ఆసియా క్రీడలు: చరిత్ర సృష్టించిన సింధు.. బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు అమ్మాయి పీవీ సింధు ఆసియా క్రీడల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయారు.

ఈ మ్యాచ్‌లోవరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తాయ్ జు రెండు వరుస గేమ్‌లలో సింధుపై విజయం సాధించారు.

మొదటి గేమ్‌ను తాయ్ జు 21 - 13, రెండో గేమ్‌ను 21 - 16 తేడాతో గెలిచి స్వర్ణం చేజిక్కించుకున్నారు. దీంతో సింధు రజతానికి పరిమితమయ్యారు.

జపాన్‌కు చెందిన అకానె యమగూచిపై విజయం సాధించడం ద్వారా ఆసియాడ్‌లో ఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళగా సింధు రికార్డు సృష్టించారు.

హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో 21-17, 15-21, 21-10 తేడాతో రెండో సీడ్ యమగూచిపై సింధు విజయం సాధించారు.

65 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చివరి గేమ్‌లో 50 షాట్ల పాటు సాగిన ర్యాలీ ఆ మ్యాచ్‌కే హైలైట్‌ అని విశ్లేషకులు పేర్కొన్నారు.

తొలి గేమ్ సింధు నెగ్గగా, రెండో గేమ్ యమగూచి గెల్చుకున్నారు. దీంతో మూడో గేమ్ నిర్ణయాత్మకంగా మారింది.

కానీ సింధు ఆ గేమ్ చాలా సులభంగా గెల్చుకుని ఫైనల్‌కు చేరారు.

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్‌ను మతంగా భావించే భారతదేశంలో పీవీ సింధు ఇప్పుడు ఒక స్టార్‌గా మారారని, ఆమె మరికొంత కాలం పాటు స్టార్‌ క్రీడాకారిణిగా కొనసాగుతారని బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే తెలిపారు.

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల్లాగే ఇప్పుడు సింధు కూడా పెద్ద ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్నారని చెప్పొచ్చు.

పీవీ సింధు తప్పనిసరిగా విజయం సాధించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆమె రజతంతో సరిపెట్టుకున్నప్పటికీ ఇదేమీ చిన్న విజయం కాదు.

ఫోర్బ్స్ ‘అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా క్రీడాకారుల’ జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచారు.

ఈ జాబితా విడుదలైన కొన్ని రోజులకే ఆమె ఆసియాడ్‌లో ఫైనల్‌కి చేరి చరిత్ర సృష్టించారు.

అంతకు ముందు జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై నెగ్గడం ద్వారా తాయ్ జు యింగ్ ఫైనల్‌కు చేరారు.

దీంతో సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

తాయ్ జు వర్సెస్ సింధు

ఇప్పటి వరకు తాయ్ జు, సింధుల మధ్య జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే తాయ్ జు దే పైచేయి .

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరెషన్ ప్రకారం.. ఇప్పటి వరకూ వీరిద్దరూ వివిధ వేదికలపై 13 మ్యాచ్‌లలో తలపడ్డారు.

వీటిలో తాయ్ జు 10 మ్యాచ్‌లు గెలవగా.. సింధు 3 సార్లు గెలిచారు.

ముఖ్యంగా గత అయిదు మ్యాచ్‌లలో తాయ్ జు సింధుపై వరుస విజయాలు సాధించారు.

ఈ ఏడాది జరిగిన మలేసియా ఓపెన్, 2017 హాంకాంగ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇంగ్లండ్ ఓపెన్, 2016 హాంకాంగ్ ఓపెన్‌లలో తాయ్ జు గెలిచారు. తాజాగా ఆసియాడ్‌లోనూ సింధుపై తాయ్ జూ విజయం సాధించారు.

అయితే.. 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు తాయ్ జును ఓడించారు.

ఫొటో సోర్స్, Getty Images

‘తాయ్ జు కొంచెం కష్టమే’

వైవిధ్యభరితమైన షాట్లు, అంతుబట్టని వైఖరితో ఆడుతున్న తాయ్ జును ఓడించడం కొంచెం కష్టమేనని సైనా నెహ్వాల్ అన్నారు.

పీటీఐ కథనం ప్రకారం.. ‘‘ఆమెపై గెలవాలంటే మరింత వేగంగా కదలాలి.. ఆమె ర్యాలీలూ అర్థం కావు. చాలా వెరైటీ షాట్లు ఆడుతోంది. ఆమెపై గెలవాలంటే మరింత వేగం కావాలి. ఆమెను అర్థం చేసుకోవడం నాకు అంత సులభం కాదు’’ అని సైనా విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)