శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి మనిషిని పంపడానికి భారత్ సిద్ధంగా ఉందా?

ఇస్రోకు ఆ శక్తి ఉందా?

ఫొటో సోర్స్, Reuters

ప్రధాని నరేంద్ర మోదీ 2022లో స్వదేశం నుంచి భారతీయుడిని అంతరిక్ష యాత్రకు పంపిస్తామని ప్రకటించారు. అయితే, దేశంలోని అంతరిక్ష ప్రయోగ సంస్థ ఆ సవాలును స్వీకరించగలదా? అనే విషయంపై సైన్స్ రచయిత పల్లవ్ బగ్లా పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

ప్రధాని మోదీ విసిరిన సవాలును అందుకోవాలంటే రూ.128 కోట్లు అవసరమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 40 నెలల్లో తాము ఈ ప్రయోగం చేయగలమని అనుకుంటున్నారు.

ఇది సాధ్యమే అని వారు నమ్మకంగా చెప్పడానికి అక్కడ చాలా కారణాలు కనిపిస్తున్నాయి

ఈ అంతరిక్ష యాత్రకు భారత దేశ అత్యంత బరువైన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3 ఉపయోగించాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

640 టన్నుల బరువు, 43 మీటర్ల పొడవు ఉండే ఈ రాకెట్‌ను 2017లో విజయవంతంగా ప్రయోగించారు. పలు వెబ్‌‌సైట్స్ ఈ రాకెట్ బరువును 200 ఏనుగులు, ఐదు భారీ విమానాలకు సమానంగా పోల్చాయి.

పది టన్నుల పేలోడ్‌తో ఈ రాకెట్‌ను దిగువ భూ-కక్ష్యలోకి, అంటే భూమి నుంచి 2 వేల కిలోమీటర్ల ఎత్తు వరకూ ప్రయోగించవచ్చు. ఒక మనిషిని అంతరిక్షంలోకి పంపడానికి అవసరం అయ్యే దానికంటే అది ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బంగాళాఖాతం తీరంలో అంటే శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్‌కు కొన్ని మార్పులు చేస్తే దానిని ఉపయోగించి, వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడం సులభంగానే ఉంటుందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

వ్యోమగాముల కోసం భారత్ తయారు చేసిన స్పేస్ సూట్‌లో రచయిత

జులైలో ఇస్రో "ప్యాడ్ అబోర్ట్ టెస్ట్" విజయవంతంగా నిర్వహించింది. వ్యోమగాములు లేకుండా డమ్మీని ఉపయోగించి ఈ ప్రయోగం చేశారు. శక్తిమంతమైన ఇన్ బిల్ట్ థ్రస్టర్స్‌తో ఇది ఆ సమయంలో ఆకాశంలోకి దూసుకెళ్లింది.

లాంచ్ ప్యాడ్‌లో రాకెట్ విఫలమైతే లోపల ఉన్న సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం నిర్వహించారు.

అంతరిక్ష వాహనం భూవాతావరణంలోకి ప్రవేశించినపుడు రాపిడి వల్ల బయట మంటలు అంటుకోకుండా పూత వేసేందుకు భారత శాస్త్రవేత్తలు తేలికపాటి సిలికాన్ టైల్స్‌ కూడా తయారు చేశారు.

అహ్మదాబాద్‌లో ఉన్న ఒక ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు వ్యోమగాముల కోసం ఒక స్పేస్ సూట్ తయారు చేశారు.

వ్యోమగాములను అంతరిక్షంలో సజీవంగా ఉంచడానికి అవసరమైన లైఫ్ సపోర్ట్ సిస్టం రూపొందించి, వారికి శిక్షణ ఇవ్వడం అతిపెద్ద సవాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే ఈ కార్యక్రమం వల్ల దేశ ప్రతిష్ట పెరగడమే కాదు, భారతీయ యువత సైన్స్ కెరీర్ ఎంచుకోడానికి ఇది ప్రేరణ అవుతుంది" అని ఇస్రో ఛైర్మన్, ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త డాక్టర్ కె.శివన్ నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Isro

రాబోవు తరాలకు సాధ్యం

వ్యోమగాములకు శిక్షణ ఇచ్చే పూర్తి సామర్థ్యం భారత్‌ ఇంకా సాధించలేదని డాక్టర్ శివన్ తెలిపారు. మనం గడువును అందుకోవాలంటే ఇతర సంస్థల నైపుణ్యం, శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

1984లో సోవియట్ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ "ప్రతి అంతరిక్ష కార్యక్రమం ఒక పరిపక్వ స్థాయికి చేరినపుడు, మానవ సహిత అంతరిక్ష యాత్ర అనేది సహజంగా జరిగే పరిమాణం. రాబోవు తరంలో మనకిది సాధ్యమే" అన్నారు.

ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనా మాత్రమే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాయి. భారత్ దీన్ని సాధిస్తే మనిషిని అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశం అవుతుంది.

కానీ అంతరిక్ష యాత్ర లక్ష్యం సరిగా లేదని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

"భారతీయులను అంతరిక్షంలోకి పంపించడం అనేది చాలా తెలివి తక్కువ ఆలోచన, ముఖ్యంగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన 50 ఏళ్ల తర్వాత మనిషిని అక్కడికి పంపడంలో అర్థం లేదు" అని సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త వి.సిద్దార్థ అన్నారు.

2012లో మరణించిన ఆర్మ్‌స్ట్రాంగ్, 1969 జులై 20న చంద్రుడిపై అడుగుపెట్టారు. దానిని "మనిషి చిన్న అడుగు, మానవాళికి ఒక పెద్ద ముందడుగు"గా వర్ణించారు.

"మనుషులను అంతరిక్షంలోకి పంపించాల్సిన అవసరం లేకుండా, వ్యోమగాములు చేసే చాలాపనులను ఇప్పుడు రోబోటిక్ మిషన్స్ చేస్తున్నాయి"అని సిద్దార్థ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

2017లో 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో

‘‘మనిషి మాత్రమే అందుకోగల చాలా లక్ష్యాలు ఇంకా ఉన్నాయి. భారతీయులను అంతరిక్షంలోకి పంపడానికి భారత్ సొంతంగా సామర్థ్యం సంపాదించాలని పేర్కొంటూ శివన్.. సిద్ధార్థ వాదనను తోసిపుచ్చారు.

"మనిషి మనుగడ కోసం భూమి బయట నివాస ప్రాంతాలు ఏర్పాటు చేయాల్సివస్తే, అత్యంత పురాతన నాగరికత ఉన్న భారత్ వెనకబడాలని ఎలా కోరుకుంటుంది" అని శివన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ నాతో "భారత్‌కు ఈ మిషన్ కోసం చక్కటి సాంకేతికత, సాంస్కృతిక వాతావరణం ఉందని" అన్నారు.

గతంలో తమకు ఎదురైన సవాళ్లను ఇస్రో పూర్తి చేసి చూపించింది.

భారత్ 2014లో అంగారకుడి కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపింది. అలా చేసిన ప్రపంచంలోని నాలుగో దేశంగా నిలిచింది. ఈ మిషన్ కోసం చేసిన 6.7 కోట్ల రూపాయల వ్యయం మిగతా దేశాల ప్రయోగాలో పోలిస్తే చాలా చౌక.

అంతకు ముందు 2009లో ఇస్రో మొదటి మూన్ మిషన్ చంద్రయాన్-1, చంద్రుడిపై నీటి జాడలు వెతికేందుకు రాడార్స్ ఉపయోగించి చేసిన తొలి పరిశోధనగా నిలిచింది.

గత ఏడాది 2017లో ఒకే మిషన్‌లో 104 ఉపగ్రహాలు ప్రయోగించిన భారత్ చరిత్ర సృష్టించింది. అంతకు ముందు 2014లో 37 ఉపగ్రహాలు ప్రయోగించిన రష్యా రికార్డును బద్దలు కొట్టింది.

"వైఫల్యాలను ఎవరూ కోరుకోరు" అని డాక్టర్ శివన్ అన్నారు.

"2022లోపు భారతీయుడిని అంతరిక్షంలోకి పంపగలమా అని నిర్ధరించుకోవడం ఇస్రో బృందానికి సవాలుగా నిలవబోతోంది".

(పల్లవ్ బగ్లా ఢిల్లీకి చెందిన సైన్స్ వ్యాసకర్త, బ్లూమ్స్‌బరీ ప్రచురణ 'రీచింగ్ ఫర్ ది స్టార్స్: ఇండియా జర్నీ ఫర్ మార్స్ అండ్ బియాండ్' పుస్తక రచయిత)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)