భారత్‌ను ఇరాక్, సిరియాలతో పోల్చి రాహుల్ ఏం సాధించదలచుకున్నారు?

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం తరువాత చర్చకొచ్చిన అనేక అంశాల్లో ఒకదానిపై మాత్రం సుదీర్ఘ చర్చ జరిగింది. 'ఇంత గొప్ప నేత 2004 ఎన్నికల్లో పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారు?' అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
'భారత్ వెలిగిపోతోంది' అంటూ ఎల్.కె.అడ్వాణీ నేతృత్వంలో సాగిన ప్రచారమే ఆ ఎన్నికల్లో ఓటమికి కారణమని చాలామంది భారతీయులు అభిప్రాయపడుతుంటారు. 'భారత్ వెలిగిపోతోంది' నినాదం మధ్య తరగతి, సంపన్న వర్గాల అభివృద్ధికే పరిమితమైందని.. పేదలను పట్టించుకోలేదన్నది చాలామంది అభిప్రాయం.
ఈ పరిస్థితులను కాంగ్రెస్ రెండు చేతులతో అందిపుచ్చుకుంది. 'భారత్ వెలిగిపోతోంది సరే.. నాకేంటి?' అన్న ప్రశ్నను లేవనెత్తి ప్రజల్లోకి వెళ్లింది.
సామాన్యుల కష్టాలు, వారి సమస్యలను ఫోకస్ చేస్తూ ఎన్నికలకు వెళ్లి విజయాన్ని అందుకుంది. 2009 ఎన్నికల్లోనూ ఇదే మంత్రం పఠిస్తూ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఆ తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అసమర్థత వంటి ఆరోపణల్లో చిక్కుకుంది.
దీంతో గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈసారి స్వచ్ఛమైన, అవినీతి రహిత ప్రభుత్వం దేశానికి కావాలని.. తమకు అవకాశమిస్తే అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. అది ఫలించి 2014లో బీజేపీకి విజయం దక్కి నరేంద్ర మోదీ ప్రధానయ్యారు.
వెలివేత రాజకీయాలు
మోదీ ప్రధానయ్యాక పేదలు, అణగారిన వర్గాల ప్రస్తావన లేకుండా ఆయన ప్రసంగం సాగేది కాదు.
2016లో కేరళలో నిర్వహించిన బీజేపీ జాతీయ సమావేశాల్లో మోదీ ప్రసంగించిన తరువాత ఆయన కేబినెట్లోని కీలక మంత్రే ఒకరు తీవ్ర నిరాశతో ప్రశ్నల వర్షం కురిపించారు.
''భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. మనం ఎందుకింత ప్రతికూలంగా ఆలోచించాలి? పేదరికంపై ఎందుకింత చర్చ?'' అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జర్మనీలో మాట్లాడుతూ ఇదే అంశాన్ని లేవనెత్తారు.
భారత్‌లో 'వెలివేత రాజకీయాలు' మొదలయ్యాయని.. అభివృద్ధి ప్రక్రియ నుంచి అనేక వర్గాలను వెలివేశారని, దీని పర్యవసానాలు మొత్తం ప్రపంచానికే ప్రమాదకరమని ఆయన అన్నారు.
కేవలం మతపరమైన మైనారిటీలనే కాకుండా దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలనూ వెలివేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వపు ఘనతలను ప్రస్తావించారు. మన్మోహన్ ప్రభుత్వంలో మంచి ఫలితమిచ్చిన ఉపాధిహామీ పథకాన్ని, దళితులకు సంబంధించిన చట్టాలను ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో నీరుగార్చారని.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి మోదీ ఆర్థిక విధానాలు కోట్లాదిమందిని ఇబ్బంది పెట్టాయని, కేవలం సంపన్నులు, కార్పొరేట్ సంస్థలకే ప్రయోజనం కలిగించాయని ఆరోపించారు.
రాహుల్ తన ప్రసంగంలో మోదీ ప్రభుత్వ దేశీయ, విదేశాంగ విధానాలనూ తప్పు పట్టారు. భారత్, చైనాలను పోల్చుతూ రెండు దేశాల వృద్ధి రేట్లను, ఉపాధి కల్పన సామర్థ్యాలను ప్రస్తావించారు. దేశంలోని వివిధ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా దూరం పెడితే దుష్పరిణామాలు తలెత్తుతాయని అన్నారు. ఇరాక్‌లో ఇలాంటి పరిణామాలను చూశామని, సిరియాలో కూడా చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
ఫలితాలే గీటురాయి
రాహుల్ ప్రసంగం వచ్చే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లబోయే ప్రధానాంశాన్ని చెప్పినట్లయింది. ''సంపన్నుల కోసమే రూపొందించిన మీ అసంబద్ధ విధానాలను వ్యతిరేకిస్తాం, మీ అధికారం వల్ల వంచనకు గురైన వర్గాలకు మేం చేయందిస్తాం(కాంగ్రెస్ ఎన్నికల గుర్తు)'' అన్నది రాహుల్ మాటల్లో ధ్వనించింది.
ఆయన ప్రసంగంలో నిబద్ధత, తార్కికత కనిపించినా ఆయన ఇదంతా మాట్లాడింది మాత్రం విదేశీ గడ్డపై. మోదీ విదేశీ గడ్డపై మాట్లాడిన ఏ సందర్భంలోనూ ఇలా రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శలు చేయలేదు. అదేసమయంలో ఆయన తన అతి సామాన్యమైన మూలాల గురించి, తన ప్రభుత్వం ఘనతల గురించి చెప్పడం మర్చిపోరు.
మోదీ ప్రసంగాలతో పోల్చితే రాహుల్ గాంధీ ఉపన్యాసం తేలిపోయి ఉండొచ్చు. కానీ, ఆయన గొంతులో నిజాయితీ ఉంది.
ఎవరెన్ని మాట్లాడుకున్నా చివరికి తేలాల్సింది ఫలితం.
మోదీ ప్రభుత్వం తానిచ్చిన వాగ్దానాల్లో ఎన్నిటిని నెరవేర్చింది? అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ(కాంగ్రెస్) ఎన్ని ప్రయోజనకర పనులు చేసింది? అన్నది బేరీజు వేసుకోవాల్సిందే.
తీర్పు రావడానికి ఇంకా సమయముంది.
అయితే.. రహదారులు నిర్మించడం, డిజిటల్ కనెక్టివిటీ పెరగడం, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు ప్రజల పనితీరును మార్చతుండడం, జీఎస్టీ రాకతో అనేక వ్యాపారాలను సులభతరం చేయడాన్ని కాదనలేం.
అదేసమయంలో రాహుల్ గాంధీ.. మూకదాడులు, మతపరంగా వెలివేయడం, కుల హింస వంటి అంశాలపై మాట్లాడుతుండడం కాంగ్రెస్ సరైన దారిలోనే వెళ్తోందని సూచిస్తోంది. అయితే, ఇది ఎన్నికల్లో విజయానికి సరిపోతుందా అన్నదే ప్రశ్న. చెప్పడం కష్టమే. అయితే, జర్మనీలో రాహుల్ గాంధీ మాట్లాడింది చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన పాత నినాదం 'గరీబీ హఠావో'ను ఎత్తుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- విశ్లేషణ: కిమ్‌తో భేటీని ట్రంప్ ఎందుకు రద్దు చేసుకున్నారు? అమెరికా వ్యూహం ఏంటి?
- పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
- చీర్‌లీడర్స్: ‘మమ్మల్ని కేవలం అందమైన ఆట బొమ్మల్లా చూస్తారు’
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)