నాగ్‌పూర్ అత్యాచారం: పాతికేళ్ల నా సర్వీసులో.. అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు

  • జైదీప్ హార్దికర్
  • బీబీసీ ప్రతినిధి
ఉమ్రెడ్ ఘటన

ఓ పక్క దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగినప్పుడు మరోపక్క నాగ్‌పూర్‌లో ఓ యువతి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య పోరాడుతూ ఆస్పత్రిలో చేరింది.

ఆమెను ఆగస్టు 14 రాత్రి నాగ్‌పూర్‌లోని ఆరేంజ్ ఆస్పత్రికి చేర్చాక, బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అక్కడి వైద్యులు భయపడ్డారు. ఆమె తల, మొహం నుజ్జునుజ్జయ్యాయి. ఎడమ కంటి గుడ్డు బయటకు పొడుచుకొచ్చింది. నోరు చిట్లిపోయి పక్కకు జరిగింది. ఒంటినిండా అనేక గాయాలున్నాయి. చాలా రక్తం పోయింది.

‘అది మనుషులు చేసిన పనిలా కనిపించలేదు, ఏదో మృగం చేసిన దాడిలానే ఉంది’ అని ఆరేంజ్ ఆస్పత్రి క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్ డా.రాజేష్ అటల్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. ‘ఇక్కడికి వచ్చే సమాయానికి ఆమె భరించలేని నొప్పి, భాధను అనుభవిస్తోంది. అతి కష్టమ్మీద ఊపిరి తీసుకుంటోంది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్త పోటు పడిపోయింది’ అని ఆయన అన్నారు.

26ఏళ్ల ఆ యువతిపై అత్యాచారం జరిపి ఆ తరువాత రెండున్నర కేజీల బరువున్న రాయితో ఆమె మొహంపై తీవ్రంగా దాడి చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయు. ఆ ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.

బాధితురాలు నాగ్‌పూర్‌కు దగ్గర్లోని ఉమ్రెడ్‌లో ఉన్న ‘వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్’ ఉద్యోగి. ఆమె పని చేసే చోటుకు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఆగంతుకులు ఆమెను అనుసరించి, అత్యాచారం జరిపి తరువాత హత్య చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆ వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. నేరం జరిగిన సమయంలో చుట్టూ పదుల సంఖ్యలో లారీలున్నా ఎవరూ వారిని గమనించలేదు.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం 8గం.కు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే సమయానికి ‘ఉమ్రెడ్ బాధితురాలు’ ఆపరేషన్ థియేటర్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె గాయాలకు శస్త్ర చికిత్స చేయడానికి నలుగురు సర్జన్లకు ఎనిమిది గంటలు పట్టింది. దాడి తరువాత ఆమెకు చేసిన సర్జరీల్లో అది మొదటిది.

‘ఆమె తలపై చాలా ఫ్రాక్చర్లయ్యాయి. అదృష్టవశాత్తూ మెదడుకు ఎలాంటి గాయాలూ కాలేదు. చాలా పళ్లు విరిగిపోయాయి. నోరు మొత్తం చిట్లింది. 25ఏళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం ఆ యువతి కోలుకుంటోంది. సైగల ద్వారా సంభాషిస్తోంది. కొన్ని రోజుల్లో మాట్లాడుతుందని ఆశిస్తున్నాం’ అని డా.రాజేష్ అన్నారు.

‘ఆ యువతి వాంగ్మూలమే మా విచారణకు చాలా కీలకం’ అని ఉమ్రెడ్ డీఎస్పీ పౌర్ణిమా తవారే చెప్పారు. కేసులో ప్రధాన నిందితులైన మమ్లేష్ చక్రవర్తి(24), సంతోష్ మాలి(40)లను అరెస్టు చేసి వారిపైన అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. చక్రవర్తి లారీ క్లీనర్, మాలి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆ ఘటన జరిగినప్పుడు ప్రధాన నిందితుడైన మాలి మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

‘నా కూతరు మాట్లాడుతుంది. తనపై దాడి చేసిన వారికి శిక్షపడేలా చేస్తుంది’ అని బాధితురాలి తల్లి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. ‘బొగ్గు గనిలో పని వాతావరణం ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ తన కాళ్లమీద తాను నిలబడాలని, అందుకే అక్కడ పనిచేస్తున్నానని నా కూతురు చెప్పేది’ అంటూ ఆమె గుర్తుచేసుకున్నారు.

బాధితురాలి తల్లిదండ్రులు, సోదరుడు ఛత్తీస్‌గఢ్‌లో ఉంటారు. ఆమె తండ్రి తన ఐదెకరాల భూమిని బొగ్గు గనికి బదిలీ చేశారు. దానికి పరిహారంలో భాగంగా ఆయన కూరుతుకు ఆ గనిలోనే క్లెరికల్ ఉద్యోగం ఇచ్చారు.

‘బాధితురాలు గనిలోని వెయి బ్రిడ్జ్ దగ్గర పనిచేస్తోంది. ఆ ఘటన జరిగిన రోజు వర్షం కురుస్తోంది. గనికి దగ్గర్లో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అందులో ఒకరు వెయి బ్రిడ్జ్ నంబర్ 4 దగ్గర పనిచేసే వ్యక్తి బంధువు. దాంతో అక్కడ పనిచేసే వ్యక్తి సెలవు పెట్టి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో వెయి బ్రిడ్జ్ 1 దగ్గర పనిచేసే ఆ యువతిని వెయి బ్రిడ్జ్ 4కి పంపించాం. కానీ ఆ వెయి బ్రిడ్జి మిగతా నిర్మాణాలకు కాస్త దూరంగా ఉంటుంది.

మధ్యాహ్నం 1.50 ప్రాంతంలో భోజనం చేశాక ఆ యువతి వెయి బ్రిడ్జ్ దగ్గర్లో ఉన్న టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడే ఈ ఘటన జరిగింది’ అని గని సేఫ్టీ మేనేజర్ రవీంద్ర ఖేడ్కర్ చెప్పారు.

‘మధ్యాహ్నం 2గం.ల ప్రాంతంలో ఆ యువతి టాయిలెట్ వైపు వెళ్లడం వెయి బ్రిడ్జ్ 1కి అమర్చిన సీసీ టీవీలో నమోదైంది. ఆమె వెనకే నిందితుడు కూడా వెళ్లాడు. 17 నిమిషాల తరువాత ఆ వ్యక్తి వెనక్కు వచ్చాడు. కానీ, ఆ యువతి మాత్రం రాలేదు’ అని స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ హకే తెలిపారు.

మధ్యలో ఉన్న ట్రక్కుల వల్ల అవతలివైపు ఉన్నవాళ్లకు టాయిలెట్ కనిపించలేదని, లేకపోతే ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. గనిలోని మరో ట్రక్కు డ్రైవర్ ఆమెను గుర్తించాడు. తరువాత అందరూ కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఉమ్రెడ్‌లో నిరసనలు

ఆగస్టు 16న ఈ ఘటనకు వ్యతిరేకంగా ఉమ్రెడ్ వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, మహిళా ఉద్యోగికి భద్రత కల్పించలేని గని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా మంది వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పది వేల మంది ర్యాలీ చేపట్టారు.

ప్రస్తుతం యాజమాన్యం వెయి బ్రిడ్జ్ 1 దగ్గర టాయిలెట్‌ను నిర్మిస్తోంది.

డిగ్రీ పూర్తి చేసిన బాధితురాలు ఉమ్రెడ్‌లోనే పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ రోజూ 32 కి.మీ. ప్రయాణించి గనిలో పనికి వెళ్తోంది.

గనిలో మహిళల భద్రత గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ పీఆర్‌వో నుంచి ఇంకా సమాధానాలు రాలేదు.

‘ఇటీవలి కాలంలో ఉమ్రెడ్‌లో చాలామంది చదువుకున్న యువతీ యువకుల్ని ఉద్యోగంలోకి తీసుకున్నాం. వారిలో కనీసం వందిమంది భూమి పరిహారంలో భాగంగా ఉద్యోగాలు పొందిన వారే. బాధితురాలు కూడా అలాంటి వాళ్లలో ఒకరు’ అని గని ఉన్నతాధికారుల్లో ఒకరు అన్నారు.

ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులు రెండో ఆలోచన లేకుండా బాధితురాలి సోదరుడికి బదులు ఆమెకే ఉద్యోగం ఇప్పించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే గని యాజమాన్యం, ఉద్యోగుల నిర్వహణ బాధ్యతను చూసే ఓ అధికారిని ఉమ్రెడ్ నుంచి నాగ్‌పూర్‌కు బదిలీ చేసింది. దాంతో ఒకరి తప్పిదాన్ని కప్పిపుచ్చి మరెవరినో బలిపశువును చేస్తారేమోననే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

‘దాదాపు 300 మంది అర్హత కలిగిన మహిళలను డబ్ల్యుసీఎల్ ఉమ్రెడ్ ప్రాంతంలో జనరల్ కేటగిరీ వర్కర్ల కింద యాజమాన్యం నియమించింది. కానీ వీరి సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై వారికి స్పష్టత లేదు. సురక్షితం కాని ప్రాంతాల్లో వారికి పని కల్పించే ముందు మానవ వనరుల విభాగం ఒక్కసారి కూడా ఆలోచించలేదు’ అని గని ఏరియా అధికారి ఒకరు బీబీసీకి వివరించారు.

బాధితురాలు 2016 డిసెంబర్‌లో ఉద్యోగంలో చేరింది. మొదట ఆమెకు గనిలో ఉపయోగించే పేలుడు పదార్థాల విభాగంలో పని కల్పించారు. కానీ అక్కడ పని కష్టంగా ఉండటంతో ఆమె వేరే చోటుకు బదిలీ చేయించుకున్నారు. దాంతో ఆమె వెయి బ్రిడ్జ్‌ దగ్గర పనిలో చేరారు.

రోజూ గనిలోకి ప్రవేశించి, బయటకు వెళ్లే ట్రక్కుల కంప్యూటరైజ్డ్ ఎంట్రీలను నమోదు చేయడం ఆ యువతి బాధ్యత. కనీసం రోజూ 800 ట్రక్కులు వచ్చి వెళ్తుంటాయి. సరైన భద్రత లేకుండా అక్కడ పని చేయడం కష్టం. చాలాసార్లు దురుసుగా, తాగి ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు ఎదురుపడుతుంటారు. దురదృష్టవశాత్తూ ఆ రోజు మధ్యాహ్నం ఆ యువతి విషయంలో అదే జరిగింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)