అమరావతి బాండ్లు: అప్పులు వరమా? శాపమా?

  • 29 ఆగస్టు 2018
అమరావతి Image copyright APCRDA/Facebook

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి బాండ్ల ద్వారా రూ. 2,000 కోట్లు అప్పులు సేకరించింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో అవకాశం ఉన్న అన్ని మార్గాలలో నిధులు సమీకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే.. రాష్ట్రం అసలే దాదాపు 2.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. ఇప్పుడు అధిక వడ్డీ రేట్లతో వేల కోట్లు అప్పుచేయటం ప్రభుత్వానికి, ప్రజలకు గుదిబండగా మారుతుందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

దేశంలో ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బాండ్లు జారీ చేయడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) ‘అమరావతి బాండ్లు’ జారీ చేసింది. వీటిని ఆగస్టు 14న బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌ (బీఎస్‌ఈ)లో అమ్మకానికి పెట్టింది.

మొదట రూ. 1,300 కోట్లు సేకరించేందుకు బాండ్లు విడుదల చేస్తే.. గంట సమయంలోనే ఒకటిన్నర రెట్లు అధికంగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయని.. మొత్తం రూ. 2,000 కోట్ల విలువైన బాండ్లు అమ్ముడయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ బాండ్లను ఆగస్టు 27న బీఎస్‌ఈలో నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముంబైలోని బీఎస్‌ఈలో గంట కొట్టి ఈ నమోదును లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా సమావేశమై అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

అమరావతి బాండ్లకు అద్భుత ప్రతిస్పందన లభించిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. మున్ముందు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ బాండ్లను లిస్ట్ చేయటంతో పాటు.. రిటైల్ బాండ్లు జారీ చేయాలని కూడా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Image copyright NAra chandrababu naidu/Facebook

బాండ్ల మీద వడ్డీ రేటు వివాదం...

ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రిత్వశాఖ ఆగస్టు 9న జారీచేసిన జీవో 266 ద్వారా.. 10.32 శాతం వడ్డీ రేటుతో రూ. 2,000 కోట్ల సేకరణ కోసం అమరావతి బాండ్లు జారీ చేయటానికి అనుమతిచ్చింది.

ఈ మొత్తం అప్పుకు, దానిపై వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తోంది. అంటే.. ఏపీసీఆర్‌డీఏ ఆ అప్పులు, వడ్డీ చెల్లించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఈ బాండ్ల కాలవ్యవధి పదేళ్లు. వీటికి ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ఎ ప్లస్ రేటింగ్ ఇవ్వగా.. బ్రిక్‌వర్క్‌, ఆయుక్ట్‌ సంస్థలు ఏఏ రేటింగ్ ఇచ్చాయి.

ఈ బాండ్లకు మర్చంట్ బ్యాంకర్ (మధ్యవర్తి)గా మెస్సర్స్ ఎ.కె.క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థను నియమించారు.

ఆ సంస్థకు ఫీజుగా 0.85 శాతం, దానిపై జీఎస్‌టీ చెల్లించటానికి అంగీకరించారు.

అమరావతి బాండ్ల మీద మొదటి ఐదేళ్లు మారటోరియం ఉంటుంది. ఈ కాలంలో మూడు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు. ఆ తర్వాత ఐదేళ్లలో మూడు నెలలకు ఒకసారి వడ్డీతో కలిపి అసలు కూడా తిరిగి చెల్లిస్తూ వస్తారు. అంటే బాండ్ల ద్వారా సేకరించిన రూ. 2,000 కోట్ల అప్పుకు.. పదేళ్లలో వడ్డీ రూ. 1,573.73 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మధ్యవర్తి సంస్థకు ఫీజు కింద సుమారు రూ. 17 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే.. ప్రభుత్వ గ్యారెంటీతో 10.32 శాతం వడ్డీకి బాండ్ల రూపంలో రుణాలు తీసుకోవటం అనూహ్యమైన విషయమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పుణే నగరపాలక సంస్థ 7.59 శాతం, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఒక విడతలో 8.9 శాతం, మరొక విడతలో 9.38 శాతం వడ్డీ రేట్లతో.. ప్రభుత్వ హామీ లేకుండానే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయని పేర్కొన్నారు.

Image copyright Amaravati/Twitter

వడ్డీ 6 శాతం లోపే ఉండాలంటూ జీఓలో నిర్దేశాలు

నిజానికి.. రాజధాని నిర్మాణానికి నిధులను రుణాల ద్వారా సేకరించటం కోసం.. పురపాలక మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేసిన జీవో ఎంఎస్ నం. 65లో కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది.

అందులో.. ఆరు శాతం కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు లభించేలా.. పన్ను రాయితీలతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలికసదుపాయాల) బాండ్ల జారీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. అసలు.. వడ్డీ రేట్లు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. టెర్మ్ రుణాలపై బ్యాంకుల వడ్డీ రేటు కన్నా తక్కువ స్థిర వడ్డీ రేటు ఉంటేనే బాండ్ల ద్వారా రుణాల సేకరణ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని నిర్దేశించింది.

అంతేకాదు.. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) దగ్గర తీసుకునే అప్పుల వడ్డీ సైతం 8 శాతం కన్నా తక్కువ ఉండే విధంగా హడ్కోతో మాట్లాడాలని సూచించింది. ఈ వడ్డీ శాతాన్ని హడ్కో తగ్గించకపోతే.. ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో 8 శాతం కంటే తక్కువ వడ్డీకి ప్రభుత్వమే అప్పులు ఇప్పిస్తుందనీ పేర్కొంది.

Image copyright Nara chandrababu naidu/Facebook

హడ్కో వడ్డీ కన్నా అమరావతి బాండ్ల వడ్డీ తక్కువా..?

కానీ.. ఆ జీఓలో నిర్దేశించిన మార్గదర్శకాలకు భిన్నంగా.. 10.32 శాతం వడ్డీ రేటుతో అమరావతి బాండ్లు విడుదల చేయటాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.

మార్కెట్‌లో తక్కువ వడ్డీకి రుణాలు వస్తుంటే.. అధిక వడ్డీకి బాండ్ల రూపంలో అప్పులు చేయటం.. నలభై, యాభై వేల కోట్లతో రాజధాని నగరం నిర్మిస్తామనటం.. ప్రజాధనం దుర్వినియోగం, దోపిడీయే అవుతుందని దిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త రఘురామ్ పురిగళ్ల పేర్కొన్నారు. అమరావతి కోసం హడ్కో రూ. 7,500 కోట్ల రుణం ఇవ్వటానికి ఒప్పందం కుదిరిందని.. ఆ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు.

ఈ విమర్శల మీద ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో రుణం మీద కూడా అధిక వడ్డీయే ఉందని చెప్పారు. ‘‘ఏడాది రుణం మీద 10.10 శాతం, మూడేళ్ల రుణం మీద 10.25 శాతం, మూడేళ్లకు మించితే 10.35 శాతం వడ్డీతో నిధులు అందిస్తోందని బీబీసీతో చెప్పారు. హడ్కో వడ్డీ కన్నా అమరావతి బాండ్ల వడ్డీ తక్కువే ఉన్నా దానిపై విమర్శలు రావడాన్ని ఆయన తప్పుపట్టారు.

హడ్కోతో రూ. 7,500 కోట్ల రుణ ఒప్పందంలో ఇప్పటికి విడుదల చేసింది రూ. 900 కోట్లేనని ఆయన తెలిపారు.

చిత్రం శీర్షిక విభజన చట్టంలో.. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయానికి సంబంధించిన సెక్షన్

రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వటం లేదా..?

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో.. రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి వంటి వాటితో సహా అవసరమైన వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తుందని విభజన చట్టంలో స్పష్టంగా నిర్దేశించారు.

‘రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా? కేంద్రం కట్టవలసిన దానిని అధిక వడ్డీకి అప్పులు తీసుకువచ్చి కట్టడం ధర్మమేనా?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల తన పాదయాత్రలో భాగంగా జరిగిన ఒక బహిరంగ సభలో ప్రశ్నించారు.

‘‘అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఇచ్చింది. మరో రూ. 2,500 కోట్లు ఇస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. రాజధాని నగరాన్ని హెరిటేజ్ నగరంగా ప్రకటించింది. అందులో భాగంగా రూ. 78 కోట్లు ఇచ్చింది. స్మార్ట్ సిటీగా ప్రకటించి రూ. 1,890 కోట్లు కేటాయించింది. అందులో రూ. 1,000 కోట్లు విడుదల చేసింది.. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ వంటి చాలా ప్రాజెక్టులకు నిధులు అందిస్తోంది’’ అని బీజేపీ నేత రఘురామ్ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం రూ. 1,500 కోట్లు దుబారా చేసిందని విమర్శించారు. హైదరాబాద్ వంటి రాజధానిని రాత్రికి రాత్రి నిర్మించటం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ ప్రభుత్వ తపన రాజధాని నిర్మాణం కోసం కాదని.. అధికార పార్టీ పెద్దలు, నాయకులు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటానికి, విస్తరించుకోవటానికి పడుతున్న తాపత్రయమని ఆయన ఆరోపించారు.

‘’కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావటం లేదంటే.. ‘రాష్ట్రం లెక్కలు చెప్పటం లేదు’ అంటోంది కేంద్రం. మేం కూడా 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశాం. కేంద్రం నుంచి నిధుల విడుదల వార్షిక పద్ధితిలో ఉండదు. త్రైమాసిక పద్ధతిలో ఉంటుంది. మొదటి త్రైమాసికంలో విడుదల చేసిన నిధుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు చెప్పాలి’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.

కానీ రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన డబ్బులు వేటికీ రాష్ట్రం లెక్కలు చెప్పటం లేదని.. అందుకే కేంద్రంలో నిధులు తొక్కిపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లోపాలను సరిచేసుకుని, రాజధాని నిధుల కోసం ప్రతిపక్షాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ప్రభుత్వం ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తూ.. ఇష్టానుసారం అప్పులు చేస్తోందని విమర్శించారు.

Image copyright NAra chandrababu naidu/Facebook

‘‘కేంద్రం ఇచ్చింది రూ. 1,500 కోట్లే... కొర్రీలు పెడుతోంది...’’

అయితే.. కొత్త రాజధాని కోసం గడచిన నాలుగేళ్లలో కేంద్రం నుంచి అందిన నిధులు రూ. 1,500 కోట్లు మాత్రమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొన్నారు. కానీ.. ఇతర పథకాల కింద ఇచ్చిన నిధులను కూడా ఇందులో లెక్క చెప్తున్నారని తప్పుపట్టారు.

అమరావతిలో తొలి దశ నిర్మాణాలకు రూ. 48,000 కోట్లు అవసరమని.. ఈ పనులకు సంబంధించి కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించినప్పటికీ ఇంతవరకూ ఎటువంటి స్పందనా లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోగా ప్రతికూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అదేమంటే.. ఈసీలు అవీ అంటూ కొర్రీలు పెడుతోందన్నారు.

‘‘కేంద్రం సానుకూలంగా లేనపుడు.. కేంద్రానికి నిరసన తెలుపుతూ చేతులు కట్టుకుని కూర్చోవాలా? ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టకుండా ఆపివేయాలా?’’ అని ఆయన ప్రశ్నించారు. అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వ సహాయంతో పాటు ప్రపంచ బ్యాంక్‌, హడ్కో, వాణిజ్య బ్యాంకులు, బాండ్ల జారీ తదితర మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నామన్నారు.

చిత్రం శీర్షిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2018-19 బడ్జెట్‌లో వివరించిన అప్పుల వివరాలు

రూ. 2.50 లక్షల కోట్లకు చేరుతున్న ఏపీ అప్పులు...

రాష్ట్ర అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,49,435 కోట్లకు పెరుగుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. నాలుగేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచీ.. ఏపీ అప్పులు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. 2014-15లో రూ. 1,48,743 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆ మరుసటి ఏడాది అంటే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,73,853 కోట్లకు పెరిగాయి.

ఈ అప్పులు 2016-17లో రెండు లక్షల కోట్లు దాటి రూ. 2,01,314 కోట్లకు చేరాయి. 2017-18 సంవత్సరంలో అప్పుల భారం 2,25,234 కోట్లకు పెరిగిందని.. రాష్ట్ర బడ్జెట్ పత్రాలు చెప్తున్నాయి. ఇందులో 60 శాతం.. అంటే రూ. 1,34,551 కోట్లు మార్కెట్ అప్పులే ఉన్నాయి.

ఇక మొత్తం అప్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,49,435 కోట్లకు పెరుగుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. (ఇందులో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణల మధ్య పంపిణీ జరగని రూ. 23,483 కోట్ల అప్పు కూడా కలిపి ఉందని ప్రభుత్వం చెప్తోంది.) అప్పుల మొత్తం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 28.66 శాతంగా ఉంటాయని పేర్కొన్నారు.

మరోవైపు.. 2017 మార్చి నాటికి రాష్ట్ర రుణాల చెల్లింపుల గడువుల వివరాలను పరిశీలిస్తే.. తన రుణ బకాయిల్లో సగానికి పైగా అంటే రూ. 76,888 కోట్ల రుణాలను వచ్చే ఏడేళ్లలో లోపు తీర్చాల్సి ఉందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో ఉటంకించింది.

‘‘2019-21 మధ్య కాలంలో రూ. 21,120 కోట్ల మేర, 2021-23 మధ్య రూ. 26,192 కోట్ల మేర రుణాలను తీర్చాల్సి ఉందని తెలుస్తోంది. దీనివల్ల ఆయా సంవత్సరాల్లో ప్రభుత్వ బడ్జెట్లపై భారం పడుతుంది. ఈ కీలక సంవత్సరాలలో అదనపు అప్పుల భారాన్ని నివారించేలా రుణ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ఒక వివేచనాత్మక వ్యూహాన్ని రూపొందించుకోవాలి’’ అని కాగ్ సూచించింది.

Image copyright NAra chandrababu naidu/Facebook

సర్కారు అప్పుల తిప్పలా..? ప్రతిపక్షాల అసత్య ఆరోపణలా..?

‘‘ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి కొత్త రాష్ట్రం అప్పు లక్ష కోట్ల లోపే ఉంటే.. గత నాలుగున్నరేళ్లలోనే మరో 1.30 లక్షల కోట్లు అప్పులు పెరిగాయి. ఒకవైపు అప్పుల భారంతో, వాటికి వడ్డీలు కట్టలేక సతమవుతూ ఉంటే.. ఇంకా బాండ్ల పేరుతో అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ.. ఇది తమ గొప్ప అని చెప్పుకోవటం ప్రజలను తప్పుదారి పట్టించటమే’’ అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.

ప్రతిపక్ష నేతలు చెప్తున్న అప్పుల లెక్కలు వాస్తవదూరమని కుటుంబరావు కొట్టివేశారు. ‘‘రాష్ట్ర విభజన సమయానికి రాష్ట్రానికి రూ. 1.19 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. అవిగాక మరో రూ. 28,000 కోట్ల అప్పు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు. అవీ ఏపీ పద్దులోనే కలిసున్నాయి. ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు సుమారు రూ. 68,000 కోట్లు’’ అని ఆయన తెలిపారు.

‘‘రాష్ట్ర విభజన సమయానికే ఉన్న మొత్తం రూ. 1.47 లక్షల కోట్ల అప్పుకు సగటున 8.2 శాతం వడ్డీ రేటు ఉంది. నాలుగేళ్లుగా చేసిన అప్పుల్లో అధిక భాగం ఈ వడ్డీలు కట్టటానికే సరిపోతోంది’’ అని చెప్పారు.

Image copyright APCRDA/Facebook

’’బ్యాంకుల నుంచి కాకుండా.. మార్కెట్ బాండ్లు ఎందుకు..?‘‘

రాష్ట్ర ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్‌బీఎం) పరిమితులకన్నా అధికంగా అప్పులు ఉండటం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందటం కష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవటానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించకపోవటంతో.. అప్పులు తెచ్చుకునే స్థానం లేకనే చంద్రబాబు ప్రభుత్వం బాండ్లు వంటి దారులు వెదుకుతోందన్నారు. దొరికనకాడ దొరికినంత అన్నట్టు అప్పులు చేస్తూ బాధ్యతారహితంగా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి ఆంధ్రప్రదేశ్ 2005లో సవరణ చేసింది. ఆ చట్టం ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 27.6 శాతం లోపు ఉండాలి. కానీ.. ఆ ఏడాది రుణాల శాతం 28.25 శాతంగా ఉందని ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు చెప్తున్నాయి.

పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సవరించలేదు. అయితే.. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ నిధుల సమస్య ఎదుర్కొంటున్నందున రుణ పరిమితిని పెంచేలా ఆ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. ఇంతవరకూ ఆ పని చేయలేదు.

అయితే.. నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కేంద్రాన్ని నిందించకుండా.. కేంద్రం సహకరించకపోయినా అందుబాటులో ఉన్న మార్గాల్లో నిధులు సమకూర్చుకుంటూ అభివృద్ధి పనులు పూర్తిచేయటానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించటం సంకుచిత రాజకీయాలని కుటుంబరావు తప్పుపట్టారు.

Image copyright APCRDA/Facebook

‘‘ఈ అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారతాయి...’’

‘‘రాజధాని నిర్మాణం కోసం ఎన్నికల సంవత్సరంలో రూ. 60 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఈ మొత్తం వడ్డీ రేట్లతో ఇటు ఆర్థిక సంస్థల నుంచి గాని, బాండ్ల రూపంలోగాని ప్రభుత్వ హామీ మీదనే సేకరించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం అదనంగా చేస్తున్న అప్పు. ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పుతో మూలుగుతున్న రాష్ట్ర ప్రజల మీద పడే అదనపు తాటికాయ అమరావతి అప్పులు’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఒక విశ్లేషణలో అభివర్ణించారు.

ఇవి కాలక్రమంలో పరిణతి చెందాల్సిన మహానగరాన్ని ఒకేసారి నిర్మించాలనే వాస్తవ దూరమైన ప్రాతిపదికపై జరుగుతున్న కార్యక్రమానికి చేస్తున్న అప్పులని ఆయన తప్పుపట్టారు.

‘‘ఒక పరిపాలన రాజధానిని రూ. 10 వేల కోట్లలో నిర్మించడమే సమస్యకు పరిష్కారం. అలా కాకుండా ఇప్పటికిప్పుడు ఒక మహానగరం ఏర్పడాలనే భావనతో ముందడుగు వేస్తే ఆ కార్యక్రమం అటు అమరావతికి, ఇటు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి గుదిబండగా మారుతుంది’’ అని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)