విరసం నేత వరవరరావు, పలువురు పౌర హక్కుల నేతల అరెస్ట్, దేశ వ్యాప్తంగా పలు ఇళ్లలో సోదాలు

  • బీబీసీ
  • తెలుగు డెస్క్
వరవరరావు

ఫొటో సోర్స్, facebook/Varavara Rao

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావు, మరికొందరు పౌర హక్కుల నాయకుల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. అనంతరం వరవరరావును అరెస్ట్ చేసి తమతో పాటు పూణే తీసుకెళ్లారు.

అరెస్ట్ అనంతరం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వరవరరావు ఇంటి వద్ద ఉన్న బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 29వ తేదీ బుధవారం పూణే కోర్టులో వరవరావును, ఇతర పౌర హక్కుల నాయకులను హాజరుపర్చనున్నారు.

భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు జూన్ మొదటివారంలో కొందరిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం.

ఈ మేరకు వరవరరావుపై ఐపీసీ 153 (ఏ), 505 (1) (బీ), 117, 120 (బీ), చట్ట వ్యతిరేక చర్యల (నియంత్రణ) చట్టం సెక్షన్ 13, 16, 17, 18 (బీ), 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పూణే జిల్లా విశారంబాగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

వరవరరావు ఇంటి వద్ద పరిస్థితి

హైదరాబాద్‌తోపాటుగా ముంబై, పుణే, గోవా, రాంచి, దిల్లీ నగరాల్లోని మానవహక్కుల నేతల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా.. ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వరవరరావు, ఆయన అల్లుళ్ల(కుమార్తెల భర్తలు) ఇళ్లల్లో, విరసం సభ్యుడు, పాత్రికేయుడు క్రాంతి, అధ్యాపకుడు ఖాసిం, నివాసాల్లో కూడా పుణే పోలీసులు సోదాలు చేశారు.

హైదరాబాద్‌తోపాటుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు పుణే జాయింట్ కమిషనర్ శివాజీ భద్కే వెల్లడించారు. బీమా కోరెగావ్ హింసకు సంబంధించి ముఖ్యంగా ఎల్గార్ పరిషత్ యాక్టివిటీస్‌కు సంబంధించి ఈ దాడులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

వరవరరావు భార్య
వరవరరావు మద్దతుదారులు

ఈ కేసులో రోనా విల్సన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.

రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. పోలీసుల ఆరోపణలను హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్ర అని, ప్రశ్నించే గొంతునొక్కడమేతప్ప మరేమీ కాదని అంటున్నారు.

ముంబైలో అరుణ్ ఫెరీరా, వరుణ్ గోంజాల్వెజ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. హరియాణలోని సూరజ్ కుండ్ సమీపంలో చత్తీస్‌గఢ్ పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీస్ కార్యకర్త సుధా భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె కుమార్తె బీబీసీతో అన్నారు.

ఎన్నికలకు సన్నాహకంగా చేస్తున్నారా?

అరుంధతీరాయ్ బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ.. పలువురు న్యాయవాదులు, రచయితలు, కవులు, దళిత హక్కుల నేతలు, మేథావుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపారని తెలిపారు.

హత్యలు, మూక దాడులు చేస్తున్నవారిని కాకుండా మేథావులు, పౌరహక్కుల నేతలను ఇలా చేయడం దేశం ఎటువైపు వెళ్తోందో సూచిస్తోందని అన్నారు.

హంతకులను ప్రోత్సహిస్తూ.. న్యాయం కోసం, హిందు మెజారిటేరియనిజానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని క్రిమినల్స్‌గా చూపుతున్నారని ఆరోపించారు.

ఎన్నికలకు సన్నాహకంగా ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

పోలీసుల పంచనామా రిపోర్టు
ఫొటో క్యాప్షన్,

పూణే పోలీసులు విడుదల చేసిన పంచనామా రిపోర్టు

వరవరరావు ఇంటి నుంచి పోలీసులు ఏమేం స్వాధీనం చేసుకున్నారంటే..

వరవరరావు ఇంట్లో సోదాలు చేసినట్లు పూణే పోలీసులు పంచనామా రిపోర్టులో తెలిపారు.

విశారంబాగ్ పోలీసు స్టేషన్‌కు చెందిన సైబర్ నిపుణుడు సందీప్ గాడియా ఈ సోదాలకు నేతృత్వం వహించారు.

సికింద్రాబాద్‌లోని హిమసాయి హైట్స్‌లో ఉన్న వరవరరావు ఫ్లాట్‌లో సోదాల అనంతరం 500 జీబీ హార్డ్ డ్రైవ్, ఆరు సెల్‌ఫోన్లు, ఏడు సిమ్ కార్డులు, ఇంటర్నెట్ కార్డు, యూఎస్‌బీ డ్రైవ్, పాల పిట్టల పాటల ఆడియో క్యాసెట్, భారతదేశంలో మావోయిస్టులు పేరిట ఉన్న ఒక క్యాసెట్, 50 ఏళ్ల నక్సల్బరీ పేరిట ఉన్న మూడు డీవీడీలు, ఇంకా పలు సీడీలు, డీవీడీలు, లెటర్స్ ఆఫ్ మావోయిస్ట్ పార్టీ పేరిట ఉన్న ఒక ప్యాకెట్ లెటర్లు.. ఇందులో సీపీఐ (మావోయిస్టు)కు సంబంధించిన 140 పేజీల సమాచారం ఉంది, సీమా ఆజాద్, మైనా రఫీఖ్ తదితరుల వ్యాసాలతో కూడిన ఒక ప్యాకెట్, ఇందులో కూడా సీపీఐ (మావోయిస్టు)కు సంబంధించి 97 పేజీల సమాచారం ఉంది, భూస్వాములు కనుమరుగు, విప్లవ సాధన పేరిట మావోయిస్టు పార్టీ వ్యాసాలతో కూడిన 37 పేజీల ప్యాకెట్, మావోయిస్టు పార్టీ నుంచి విరసంకు అన్న పేరిట ఉన్న 56 పేజీల సమాచారంతో కూడిన పసుపు పాలిథీన్ బ్యాగ్, నక్సల్ నేరాల్లో నిందితులుగా ఉన్న పలువురి నుంచి వరవరరావుకు వచ్చిన 15 లేఖలు, సీపీఐ (మావోయిస్టు)కు సంబంధించిన పార్టీ డాక్యుమెంట్లు, ప్రచార సామాగ్రి, డైరీలు, ఫోన్ బుక్‌లు, 64 జీబీ మెమరీ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వరవరరావు

ఫొటో సోర్స్, Getty Images

వరవరరావుకు అనారోగ్యం..నిరంతరం మందులు అందించాలి: న్యాయవాది రవీంద్రనాథ్

వరవరరావు న్యాయవాది బి రవీంద్రనాథ్ ఈ అరెస్టుపై స్పందిస్తూ.. "ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం రెండు వరకూ పుణె పోలీసులు వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. మరాఠీ భాషలో ఒక పంచనామా నివేదిక ఇచ్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సాహిత్యం, హార్డ్ డిస్కు స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు భార్యకు సమాచారం ఇచ్చారు. ట్రాన్సిట్ వారెంటు కోసం నాంపల్లిలోని ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పుణెలోని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆయన్ను అరెస్టు చేసినట్టు కోర్టులో చెప్పారు. చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం (అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) లోని వేర్వేరు సెక్షన్ల కింద ఆయనపై కేసులు పెట్టారు. పుణె కోర్టులో హాజరుపర్చడానికి 48 గంటల సమయం అడిగారు పోలీసులు. పుణెకి హైదరాబాద్ నుంచి ఒక రాత్రిలో వెళ్లిపోవచ్చనీ కాబట్టి అంత సమయం ఇవ్వక్కర్లేదని మేం వాదించాం. దీంతో రేపు సాయంత్రం (29 ఆగస్టు) ఐదు గంటలలోపు పుణె కోర్టులో ఆయన్ను హాజరుపర్చాలని జడ్జి ఆదేశించారు. తనకు అనారోగ్యం ఉందనీ మెదడులో రక్తం గడ్డ కట్టడం, బిపి, షుగర్, సైనస్, పెంక్రియాస్ పెరుగుదల వ్యాధులతో తాను బాధపడుతున్నాననీ, వాటికోసం అల్లోపతి హోమియో మందులు వేసుకుంటున్నట్టు వరవరరావు కోర్టులో చెప్పగా, ఆయనకు తగిన మందులు నిరంతరం అందించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. వారు 3.30 - 4 ప్రాంతంలో కోర్టు నుంచి వెళ్లారు" అని చెప్పారు.

అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రశాంత్ భూషణ్: వేణుగోపాల్

పాత్రికేయులు, వరవరరావు బావమరిది ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు. పంచనామా నివేదిక ఇచ్చారు. కానీ చట్ట ప్రకారం పంచనామా నివేదిక నిందితుడికి అర్థమయ్యే భాషలో ఇవ్వాలి. కానీ మరాఠీలో ఇచ్చారు. ఆ భాష వరవరరావు, ఆయన భార్యకు రాదు. పంచనామాలో సాక్షులు కూడా పెద్ద మనుషులు ఉండాలి. కానీ వారు సొంత సాక్షులను తెచ్చుకున్నారు. అసలు ఆ నివేదికల్లో ఏం రాశారో మాకు తెలియదు. ఆ రిపోర్టు మాకిచ్చి ఆయన్ను తీసుకెళ్లిపోయారు. ఆయన్ను రేపు పుణె కోర్టులో ప్రవేశ పెడతారు. మేం వెంటనే బెయిల్ కోసం పుణె కోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటికే ప్రశాంత్ భూషణ్, బృందా గ్రోవర్లు ఈ అరెస్టులపై సుప్రీం కోర్టుకు వెళ్ళారు. కేవలం వరవర రావు కోసమే కాదు, అరెస్టయిన ఇతరులను కలిపి వారు ఈ కేసులు పెట్టారు’’ అన్నారు.

వరవరరావు ఓటరు ఐడీ కార్డు

మోదీ హత్యకేసులో ఆయన పేరు ఉంది.. కాబట్టి వారెంట్ అక్కర్లేదు అన్నారు: వరవరరావు భార్య హేమలత

వరవరరావు భార్య హేమలత మాట్లాడుతూ.. ‘‘ఆయనపై 25 కేసులు పెట్టినా ఒక్క కేసులో కూడా శిక్ష పడలేదు. పోలీసులు ఎప్పుడు వచ్చినా ఇంటిలో కూర్చుని టీ తాగి, ఆయన సిద్ధమయ్యే వరకూ ఉండి తీసుకెళ్లేవారు. కానీ ఈసారి పద్ధతి అలా లేదు. తలుపులు తోసుకుని వచ్చారు. అరెస్టు వారెంట్ లేదంటూ పది పదిహేను నిమిషాలు ఆపాం. కానీ మోదీ హత్య కేసులో ఆయన పేరు ఉంది కాబట్టి వారెంట్ అక్కర్లేదు అన్నారు. వెంటనే సెర్చ్ మొదలుపెట్టి ఇంట్లో ఉన్న అన్నీ సర్దడం మొదలుపెట్టారు. ప్రతీ వస్తువూ తీశారు. వంటిల్లు కూడా వదల్లేదు. ఆరు గంటల నుంచీ రెండున్నర వరకూ ఇంతే. నేనే టీ కలిపి వాళ్లకు ఇచ్చి నేను తాగాను. ఈసారి కొత్త విషయం ఏంటంటే మా పిల్లల్ల ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. 16 రోజుల చంటిపాప ఉంది. ఆమె ఇంట్లో చాలాసేపు సోదాలు చేశారు. మాకు అరెస్టులు కొత్త కాదు. 40 ఏళ్ల నుంచి ఈ జీవితం అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన 78 ఏళ్ళ మనిషి ఆరోగ్యం బాలేదు, ఎక్కడికి వెళ్లడం లేదు. ఆయన ఎక్కడ తట్టుకుంటారు అంటూ నాకు బాధ అనిపిస్తుంది’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎఫ్ఐఆర్ లేదు.. మరెందుకు సోదాలు?: విరసం సభ్యుడు క్రాంతి

విరసం సభ్యుడు టేకుల క్రాంతి మాట్లాడుతూ.. ‘‘నన్ను నిద్రలేపారు. చుట్టూ చూస్తే నలుగురైదుగురు కొత్త వాళ్లున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మహారాష్ట్ర పోలీసులు పది మంది, తెలంగాణ పోలీసలు పది మంది వరకూ ఉన్నారు. ఇంటి నిండా పోలీసులే ఉన్నారు. మా అమ్మకి గుండె జబ్బు ఉందన్నా బంధువులను లోనికి రానివ్వలేదు. ఏం జరుగుతుంది అని అడిగితే చెప్పలేదు. మా ఇంట్లో సాహిత్యం ఉండడం సహజం. ఆ పుస్తకాలన్నీ తీసుకున్నారు. ఏదైనా ఎఫ్‌ఐఆర్ ఉందా అంటే లేదన్నారు. మరెందుకు సెర్చ్ అంటే క్లూస్ ఉన్నాయన్నారు. అవేంటని అడిగితే, తర్వాత వెళ్లేప్పుడు చెబుతాం అన్నారు. కానీ చెప్పలేదు. వాళ్లు మరాఠీలో మాట్లాడుకున్నారు ఏమీ అర్థం కాలేదు. చివరగా సంతకాలు చేయమన్నారు చేశాను. నాకున్న రెండు ఈమెయిల్ ఐడీల పాస్ వర్డులూ చెప్పమన్నారు. తరువాత మీడియా వాళ్లు మా ఇంట్లోకి వచ్చాక గానీ బయట ఏం జరుగుతుందో తెలియలేదు. మా అమ్మ ఇంట్లో పడిపోతే బయటకు తీసుకెళ్లారు. కనీసం ఇంట్లో కూర్చుంటానన్నా కూర్చోనివ్వలేదామెను’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)