ ముస్లింలలోని ఇతర శాఖలను, హిందువులను ఆదరించారు.
తెలుగు వాళ్లకు బాగా పరిచయమైన తానీషా, అసలు పేరు అబుల్ హసన్. ఇతని హయాంలో కుతుబ్ షాహీ దర్బారులో హిందువుల సంఖ్య బాగా పెరిగింది.
అక్కన్న, మాదన్నలను మంత్రులుగా పెట్టుకున్నారు. రామదాసు (కంచర్ల గోపన్న) ఇతని హయాంలోనే రామాలయం నిర్మించారు. హిందువులను, ముస్లింలతో సమానంగా గౌరవించాడు.
ఫొటో సోర్స్, Getty Images
వజ్రాల కొండ, గోల్కొండ
గోల్కొండ సామ్రాజ్యం అప్పట్లో వజ్రాలకు ప్రసిద్ధి.
ప్రపంచంలోని మేలైన వజ్రాలు ఇక్కడ దొరికేవి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లాలోని కోల్లూరు ప్రాంతంలో ఉన్న వజ్రాల గని నుంచి అనేక మేలిమి వజ్రాలు వెలికి తీశారు.
కృష్ణా తీరంలో వజ్రాలు విరివిగా దొరికాయి. అక్కడ భద్రత కోసం కుతుబ్ షాహీలు నిర్మించిన వాచ్ టవర్ ఇప్పటికీ చూడవచ్చు.
అప్పట్లో ప్రపంచానికి వజ్రాలు అంటే భారతదేశం మాత్రమే తెలుసు. ఈ వజ్రాల గనులే గోల్కొండ అనే పదం ఇంగ్లిష్ నిఘంటువులో చేరేలా చేశాయి.
18వ శతాబ్దం తరువాత ఇంగ్లీషులో అపార సంపదలకు, ఆనందాలకు నిలయం అనే అర్థంలో గోల్కొండ అనే పదాన్ని వాడుతున్నారు.
గోల్కొండ సామ్రాజ్యంలో కోహ్ ఇ నూర్, దారై ఇ నూర్, నూర్ ఉల్ ఐన్, కోహ్ ఇ నూర్, హోప్, ప్రిన్సీ, రీజెంట్ వజ్రాలు వెలుగు చూశాయి.
ఫొటో సోర్స్, Oxford
ఔరంగజేబు
అబ్దుల్లా కుతుబ్ షా హయాంలోనే యూరోపియన్ వర్తకులు ఆంధ్రలో అడుగుపెట్టారు. 1642లో అబ్దుల్లా కుతుబ్ షా డచ్ వ్యాపారులకు వ్యాపారం కోసం అనుమతిచ్చారు.
"అప్పట్లో డచ్ వాళ్లు తమ కరెన్సీ అవసరాల కోసం రాగి నాణేలు ముద్రించారు. దానిపై ఒకవైపు డచ్ ముద్ర, మరోవైపు అబ్దుల్లా కుతుబ్ షా బొమ్మ ఉండేవి" అని సఫీయుల్లా అన్నారు.
ఔరంగజేబు దాడితో పతనం
అబ్దుల్లా కుతుబ్ షా హయంలో షాజహాన్ హైదరాబాద్ పై దండెత్తారు. మొఘల్ షరతులకు లోబడి వీరి పాలన సాగింది. తరువాత తానీషా హయాంలో పన్నుల విషయంలో విబేధాలు రావడంతో ఔరంగజేబు గోల్కొండ కోటపై దండెత్తాడు.
తానీషా దాదాపు 8 నెలలు ఔరంగజేబు నుంచి కోటను రక్షించుకోగలిగాడు. చివరకు 1687 సెప్టెంబరులో ఔరంగజేబు గోల్కొండను గెలిచాడు.
ఆ సమయంలో తానీషా ఔరంగజేబుకు చెల్లించిన వజ్రాలతో అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పాలకుడయ్యాడని సఫీయుల్లా వివరించారు.
ఇవి కూడా చదవండి
- కేరళ వరదలు: విదేశీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు?
- తాజ్‌మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- వైరల్ ఫొటో: ‘స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే... అక్కడ నానమ్మ కనిపించింది’
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)