ప్రెస్ రివ్యూ: ‘ఇది బాహుబలికి మించి’

అమితాబ్, ఆమిర్ ఖాన్

ఫొటో సోర్స్, Deccan Chronicle

బాలీవుడ్‌లో మునుపెన్నడూ విడుదల కానన్ని థియేటర్లలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాను విడుదల చేయనున్నట్లు దక్కన్ క్రానికల్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాకు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకూ పెద్ద బడ్జెట్ బాలీవుడ్ సినిమాలను గరిష్టంగా 3,500-4,000 థియేటర్లలో విడుదల చేశారు.

అయితే భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి మార్కెట్ ఉండటంతో కథ మారింది. బాహుబలి-2, దంగల్ సినిమాలకు విదేశాల్లో దక్కిన ఆదరణతో ఈ సినిమాను దేశ, విదేశాల్లో గతంలోకంటే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని యాష్‌రాజ్ నిర్మాణ సంస్థ భావిస్తోంది.

‘‘ఈ సినిమాను కేవలం 3డీ, ఐమాక్స్‌లకే పరిమితం చేయకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. యాష్‌రాజ్ నిర్మాణ సంస్థలో ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ నటించిన థగ్స్ ఆప్ హిందుస్థాన్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి’’ అని ఒక సినిమా వ్యాపార నిపుణుడు అన్నారు.

ఈ సినిమాతో హిందీ సినీ పరిశ్రమ ప్రపంచ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే అవకాశాలున్నాయని దక్కన్ క్రానికల్ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆరెస్సెస్ వేదికపై రాహుల్ గాంధీ?

ఆర్ఎస్సెస్ నిర్వహించనున్న కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశాలున్నాయంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

సెప్టెంబర్‌ 17-19 వరకు మూడు రోజులపాటు 'భవిష్యత్‌ భారత్‌: ఆరెస్సెస్‌ దృక్పథం' పేరుతో దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆరెస్సెస్‌ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్‌ అభిప్రాయాలను ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు.

అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇస్లామిక్‌ రాడికల్‌ గ్రూప్‌ అయిన ముస్లిం బ్రదర్‌ హుడ్‌తో ఆరెస్సెస్‌ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ను సమావేశానికి ఆహ్వానించి.. ఆయనకు సంఘ్‌ గురించి అవగాహన కల్పించాలని ఆరెస్సెస్‌ భావిస్తోందని సాక్షి పేర్కొంది.

'వివిధ రంగాల్లోని మేధావులు, ప్రముఖులతో భాగవత్‌ చర్చిస్తారు. జాతీయ ప్రాధాన్యమున్న అంశాల్లో సంఘ్‌ దృక్పథాన్ని వారితో పంచుకుంటారు' అని సంఘ్‌ ప్రచార్ ప్రముఖ్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారని సాక్షి కథనం.

ఫొటో సోర్స్, governor.tsap.nic.in

ఫొటో క్యాప్షన్,

గవర్నర్ నరసింహన్

ముందస్తుగా గవర్నర్ ఏం చేస్తారు?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్ న్యాయనిపుణుల సలహా కోరినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. ఆ కథనంలో..

అసెంబ్లీ రద్దుకు తొలుత మంత్రివర్గం తీర్మానం చేస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దానిని గవర్నర్‌కు పంపుతుంది. ఇక్కడి నుంచే గవర్నర్‌ పాత్ర మొదలవుతుంది. కేబినెట్‌ సిఫారసును ఆయన ఆమోదించక తప్పదు.

మెజారిటీ ప్రభుత్వం ఈ తీర్మానం చేసినందున ఇక్కడ ఆయన తన సొంత విచక్షణను ఉపయోగించే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

''పూర్తి మెజారిటీ ఉన్న కేబినెట్‌ అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేస్తే.. ఆ నిర్ణయానికే గవర్నర్‌ కట్టుబడి ఉండాలి. ప్రతిపక్ష పార్టీకి పూర్తి మెజారిటీ లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో కేబినెట్‌ సిఫారసుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అధికారాలు గవర్నర్‌కు లేవు'' అని తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యాయ నిపుణుడు ఒకరు తెలిపారు.

గవర్నర్‌ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు న్యాయవాది గండ్ర రామ్మోహనరావు తెలిపారు. ''కేబినెట్‌ సలహాలు, సిఫారసుల మేరకు వ్యవహరించాలి. అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్‌ సిఫారసు చేస్తే గవర్నర్‌ దానిని తప్పక ఆమోదించాల్సిందే'' అని వివరించారు.

''ముందస్తుగానే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ తీసుకునే నిర్ణయంపై కేంద్రానికి సీల్డ్‌ కవరులో నివేదిక ఇవ్వొచ్చు. అసెంబ్లీని రద్దు చేయడానికి తగిన కారణాలు చూపాలని అడగొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అనంతరం రెండు ప్రభుత్వాలు ఒకేసారి ఏర్పడ్డాయి. రెండుచోట్ల ఒకేసారి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అక్కడ లేకుండా ఇక్కడ ఎన్నికలకు ఆమోదం చెప్పడం సరికాదు'' అని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ తెలిపారంటూ ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, High court website

హైకోర్టుపై కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే కొత్త కోర్టు ఏర్పాటు చేయాలన్న ఉమ్మడి హైకోర్టు తీర్పుపై మూడేళ్ల తరువాత సుప్రీంలో ప్రత్యేక పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది.

కొత్తకోర్టు ఏర్పాటుకు ఉన్నత న్యాయస్థానం తీర్పు అవరోధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి హైకోర్టులే నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటి వరకు కేంద్రం చెబుతూ వచ్చింది. ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయడానికి ఓ వైపు జాప్యం జరుగుతుండగా న్యాయస్థానం విభజనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి న్యాయస్థానాన్ని విభజించి తెలంగాణలోనే తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ఉద్దేశం కావచ్చని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

హైకోర్టు విభజన అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా హైకోర్టు, ఏపీ ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందంటూ కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటీషన్ దాఖలు చేసిన దరిమిలా తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసే పరిస్థితి రావచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ విషయంలో సుప్రీం కోర్టు వైఖరే కీలకం కానుంది. ఎస్‌ఎల్‌పీపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ ఈనెల 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు. ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఎస్‌ఎల్‌పీ ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశాలున్నాయని ఈనాడు కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)