హైదరాబాద్ జంటపేలుళ్లు: నెత్తుటి గాయానికి నేటితో 11 ఏళ్లు

  • 25 ఆగస్టు 2018
హైదరాబాద్ జంట పేలుళ్లు Image copyright Getty Images

సరిగ్గా 11 ఏళ్ల క్రితం.. ఇదే రోజు హైదరాబాద్ బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. నగరంలోని లుంబినీ పార్క్‌, గోకుల్ చాట్‌లలో నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా, 300 మంది గాయపడ్డారు.

ఆగస్టు 25, 2007 రాత్రి 7.45 నిమిషాలు..

ట్యాంక్‌బండ్‌లోని లుంబినీపార్క్‌లో హైదరాబాద్ చరిత్ర దాని విశిష్టతలను వివరిస్తూ లేజర్ షో సాగుతోంది.

ఎక్కడినుంచో వచ్చిన ప్రేక్షకులంతా భాగ్యనగరం గొప్పతనాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

కొన్ని క్షణాలకు వారున్న చోట పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు.

ఈ ఘటన నుంచి తేరుకునేలోపే మరికొన్ని నిమిషాల్లోనే కోఠీలోని గోకుల్ చాట్‌లో పేలుడు జరగడంతో 33 మంది చనిపోయారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మరో 19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు.

Image copyright Getty Images

1125 పేజీలతో చార్జిషీట్

జంట పేలుళ్లకు సంబంధించి ఏడుగురి పేర్లతో కూడిన 1125 పేజీలతో మూడు చార్జిషీట్లను పోలీసులు దాఖలు చేశారు.

కేసులో 286 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. మక్కా పేలుళ్ల తరువాత పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు విచారణలో తేలింది.

Image copyright Getty Images

దర్యాప్తు.. అరెస్టు

ఈ పేలుళ్ల వెనుక ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఎండీ సిద్దిఖ్ ఇస్సార్ అహ్మద్, ఎండీ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనిక్ షఫిఖ్ సయ్యద్, ఫారుఖ్ షర్ఫుద్దీన్ తార్కష్‌లను ముంబయి పోలీసులు మొదట అరెస్టు చేశారు.

పీడీ యాక్ట్ కింద ముంబయి పోలీసుల నుంచి వీరిని ఆక్టోపస్ విభాగం, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్లు దాఖలు చేశారు.

చార్జ్‌షీట్లో ఐఎంకు చెందిన అనీఖ్, రియాజ్‌ భత్కల్, అక్బర్‌, ఇక్బాల్‌ భత్కల్, అమీర్‌ రజా ఖాన్, ఫారూఖ్‌ తర్ఖాష్, సాదిక్‌ షేక్‌లను నిందితులుగా పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఐఈడీ బాంబుల వినియోగం

ఈ పేలుళ్లకు ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ప్లోజీవ్‌ డివైస్‌ (ఐఈడీ)లను ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు.

టిఫిన్‌ బాక్సుల్లో బాంబులను ఉంచి వాటికి టైమర్లను అమర్చి పేలుళ్లు జరిపినట్టు చెప్పారు.

ఈ నెల 27న తుది తీర్పు

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల ఘటన కేసు విచారణ పూర్తైంది.

ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఈనెల 27న ఈ కేసులో తుది తీర్పును వెలువరించనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)