‘ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే, అతడి భార్య పరిస్థితి ఏమిటి?’

  • 24 ఆగస్టు 2018
మహిళ- ప్రతీకాత్మక చిత్రం Image copyright Getty Images

శంకర్‌ కాటేకర్‌ సన్నకారు రైతు. వర్షాధారం మీద పత్తి పండిస్తున్నాడు. సకాలంలో వానలు లేక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అలాంటి సమయంలో సర్కారు ఆ ప్రాంతంలో కొన్ని బావులు మంజూరు చేసింది. అలా శంకర్‌ పొలంలో కూడా ఒక బావిని తవ్వితే, అతడి అదృష్టం బాగుండి పది అడుగులకే నీళ్లు పడ్డాయి. అలా రెండేళ్లపాటు సాగునీటికి లోటు లేకుండా వ్యవసాయం చేశాడు.

ఆ తరువాత బావి ఎండి పోయింది. కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంకాస్త లోతు తవ్వితే నీరొస్తుందన్న ఆశతో అధికారుల చుట్టూ తిరిగాడు. వారు పట్టించుకోలేదు. ప్రభుత్వ నిధులతో అంతకు మించి తవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవన్నారు. దాంతో బంధువుల దగ్గర అప్పు చేసి 10 అడుగుల వరకు తవ్వాడు. కానీ, నీళ్లు పడలేదు. పంటలు పండక నష్టం వచ్చింది. అప్పులిచ్చిన వారు వెంట పడ్డారు. దిక్కుతోచని శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలానికి, మహారాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంలో తొలివిడతగా నలభైవేల రూపాయలను ఆ రైతు భార్య అంజన చేతిలో పెట్టింది. ఆ డబ్బుతో ఆమె బావిని బాగుచేసుకొని సాగు చేస్తున్నారు.

'ఆ నలభై వేలను సర్కారు ముందే ఇస్తే బావి బాగుపడేది, నా భర్త నాకు దక్కేవాడు కదా?' అని అంటారు అంజన.

ఇలాంటి కథనాలతో మొదలవుతుంది 'విడోస్‌ ఆఫ్‌ విదర్భ' అనే పుస్తకం. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని రైతు కుటుంబాల జీవిత వ్యథలను తెలిపే పుస్తకం ఇది.

స్వతంత్ర పరిశోధకురాలు, రచయిత్రి నీలిమ దీన్ని రాశారు. విదర్భ రైతుల సమస్యలకు తెలంగాణ రైతుల స్థితిగతులకు మధ్య ఎన్నో సారూప్యాలున్నాయి. తెలంగాణలో సాగు సమస్యలు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా నీలిమ బీబీసీతో చెప్పిన విషయాలు:

Image copyright Neelima

రైతుల వైపు దృష్టి

''దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనుకోవాలి! అలాంటి వారి కోసం విధానాలు రూపొందించే ప్రభుత్వ యంత్రాంగానికి అసలు కారణాలు తెలుసా? ఆత్మహత్యల వెనుకున్న వాస్తవాలేమిటి?

ఇలాంటివి మీడియాలో ప్రధానంగా రావాలి. వీటి గురించి ప్రత్యేక కథనాలు రావాలి. కానీ, వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. ఇలాంటి నిజాన్ని రాయాలంటే పత్రికలు పాలసీకి భిన్నంగా నడవాలి. అందుకే, నేను పనిచేస్తున్న మీడియా సంస్థకు రాజీనామా చేయాలనుకున్నాను. కానీ ఉద్యోగం మానేసి, పూర్తిగా రైతుల ఆత్మహత్యల మీద రీసెర్చ్‌ చేయాలంటే, మరో ఆదాయ మార్గం కావాలి. అందుకే కుంచె పట్టాను.''

పెయింటింగ్స్‌ ఆదాయంతో పరిశోధన

నీలిమ తైలవర్ణ సొగసు తెలిసిన చిత్రకారిణి. ఉపనిషత్తుల సారాన్ని ఆమె వర్ణ చిత్రాల్లో చూపేందుకు ప్రయత్నిస్తారు. ‘‘దేశవిదేశాల్లో పెయింటింగ్‌ ఎగ్జిబిషన్స్‌ పెడుతుంటాను. చాలా మంది వాటిని కొంటారు. నా రీసెర్చ్‌ కోసం ఖర్చుపెట్టడానికి అలా వచ్చిన ఆదాయం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. దీనికి ముందు మన దేశ వ్యవసాయ సమస్యలు, నష్టాల మీద వచ్చిన పుస్తకాలు, పరిశోధనలను చదివి అవగాహన పెంచుకున్నాను. నా అధ్యయనాన్నంతా పాఠంలా, గణాంకాలతో చెబితే ప్రజలకు అర్ధం కాదు. అందుకే, వాటిని కథలుగా, నవలల రూపంలో మలిచాను. అలా రాసిన తొలి పుస్తకం ''రివర్‌స్టోన్స్‌''. రైతుల ఆత్మహత్యలను, వ్యవసాయాన్ని ప్రభుత్వ పాలసీలు ఎంత నిర్లక్ష్యం చేశాయో ఈ పుస్తకంలో చెప్పాను.’’

Image copyright Neelima

మీడియాలో రాని కథనాలతో...

''నా రెండవ పుస్తకం 'డెత్‌ ఆఫ్‌ ఎ మనీలెండర్‌' 2009లో వచ్చింది. పల్లెల్లో పేదరికాన్ని పట్టించుకోని మెయిన్‌ స్ట్రీం జర్నలిజం మీద రాసిన పుస్తకమది. మూడో పుస్తకం ''షూస్‌ ఆఫ్‌ ది డెడ్‌'' పల్లెల్లో, నగరంలోని యువతరం మధ్య ఉండే వ్యత్యాసాన్ని, దానికి కారణమైన వ్యవస్థకు అద్దం పట్టే ప్రయత్నం చేశాను.''

రైతు ఆత్మహత్య చేసుకుంటే?

''అప్పుల బాధలు, బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేరుస్తున్నది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. రైతు చేసిన అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్ల బతుకు పోరాటాన్ని కేస్‌ స్టడీస్‌గా మలిచి ఇటీవల ''విడోస్‌ ఆఫ్‌ విదర్భ'' పుస్తకం రాశాను. ఇది రాయడానికి నాలుగేళ్లు పట్టింది. ముందు వంద కేస్‌ స్టడీస్‌ తీసుకున్నా. వాటిలోంచి పద్దెనిమిది ఎంచుకున్నాను. ఆ పద్దెనిమిది మంది మహిళల జీవితాల్లో వైవిధ్యం ఉంది. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా జీవితాన్ని సాగిస్తూ, ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ధైర్యంగా నిలబడ్డారు. వాళ్లను చూస్తే, వాళ్ల కథలు వింటే ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. వారికి చదువు లేదు, బయటి ప్రపంచం తెలియదు. ఆర్థిక అండలేని వాళ్లు. అయినా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. తమ భర్తల లాగే వారు కూడా బలవన్మరణాలకు పాల్పడితే వారి బిడ్డల పరిస్ధితేంటి?'' అంటూ తన 'విడోస్‌ ఆఫ్‌ విదర్భ' లోని అంశాలను వివరించారు నీలిమ.

విదర్భ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు ?

''దేశవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో 3లక్షలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో మహారాష్ట్రలోనే అరవై వేలకు పైగా జరిగాయి. అందులోనూ విదర్భ ప్రాంతాల్లో ఎక్కువ. అందుకే నా పరిశోధన ఇక్కడ నుంచి మొదలు పెట్టాను'' అంటారామె.

Image copyright NEELIMA

కదిలించిన జీవితం

''రైతుల ఆత్మహత్యల ప్రభావం పరోక్షంగా కొన్ని తరాల మీద ఉంటుంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, అష్టగావ్‌‌లోని జ్యోతి బంబర్‌ ఒక రైతు భార్య. 2007లో ఆమె భర్త వ్యవసాయం కోసం అప్పులు చేసి, పంట నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. జ్యోతి తమకున్న పొలాన్ని పండించే స్తోమత లేక రైతు కూలీగా మారింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. వారిని పెంచలేక ఒక బిడ్డను బంధువుల దగ్గర వదిలిపెట్టింది. ఆ కుర్రాడు దాదాపు అక్కడ వెట్టి చాకిరీ చేస్తూ, చదువుకుంటున్నాడు. అప్యాయంగా చూసుకున్న తండ్రి లేని లోటు ఆ బిడ్డ పై తీవ్ర మానసిక ప్రభావం చూపింది. ఎపుడు కలిసినా ఆ కుర్రాడు తీవ్ర వేదనలో, తన తండ్రిలా రైతుగా మార కూడదని అనుకుంటాడు.'' ఒక రైతు ఆత్మహత్య ఒక తరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఈ రైతుబిడ్డ కథనం లో చెప్పారు నీలిమ.

ఆదిలాబాద్‌ నుండి అధ్యయనం

ప్రస్తుతం తెలంగాణ రైతు సమస్యలు, వలసలు , చేనేత కార్మికుల అవస్థల గురించి అధ్యయనం చేయడానికి నీలిమ సన్నద్ధమవుతున్నారు.

''తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు భయం కలిగిస్తున్నాయి. ఈ సమస్యలను ప్రభుత్వ కోణం నుండి చూస్తే ఒకలా, స్వతంత్ర పరిశోధకురాలిగా చూస్తే మరోలా కనిపిస్తాయి. నేను ఎవరి ఆర్థిక సహాకారంతో పరిశోధన చేయడం లేదు కాబట్టి నిజాలను రికార్డ్ చేయడానికే మొగ్గుచూపుతాను. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకున్నప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. కొన్ని సమస్యల వల్ల రైతు ఆత్మహత్య చేసుకోవచ్చు. కానీ భర్తను కోల్పోయిన ఆ భార్య అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె పేరున భూమి ఉండదు. బ్యాంకులు ఆమెకు రుణాలివ్వవు. విత్తనాలు, ఎరువుల కోసం వెతుక్కోవాలి. వ్యవసాయంలో భర్తకు ఉన్న అనుభవం ఆమెకు ఉండదు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఎలా జీవనాన్నిసాగిస్తుంది? అనే దిశగా నా పరిశోధన సాగుతుంది. ముందుగా ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మొదలు పెడతాను'' అన్నారు నీలిమ.

ఎవరీ నీలిమ

కోట నీలిమ సొంతూరు విజయవాడ. పెరిగింది దిల్లీలో. అమెరికాలో పీహెచ్‌డీ చేశారు. తండ్రి రామశర్మ నేషనల్‌ హెరాల్డ్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రపంచాన్ని ఎలా చూడాలో నాన్న నుంచి నేర్చుకున్నానంటారు నీలిమ. ''ది స్టేట్స్‌మన్‌'', '' ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌''లో ఆమె పాత్రికేయురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా కొన్ని పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. ఆమె పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి. త్వరలో తన పుస్తకాలను మరాఠీ, తెలుగులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image copyright Neelima

ప్రయాణంలో ఆమె ఏం గుర్తించారు?

''వందకు పైగా గ్రామాలు తిరిగి, రైతుల భార్యలను కలిశాక నేను తెలుసుకున్న అంశాలివి.

భర్త చేసిన తప్పులు తాము చేయకుండా వ్యవసాయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సాగు ఆదాయాన్ని అప్పులు మింగేయకుండా చూసుకుంటున్నారు.

ఒక పేదరైతు ఆత్మహత్య వరకు వెళ్తున్నాడంటే ఎంత బలమైన కారణాలు ఉంటాయో తెలిసింది.

ఈ రోజు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటూ, రేపటి తిండి కోసం ఆలోచించే రైతుల జీవితం అర్ధం చేసుకోవడం క్షేత్ర పర్యటన ద్వారానే సాధ్యం.

కష్టపడి పంట పండించే రైతుకు ఆత్మగౌరవం ఉంటుంది. అప్పుఇచ్చిన వ్యక్తి గట్టిగా అడిగితే తట్టుకోలేడు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, వేరే చోటుకు పారిపోవాలని అనుకోరు. భూమిని నమ్ముకొని బతుకుతాడు, ఎందుకంటే రైతంటే నమ్మకం, రైతంటే నిజాయితీ.'' అని ముగించారు నీలిమ.

ఆమె రాసిన ''షూస్‌ ఆఫ్‌ ది డెడ్‌'' నవలను తమిళ దర్శకుడు వెట్టిమారన్‌ సినిమాగా తీయబోతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)